29 Bible Verses About Complaining

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Complaining
  1. 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  2. 13 ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు. 14 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. 15 దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు. 16 జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.

    17 మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను. 18 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి.

  3. 1 ప్రజలు యెహోవా వింటుండగా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. వారి మాటలు విని యెహోవా ఆగ్రహించాడు. దాంతో వారి మధ్యలో మంటలు రేగి శిబిరం ఒక వైపున అంచుల్లో కాలిపోవడం మొదలయింది. 2 అప్పుడు ప్రజలు గట్టిగా కేకలు పెట్టి మోషేను బతిమాలారు. కాబట్టి మోషే యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు ఆ మంటలు చల్లారాయి. 3 యెహోవా అగ్ని వారి మధ్యలో రగిలింది కాబట్టి ఆ స్థలానికి “తబేరా” అనే పేరు వచ్చింది.

    4 కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ “తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు?

  4. 16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.

    17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.

    18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.

  5. 9 వారిలో చాలామంది ప్రభువును వ్యతిరేకించి పాము కాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు. 10 అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలామంది దేవునిపై సణిగి సంహార దూత చేతిలో నాశనమయ్యారు.

    11 నాశనమయ్యారు మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి.

  6. 26 ఇంకా యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ, 27 “నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను.

    28 నువ్వు వారితో, యెహోవా చెప్పేదేమంటే, నేను జీవంతో ఉన్నట్టు, మీరు నాతో చెప్పినట్టు నేను కచ్చితంగా మీపట్ల చేస్తాను. 29 మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. మీ పూర్తి లెక్క ప్రకారం మీలో లెక్కకు వచ్చిన వారందరూ, అంటే, ఇరవై సంవత్సరాలు మొదలు ఆ పైవయస్సు కలిగి, నాకు విరోధంగా విమర్శించిన వారిందరూ రాలిపోతారు. 30 యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప మీకు నివాసంగా ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశంలో కచ్చితంగా మీలో ఎవరూ ప్రవేశించరు.

  7. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

    8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

  8. 7 ఐగుప్తు దేశం నుండి యెహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు. రేపు ఉదయానికి మీరు యెహోవా మహిమా ప్రభావం చూస్తారు.”

    8 మోషే వాళ్ళతో “మీరు సాయంత్రం తినడానికి మాంసం, ఉదయాన సరిపడినంత ఆహారం యెహోవా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు. మీరు ఆయన మీద సణుక్కోవడం ఆయన విన్నాడు. మీరు సణుక్కోవడం యెహోవా మీదే, మా మీద కాదు. మాపై సణుక్కోవడానికి మేమెంతటివాళ్ళం?” అన్నాడు.

    9 మోషే అహరోనులతో యెహోవా “ప్రజల సర్వ సమాజంతో ఇలా చెప్పు, ఆయన మీ సణుగులు విన్నాడు. సర్వ సమాజం అంతా యెహోవా సన్నిధికి రండి.” 10 అహరోను ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు. అప్పుడు మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.

  9. 9 సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు.

  10. 39 బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు?

    40 మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.

  11. 14 ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు. 15 వారిలో భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.” 16 వారు తమ దురాశలను బట్టి నడచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.

  12. 16 అయితే నేను దేవునికి మొరపెడతాను. యెహోవా నన్ను రక్షిస్తాడు.

    17 సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు.

  13. 24 రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించారు. ఆయన మాట నమ్మలేదు.

    25 యెహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సణుగుకున్నారు.

    26 అప్పుడు అరణ్యంలో వారు కూలిపోయేలా చేయడానికి,

  14. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు. 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.

    31 వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? 32 తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా?

  15. 1 తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనోరోజున ఏలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు. 2 అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే, అహరోనుల మీద సణుగుకున్నారు. 3 ప్రజలు వారితో “మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకుని కుండల దగ్గర కూర్చుని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలోనే యెహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్టయితే బాగుండేది. మేమంతా ఆకలితో చనిపోవడం కోసం ఇక్కడికి తీసుకు వచ్చారు” అన్నారు.

  16. 1 ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు రోజువారీ భోజనాల వడ్డనల్లో తమలోని విధవరాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేశారు.

    2 అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, “మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు. 3 కాబట్టి సోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై, మంచి పేరున్న ఏడుగురిని మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. 4 మేము మాత్రం ప్రార్థనలోనూ, వాక్య పరిచర్యలోనూ కొనసాగుతూ ఉంటాం” అన్నారు.

    5 ఈ మాట అందరికీ నచ్చింది. కాబట్టి, వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి ఉన్న స్తెఫను, ఇంకా ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, సీమోను, పర్మెనాసు, యూదామతంలోకి మారిన అంతియొకయ నివాసి నీకొలాసు అనేవారిని ఎంచుకున్నారు.

  17. 2 దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ “మాకు తాగడానికి నీళ్లియ్యి” అన్నారు. అప్పుడు మోషే “మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?” అన్నాడు. 3 ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ “ఇదేంటి? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చావా?” అన్నారు.

    4 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. “ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో” అన్నాడు.

  18. 10 ప్రజలు వారి కుటుంబాలతో కలసి ఎవరి గుమ్మం ఎదుట వారు కూర్చుని ఏడుస్తుండగా మోషే విన్నాడు. యెహోవా భీకర కోపం రగిలి పోయింది. వారు ఏడవడం, ఫిర్యాదు చేయడం మోషే దృష్టిలో తప్పుగా ఉంది.

    11 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు. 12 ఈ జనాన్నంతా నేను కన్నానా? ‘తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో’ అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా?

    13 ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. ‘మేము తినడానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు. 14 ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది. 15 నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.”

  19. 1 ఆ రాత్రి ప్రజలందరూ పెద్దగా కేకలు పెట్టి ఏడ్చారు. 2 ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులకు వ్యతిరేకంగా గొడవ చేశారు. 3 ఆ సమాజమంతా వారితో “ఈ అరణ్యంలో చనిపోవడం కన్నా మేము ఐగుప్తులో చనిపోతే బాగుండేది! మేము కత్తివాత చావాలని యెహోవా మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడా? మా భార్యలు, మా చిన్న పిల్లలు బాధల పాలౌతారు. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?” అన్నారు.

  20. 9 అతని భార్య వచ్చి అతనితో “నువ్వు ఇంకా నీ నిజాయితీని వదిలిపెట్టవా? దేవుణ్ణి బాగా తిట్టి చచ్చిపో” అంది.

    10 అప్పుడు యోబు “నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. మనం దేవుడిచ్చే మేళ్ళు మాత్రమే అనుభవిస్తామా? కీడు కూడా అనుభవించాలి గదా” అన్నాడు. జరుగుతున్న ఈ విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు తన నోటిమాటతో ఎలాంటి పాపమూ చేయలేదు.

  21. 4 ఆ తరువాత వారు ఎదోము చుట్టూ తిరిగి వెళ్లాలని, హోరు కొండనుంచి ఎర్ర సముద్రం దారిలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో అలసటతో ప్రజలు సహనం కోల్పోయారు. 5 అప్పుడు ప్రజలు దేవునికి, మోషేకి విరోధంగా మాట్లాడుతూ “ఈ నిర్జన బీడు ప్రాంతంలో చావడానికి ఐగుప్తులోనుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ నికృష్టమైన భోజనం మాకు అసహ్యం” అన్నారు.

    6 అప్పుడు యెహోవా ప్రజల్లోకి విషసర్పాలు పంపించాడు. అవి ప్రజలను కాటువేసినప్పుడు ఇశ్రాయేలీయుల్లో చాలామంది చనిపోయారు.

  22. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  23. 5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు. 6 కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం.

  24. 11 అప్పుడు వాళ్ళు మోషేతో “ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా? 12 మేము ఐగుప్తీయులకు బానిసలుగానే ఉంటాం, మా జోలికి రావద్దు అని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే గదా. మేము ఈ ఎడారిలో చనిపోవడం కంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది” అని నిష్టూరంగా మాట్లాడారు.

  25. 20 అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు. 21 “నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.”

  26. 2 పొగమంచులో ఆవిరిలాగా, గాలి కదలిక లాగా ప్రతిదీ మాయమైపోతున్నదని ప్రసంగి చెబుతున్నాడు. అది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నది.

    3 సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం? 4 ఒక తరం గతించిపోతుంటే ఇంకో తరం వస్తూ ఉంది. భూమి మాత్రం ఎప్పుడూ స్థిరంగా నిలిచి ఉంది.

  27. 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

    22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.

  28. 4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.

  29. 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.