33 Bible Verses About Mourning

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Mourning
  1. 1 యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. 2 ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు.

    3 “ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.

    4 దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.

    5 సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు.

  2. 13 సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు. 14 యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.

    15 మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. 16 ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. 17 ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.

    18 కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోండి.

  3. 31 దావీదు “మీ బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవం ముందు నడుస్తూ విలపించండి” అని యోవాబుకు, అతనితో ఉన్నవారికందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. 32 రాజు కూడా స్వయంగా పాడె వెంట నడిచాడు. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టినప్పుడు రాజు అబ్నేరు సమాధి దగ్గర బిగ్గరగా ఏడ్చాడు. అక్కడ సమకూడిన వారంతా ఏడ్చారు.

    33 రాజు అబ్నేరును గూర్చి ఒక విలాప గీతం పాడాడు,

    34 “అబ్నేరూ, నీచుడైన ఒక మనిషి చనిపోయినట్టు నువ్వు చనిపోయావే.

    నీ చేతులకు గాయాలు లేకుండా,

    నీ కాళ్లకు సంకెళ్లు వేయకుండా,

    అక్రమం చేసేవాడి ముందు ఒకడు పడినట్టు

    నువ్వు పడిపోయావు గదా.”

    రాజు ఈ విధంగా గీతం గొంతెత్తి పాడినప్పుడు ప్రజలంతా విని, ఇంకా ఎక్కువగా ఏడ్చారు.

    35 ఇంకా రాత్రి కాకముందు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి ఏమైనా తినమని అతణ్ణి బతిమిలాడారు. దావీదు “సూర్యుడు అస్తమించక ముందు నేను ఏదైనా ఆహారం తీసుకొంటే దేవుడు నాకు ఎంతో కీడు కలిగిస్తాడుగాక” అని ఒట్టు పెట్టుకున్నాడు.

  4. 34 యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు. 35 అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. “నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.

    36 మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి, ఫరో రాజు అంగ రక్షకుల సేనానిగా పని చేస్తున్న పోతీఫరుకు అతణ్ణి అమ్మేశారు.

  5. 20 కానీ ఇప్పుడు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా చనిపోయిన వారిలో నుండి లేచిన వారిలో ప్రథమఫలం అయ్యాడు. 21 మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది. 22 ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు. 23 ప్రతి ఒక్కడూ తన తన వరుసలో బ్రతికించబడతారు. మొదట, అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనకు చెందినవారు బ్రతికించబడతారు.

    24 ఆ తరువాత ఆయన సమస్త ఆధిపత్యాన్నీ అధికారాన్నీ బలాన్నీ రద్దు చేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది. 25 ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకూ ఆయన పరిపాలించాలి. 26 చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం.

  6. 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.

    3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.

    5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు.

  7. 6 ఈ దేశంలో గొప్పవాళ్ళు, సామాన్యులు అందరూ చస్తారు. వాళ్ళను ఎవ్వరూ పాతిపెట్టరు. వాళ్ళ గురించి ఎవరూ ఏడవరు. తమను తాము గాయపరచుకోరు. తలవెంట్రుకలు కత్తిరించుకోరు.

    7 చచ్చినవారి గురించి ప్రజలను ఓదార్చడానికి వారితో కలిసి తినే వాళ్ళెవరూ ఉండరు. ఒకరి నాన్న గానీ అమ్మ గానీ చనిపోతే కూడా ఎవరూ వారిని ఓదార్చేలా తాగడానికి ఏమీ ఇవ్వరు.

    8 విందు జరిగే ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వారితో కూర్చుని తిని తాగొద్దు.

  8. 20 అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు.

  9. 1 యోసేపు తన తండ్రి మీద వాలి ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. 2 యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ వైద్యులు ఇశ్రాయేలు శవాన్ని సిద్ధపరచారు. 3 అందుకు వారికి 40 రోజులు పట్టింది. సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి అంత సమయం పడుతుంది. ఐగుప్తీయులు అతని గురించి 70 రోజులు దుఖించారు.

  10. 29 అహరోను చనిపోయాడని సమాజమంతా గ్రహించినప్పుడు, ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ అహరోను కోసం ముప్ఫై రోజులు శోకించారు.

  11. 18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

  12. 15 యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా అన్నాడు, 16 “నరపుత్రుడా, చూడు! నీ కళ్ళకు ఇష్టమైన దాన్ని నీ నుంచి ఒక్క తెగులు మూలంగా తీసేస్తాను. నువ్వు సంతాప పడవద్దు. కన్నీరు కార్చ వద్దు. 17 నువ్వు మౌనంగా మూలగాలి. చనిపోయిన వాళ్లకు అంత్యక్రియలు చెయ్యొద్దు. తలపాగా కట్టుకుని చెప్పులు వేసుకో. నీ గడ్డం దాచుకోవద్దు, భార్యను కోల్పోయిన పురుషుని ఆహారం తినొద్దు.”

    18 ఉదయం ప్రజలకు నేను ప్రకటించాను. సాయంత్రం నా భార్య చనిపోగా నాకు ఆజ్ఞాపించినట్టు మరుసటి ఉదయాన నేను చేశాను.

  13. 10 అప్పుడు దావీదు వంశీయుల మీదా యెరూషలేములో నివసించే ప్రజల మీదా కరుణ కలిగించే ఆత్మ కోసం విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరిస్తాను. తాము పొడిచిన నన్ను వారు కళ్లారా చూస్తారు. ఒకడు తన ఏకైక కుమారుడు మరణిస్తే దుఃఖించినట్టు, తన జ్యేష్ఠపుత్రుడు మరణిస్తే ఒకడు విలపించినట్టు అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు.

    11 మెగిద్దో మైదానంలో హదదిమ్మోను దగ్గర జరిగిన విలాపం వలె ఆ రోజున యెరూషలేములో మహా విలాపం జరుగుతుంది. 12 దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా విలపిస్తారు. దావీదు వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. నాతాను వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. 13 లేవి వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా, షిమీ వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. 14 మిగిలిన అన్ని వంశాలవారు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.

  14. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.

    4 ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.

    5 క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది.

  15. 8 ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాల్లో మోషే కోసం 30 రోజులపాటు దుఃఖించారు. తరువాత మోషే కోసం దుఃఖించిన రోజులు ముగిసాయి.

  16. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

  17. 3 గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.

  18. 1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు.

    అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.

    గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,

    2 యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు.

    3 సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు.

    నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు.

  19. 35 యేసు ఏడ్చాడు. 36 అప్పుడు యూదులు, “ఆయన లాజరును ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు.

  20. 26 నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు.

  21. 1 ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికీ ప్రతి ఉద్దేశానికీ ఒక సమయం ఉంది.

    2 పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ

    3 చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ

    4 ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ

  22. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు.

  23. 1 “మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. 2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు.

  24. 50 సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.

    51 ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. 52 బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. 53 నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు,

    “విజయం మరణాన్ని మింగివేసింది”

    అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.

    55 “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?”

    56 మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.

    57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.

  25. 4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

  26. 4 అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు.

    అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం.

    5 కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది.

    మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.

    6 మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము.

    యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.

  27. 26 అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు. 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.

    28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  28. 6 అందుచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉండండి. ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం, ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు. 7 కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము. 8 ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి నిబ్బరంగా ఉన్నాం.

  29. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.

  30. 30 దావీదు తన తల కప్పుకుని, ఏడుస్తూ, చెప్పులు లేకుండా నడుచుకొంటూ ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ వెళ్ళాడు. అతనితో ఉన్నవారంతా తలలు కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు.

  31. 16 మీరు ఉపవాసం చేసేటప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముఖాలు నీరసంగా పెట్టుకోవద్దు. తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు. వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను. 17 నువ్వు ఉపవాసం ఉన్నపుడు ఉపవాసమున్నట్టు మనుషులకి కనబడాలని కాకుండా, ఏకాంతంలో ఉన్న తండ్రికే కనబడాలని, తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కో. 18 అప్పుడు ప్రజలకు కాక, రహస్యంలో ఉన్న నీ తండ్రికే కనబడతావు. అప్పుడు రహస్యంలో చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.

  32. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  33. 18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.