44 Bible Verses About Cursing

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Cursing
  1. 5 అలాగే, నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా, ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగల బెడుతుందో గమనించండి! 6 నాలుక కూడా ఒక అగ్ని. పాప ప్రపంచం మన శరీరంలో అమర్చి ఉన్నట్టు అది ఉండి, శరీరమంతటినీ మలినం చేసి, జీవన మార్గాన్ని తగలబెడుతుంది. తరవాత నరకాగ్నికి గురై కాలిపోతుంది.

    7 అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా. 8 కాని, మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేక పోతున్నారు. అది ఎడతెగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది. 9 నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం. 10 ఒకే నోటినుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు. 11 ఒకే ఊటలోనుంచి మంచి నీళ్ళు, చేదు నీళ్ళు, రెండూ ఊరుతాయా? 12 నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పళ్ళు, ద్రాక్ష తీగెలకు అంజూరుపళ్ళు కాస్తాయా? అదేవిధంగా, ఉప్పునీటి ఊట నుంచి మంచి నీళ్ళు రావు.

    13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి.

  2. 27 “వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. 28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.

    29 నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు. 30 అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు.

  3. 29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.

    30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి.

  4. 10 ఆయన ప్రజలందరినీ పిలిచి, “మీరు తెలుసుకోవలసింది ఏమంటే, 11 ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్రపరచదు. నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది” అని చెప్పాడు.

  5. 14 మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి గానీ శపించవద్దు.

  6. 10 ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. 11 ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవరినీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు.” 12 ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, “దాని విధులను ఆచరించే వాడు వాటి వల్లనే జీవిస్తాడు.”

    13 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు. 14 అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.

  7. 14 అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు. 15 నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు.

    16 ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు. 17 ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు. 18 నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు. 19 నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు.

  8. 26 చూడండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను. 27 నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవా ఆజ్ఞలను మీరు విని, వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది. 28 మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది.

    29 కాబట్టి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రప్పించిన తరువాత గెరిజీము కొండ మీద ఆ దీవెననూ ఏబాలు కొండ మీద ఆ శాపాన్నీ ప్రకటించాలి.

  9. 33 “‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా. 34 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం. 35 భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం. 36 నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు. 37 మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే.

  10. 2 నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు. 3 నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”

  11. 7 నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు.

  12. 17 తన తండ్రిని, తల్లిని దూషించేవాడు తప్పక మరణశిక్ష పొందుతాడు.

  13. 24 అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్నకొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు.

    25 “కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు. 26 అతడు “షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక.

    కనాను అతనికి సేవకుడవుతాడు గాక.

    27 దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక.

    అతడు షేము గుడారాల్లో నివాసం ఉంటాడు.

    అతనికి కనాను సేవకుడవుతాడు” అన్నాడు.

  14. 17 శపించడం వాడికి మహా ఇష్టం. కాబట్టి అది వాడి మీదికే రావాలి. దీవెనను వాడు అసహ్యించుకున్నాడు. కాబట్టి ఏ దీవెనా వాడికి దక్కదు.

    18 ఉత్తరీయంలాగా వాడు శాపాన్ని ధరించాడు. నీళ్లవలె అది వాడి కడుపులోకి దిగిపోయింది. నూనె వలె వాడి ఎముకల్లోకి ఇంకింది.

  15. 7 నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవీ చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనుల విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరచుకో. 8 నీ ఉపదేశం యథార్థంగా, మర్యాదపూర్వకంగా, విమర్శకు చోటియ్యనిదిగా ఉండాలి.

  16. 34 విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. 35 మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు. 36 మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను. 37 నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.”

  17. 13 వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది.

    వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు.

    వారి పెదవుల కింద పాము విషం ఉంది.

    14 వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.

    15 రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి.

    16 వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి.

    17 వారికి శాంతిమార్గం తెలియదు.

    18 వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.”

  18. 8 కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి.

  19. 14 చెవిటివాణ్ణి తిట్ట కూడదు.

    గుడ్డివాడి దారిలో అడ్డంకులు వేయకూడదు.

    నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను.

  20. 9 ఎవడు తన తండ్రినిగానీ తన తల్లినిగానీ దూషిస్తాడో వాడికి మరణశిక్ష విధించాలి. వాడు తన తండ్రినో తల్లినో దుర్భాషలాడాడు గనక అతడు దోషి, మరణ శిక్షకు పాత్రుడు.

  21. 3 మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన. 4 కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు.

  22. 2 రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతున్న పిచ్చుక, రివ్వున ఎగిరిపోయే వానకోయిల ఎలా నేలకు దిగవో అలానే శాపానికి అర్హుడు కాని వాడికి శాపం తగలదు.

  23. 21 “‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు. 22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.

  24. 26 తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం.

  25. 28 నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. నీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించ కూడదు.

  26. 23 యాజకుడు అప్పుడు ఆ శాపాలను ఒక పత్రం పైన రాయాలి. రాసిన ఆ శాపాలను చేదు నీళ్ళతో తుడిచి వేయాలి.

  27. 1 “మీరు మీ యెహోవా దేవుని మాట శ్రద్ధగా విని ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటే మీ దేవుడైన యెహోవా భూమి మీదున్న ప్రజలందరి కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. 2 మీరు మీ యెహోవా దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ మీరు స్వంతం చేసుకుంటారు.

    3 పట్టణంలో, పొలంలో మీకు దీవెనలు కలుగుతాయి. 4 మీ గర్భఫలం, మీ భూఫలం, మీ పశువుల మందలూ, మీ దుక్కిటెద్దులూ, మీ గొర్రె మేకల మందల మీద దీవెనలుంటాయి.

    5 మీ గంప, పిండి పిసికే తొట్టి మీదా దీవెనలుంటాయి. 6 మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు దీవెనలుంటాయి.

  28. 13 దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.

    14 చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.

  29. 8 మానవుడు దేవుని సొత్తు దొంగతనం చేస్తాడా? అయితే మీరు నా సొత్తు దొంగిలించారు. ‘ఏ విషయంలో మేము నీదగ్గర దొంగిలించాం?’ అని మీరు అంటారు. దశమ భాగం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వకుండా దొంగిలించారు.

    9 ఈ ప్రజలందరూ నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు. మీరు శాపానికి పాత్రులయ్యారు. 10 నా ఆలయంలో ఆహారం ఉండేలా మీ దశమ భాగం నా ఆలయం గిడ్డంగిలోనికి తీసుకురండి. ఇలా తీసుకువచ్చి నన్ను శోధించండి, నేను పరలోక ద్వారాలు విప్పి, పట్టలేనంత దీవెనలు విస్తారంగా కుమ్మరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

    11 “మీ పంటను పురుగులు తినివేయకుండా నేను గద్దిస్తాను. అవి మీ భూమిపై ఉన్న పంటను నాశనం చెయ్యవు. మీ ద్రాక్షచెట్ల ఫలాలు అకాలంలో రాలిపోవు. ఇది సైన్యాలకు అధిపతియైన యెహోవా వాక్కు.

  30. 45 మంచి మనిషి తన హృదయమనే ధననిధిలో నుండి మంచి విషయాలను బయటకు తెస్తాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలను బయటకు తెస్తాడు. హృదయం దేనితో నిండి ఉంటే దాన్నిబట్టే నోరు మాట్లాడుతుంది.

  31. 12 నా సోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి. ఆకాశం తోడనీ భూమి తోడనీ మరి దేని తోడనీ ఒట్టు పెట్టుకోవద్దు. మీరు “అవునంటే అవును, కాదంటే కాదు” అన్నట్టుగా ఉంటే మీరు తీర్పు పాలు కారు.

  32. 11 ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు శాపానికి గురయ్యావు. 12 నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు” అన్నాడు.

    13 కయీను “నా శిక్ష నేను భరించలేనిది. 14 ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు” అన్నాడు.

    15 యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి శిక్షిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు.

    16 కాబట్టి కయీను యెహోవా సన్నిధిలోనుంచి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పువైపు ఉన్న నోదు ప్రాంతంలో నివాసం ఉన్నాడు.

  33. 21 యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి “వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.

  34. 12 ఒకవేళ మా నాన్న నన్ను తడిమి చూశాడనుకో. అప్పుడు నేను అతని దృష్టికి ఒక మోసగాడిలా ఉంటాను. అప్పుడిక నా మీదికి ఆశీర్వాదం స్థానంలో శాపం వస్తుంది” అన్నాడు.

    13 కానీ అతని తల్లి “కొడుకా, ఆ శాపం నాపైకి వస్తుంది గాక! నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్టు వాటిని నా దగ్గరికి తీసుకుని రా” అని చెప్పింది.

  35. 12 నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు.

    నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

  36. 23 తరువాత ఎలీషా అక్కడ నుండి బేతేలుకు వెళ్ళాడు. అతడు దారిలో వెళ్తుండగా ఆ పట్టణంలో నుండి కొంతమంది కుర్రవారు వచ్చి “బోడి వాడా, బోడి వాడా, వెళ్లిపో” అంటూ ఎగతాళి చేసారు. 24 ఎలీషా వెనక్కు తిరిగి వాళ్ళను చూసి యెహోవా పేరున వాళ్ళను శపించాడు. అప్పుడు అడవిలో నుండి రెండు ఆడ ఎలుగు బంట్లు వచ్చి వారిలో నలభై రెండు మందిని గాయపరిచాయి.

  37. 9 అతని భార్య వచ్చి అతనితో “నువ్వు ఇంకా నీ నిజాయితీని వదిలిపెట్టవా? దేవుణ్ణి బాగా తిట్టి చచ్చిపో” అంది.

  38. 7 అతని నోరు శాపంతో, కపటంతో, హానికరమైన మాటలతో నిండి ఉంది. అతని నాలుక గాయపరిచి నాశనం చేస్తుంది.

    8 గ్రామాల దగ్గర అతడు పొంచి ఉంటాడు, రహస్య ప్రదేశాల్లో నిరపరాధులను హత్య చేస్తాడు. నిస్సహాయులైన బాధితుల కోసం అతడి కళ్ళు వెతుకుతాయి.

  39. 12 వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.

  40. 24 నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు.

  41. 21 జీవన్మరణాలు నాలుక వశం. దాన్ని ఇష్టపడే వారు దాని ఫలం అనుభవిస్తారు.

  42. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.

  43. 74 దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.

  44. 6 మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.