68 Bible Verses About The Tongue

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About The Tongue
  1. 2 మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తన మాటలలో తప్పిపోని వాడు లోపం లేనివాడుగా ఉండి తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడు.

    3 గుర్రాలు మనకు లోబడడానికి దాని నోటికి కళ్ళెం పెట్టి, దాని శరీరం అంతా మనకు లోబడేలా చేస్తాం కదా! 4 ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు. 5 అలాగే, నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా, ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగల బెడుతుందో గమనించండి! 6 నాలుక కూడా ఒక అగ్ని. పాప ప్రపంచం మన శరీరంలో అమర్చి ఉన్నట్టు అది ఉండి, శరీరమంతటినీ మలినం చేసి, జీవన మార్గాన్ని తగలబెడుతుంది. తరవాత నరకాగ్నికి గురై కాలిపోతుంది.

    7 అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా. 8 కాని, మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేక పోతున్నారు. అది ఎడతెగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది. 9 నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం. 10 ఒకే నోటినుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు. 11 ఒకే ఊటలోనుంచి మంచి నీళ్ళు, చేదు నీళ్ళు, రెండూ ఊరుతాయా? 12 నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పళ్ళు, ద్రాక్ష తీగెలకు అంజూరుపళ్ళు కాస్తాయా? అదేవిధంగా, ఉప్పునీటి ఊట నుంచి మంచి నీళ్ళు రావు.

    13 మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.

    16 ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది.

  2. 6 మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.

  3. 4 మృదువైన మాటలు పలికే నాలుక జీవవృక్షం వంటిది. కుటిలమైన మాటలు ఆత్మను క్రుంగదీస్తాయి.

  4. 33 “చెట్టు మంచిదయితే దాని పండూ మంచిదవుతుంది. అలా కాక, చెట్టు చెడ్డదయితే దాని పండూ చెడ్డదవుతుంది. చెట్టు ఎలాటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు. 34 విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. 35 మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు. 36 మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను. 37 నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.”

  5. 19 వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు.

    20 ఉత్తముడు పలికే మాటలు అమూల్యమైన వెండి వంటివి. భక్తిహీనుల తలంపులు వ్యర్ధమైనవి.

    21 నీతిమంతుని మాటల ద్వారా చాలా మంది మేలు పొందుతారు. మూర్ఖులు జ్ఞానం లేకపోవడం వల్ల మరణానికి లోనవుతారు.

  6. 18 కత్తిపోటులాంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. జ్ఞానుల మాటలు ఆరోగ్యం కలిగిస్తాయి.

    19 నిజాలు పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాలు పలికే నాలుక ఉనికి క్షణకాలం.

  7. 26 తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం. 27 తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.

  8. 20 ఒకడి కడుపు నిండడం అతని నోటి మాటలను బట్టే ఉంటుంది. తన పెదవుల పంట కోత మూలంగా అతడు తృప్తిచెందుతాడు.

    21 జీవన్మరణాలు నాలుక వశం. దాన్ని ఇష్టపడే వారు దాని ఫలం అనుభవిస్తారు.

  9. 33 యేసు అతన్ని జనంలో నుండి పక్కకి తీసుకు వెళ్ళి తన వేళ్ళు అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి అతని నాలుకను ముట్టాడు. 34 అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, “ఎప్ఫతా” అని అతనితో అన్నాడు. ఆ మాటకు, “తెరుచుకో!” అని అర్థం. 35 వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు.

  10. 10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి.

  11. 1 సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.

    2 జ్ఞానుల నోరు మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది. మూర్ఖుల నోరు తెలివి తక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.

  12. 28 దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. 29 అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. 30 అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. 31 కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.

  13. 27 జ్ఞానం గలవాడు తక్కువగా మాట్లాడతాడు. అవగాహన గలవాడు శాంత గుణం కలిగి ఉంటాడు.

    28 మూర్ఖుడు సైతం మౌనంగా ఉంటే చాలు, అందరూ అతడు జ్ఞాని అనుకుంటారు. అలాటి వాడు నోరు మూసుకుని ఉంటే చాలు, అతడు తెలివి గలవాడని అందరూ అనుకుంటారు.

  14. 23 నోటిని నాలుకను కాపాడుకునేవాడు ఇబ్బందుల నుండి తనను కాపాడుకుంటాడు.

  15. 29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.

  16. 19 నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు. 20 ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని నెరవేర్చదు.

    21 కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది.

    22 వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే.

  17. 3 యెహోవా, మోసపు మాటలు పలికే పెదాలనూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ కోసివెయ్యి.

    4 మా నాలుకలతో మేము సాధిస్తాం, మా పెదాలతో మేము మాట్లాడినప్పుడు మా మీద ప్రభువుగా ఎవరు ఉండగలరు? అని అంటున్నది వీళ్ళే.

  18. 12 జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?

    13 దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.

  19. 3 యెహోవా, నా నోటికి కాపలా ఉంచు. నా పెదాలు అనే ద్వారాన్ని కాపు కాయి.

    4 నా మనసును దుష్టత్వం వైపు తిరగనియ్యకు. పాపులతో చేరి దుష్ట కార్యకలాపాల్లో పాలు పొందనీయకు. వాళ్ళు తినే రుచి గల పదార్థాలు నేను తినకుందును గాక.

  20. 171 నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. నా పెదాలు నీ స్తోత్రం పలుకుతాయి.

    172 నీ ఆజ్ఞలన్నీ న్యాయం. నీ వాక్కును గూర్చి నా నాలుక గానం చేస్తుంది.

  21. 16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.

    17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

  22. 13 అప్పుడు అతిక్రమాలు చేసేవాళ్ళకు నీ మార్గాలు బోధిస్తాను. అప్పుడు పాపులు నీ వైపు తిరుగుతారు.

    14 నా రక్షణకు ఆధారమైన దేవా, రక్తాన్ని చిందించినందుకు నన్ను క్షమించు. నీ నీతిన్యాయాలను బట్టి నేను ఆనందంతో బిగ్గరగా గానం చేస్తాను.

    15 ప్రభూ, నా పెదాలను తెరువు. నా నోరు నీకు స్తుతి పాడుతుంది.

  23. 24 అయితే నా నాలుక రోజంతా నీ నీతిని వివరిస్తూ ఉంది.

  24. 3 విల్లును వంచినట్టుగా వారు తమ నాలుకను అబద్ధమాడడానికి వంచుతారు. ఈ భూమిపై వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒకటి తరవాత మరొకటి చెడుకార్యాలు జరిగిస్తున్నారు. “నేను ఎవరో వారు ఎరుగరు” అని యెహోవా చెబుతున్నాడు.

  25. 8 వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది.

    ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి.

  26. 10 మోషే “ప్రభూ, నీవు నీ దాసుడినైన నాతో మాట్లాడడానికి ముందుగానీ తరవాతగానీ ఏనాడూ నేను మాటకారిని కాను. నా నోరు, నా నాలుక మందమైనవి” అన్నాడు.

    11 అప్పుడు యెహోవా “మనుషులకు నోరు ఇచ్చిన వాడు ఎవరు? మూగ వారిని, చెవిటి వారిని, చూపు గలవారిని, గుడ్డి వారిని అందరినీ పుట్టించినది ఎవరు? యెహోవానైన నేనే గదా. 12 కాబట్టి వెళ్లు, నేను నీ నోటికి తోడుగా ఉండి, నువ్వు ఏం మాట్లాడాలో నీకు చెబుతాను” అని మోషేతో చెప్పాడు.

  27. 9 వాళ్ళ నోట సత్యం లేదు. వాళ్ళ అంతరంగం దుర్మార్గం. వాళ్ళ కంఠం తెరిచిన సమాధి. వాళ్ళు తమ నాలుకతో ఇచ్చకాలు పలుకుతారు.

  28. 7 అతని నోరు శాపంతో, కపటంతో, హానికరమైన మాటలతో నిండి ఉంది. అతని నాలుక గాయపరిచి నాశనం చేస్తుంది.

  29. 2 నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది. అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది.

  30. 2 యెహోవా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు.

    3 మోసకరమైన నాలుకా, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా?

  31. 12 తన పొరుగువాణ్ణి కించపరిచేవాడు జ్ఞానహీనుడు. వివేకం గల వాడు మౌనం వహిస్తాడు.

  32. 18-19 తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాననే వాడు నిప్పు బాణాలు విసిరే వెర్రి వాడితో సమానం.

    20 కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది. కొండేలు చెప్పేవాడు లేకపొతే జగడం చల్లారుతుంది.

    21 నిప్పు కణికెలకు బొగ్గులు, అగ్నికి కట్టెలు. పోట్లాటలు రేపడానికి కలహప్రియుడు.

    22 కొండేలు రుచిగల పదార్థాల వంటివి. అవి కడుపులోకి మెత్తగా దిగిపోతాయి.

    23 చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.

    24 పగవాడు పెదాలతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు.

    25 వాడు దయగా మాటలాడితే వాడి మాట నమ్మవద్దు. వాడి హృదయంలో ఏడు అసహ్యమైన విషయాలు ఉన్నాయి.

  33. 62 “వాడికి ఏ పేరు పెట్టాలి?” అని తండ్రిని సైగలతో అడిగారు. 63 అతడు పలక తెమ్మని, “బాబు పేరు యోహాను” అని రాశాడు. అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు. 64 వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు.

  34. 28 అప్పుడు నేను నీ న్యాయాన్ని గూర్చి ప్రచారం చేస్తాను. దినమంతా నిన్ను స్తుతిస్తూ ఉంటాను.

  35. ప్రధాన సంగీతకారుడు యెదూతూను కోసం. దావీదు కీర్తన

    1 ఇది నా నిర్ణయం, నా నాలుకతో పాపం చేయకుండా ఉండటానికి నా మాటలను జాగ్రత్తగా చూసుకుంటాను. దుర్మార్గుడి దగ్గర నా నోటికి కళ్ళెం పెట్టుకుంటాను.

  36. 1 పెంతెకొస్తు అనే పండగరోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట సమావేశమయ్యారు. 2 అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. 3 అగ్నిజ్వాలలు నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరి మీదా వాలాయి. 4 అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు. 5 ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రాంతపు జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. 6 ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తన సొంత భాషలో మాట్లాడడం విని కలవరపడ్డారు. 7 వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా. 8 మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి? 9 పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసపటేమియా యూదయ కప్పదొకియ పొంతు ఆసియ 10 ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనేలో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన 11 యూదులూ, యూదామతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నాము” అనుకున్నారు. 12 అందరూ ఆశ్చర్యచకితులై ఎటూ తోచక, “ఇదేమిటో” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.

  37. 13 వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది.

    వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు.

    వారి పెదవుల కింద పాము విషం ఉంది.

    14 వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.

  38. దావీదు కీర్తన.

    1 యెహోవా, నీ మందిరంలో ఉండదగినవాడు ఎవరు? నీ పవిత్ర పర్వతం మీద నివసించ గలవాడు ఎవరు?

    2 అతడు యథార్థమైన ప్రవర్తన కలిగి, న్యాయమైనది చేస్తూ, హృదయంలోనుంచి సత్యం పలుకుతాడు.

    3 అతడు నాలుకతో కొండేలు చెప్పడు. ఇతరులకు హాని చెయ్యడు, తన పొరుగు వాణ్ణి కించపరచడు.

  39. 30 నీతిమంతుని నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. అది న్యాయాన్ని అధికం చేస్తుంది.

  40. 19 ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది.

  41. 23 సరియైన సమాధానం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరం!

  42. 1 మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు.

  43. 23 జ్ఞాని హృదయం వాడికి తెలివి బోధిస్తుంది. వాడి పెదాలకు నమ్రత జోడిస్తుంది.

    24 మధురమైన మాటలు కమ్మని తేనె వంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం.

  44. 4 కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు.

  45. 31 ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు.

  46. 3 తన నోటిని అదుపులో ఉంచుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. వ్యర్థంగా మాట్లాడే వాడు నాశనం కొని తెచ్చుకుంటాడు.

  47. 6 అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం.

  48. 27 గుంట తవ్వే వాడే దానిలో పడతాడు. రాతిని పొర్లించే వాడి మీదికే అది తిరిగి వస్తుంది.

    28 అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.

  49. 20 తొందరపడి మాట్లాడే వాణ్ణి చూసావా? వాడికంటే మూర్ఖుడే సుళువుగా మారతాడు.

  50. 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి.

  51. 11 “నిశ్చయంగా జీవిస్తున్న నేను చెప్పే దేమిటంటే, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది.

    ప్రతి నాలుకా దేవుని స్తుతిస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు”

    అని రాసి ఉంది.

  52. 16 నీ ప్రజల మధ్య కొండేలు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు.

    ఎవరికైనా ప్రాణ హాని కలిగించేది ఏదీ చెయ్యవద్దు. నేను యెహోవాను.

    17 నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు.

    నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి.

    18 పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు.

    నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.

  53. 2 మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు.

    3 మీ చేతులు రక్తంతో మీ వేళ్లు అపరాధాలతో మరకలయ్యాయి.

    మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక ద్వేషంతో మాటలాడుతున్నది.

  54. 4 దప్పిక వల్ల పాలు తాగే పిల్ల నాలుక దాని అంగిటికి అంటుకుంటూ ఉంది.

    పిల్లలు అన్నం అడుగుతారు, కాని వాళ్ళు తినడానికి ఏమీ లేదు.

  55. 12 ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు.

    అక్కడి ప్రజలు అబద్దికులు.

    వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.

  56. 24 ‘తండ్రీ అబ్రాహామూ, నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు’ అని కేకలు పెట్టాడు.

  57. 1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.

  58. 14 యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.

  59. 2 దుష్టులు, మోసగాళ్ళు నాపై దాడి చేస్తున్నారు. వారు నా మీద అబద్ధాలు పలుకుతున్నారు.

  60. 4 యెహోవా, నా నోట మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు.

  61. 11 నీతిమంతుల నోటినుంచి వచ్చే మాటలు జీవజలపు ఊటలు. దుష్టులు తమలో దౌర్జన్యాన్ని దాచుకుని ఉంటారు.

  62. 25 విచారం నిండిన హృదయం క్రుంగిపోతుంది. దయగల మంచి మాట హృదయానికి సంతోషం కలిగిస్తుంది.

  63. 28 నీతిమంతుని మనస్సు జ్ఞానంతో కూడిన జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మూర్ఖుల నోటి వెంట చెడ్డ మాటలే వస్తాయి.

    29 భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.

  64. 20 దుష్ట హృదయం గలవాడికి మేలు జరగదు. కుటిలంగా మాట్లాడే వాడు ప్రమాదంలో చిక్కుకుంటాడు.

  65. 23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందనీ, ప్రతి నాలుకా ‘యెహోవా తోడు’ అని అంటుందనీ నేను ప్రమాణం చేశాను.

    నా న్యాయ వాక్కు బయలుదేరింది. అది వ్యర్ధం కాదు.

  66. 20 నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు” అని అతనితో అన్నాడు.

    21 ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ, ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు. 22 అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు.

  67. 8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.

  68. 10 అయిదవ దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు. 11 అయితే తమకు కలిగిన వేదనలను బట్టీ, కురుపులను బట్టీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారు తప్ప తమ క్రియలు మాని పశ్చాత్తాప పడలేదు.