80 Bible Verses About Teaching

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Teaching
  1. 18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

  2. 1 అయితే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు. 2 వృద్ధులు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగా, వివేకంతో మెలుగుతూ విశ్వాసం, ప్రేమ, సహనంలో శుద్ధంగా ఉండాలి.

    3 అలాగే వృద్ధ స్త్రీలు గౌరవప్రదంగా, పుకార్లు పుట్టించేవారుగా కాకుండా ఉండాలి. అస్తమానం మద్యపానంలో మునిగి తేలుతూ ఉండకూడదు. నడవడిలో భయభక్తులు గలిగి మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. 4-5 దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని యువతులను ప్రోత్సహిస్తూ, మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా, తమ భర్తలకు లోబడుతూ ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి.

    6 అలానే మనసు అదుపులో ఉంచుకోవాలని యువకులను హెచ్చరించు. 7 నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవీ చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనుల విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరచుకో. 8 నీ ఉపదేశం యథార్థంగా, మర్యాదపూర్వకంగా, విమర్శకు చోటియ్యనిదిగా ఉండాలి.

  3. 14 కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో. 15 ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.

    16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

  4. 4 ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. 5 నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

    6 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.

    7 మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.

    8 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. 9 మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.

  5. 3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి. 4 ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు. 5 అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.

    6 దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి. 7-8 పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి.

  6. 11-12 విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. 13 మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు. 14 అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము. 15 ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం. 16 ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.

  7. 1 దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను.

    2 వాక్యాన్ని బోధించు, అనుకూలమైనా, కాకపోయినా సిద్ధంగా ఉండు. ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా సంపూర్ణమైన సహనంతో ఉపదేశించు.

    3 ఎందుకంటే మనుషులు మంచి బోధను సహించలేని సమయం రాబోతోంది. దురద చెవులతో తమ స్వంత దురాశలకు అనుగుణంగా బోధించే వారిని పోగుచేసుకుని, 4 సత్యం నుండి తొలిగిపోయి కట్టు కథల వైపు మళ్ళుతారు.

    5 నీవు మాత్రం అన్ని విషయాల్లో సంయమనంతో ఉండి, కష్టాలు భరించు. సువార్త ప్రచారకుని పనిచెయ్యి, నీ పరిచర్యను సంపూర్తి చెయ్యి.

  8. 6 పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు.

  9. 13 నేను వచ్చే వరకూ లేఖనాలను బహిరంగంగా చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు.

  10. 4 యెహోవా చేసిన గొప్ప కార్యాలను, ఆయన బలాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వారి పిల్లలకు మేము వినిపిస్తాం.

    5 రాబోయే తరాల్లో పుట్టే పిల్లలు దాన్ని తెలుసుకుని తమ పిల్లలకు దాన్ని వివరించాలి. వారు కూడా దేవునిలో నిరీక్షణ ఉంచి దేవుని కార్యాలు మరచిపోకూడదు.

    6 వారి పూర్వికులు యథార్థహృదయులు కారు. దేవుని విషయంలో స్థిర బుద్ధి లేనివారై ఆయనపై తిరగబడ్డారు.

    7 మీరు ఆ తరం వారిలాగా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి.

    8 ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు.

  11. 3 నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి. 4 అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు. 5 ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.

    6 కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు. 7 వారు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాకపోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు. 8 అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.

    9 దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ 10 వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.

    11 ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.

  12. 16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

  13. 1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది. 2-3 “నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.

    4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.

  14. 18 కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయాల్లో, మనస్సుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదిటి మీద బాసికాలుగా ఉండనివ్వండి. 19 మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. 20 మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి. 21 ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి.

  15. 24 ఇప్పుడు మీ కోసం నేను పడుతున్న హింసల్లో సంతోషిస్తున్నాను. సంఘం అనే తన శరీరం కోసం క్రీస్తు పడిన యాతనల్లో కొదువగా ఉన్న వాటిని నా వంతుగా నా శరీరంలో సంపూర్ణం చేస్తున్నాను. 25 రహస్య సత్యంగా ఉన్న దేవుని వాక్కును సంపూర్ణంగా తెలియజేయడానికి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నేను సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. 26 ఈ రహస్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు తన పవిత్రులకు దాన్ని తెలియజేశాడు. 27 అన్యజనుల్లో ఈ మర్మం అనే దివ్య సంపదను తెలియజేయాలని దేవుడు తలంచాడు. ఈ మర్మం మీలో ఉన్న యేసు క్రీస్తే. ఆయనే మహిమను గూర్చిన ఆశాభావం.

    28 మేము ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశంతోనే మేము సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం బోధిస్తున్నాం. 29 దీని కోసం నేను శ్రమిస్తూ ఉన్నాను. నాలో బలంగా పని చేస్తున్న ఆయన మహత్తర శక్తిని నేను వినియోగించుకుంటూ ప్రయాసపడుతున్నాను.

  16. 6 ఈ సంగతులను సోదరులకు వివరించడం ద్వారా నీవు అనుసరించే విశ్వాస వాక్యాలతో మంచి ఉపదేశంతో ఎదుగుతూ క్రీస్తు యేసుకు మంచి సేవకుడివి అనిపించుకుంటావు.

    7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వదిలేసి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. 8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.

    9 ఈ సందేశం విశ్వసనీయమైనదీ పూర్తిగా అంగీకరించదగినదీ. 10 మనుషులందరికీ మరి విశేషంగా విశ్వాసులకు ముక్తిప్రదాత అయిన సజీవ దేవుని మీదే మనం నిరీక్షణ పెట్టుకున్నాము. కాబట్టి చెమటోడ్చి పాటుపడుతున్నాం.

    11 ఈ సంగతులు ఆదేశించి నేర్పు.

  17. 1 నా సోదరులారా, ఉపదేశకులమైన మనకు కఠినమైన తీర్పు ఉందని ఎరిగి మీలో ఎక్కువమంది ఉపదేశం చేసేవారుగా ఉండకండి. 2 మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తన మాటలలో తప్పిపోని వాడు లోపం లేనివాడుగా ఉండి తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడు.

  18. 1 బానిసలుగా పని చేస్తున్న విశ్వాసులు వారి యజమానులను పూర్తి గౌరవానికి తగినవారుగా ఎంచాలి. ఆ విధంగా చేయడం వలన దేవుని నామమూ ఆయన బోధా దూషణకు గురి కాకుండా ఉంటాయి. 2 విశ్వాసులైన యజమానులు గల బానిసలైతే ఆ యజమానులు తమ సోదరులే కదా అని వారిని చిన్న చూపు చూడక, తాము సేవించేది తమ ప్రేమ పాత్రులైన విశ్వాసులనే అని ఇంకా బాగా వారికి సేవ చేయాలి. ఈ సంగతులు బోధిస్తూ వారిని హెచ్చరించు.

    3 ఎవరైనా మన ప్రభువైన యేసు క్రీస్తు ఆరోగ్యకరమైన ఉపదేశానికీ, దైవభక్తికి అనుగుణమైన బోధకూ సమ్మతించకుండా, దానికి భిన్నంగా బోధిస్తే 4 వాడు గర్విష్టి. వాడికి ఏమీ తెలియదన్నమాట. వాడు తర్కాల్లో వాగ్వాదాల్లో నిమగ్నమై ఉంటాడు. ఫలితంగా అసూయ, కలహం, దూషణలు, అపోహలు కలుగుతాయి. 5 ఇంకా చెడిపోయిన మనసుతో అలాటి వారు సత్యం నుండి తొలగిపోయి దైవభక్తి ధనసంపాదన మార్గం అనుకుంటారు.

  19. 19 కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు.

  20. 28 యేసు ఈ మాటలు చెప్పి ముగించినపుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. 29 ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడిలాగా వారికి బోధించాడు.

  21. 35 అయితే పౌలు బర్నబా అంతియొకయలోనే ఉండి అనేకమందికి ప్రభువును బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు.

  22. 15 దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.

  23. 23 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు.

  24. 17 నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవుని విషయంలో అతిశయిస్తున్నావు కదా? 18 ఆయన చిత్తం తెలిసి, ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఏది మంచిదో తెలిసి దాన్ని మెచ్చుకొంటావు కదా? 19 జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలిగిఉండి, “నేను గుడ్డివారికి దారి చూపేవాణ్ణి, చీకటిలో ఉండేవారికి వెలుగు చూపేవాణ్ణి, 20 బుద్ధిలేని వారిని సరిదిద్దే వాణ్ణి, చిన్న పిల్లలలకు అధ్యాపకుణ్ణి అని” అని నిశ్చింతగా ఉన్నావు కదా? 21 ఎదుటి మనిషికి ఉపదేశించే వాడివి, నీకు నీవు బోధించుకోవా? దొంగతనం చేయకూడదని చెప్పే నీవే దొంగతనం చేస్తావా? 22 వ్యభిచారం చేయవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహ్యించుకుంటూ నీవే గుడులను దోచుకుంటావా? 23 ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి, దేవునికి అవమానం తెస్తావా? 24 “మిమ్మల్ని బట్టే గదా దేవుని పేరు యూదేతరుల మధ్య దూషణ పాలవుతున్నది?” అని రాసి ఉంది కదా.

  25. 28 దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. 29 అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు.

  26. 22 యేసే క్రీస్తు అని అంగీకరించని వాడు గాక మరి అబద్ధికుడు ఎవరు? తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించేవాడే క్రీస్తు విరోధి. 23 కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడికీ తండ్రి లేనట్టే. కుమారుణ్ణి ఒప్పుకున్న వాడికి తండ్రి ఉన్నట్టే.

    24 మీరైతే, మొదటినుంచి ఏది విన్నారో అది మీలో నిలిచిపోయేలా చూసుకోండి. మొదటినుండీ విన్నది మీలో అలాగే నిలిచి ఉంటే, మీరు కుమారుడిలో, తండ్రిలో నిలిచి ఉంటారు. 25 ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు. 26 ఇవన్నీ, మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారిని గురించి రాశాను.

    27 ఇక మీ విషయంలో, ఆయన నుండి అందుకున్న అభిషేకం మీలో నిలిచి ఉంది కాబట్టి, ఎవ్వరూ మీకు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన అభిషేకం అన్నిటిని గూర్చి మీకు ఉపదేశం చేస్తుంది. ఆ అభిషేకం సత్యం. అది అబద్ధం కాదు. అది మీకు ఉపదేశం చేసిన విధంగా మీరు ఆయనలో నిలిచి ఉండండి.

  27. 11 పిల్లలూ, రండి, నా మాటలు వినండి. యెహోవా అంటే భయభక్తులు నేను మీకు బోధిస్తాను.

    12 జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి?

    13 దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో.

    14 చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.

  28. 40 శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. అయితే సంపూర్ణమైన శిక్షణ పొందినవాడు తన గురువులా ఉంటాడు.

  29. 13 మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని సరిగానే పిలుస్తున్నారు. 14 బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. 15 నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను.

    16 నేను మీకు కచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వాణ్ణి పంపినవానికన్నా గొప్పవాడు కాదు. 17 ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు.

  30. 8 తరువాత పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు. 9 అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారి నుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.

    10 రెండు సంవత్సరాల పాటు ఈ విధంగా జరిగింది. కాబట్టి యూదులు, గ్రీకులు, ఆసియలో నివసించే వారంతా ప్రభువు వాక్కు విన్నారు.

  31. 6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి.

  32. 2 కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి. 3 అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి. 4 తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి.

    5 ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? 6 అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో. 7 అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.

  33. 13 క్రీస్తు యేసులో ఉంచవలసిన విశ్వాసంతో, ప్రేమతో నేను నీకు నేర్పిన క్షేమకరమైన బోధ నమూనాను పాటించు. 14 దేవుడు నీకు అప్పగించిన ఆ మంచిదాన్ని మనలో నివాసమున్న పరిశుద్ధాత్మ వలన కాపాడుకో.

  34. 23 బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి.

    24 ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి. 25-26 దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.

  35. 11 దీన్ని గురించి చెప్పాల్సింది ఎంతో ఉంది. అయితే వినడంలో మందకొడిగా ఉంటారు గనక మీకు వివరించడం కష్టం. 12 ఈపాటికల్లా మీరు బోధకులుగా ఉండవలసింది కానీ దేవుని మాటల్లోని ప్రాథమిక సూత్రాలను మరొకడు ఇంకా మీకు బోధించాల్సి వస్తున్నది. మీరింకా పాలు తాగే దశలోనే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినే శక్తి మీకు లేదు. 13 కేవలం పాలు మాత్రమే తాగే ప్రతివాడూ పసివాడే కాబట్టి నీతికి సంబంధించిన విషయాల్లో అనుభవం లేని వాడుగా ఉన్నాడు. 14 దీనికి భిన్నంగా, వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధకం చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించ గలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. అలాంటి వారికి పుష్టికరమైన ఆహారం కావాలి.

  36. 41 అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు. 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.

    43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.

  37. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

  38. 11 స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. 12 ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే. 13 ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు? 14 ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది.

    15 అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉంటే ప్రసవం ద్వారా దేవుడు వారిని కాపాడతాడు.

  39. 8 నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవాల్సిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేస్తాను.

  40. 1 కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.

    2 అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.

  41. 42 ప్రతిరోజూ దేవాలయంలో, ఇంటింటా మానకుండా బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు.

  42. 7 అధ్యక్షుడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడు కాబట్టి నిందారహితుడుగా ఉండాలి. అతడు అహంకారి, ముక్కోపి, ద్రాక్ష మద్యానికి అలవాటు పడినవాడు, దెబ్బలాడేవాడు, దురాశపరుడు అయి ఉండకూడదు. 8 అతిథి ప్రియుడు, మంచిని ప్రేమించేవాడు, ఇంగిత జ్ఞానం గలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశలను అదుపులో ఉంచుకొనేవాడు, 9 నమ్మదగిన బోధను స్థిరంగా చేపట్టడం ద్వారా క్షేమకరమైన సిద్ధాంతం బోధిస్తూ ప్రజలను హెచ్చరించడంలో, ఎదిరించే వారి వాదాలను ఖండించడంలో సమర్ధుడుగా ఉండాలి.

  43. 20 ప్రజలకు దేవుని చట్టాలూ ధర్మశాస్త్ర నియమాలూ బోధించాలి. వాళ్ళు నడుచుకోవలసిన మార్గాలను, చేయవలసిన పనులనూ వాళ్ళకు తెలియజెయ్యాలి.

  44. 8 కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు.

    9 అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి.

  45. 35 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు.

  46. 24 గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు.

  47. 9 దానికి జవాబుగా నికోదేము, “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అన్నాడు. 10 యేసు ఇలా అన్నాడు, “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడివై ఉండీ ఈ సంగతులు అర్థం చేసుకోలేవా? 11 మాకు తెలిసిన సంగతులను చెబుతున్నాం, మేము చూసిన వాటి గురించి వివరిస్తున్నాం. అయినా మీరు మా సాక్షాన్ని ఒప్పుకోరని కచ్చితంగా చెబుతున్నాను. 12 భూసంబంధమైన సంగతులు నేను మీకు చెప్పినప్పుడు నమ్మని వారు ఇక నేను పరలోక సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు ఎలా నమ్ముతారు? 13 పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.

    14 అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో,

  48. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

  49. 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

  50. 1 కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనలను మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి. 2 మన సాటిమనిషికి క్షేమాభివృద్ధి కలిగేలా మనలో ప్రతివాడూ మంచి విషయాల్లో అతణ్ణి సంతోషపరచాలి. 3 క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. “నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి” అని రాసి ఉన్నట్టు ఆయనకు జరిగింది.

    4 ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం.

  51. 14 సోదరులారా, మీరు మంచివారు, సంపూర్ణ జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను.

  52. 20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే. 21 నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం అయితే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్టే గదా.

  53. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

  54. 1 మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం, 2 రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.

  55. 11 ఆ సువార్త విషయంలో నేను ప్రచారకుడుగా, అపొస్తలుడుగా, బోధకుడుగా నియామకం పొందాను.

  56. 2 అనేకుల ముందు నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగలిగిన, నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు.

  57. 10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి. 11 ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్‌.

  58. 1 ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ ఎదుట సూచక క్రియను లేక మహత్కార్యాన్ని చూపించి, 2 మీరు ఎరుగని “ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం రండి” అని చెబుతాడేమో. 3 అలా చెప్పినప్పుడు అతడు మీతో చెప్పిన సూచక క్రియ లేక మహత్కార్యం జరిగినా సరే, ఆ ప్రవక్త, లేక కలలు కనేవాడి మాటలు వినవద్దు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు.

  59. 1 దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు.

    2 జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికీ, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికీ, 3 నీతి, న్యాయం, యథార్థతల ప్రకారం నడుచుకుంటూ దిద్దుబాటు చేసుకోవడానికి, 4 ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చేయడానికి ఉపకరిస్తాయి.

    5 తెలివి గలవాడు ఈ సామెతలు విని తన జ్ఞానం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు విని నీతి సూత్రాలు అలవర్చుకుంటాడు.

    6 వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు.

  60. 1 కుమారులారా, తండ్రి చెప్పే మంచి మాటలు విని వివేకం తెచ్చుకోండి.

    2 నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి.

    3 నేను నా తండ్రి కుమారుణ్ణి. నా తల్లికి నేను అందమైన ఏకైక కుమారుణ్ణి.

    4 ఆయన నాకు బోధ చేస్తూ ఇలా చెప్పాడు “నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని వాటిని నీ హృదయంలో నిలిచిపోనివ్వు. వాటిని విని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు జీవిస్తావు.

  61. 20 కుమారా, నీ తండ్రి బోధించే ఆజ్ఞలు పాటించు. నీ తల్లి చెప్పే ఉపదేశాన్ని నిర్ల్యక్షం చెయ్యకు.

    21 వాటిని ఎల్లప్పుడూ నీ హృదయంలో పదిలం చేసుకో. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.

    22 నీ రాకపోకల్లో, నువ్వు నిద్రపోయే సమయంలో అవి నిన్ను కాపాడతాయి. నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అవి నీతో సంభాషిస్తాయి.

    23 దేవుని ఆజ్ఞలు దీపం లాంటివి. ఉపదేశం వెలుగు వంటిది. క్రమశిక్షణ కోసం చేసే దిద్దుబాట్లు జీవానికి సోపానాలు.

  62. 11 తెలివి గల వారి మాటలు ములుకోలల్లాంటివి. ఈ సామెతలు, అనుభవజ్ఞులు సమకూర్చిన మాటల్లాగా, గట్టిగా బిగించి, దిగగొట్టిన మేకుల్లాగా ఒక కాపరి బోధించినట్టుగా ఉన్నాయి.

    12 కుమారా, ఇంకా ఇతర విషయాల గూర్చి జాగ్రత్తపడు. అంతూ పొంతూ లేని గ్రంథాల రచన. విపరీతంగా చదవడం వలన శరీరం అలిసిపోతుంది.

    13 ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే.

    నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలి.

    మానవులంతా చేయాల్సింది ఇదే.

  63. 1 నికోదేము అనే పేరు గల ఒక పరిసయ్యుడు ఉన్నాడు. అతడు యూదుల చట్ట సభలో సభ్యుడు. 2 అతడు రాత్రి వేళ యేసు దగ్గరికి వచ్చాడు. ఆయనతో, “బోధకా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడివి అని మాకు తెలుసు. దేవుడు తోడు లేకపోతే ఎవరూ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరని మాకు తెలుసు” అన్నాడు. 3 దానికి జవాబుగా యేసు అతనితో, “ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

    4 అందుకు నికోదేము, “మనిషి ముసలివాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండవ సారి పుట్టడానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించలేడు గదా! అలా ప్రవేశిస్తాడా?” అని ఆయనను అడిగాడు.

    5 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “కచ్చితంగా చెబుతున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు.

  64. 25 మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను. 26 నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.

  65. 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు.

  66. 16 ఏమైనా సరే, మనం ఇప్పటికే పొందిన అదే సత్యానికి అనుగుణంగా మనమంతా నడుచుకొందాము.

    17 సోదరులారా, మీరు నన్ను పోలి ప్రవర్తించండి. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నడుచుకునే వారిని జాగ్రత్తగా గమనించండి. 18 చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దుఃఖంతో చెబుతున్నాను. 19 నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే వారు మనసు ఉంచుతారు.

    20 ఎందుకంటే మనం అయితే పరలోక పౌరులం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు అక్కడ నుండే భూమి మీదికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం. 21 సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో మన బలహీనమైన దేహాలను తన మహిమగల దేహంలాగా మార్చి వేస్తాడు.

  67. 24 అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది. 25 యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి. 26 మీ కొడుకులు ‘మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం?’ అని మిమ్మల్ని అడిగితే, 27 ‘ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు’ అని చెప్పాలి” అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు.

  68. 2 నా ఉపదేశం వానలా కురుస్తుంది.

    నా మాటలు మంచు బిందువుల్లా,

    లేతగడ్డిపై పడే చినుకుల్లా,

    పచ్చికపై కురిసే చిరుజల్లులా,

    మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి.

    3 నేను యెహోవా పేరును ప్రకటిస్తాను.

    మన దేవునికి ఘనత ఆపాదించండి.

  69. 4 యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.

    5 నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.

  70. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  71. 8 మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు. 9 ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి. 10 అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.

  72. 31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. 32 సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు.

  73. 1 పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, ద్వారపాలకుల అధికారీ, సద్దూకయ్యులూ వారి దగ్గరికి వచ్చారు. 2 వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు. 3 వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు. 4 కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు.

  74. 1 అంతియొకయలోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీ వాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు.

  75. 30 పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో నివసించి, తన దగ్గరికి వచ్చే వారినందరినీ ఆదరిస్తూ 31 ఏ ఆటంకమూ లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు.

  76. 17 అందుకే ప్రభువులో నాకు ప్రియమైన, నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ దగ్గరికి పంపాను. అతడు నేను ఏ విధంగా ప్రతి స్థలంలో, ప్రతి సంఘంలో ఏమి బోధిస్తున్నానో, వాటిని క్రీస్తులో ఏ విధంగా అనుసరిస్తున్నానో, మీకు జ్ఞాపకం చేస్తాడు.

  77. 15 కాబట్టి సోదరులారా, స్థిరంగా ఉండండి. మా నోటి మాట చేతా, మా పత్రికల చేతా మేము ఉపదేశించిన విధివిధానాలను పాటించండి.

  78. 16 మన దైవభక్తిని గురించి వెల్లడైన సత్యం గొప్పది.

    ఏ సందేహమూ లేదు. ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు.

    ఆయన నీతిపరుడని ఆత్మ తీర్పునిచ్చాడు.

    ఆయనను దేవదూతలు చూశారు.

    దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు.

    లోకం ఆయనను నమ్మింది.

    మహిమతో ఆయన ఆరోహణమయ్యాడు.

  79. 15 దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.

  80. 1 తోటి పెద్దనూ, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామినీ అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. 2 మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు కోరే రీతిగా ఇష్ట పూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి. 3 మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారుగా ఉండక, మందకు ఆదర్శంగా ఉండండి. 4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.

    5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు.