89 Bible Verses About Sharing the Gospel

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Sharing the Gospel
  1. 1 సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు. 2 మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు.

    3 దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, 4 లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయనను మూడవ రోజున తిరిగి లేపాడు కూడా. 5 ఆయన కేఫాకూ, తరువాత పన్నెండు మందికీ కనబడ్డాడు. 6 ఆ తరువాత ఐదు వందలకంటే ఎక్కువైన సోదర సోదరీలకు ఒక్క సమయంలోనే కనిపించాడు. వారిలో చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. కొందరు కన్ను మూశారు. 7 తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపొస్తలులకందరికీ కనిపించాడు.

    8 చివరిగా అకాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు.

  2. 16 పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు. 17 అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.

    18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

  3. 14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఎలాగంటే, అందరి కోసం ఒకడు చనిపోయాడు కాబట్టి అందరూ చనిపోయారనే విషయం కచ్చితం. 15 బతికే వారు ఇక నుంచి తమ కోసం బతకకుండా తమ కోసం చనిపోయి సజీవంగా తిరిగి లేచిన వాడి కోసమే బతకాలని ఆయన అందరి కోసం చనిపోయాడు. 16 ఈ కారణం చేత ఇప్పటి నుండి మేము ఎవరితోనూ ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే చూశాం. అయితే ఇప్పటి నుండి ఇలా వ్యవహరించం.

    17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి. 18 అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు. 19 అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.

    20 కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం. 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.

  4. 14 గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను. 15 కాబట్టి రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించాలన్న ఆశతో నేను సిద్ధంగా ఉన్నాను.

    16 సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి. 17 నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.

    18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

    21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది.

  5. 15 యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. 16 దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.

    17 “నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు. 18 తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.”

    ఆరోహణం (లూకా 24:50-53. అపొ. కా. 1:6-11)

    19 ప్రభు యేసు వారితో మాట్లాడిన తరవాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. 20 ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకూ వెళ్ళి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై, వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు.

  6. 8 “అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు.

  7. 26 ప్రభువు దూత ఫిలిప్పుతో “నీవు లేచి, దక్షిణ దిశగా వెళ్ళి, యెరూషలేము నుండి గాజా పోయే అరణ్య మార్గంలో వెళ్ళు” అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు. 27 అప్పుడు ఇథియోపియా రాణి కందాకే దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటినీ నిర్వహిస్తున్న ఇథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు.

    28 అతడు తిరిగి వెళ్తూ, తన రథం మీద కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు. 29 ఆత్మ ఫిలిప్పుతో “నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకో” అని చెప్పాడు. 30 ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథం చదువుతుంటే విని, “మీరు చదివేది మీకు అర్థమవుతుందా?” అని అడిగాడు. 31 అతడు, “నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంది” అని చెప్పి, రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు. 32 ఇతియోపీయుడు చదివే లేఖనభాగం ఏదంటే,

    ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు.

    బొచ్చు కత్తిరించే వాడి దగ్గర

    గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే,

    ఆయన నోరు తెరవలేదు.

    33 ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు.

    ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు?

    ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు.

    34 అప్పుడు ఆ నపుంసకుడు, “ప్రవక్త చెప్పేది ఎవరి గురించి? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు” అని ఫిలిప్పును అడిగాడు. 35 ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు. 36 వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చారు. నపుంసకుడు “ఇక్కడ నీళ్ళున్నాయి! నాకు బాప్తిసమివ్వడానికి ఆటంకమేమిటి?” అని అడిగి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు.

    37 ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీటిలోకి దిగారు. 38 అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చాడు. 39 వారు నీళ్లలో నుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు. 40 అయితే ఫిలిప్పు అజోతు అనే ఊళ్ళో కనిపించాడు. అతడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ కైసరయ వరకూ అన్ని ఊళ్లలో సువార్త ప్రకటించాడు.

  8. 1 అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. 2 ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే, 3 ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది. 4 దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు.

  9. 2 ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి.

    3 దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను. 4 నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి.

    5 సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 6 మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.

  10. 15 దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.

    16 మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు.

  11. 1 ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం. 2 ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం.

    3 మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది. 4 మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం.

    5 దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు.

  12. 1 ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి తీవ్రమైన హింస మొదలైంది. 2 కాబట్టి, అపొస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాల్లోకి చెదరి పోయారు. భక్తిపరులైన మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి చాలా దుఖించారు. 3 అయితే సౌలు ప్రతి ఇంట్లోకి చొరబడి, స్త్రీ పురుషులను ఈడ్చుకుపోయి, చెరసాలలో వేస్తూ సంఘాన్ని పాడు చేస్తున్నాడు.

    4 అయినా, చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు.

    5 ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు.

  13. 5 ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవిస్తాడని మోషే రాస్తున్నాడు. 6 అయితే విశ్వాసమూలమైన నీతి ఇలా చెబుతున్నది, “పరలోకానికి ఎవడు ఎక్కిపోతాడు? (అంటే క్రీస్తును కిందకి తేవడానికి). 7 లేక అగాధంలోకి ఎవడు దిగిపోతాడు? (అంటే క్రీస్తును చనిపోయిన వారిలో నుండి పైకి తేవడానికి) అని నీ హృదయంలో అనుకోవద్దు.”

    8 కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి,

    “దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో,

    మీ హృదయంలో ఉంది.”

    మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. 9 అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది. 10 ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు. 11 “ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. 12 ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. 13 ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది. 14 నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? 15 ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది. 16 అయితే అందరూ సువార్తకు లోబడలేదు. “ప్రభూ, మా సందేశాన్ని ఎవరు నమ్మారు?” అని యెషయా చెబుతున్నాడు కదా? 17 కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది.

  14. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు.

  15. 17 కాని ప్రియులారా, అంతకు ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి. 18 చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు. 19 వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు.

    20 కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ 21 మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి. 22 అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి. 23 అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి. 24 మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు. 25 ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.

  16. 35 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు. 36 ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా, చెదరిపోయి ఉన్నారు. 37 ఆయన తన శిష్యులతో, “కోత చాలా ఎక్కువగా ఉంది. కానీ పని వారు తక్కువగా ఉన్నారు. 38 కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు.

  17. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.

    46 “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.

    49 “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు.

  18. 26 “తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. 27 మీరు మొదటి నుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు కూడా సాక్షులుగా ఉంటారు.

  19. 7 దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు. 8 కాబట్టి నువ్వు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గురించి గానీ, ఆయన ఖైదీనైన నన్ను గురించి గానీ సిగ్గుపడకుండా, దేవుని శక్తితో సువార్త మూలంగా వాటిల్లే కష్టాల్లో భాగం పంచుకో.

    9 ఆయన మన క్రియలనుబట్టి కాక తన సంకల్పాన్నిబట్టి, కాలం ఆరంభానికి ముందే మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు. 10 ఆ కృప ఇప్పుడు క్రీస్తు యేసు అనే మన రక్షకుడు ప్రత్యక్షం కావడం ద్వారా వెల్లడి అయింది. ఆయన మరణాన్ని నాశనం చేసి జీవాన్నీ అమర్త్యతనూ సువార్త ద్వారా వెలుగులోకి తెచ్చాడు. 11 ఆ సువార్త విషయంలో నేను ప్రచారకుడుగా, అపొస్తలుడుగా, బోధకుడుగా నియామకం పొందాను.

    12 ఆ కారణం చేత నేనీ కష్టాలు అనుభవిస్తున్నాను. నేను నమ్మినవాడు నాకు తెలుసు కాబట్టి సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించినదాన్ని రాబోతున్న ఆ రోజు వరకూ ఆయన కాపాడగలడని నాకు పూర్తి నమ్మకం ఉంది. 13 క్రీస్తు యేసులో ఉంచవలసిన విశ్వాసంతో, ప్రేమతో నేను నీకు నేర్పిన క్షేమకరమైన బోధ నమూనాను పాటించు. 14 దేవుడు నీకు అప్పగించిన ఆ మంచిదాన్ని మనలో నివాసమున్న పరిశుద్ధాత్మ వలన కాపాడుకో.

  20. 9 మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 10 అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి.

    11 వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ.

    12 సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు. 13 నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకూ సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు.

  21. 37 వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. 38 దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు. 40 ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు. 41 అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.

  22. 30 మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. 31 ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు. 32 మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.”

  23. 8 తరువాత పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు. 9 అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారి నుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.

    10 రెండు సంవత్సరాల పాటు ఈ విధంగా జరిగింది. కాబట్టి యూదులు, గ్రీకులు, ఆసియలో నివసించే వారంతా ప్రభువు వాక్కు విన్నారు.

    11 అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు. 12 అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దురాత్మలు కూడా వదలిపోయాయి.

  24. 26 అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.

    27 అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు. 28 అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు.

    29 చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి, 30 వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. 31 అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి 32 అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. 33 రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు.

    34 అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.

  25. 23 ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.

  26. 1 సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి దేవుని మర్మం గూర్చి బోధించినప్పుడు మాటకారితనాన్నీ లేక గొప్ప తెలివినీ ఉపయోగించలేదు. 2 మీతో ఉన్న సమయంలో నేను యేసు క్రీస్తును తప్ప, అంటే సిలువను అనుభవించిన యేసు క్రీస్తును తప్ప, మరేదీ తెలియనివాణ్ణయి ఉండాలని తీర్మానించుకున్నాను. 3 బలహీనుడుగా, భయంతో, వణకుతూ మీ దగ్గర గడిపాను.

    4 మీ విశ్వాసం మానవ జ్ఞానంపై కాక, దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నా ఆశ. 5 అందుకే నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, జ్ఞానంతో నిండిన తియ్యని మాటలు వాడక, పరిశుద్ధాత్మ శక్తినే ప్రదర్శించాను.

  27. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

    4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

    6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.

    8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  28. 11 “నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు. 12 అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.

    13 “లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.

    14 ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. 15 ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. 16 మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.

  29. 14 రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.

  30. 17 కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని సేవ విషయాల్లో నాకు అతిశయ కారణం ఉంది. 18 అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్కు చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే తప్ప మరి ఇతర విషయాలు మాట్లాడను. 19 కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను. 20 నేను వేరొకడు వేసిన పునాది మీద కట్టకూడదని క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని బహు ఆశతో అలా ప్రకటించాను.

  31. 19 నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను. 20 యూదులను సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను. 21 దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను. 22 బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను. 23 సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ.

    24 పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి. 25 అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.

    26 కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు. 27 ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.

  32. 12 సోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా వ్యాపించడానికే అని మీరు తెలుసుకోవాలని ఇప్పుడు కోరుతున్నాను. 13 ఎలాగంటే, నా సంకెళ్ళు క్రీస్తు కోసమే కలిగాయని రాజ భవనం కావలి వారికీ తక్కిన వారందరికీ తెలిసిపోయింది. 14 అంతేకాక, ప్రభువులోని సోదరుల్లో ఎక్కువమంది నా బంధకాలను బట్టి స్థిర విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్కు ప్రకటించడానికి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.

    15 కొంతమంది అసూయతో కలహబుద్ధితో, మరి కొంతమంది మంచి ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. 16 ప్రేమతో క్రీస్తును ప్రకటించేవారికి నేను సువార్త పక్షాన వాదించడానికి నియామకం పొందానని తెలుసు. 17 అయితే మిగతా వారు బంధకాల్లో ఉన్న నాకు మరింత బాధ కలిగించాలని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. 18 అయితేనేం? కపటంతో గానీ సత్యంతో గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా ఆనందిస్తాను.

  33. 1 నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2 మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.

    3 ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. 4 “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. 5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.

    6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

  34. 7 నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివాడిగా నియమించాను. కాబట్టి నువ్వు నా నోటి మాట విని నా పక్షంగా వారిని హెచ్చరించాలి. 8 ‘దుర్మార్గుడా, నువ్వు తప్పకుండా చస్తావు’ అని దుర్మార్గుడికి నేను చెబితే, నువ్వు అతణ్ణి హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు తన దోషాన్ని బట్టి చస్తాడు. అయితే అతని చావుకు నిన్నే బాధ్యుని చేస్తాను. 9 అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని నువ్వు అతన్ని హెచ్చరించావనుకో. అతడు తన దుర్మార్గం విడిచి పెట్టకపోతే అతడు తన దోషాన్ని బట్టి చస్తాడు గానీ నువ్వు అతని చావుకు బాధ్యుడివి కాదు.

  35. 32 “ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.

  36. 38 కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి వెళ్ళకుండా వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన గానీ వారి పని గానీ మనుషుల వలన కలిగినదైతే, అది వ్యర్థమై పోతుంది. 39 దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొకవేళ దేవునితో పోరాడే వారవుతారేమో సుమా.”

    40 వారతని మాటకు అంగీకరించి, అపొస్తలులను పిలిపించి వారిని కొట్టించి, యేసు నామంలో బోధించ వద్దని ఆజ్ఞాపించి విడుదల చేశారు. 41 ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపొస్తలులు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్ళిపోయారు. 42 ప్రతిరోజూ దేవాలయంలో, ఇంటింటా మానకుండా బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు.

  37. 26 “సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుడంటే భయభక్తులు గలవారలారా, ఈ రక్షణ సందేశం మనకే వచ్చింది. 27 యెరూషలేములో నివసిస్తున్నవారు, వారి అధికారులూ, ఆయనను గానీ, ప్రతి విశ్రాంతి దినాన చదివే ప్రవక్తల మాటలను గానీ నిజంగా గ్రహించక, యేసుకు మరణ శిక్ష విధించి ఆ ప్రవచనాలను నెరవేర్చారు.

    28 ఆయనలో మరణానికి తగిన కారణమేమీ కనబడక పోయినా వారు ఆయనను చంపాలని పిలాతును కోరారు. 29 ఆయనను గురించి రాసినవన్నీ నెరవేరిన తరువాత వారాయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు. 30 అయితే దేవుడు చనిపోయిన వారిలో నుండి ఆయనను లేపాడు. 31 ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు. 32 పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతుల్లో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు.”

    33 “‘నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను’

    అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది. 34 ఇంకా, ఇకపై కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపడం ద్వారా,

    ‘దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన, నమ్మకమైన దీవెనలను నీకిస్తాను’

    అని చెప్పాడు. 35 అందుకే వేరొక కీర్తనలో,

    ‘నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు’ అని చెబుతున్నాడు.

    36 దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి కన్ను మూశాడు. 37 తన పితరుల దగ్గర సమాధి అయి కుళ్ళిపోయాడు గాని, దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. 38 కాబట్టి సోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రకటిస్తున్నాము.

    39 మోషే ధర్మశాస్త్రం మిమ్మల్ని ఏ విషయాల్లో నిర్దోషులుగా తీర్చలేక పోయిందో ఆ విషయాలన్నిటిలో, విశ్వసించే ప్రతివానినీ ఈయనే నిర్దోషిగా తీరుస్తాడని మీకు తెలియాలి.

  38. 1 వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. 2 పౌలు తన అలవాటు ప్రకారం అలవాటు ప్రకారం మూడు విశ్రాంతి దినాలు లేఖనాల్లో నుండి వారితో తర్కించాడు. 3 క్రీస్తు హింసలు అనుభవించి మృతుల్లో నుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను విప్పి వివరించాడు. “నేను మీకు ప్రకటించే యేసే క్రీస్తు” అని తెలియజేశాడు.

    4 కొంతమంది యూదులు ఒప్పుకుని పౌలు సీలలతో కలిశారు. వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు.

  39. 13 విశ్రాంతి దినాన ఊరి బయటి ద్వారం దాటి నదీ తీరాన ప్రార్థనాస్థలం ఉంటుందని అనుకున్నాము. మేము అక్కడ కూర్చుని, అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడాం.

    14 లూదియ అనే దేవుని ఆరాధకురాలు ఒకామె మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు బట్టలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు. 15 ఆమె, ఆమె ఇంటివారూ బాప్తిసం పొందారు. “నేను ప్రభువులో విశ్వాసం గలదాన్ని అని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండాలి,” అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది.

  40. 21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

    27 కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే. 28 కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.

    29 దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే. 30 దేవుడు ఒక్కడే కాబట్టి, ఆయన సున్నతి గలవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేని వారిని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తాడు.

    31 విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.

  41. 6 యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.

  42. 6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. 11 అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.

  43. 16 నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన.

    17 దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు.

  44. 14 దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు. 15 విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము. 16 నాశనమైపోతున్న వారికి మరణపు వాసనగా, విమోచన పొందుతున్న వారికి జీవపు సువాసనగా ఉన్నాము. వీటికి యోగ్యులెవరు? 17 దేవుని వాక్యాన్ని లాభం కోసం చాలామంది అమ్మేస్తున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు. మేమైతే సదుద్దేశంతో ఉన్నాం. దేవుడు మమ్మల్ని పంపించాడు. క్రీస్తులో దేవుని ఎదుట బోధిస్తున్నాం.

  45. 8 పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి అయినా మన ఊహకందని క్రీస్తు ఐశ్వర్యాన్ని యూదేతరులకు ప్రకటించడానికీ, 9 సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు. 10 తన బహుముఖ జ్ఞానం సంఘం ద్వారా వాయుమండలంలోని ప్రధానులూ అధికారులూ తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం. 11 అది మన ప్రభువైన క్రీస్తు యేసులో చేసిన ఆయన నిత్య సంకల్పం. 12 క్రీస్తుపై మన విశ్వాసం చేత ఆయనను బట్టి మనకి ధైర్యం, దేవుని సన్నిధిలోకి ప్రవేశించే నిబ్బరం కలిగింది.

    13 కాబట్టి మీ నిమిత్తం నాకు కలిగిన హింసలు చూసి మీరు అధైర్యపడవద్దని చెబుతున్నాను. ఇవి మీకు మహిమ కారకాలుగా ఉంటాయి.

  46. 19 సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి. 20 సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.

  47. 7 సువార్త ప్రకటిస్తూ శాంతిసమాధానాలు చాటిస్తూ శుభ సమాచారం తెస్తూ విడుదల సమాచారం తీసుకు వచ్చే వారి పాదాలు “నీ దేవుడు పరిపాలిస్తున్నాడు” అని సీయోనుతో చెప్పే వారి పాదాలు పర్వతాల మీద ఎంతో అందంగా ఉన్నాయి.

  48. 4 అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు.

    అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం.

    5 కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది.

    మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.

    6 మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము.

    యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.

    7 ఆయన దుర్మార్గానికి గురి అయ్యాడు. బాధల పాలైనా అతడు నోరు తెరవలేదు.

    గొర్రెపిల్లలాగా ఆయన్ని వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు.

    8 అన్యాయపు తీర్పుతో ఆయన్ని శిక్షించారు. ఆ తరంలో ఆయన గురించి ఎవరు పట్టించుకున్నారు?

    నా ప్రజల దుర్మార్గానికి ఆయనకు శిక్ష పడింది. సజీవుల భూమిలోనుంచి అతడు హతమయ్యాడు.

    9 అతడు చనిపోయినప్పుడు నేరస్థులతో అతన్ని సమాధి చేశారు. ధనవంతుని దగ్గర అతన్ని ఉంచారు.

    అతడు ఏ నేరమూ చేయలేదు. అతని నోట మోసం ఎప్పుడూ లేదు.

    10 అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు.

    ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు.

    ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది.

  49. 14 యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, 15 “కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు. 16 ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు.

  50. 18 అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు. 19 అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. 20 మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు.

  51. 15 అందుకు ప్రభువు, “నీవు వెళ్ళు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. 16 ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను” అని అతనితో చెప్పాడు.

  52. 6 ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ 7 యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.

    8 అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు. 9 అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది. 10 అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.

  53. 8 ఆ సమాజ మందిరం అధికారి క్రిస్పు కుటుంబ సమేతంగా ప్రభువులో విశ్వాసముంచాడు. ఇంకా కొరింతు పౌరుల్లో చాలామంది విని, విశ్వసించి బాప్తిసం పొందారు.

  54. 9 ప్రభువు రాత్రివేళ దర్శనంలో, “నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు. 10 ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి నీ మీదికి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు చెందినవారు చాలామంది ఉన్నారు” అని పౌలుతో చెప్పాడు.

    11 అతడు వారి మధ్య దేవుని వాక్కు బోధిస్తూ, ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు.

  55. 3 ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే. 4 దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.

  56. 13 మీరు కూడా సత్య వాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసముంచారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీమీద ముద్ర పడింది. 14 దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే వరకూ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.

  57. 1 పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి. 2 వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి. 3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.

    4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

    8 ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి పనులు శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.

    9 అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు. 10 మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో. 11 నీకు తెలుసు, అలాటివాడు దారి తప్పిపోయి పాపం చేసి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు.

    12 నేను నికొపొలిలో చలికాలం గడపాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను అర్తెమానుగాని, తుకికునుగాని నీ దగ్గరకి పంపినప్పుడు నువ్వు నికొపొలికి రావడానికి ప్రయత్నం చెయ్యి.

  58. 2 యెహోవాకు పాడండి, ఆయన నామం స్తుతించండి, ప్రతిరోజూ ఆయన రక్షణ ప్రకటించండి.

    3 రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి.

    4 యెహోవా గొప్పవాడు. ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి. దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి.

  59. 1 యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు. 2 “నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.”

  60. 18 వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు.

    19 వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు. 20 మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు.

  61. 32 సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. 33 ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. 34 రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.

    35 ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. 36 సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. 37 ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు. 38 ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు. 39 ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.

    40 ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు. 41 యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు. 42 వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.

    43 ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి, 44 “నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు. 45 కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.

  62. 18 యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు. 19 కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, “నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు” అని అన్నాడు.

  63. 35 మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు. 36 అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, “ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల” అన్నాడు.

  64. 24 కాబట్టి వారు అప్పటివరకూ గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని రెండవ సారి పిలిపించారు. “దేవునికి మహిమ చెల్లించు. ఈ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అని అతనితో అన్నారు. 25 అందుకు వాడు, “ఆయన పాపాత్ముడో కాదో నాకేం తెలుసు? అయితే నాకు ఒక్కటి తెలుసు. నేను గుడ్డివాడుగా ఉండేవాణ్ణి, ఇప్పుడైతే చూస్తున్నాను” అన్నాడు.

  65. 17 ప్రధాన యాజకుడూ అతనితో పాటు ఉన్నవారంతా, అంటే సద్దూకయ్యుల తెగ వారంతా అసూయతో నిండిపోయి 18 అపొస్తలులను పట్టుకుని పట్టణంలోని చెరసాల్లో వేశారు.

    19 అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి 20 ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పండి” అని వారితో అన్నాడు.

  66. 50 అయితే యూదులు భక్తి మర్యాదలున్న స్త్రీలనూ ఆ పట్టణ ప్రముఖులనూ రెచ్చగొట్టి పౌలునూ బర్నబానూ హింసల పాలు చేసి, వారిని తమ ప్రాంతం నుండి తరిమేశారు.

    51 అయితే పౌలు బర్నబాలు తమ పాద ధూళిని వారికి దులిపి వేసి ఈకొనియ ఊరికి వచ్చారు. 52 అయితే శిష్యులు ఆనందంతో పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు.

  67. 17 అందుచేత సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి ఆరాధించే వారితోనూ, వ్యాపార వీధుల్లో ప్రతి రోజూ వచ్చిపోయే వారితోనూ చర్చిస్తూ వచ్చాడు.

  68. 30 పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో నివసించి, తన దగ్గరికి వచ్చే వారినందరినీ ఆదరిస్తూ 31 ఏ ఆటంకమూ లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు.

  69. 21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.

  70. 1 దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను.

    2 వాక్యాన్ని బోధించు, అనుకూలమైనా, కాకపోయినా సిద్ధంగా ఉండు. ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా సంపూర్ణమైన సహనంతో ఉపదేశించు.

  71. 11 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12-13 మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.

    14 ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.

  72. 1 భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది. 2 ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు.

  73. 8 ఇంకా మీతో చెప్పేదేమిటంటే, నన్ను మనుషుల ముందు ఎవరు అంగీకరిస్తాడో వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని దూతల ముందు అంగీకరిస్తాడు. 9 మనుషుల ముందు నేనెవరో తెలియదు అనే వారి గురించి నేను కూడా దేవుని దూతల ముందు వారెవరో నాకు తెలియదు అని చెబుతాను.

  74. 26 నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.

  75. 7 వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు. 8 పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా, 9 ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. 10 మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు. 11 ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది. 12 ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”

  76. 6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 7 అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు. 8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక. 9 మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.

    10 ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషులను తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషులను తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.

    11 సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి. 12 మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.

  77. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

  78. 8 అప్పుడు “నేను ఎవరిని పంపాలి? మా పక్షంగా ఎవరు వెళ్తారు?” అని ప్రభువు అంటుండగా విన్నాను.

    అప్పుడు నేను “ఇదుగో నేనున్నాను, నన్ను పంపు” అన్నాను.

  79. 4 “యెహోవాను స్తుతించండి. ఆయన పేరు పెట్టి పిలవండి. జనాల్లో ఆయన క్రియలు చాటించండి. ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.

    5 యెహోవాను గూర్చి పాటలు పాడండి. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ సంగతి భూమంతా తెలియనివ్వండి.

  80. 17 “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను కాపలా వాడిగా పెట్టాను. కాబట్టి నా నోటి మాట జాగ్రత్తగా విను. వాళ్లకి నా హెచ్చరిక తెలియచెయ్యి! 18 ఒక దుర్మార్గుడికి ‘నువ్వు కచ్చితంగా చస్తావు’ అని నేను చెప్పినప్పుడు నువ్వు వాడికి ముందు జాగ్రత్త చెప్పక పోయినా, వాడు బతికి ఉండటానికి తన దుర్మార్గపు పనులను విడిచిపెట్టాలని వాణ్ణి హెచ్చరించక పోయినా వాడు తన పాపాలను బట్టి తప్పకుండా చస్తాడు. కానీ వాడి రక్తానికి నిన్ను జవాబుదారీని చేస్తాను. 19 అయితే ఒకవేళ నువ్వు ఆ దుర్మార్గుణ్ణి హెచ్చరించినప్పుడు వాడు తన దుర్మార్గతను వదిలిపెట్టకుండా పాపాలు చేస్తూనే ఉంటే వాడు తన పాపాల మూలంగానే చస్తాడు. కానీ నువ్వు తప్పించుకుంటావు.

    20 నీతి గలవాడు తన నీతిని విడిచిపెట్టి అన్యాయంగా ప్రవర్తిస్తే నేను వాడి ఎదుట ఒక ఆటంకాన్ని ఉంచుతాను. అతణ్ణి నువ్వు హెచ్చరించలేదు కాబట్టి అతడు చనిపోతాడు. అతడు తన పాపంలోనే చనిపోతాడు. అతడు నీతిగా జరిగించిన పనులను నేను ససేమిరా జ్ఞాపకానికి తెచ్చుకోను. కానీ వాడి రక్తానికి నిన్ను జవాబుదారీని చేస్తాను.

  81. 17 అప్పటి నుంచి యేసు, “పరలోక రాజ్యం దగ్గరపడింది. పశ్చాత్తాపపడండి” అంటూ బోధించడం మొదలు పెట్టాడు.

  82. 23 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు.

  83. 34 తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి. 35 ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 36 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం? 37 ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?

    38 వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”

  84. 11 వారు సమాజమందిరాల్లో పెద్దల దగ్గరకూ అధిపతుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ మిమ్మల్ని తీసుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా జవాబివ్వాలా, ఏం మాట్లాడాలా అని చింత పడవద్దు. 12 మీరు ఏం చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు.”

  85. 14 కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో. 15 ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.

    16-17 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

  86. 19 నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తొలగిపోతే మరొకడు అతన్ని తిరిగి సత్యానికి మళ్ళించినట్టయితే 20 అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్ళించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.

  87. 9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.

  88. 6 దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను. 7 అందరూ తన ద్వారా ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు. 8 ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు.

  89. 39 ఆయన యూదుల దేశంలో, యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఈ యేసుని వారు మానుకు వేలాడదీసి చంపారు. 40 దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు. 41 ప్రజలందరికీ కాక దేవుడు ముందుగా ఏర్పరచిన సాక్షులకే, అంటే ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయనతో కలిసి అన్నపానాలు చేసిన మాకే, ఆయన ప్రత్యక్షంగా కనిపించేలా అనుగ్రహించాడు. 42 దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్షమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. 43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన నామంలో పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు” అని చెప్పాడు.

    44 పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు.