28 Bible Verses About Dreams

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Dreams
  1. 11 ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు. 12 హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు.

    13 వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “లేచి బాలుణ్ణీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకూ అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతున్నాడు” అని అతనితో చెప్పాడు. 14 యోసేపు లేచి, రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు.

  2. 1 ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ ఎదుట సూచక క్రియను లేక మహత్కార్యాన్ని చూపించి, 2 మీరు ఎరుగని “ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం రండి” అని చెబుతాడేమో. 3 అలా చెప్పినప్పుడు అతడు మీతో చెప్పిన సూచక క్రియ లేక మహత్కార్యం జరిగినా సరే, ఆ ప్రవక్త, లేక కలలు కనేవాడి మాటలు వినవద్దు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు.

    4 మీరు మీ యెహోవా దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయననే హత్తుకుని ఉండాలి. 5 మీరు నడుచుకోవాలని మీ దేవుడు యెహోవా మీకాజ్ఞాపించిన మార్గం నుండి మిమ్మల్ని తొలగించి, ఐగుప్తు దేశం అనే బానిసల ఇంట్లో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించారు కాబట్టి ఆ ప్రవక్తకు, లేక కలలు కనేవాడికి మరణశిక్ష విధించాలి. ఆ విధంగా మీ మధ్య నుండి ఆ దుష్టత్వాన్ని పరిహరించాలి.

  3. 1 రాజైన నెబుకద్నెజరు పాలన కాలం రెండవ సంవత్సరంలో అతనికి నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలలను బట్టి అతడు కలవరం చెందాడు. అతనికి నిద్రపట్టడం లేదు. 2 తనకు వచ్చిన కలలను గూర్చి తెలియజేయడానికి శకునాలు చెప్పేవాళ్ళను, గారడీ విద్యలు చేసేవాళ్ళను, మాంత్రికులను, జోతిష్యులను పిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళందరూ వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. 3 రాజు వాళ్ళతో “నాకు నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలల అర్థం తెలుసుకోవాలని నేను ఎంతో ఆదుర్దా పడుతున్నాను” అని చెప్పాడు.

    4 అప్పుడు జోతిష్యులు సిరియా భాషలో “రాజు చిరకాలం జీవించు గాక. మీ దాసులమైన మాకు ఆ కలలు ఏమిటో చెప్పండి. దాని భావం మీకు వివరిస్తాం” అన్నారు.

  4. 3 కాని దేవుడు రాత్రి కలలో అబీమెలెకు దగ్గరికికు కనబడి అతనితో “చూడు, నువ్వు చచ్చినట్టే! ఎందుకంటే నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్న స్తీ ఒక వ్యక్తికి భార్య” అని చెప్పాడు.

    4 అయితే అబీమెలెకు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి అతడు “ప్రభూ, ఇలాంటి నీతిగల జాతిని చంపివేస్తావా? 5 ‘ఈమె నా చెల్లి’ అని నాతో అతడే చెప్పాడు కదా! ఆమె కూడా ‘అతడు నా అన్న’ అన్నది కదా. నేను నా చేతులతో ఏ దోషమూ చేయలేదు. నిజాయితీగానే ఈ పని చేశాను” అన్నాడు.

    6 అందుకు దేవుడు అతనికి కలలో కనబడి “అవును, నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేశావని నాకు తెలుసు. నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డుకున్నాను. అందుకే నేను నిన్ను ఆమెను తాకడానికి అనుమతించ లేదు. 7 కాబట్టి ఆ వ్యక్తి భార్యను తిరిగి అతనికప్పగించు. ఎందుకంటే అతడు ప్రవక్త. నువ్వు బతికేలా అతడు నీ కోసం ప్రార్థిస్తాడు. ఒకవేళ నువ్వు ఆమెను తిరిగి అతనికి అప్పగించకపోతే నువ్వూ, నీకు చెందినవారూ తప్పక చనిపోతారు. ఈ సంగతి నువ్వు బాగా తెలుసుకో” అని చెప్పాడు.

  5. 12 మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుప్రాంతాల వాళ్ళు లెక్కకు మిడతల్లా ఆ మైదానంలో పోగై ఉన్నారు. వాళ్ల ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న యిసుక రేణువుల్లా లెక్కకు మించి ఉన్నాయి. 13 గిద్యోను దిగి వచ్చినప్పుడు, ఒకడు తాను కనిన కలను మరో సైనికుడికి చెప్తూ “నాకొక కలొచ్చింది. బార్లీ రొట్టె ఒకటి మిద్యానీయుల శిబిరంలోకి దొర్లి, ఒక గుడారానికి తాకి, దాన్ని పడగొట్టి తలకిందులు చేయగా ఆ గుడారం కూలిపోయింది” అన్నాడు. 14 అందుకు అతని స్నేహితుడు “అది ఇశ్రాయేలీయుడు యోవాషు కొడుకు గిద్యోను ఖడ్గమే తప్ప మరొకటి కాదు. దేవుడు మిద్యానీయుల మీద, ఈ శిబిరం మీద, అతనికి జయం ఇస్తున్నాడు” అని జవాబిచ్చాడు. 15 గిద్యోను ఆ కల, దాని భావం విన్నప్పుడు, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల శిబిరంలోకి తిరిగి వెళ్లి “లెండి, యెహోవా మిద్యానీయుల సైన్యం మీద మీకు జయం ఇచ్చాడు” అని చెప్పి,

  6. 19 హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు కలలో కనబడి, 20 “లేచి, బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. బాలుడి ప్రాణం తీయాలని చూసేవారు చనిపోయారు” అని చెప్పాడు. 21 అప్పుడు యోసేపు లేచి పిల్లవాణ్ణీ తల్లినీ ఇశ్రాయేలు దేశానికి తీసుకు వచ్చాడు.

    22 అయితే అర్కెలా తన తండ్రి హేరోదు స్థానంలో యూదయ ప్రాంతాన్ని పాలిస్తున్నాడని విని, అక్కడికి వెళ్ళడానికి యోసేపు భయపడ్డాడు. దేవుడు అతన్ని కలలో హెచ్చరించగా గలిలయ ప్రాంతానికి వెళ్ళి,

  7. 1 యాకోబు తన తండ్రి పరదేశీయుడుగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. 2 యాకోబు జీవిత వృత్తాంతం ఇది. యోసేపు పదిహేనేళ్ళ వాడుగా ఉన్నప్పుడు తన సోదరులతో కూడ మందను మేపుతూ ఉన్నాడు. అతడు చిన్నవాడుగా తన తండ్రి భార్యలైన బిల్హా కొడుకుల దగ్గరా జిల్పా కొడుకుల దగ్గరా ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడ్డ పనులను గూర్చిన సమాచారం వారి తండ్రికి చేరవేసేవాడు. 3 యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు. 4 అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు.

    5 యోసేపు ఒక కల కని తన సోదరులతో దాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగపట్టారు. 6 అతడు వారితో ఇలా చెప్పాడు. “నేను కన్న ఈ కల మీరూ వినండి. 7 అదేమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి.” 8 అందుకు అతని సోదరులు “నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా” అని అతనితో చెప్పి, అతని కలలను బట్టీ అతని మాటలను బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు.

    9 అతడింకొక కల కని తన సోదరులతో “ఇదిగో నేను మరొక కల గన్నాను. అందులో సూర్య చంద్రులూ, పదకొండు నక్షత్రాలూ నాకు సాష్టాంగ పడ్డాయి” అని చెప్పాడు. 10 అతడు తన తండ్రితో, తన అన్నలతో అది చెప్పాడు. అతని తండ్రి అతనితో “నువ్వు కన్న ఈ కల ఏమిటి? నేనూ నీ తల్లీ నీ అన్నలూ నిజంగా నీకు సాష్టాంగపడాలా?” అని అతణ్ణి గద్దించాడు. 11 అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు.

  8. 6 యెహోవా ఇలా అన్నాడు.

    “మీరు ఇప్పుడు నా మాటలు వినండి.

    మీ మధ్య నా ప్రవక్త ఎవరన్నా ఉంటే, నేను అతనికి స్వప్నాల ద్వారా దర్శనం ఇస్తాను.

    కలల ద్వారా అతనితో మాట్లాడతాను.

  9. 19 ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు.

    20 అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. 21 ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.

    22-23 “‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది.

    ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే

    ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు”

    అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. 24 యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు.

  10. 12 అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. 13 యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను.

    14 నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. 15 ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు.

    16 యాకోబు నిద్ర మేలుకుని “నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు” అనుకున్నాడు. 17 అతడు భయపడి “ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు.

  11. 14 దేవుడు ఒక్కమారే పలుకుతాడు. రెండు సార్లు పలుకుతాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు.

    15 మంచం మీద కునికే సమయంలో, గాఢనిద్ర పట్టేటప్పుడు వచ్చే స్వప్నాల్లో మాట్లాడుతాడు.

    16 ఆయన మనుషుల చెవులను తెరుస్తాడు. వారిని భయపెడతాడు.

    17 మనుషులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి, తాము తలపెట్టిన పాపకార్యం వారు మానుకొనేలా చేయడానికి,

    18 గోతికి పోకుండా వారి జీవాన్ని, మరణం కాకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి,

  12. 26 అప్పుడు రాజు “నాకు వచ్చిన కలను, దాని భావాన్ని నువ్వు వివరించగలవా?” అని బెల్తెషాజరు అనే దానియేలును అడిగాడు. 27 దానియేలు రాజు ఎదుట నిలబడి ఇలా జవాబిచ్చాడు. “రాజు కోరినట్టు ఈ మర్మం వివరించడం జ్ఞానులకైనా, గారడీ విద్యలు చేసేవాళ్ళకైనా, శకునం చెప్పేవాళ్ళకైనా, జ్యోతిష్యులకైనా సాధ్యం కాదు. 28 అయితే గుప్తంగా ఉన్న విషయాలను వెల్లడించే దేవుడు పరలోకంలో ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఆయన రాజైన నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. మీరు మంచం మీద పడుకుని ఉన్నప్పుడు మీ మనస్సులోకి వచ్చిన దర్శనం ఏమిటో మీకు తెలియజేస్తాను.

  13. 28 తరువాత నేను ప్రజలందరి మీద

    నా ఆత్మను కుమ్మరిస్తాను.

    మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు.

    మీ ముసలివారు కలలుకంటారు.

    మీ యువకులకు దర్శనాలు వస్తాయి.

    29 ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.

    30 ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను.

    భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను.

    31 యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు

    సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.

  14. 8 అందుకు వారు “మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. వాటి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు” అన్నారు. యోసేపు వారితో “అర్థాలు తెలియచేయడం దేవుని అధీనమే గదా! దయచేసి నాకు చెప్పండి” అన్నాడు.

  15. 24 ఆ రాత్రి కలలో దేవుడు లాబాను దగ్గరికి వచ్చి “నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు. జాగ్రత్త సుమా” అని అతనితో చెప్పాడు.

  16. 25 “నా పేర మోసపు మాటలు ప్రవచించే ప్రవక్తల మాటలు నేను విన్నాను. ‘నాకు కల వచ్చింది! నాకు కల వచ్చింది’ అని వాళ్ళు చెబుతున్నారు.”

    26 ఎంతకాలం ఇలా జరగాలి? ప్రవక్తలు తమ మనస్సులో నుంచి అబద్ధాలు ప్రవచిస్తున్నారు. తమ హృదయాల్లోని మోసంతో ప్రవచిస్తున్నారు.

    27 బయలు దేవతను పూజిస్తూ తమ పూర్వీకులు నా పేరును మరచిపోయినట్టు ప్రతివాడూ తమ పొరుగు వారితో చెప్పే కలలతో నా ప్రజలు నా పేరును మరచిపోవాలని ఆలోచిస్తున్నారు.

    28 కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవచ్చు. అయితే ఎవడికి నేను నా వాక్కు వెల్లడించానో అతడు దాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. ధాన్యంతో పొట్టుకు ఏం సంబంధం? ఇదే యెహోవా వాక్కు.

  17. 19 ఆ రాత్రి సమయంలో దానియేలుకు దర్శనంలో ఆ కల, కల అర్థం వెల్లడైనాయి. దీన్నిబట్టి దానియేలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఈ విధంగా స్తుతించాడు, 20 “అన్ని యుగాల్లో దేవుని నామానికి స్తుతి కలుగు గాక. ఆయన జ్ఞానం, బల ప్రభావాలు కలిగినవాడు. 21 ఆయన కాలాలపై, సమయాలపై సమస్త అధికారం కలిగి ఉన్నవాడు. రాజులను నియమించేవాడూ, తొలగించేవాడూ ఆయనే. వివేకవంతులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేది ఆయనే, 22 ఆయన గుప్తంగా ఉండే విషయాలను, రహస్యాలను వెల్లడి చేశాడు. పాతాళంలో జరిగే విషయాలు ఆయనకు తెలుసు, ఆయన చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. 23 మా పూర్వీకుల దేవా, నువ్వు నాకు వివేకాన్నీ, బలాన్నీ అనుగ్రహించావు. ఇప్పుడు మేము కోరుకున్నట్టు రాజుకు వచ్చిన సమస్యకు పరిష్కారం నువ్వే నాకు తెలియజేశావు. అందువల్ల నేను నిన్ను స్తుతిస్తున్నాను.”

  18. 10 మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినపుడు గొర్రెలతో జత కట్టే పొట్టేళ్ళు చారలు గానీ పొడలు గానీ మచ్చలు గానీ కలిగి ఉన్నాయి.

    11 ఆ కలలో దేవుని దూత ‘యాకోబూ’ అని నన్ను పిలిచినప్పుడు నేను ‘చిత్తం, ప్రభూ’ అన్నాను. 12 అప్పుడు ఆయన ‘నీ కళ్ళు పైకెత్తి చూడు. గొర్రెలతో జంటకట్టే పొట్టేళ్ళన్నీ చారలు, పొడలు, మచ్చలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే లాబాను నీకు చేస్తున్న దానంతటినీ నేను చూశాను. 13 నీవెక్కడ స్తంభం మీద నూనె పోశావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో, ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నువ్వు ఈ దేశం విడిచిపెట్టి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు’ అని నాతో చెప్పాడు” అన్నాడు.

  19. 5 దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వితం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రం ఉండేది.

    6 వాళ్ళ గొప్పదనం ఆకాశం కన్నా ఎత్తుగా ఎదిగి, మేఘాల కంటే ఎత్తుగా తలెత్తుకుని తిరగవచ్చు.

    7 అయితే వాళ్ళ మలం లాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకు ముందు వాళ్ళను చూసిన వాళ్ళు “వాళ్ళంతా ఏమయ్యారు?” అని అడుగుతారు.

    8 కల లాగా వాళ్ళు కరిగి పోయి మళ్ళీ కనబడకుండా పోతారు. రాత్రివేళ వచ్చే కలలాగా వాళ్ళు చెదరిపోతారు.

  20. 5 గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు.

  21. 9 అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది. 10 అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.

  22. 17 ఈ నలుగురు యువకుల విషయం ఏమిటంటే, దేవుడు వారికి జ్ఞానం, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత, తెలివితేటలు అనుగ్రహించాడు. దానియేలుకు సకల విధాలైన దైవదర్శనాలకు, కలలకు అర్థాలు, భావాలు వివరించగలిగే సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు.

  23. 16 రొట్టెలు చేసే వాడు యోసేపు మంచి అర్థం చెప్పడం చూసి అతనితో “నాకూ ఒక కల వచ్చింది. మూడు రొట్టెల బుట్టలు నా తల మీద ఉన్నాయి. 17 పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి” అన్నాడు. 18 యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు బుట్టలు మూడు రోజులు. 19 ఇంక మూడు రోజుల్లో ఫరో నీ తల తీసి చెట్టుకు వేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి” అని జవాబిచ్చాడు.

  24. 25 అందుకు యోసేపు “ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు తెలియచేశాడు. ఆ ఏడు మంచి ఆవులు, ఏడేళ్ళు. 26 ఆ ఏడు మంచికంకులు ఏడేళ్ళు. 27 కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారంగా పైకి వచ్చిన ఏడు ఆవులూ ఏడేళ్ళు. తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు తాలువెన్నులు, ఏడేళ్ళ కరువు. 28 నేను ఫరోతో చెప్పే మాట ఇదే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు చూపించాడు. 29 ఇదిగో ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళు రాబోతున్నాయి. 30 వాటి తరువాత ఏడేళ్ళ కరువు వస్తుంది. అప్పుడు ఆ పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. 31 దాని తరువాత వచ్చే కరువుచేత దేశంలో ఆ పంట సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది.

  25. 9 అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుతో “నా కలలో ఒక ద్రాక్షతీగ నా ఎదుట ఉంది. 10 ఆ ద్రాక్షతీగకు మూడు కొమ్మలున్నాయి. దానికి మొగ్గలొచ్చి పూలు పూసి గెలలు పండి ద్రాక్షపళ్ళు వచ్చాయి. 11 ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేను ద్రాక్షపళ్ళు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను” అని చెప్పాడు. 12 అప్పుడు యోసేపు “దాని అర్థం ఇదే. ఆ మూడు కొమ్మలు, మూడు రోజులు. 13 ఇంక మూడు రోజుల్లో ఫరో నిన్ను హెచ్చించి, నువ్వు అతనికి గిన్నె అందించే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పిస్తాడు.

  26. 8 ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరిని పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు గాని ఫరోకు వాటి అర్థం చెప్పే వాడెవడూ లేడు.

    9 అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు “ఈ రోజు నా తప్పు గుర్తుకు వచ్చింది. 10 ఫరో తన సేవకుల మీద కోపపడి నన్నూ రొట్టెలు చేసేవారి నాయకుడినీ రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు. 11 ఒకే రాత్రి నేనూ అతడు కలలు కన్నాము. ఒక్కొక్కడు వేర్వేరు అర్థాలతో కలలు కన్నాము. 12 అక్కడ రాజ అంగ రక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హెబ్రీ యువకుడు మాతో కూడ ఉన్నాడు. అతనితో మా కలలను మేము వివరించి చెబితే అతడు వాటి అర్థాన్ని మాకు తెలియచేశాడు.

  27. 15 ఫరో యోసేపుతో “నేనొక కల కన్నాను. దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియచేయగలవని నిన్నుగూర్చి విన్నాను” అన్నాడు. 16 యోసేపు “అది నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని ఫరోతో చెప్పాడు.

  28. 10 దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో, “అననీయా!” అని అతనిని పిలిచాడు. 11 అతడు, “చిత్తం” అన్నాడు. అందుకు ప్రభువు, “నువ్వు లేచి, ‘తిన్ననిది’ అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. 12 దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు” అని చెప్పాడు.