32 Bible Verses About Evangelism
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
-
16 పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు. 17 అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.
18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.
-
54 మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు. 55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడి పక్కన యేసు నిలబడి ఉండడం చూసి 56 “ఆకాశం తెరుచుకోవడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్క నిలిచి ఉండడం చూస్తున్నాను” అని పలికాడు.
57 అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి 58 అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు.
-
8 కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి,
“దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో,
మీ హృదయంలో ఉంది.”
మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. 9 అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది. 10 ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు. 11 “ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. 12 ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. 13 ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది. 14 నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? 15 ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది.
-
14 గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను. 15 కాబట్టి రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించాలన్న ఆశతో నేను సిద్ధంగా ఉన్నాను.
16 సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి. 17 నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.
-
35 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు. 36 ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా, చెదరిపోయి ఉన్నారు. 37 ఆయన తన శిష్యులతో, “కోత చాలా ఎక్కువగా ఉంది. కానీ పని వారు తక్కువగా ఉన్నారు. 38 కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు.
-
1 సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు. 2 మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు.
3 దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, 4 లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయనను మూడవ రోజున తిరిగి లేపాడు కూడా. 5 ఆయన కేఫాకూ, తరువాత పన్నెండు మందికీ కనబడ్డాడు. 6 ఆ తరువాత ఐదు వందలకంటే ఎక్కువైన సోదర సోదరీలకు ఒక్క సమయంలోనే కనిపించాడు. వారిలో చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. కొందరు కన్ను మూశారు. 7 తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపొస్తలులకందరికీ కనిపించాడు.
-
13 మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు? 14 మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు. 15 దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.
16 మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు. 17 కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది.
18 క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు. 19 ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఆత్మల దగ్గరికి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు. 20 ఆ ఆత్మలు దేవునికి విధేయత చూపలేదు. పూర్వం నోవహు రోజుల్లో ఓడ తయారవుతూ ఉంటే దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టిన ఆ రోజుల్లో, ఆ ఓడలో కొద్ది మందినే, అంటే ఎనిమిది మందినే, దేవుడు నీళ్ళ ద్వారా రక్షించాడు.
21 దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. అది ఒంటి మీద మురికి వదిలించుకున్నట్టు కాదు, అది యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవునికి మనస్సాక్షితో చేసే అభ్యర్ధనే. 22 ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడి వైపున ఉన్నాడు. దూతలూ, అధికారులూ, శక్తులు, అన్నీ ఆయనకు లోబరచబడినాయి.
-
15 యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. 16 దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.
17 “నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు. 18 తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.”
ఆరోహణం (లూకా 24:50-53. అపొ. కా. 1:6-11)
19 ప్రభు యేసు వారితో మాట్లాడిన తరవాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. 20 ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకూ వెళ్ళి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై, వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు.
-
1 దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను.
2 వాక్యాన్ని బోధించు, అనుకూలమైనా, కాకపోయినా సిద్ధంగా ఉండు. ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా సంపూర్ణమైన సహనంతో ఉపదేశించు.
3 ఎందుకంటే మనుషులు మంచి బోధను సహించలేని సమయం రాబోతోంది. దురద చెవులతో తమ స్వంత దురాశలకు అనుగుణంగా బోధించే వారిని పోగుచేసుకుని, 4 సత్యం నుండి తొలిగిపోయి కట్టు కథల వైపు మళ్ళుతారు.
5 నీవు మాత్రం అన్ని విషయాల్లో సంయమనంతో ఉండి, కష్టాలు భరించు. సువార్త ప్రచారకుని పనిచెయ్యి, నీ పరిచర్యను సంపూర్తి చెయ్యి.
-
2 ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి.
3 దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను. 4 నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి.
5 సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 6 మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.
-
17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి. 18 అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు. 19 అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.
20 కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం. 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.
-
16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు.
-
8 “అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు.
-
13 “లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.
14 ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. 15 ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. 16 మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
-
11-12 విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. 13 మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు. 14 అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము.
-
8 అప్పుడు “నేను ఎవరిని పంపాలి? మా పక్షంగా ఎవరు వెళ్తారు?” అని ప్రభువు అంటుండగా విన్నాను.
అప్పుడు నేను “ఇదుగో నేనున్నాను, నన్ను పంపు” అన్నాను.
9 ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు.
ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు.
10 వారు కళ్ళతో చూసి, చెవులతో విని,
హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని,
స్వస్థత పొందకుండా ఉండేలా ఈ ప్రజల హృదయం కొవ్వెక్కేలా చేసి,
వారి చెవులకు చెవుడు, వారి కళ్ళకు గుడ్డితనం కలిగించు” అని చెప్పాడు.
11 “ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా,
12 యెహోవా ప్రజలను దూరప్రాంతానికి తీసుకు పోయే దాకా, దేశం నిర్జనమై చవిటిపర్ర అయ్యే దాకా.”
13 దానిలో పదవ భాగం మాత్రం మిగిలిపోయినా అది కూడా నాశనమౌతుంది.
సింధూర మస్తకి వృక్షాలను నరికి వేసినా తరువాత మిగిలి ఉండే మొద్దులాగా అది ఉంటుంది.
అలాటి మొద్దులో పరిశుద్ధమైన చిగురు ఉంది.
-
12 మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.
13 క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీ కోసం సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? 14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. 15 ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు. 16 స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు. 17 క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు.
18 సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి.
-
19 నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను. 20 యూదులను సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను. 21 దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను. 22 బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను. 23 సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ.
24 పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి.
-
36 “మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి.”
37 వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. 38 దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు. 40 ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు. 41 అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.
-
30 అయితే దేవుడు చనిపోయిన వారిలో నుండి ఆయనను లేపాడు. 31 ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు. 32 పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతుల్లో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు.”
33 “‘నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను’
అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది.
-
47 “ఎందుకంటే,
‘నీవు ప్రపంచమంతటా రక్షణ తెచ్చేవానిగా ఉండేలా నిన్ను యూదేతరులకు వెలుగుగా ఉంచాను’
అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు” అన్నారు.
-
14 రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.
-
6 ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ 7 యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.
8 అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు. 9 అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది. 10 అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.
11 మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమొత్రాకెకు, మరుసటి రోజు నెయపొలి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చాము.
12 మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, రోమీయుల వలస ప్రదేశం. మేము కొన్ని రోజులు ఆ పట్టణంలో ఉన్నాం.
-
8 కాబట్టి నువ్వు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గురించి గానీ, ఆయన ఖైదీనైన నన్ను గురించి గానీ సిగ్గుపడకుండా, దేవుని శక్తితో సువార్త మూలంగా వాటిల్లే కష్టాల్లో భాగం పంచుకో.
9 ఆయన మన క్రియలనుబట్టి కాక తన సంకల్పాన్నిబట్టి, కాలం ఆరంభానికి ముందే మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు.
-
44 తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.
46 “క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.
49 “వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు.
-
1 అంతియొకయలోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీ వాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు.
2 వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి” అని వారితో చెప్పాడు. 3 విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తరువాత వారిని పంపించారు.
-
6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 7 అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు. 8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక. 9 మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.
10 ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషులను తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషులను తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.
11 సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి. 12 మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.
-
7 వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు. 8 పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా, 9 ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. 10 మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు. 11 ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది. 12 ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”
-
4 అయినా, చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు.
5 ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు.
-
1 యేసు క్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న 2 పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటే పవిత్రులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికి శుభాలు చెబుతూ రాస్తున్నది. 3 మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
4 దేవుడు తన కుమారుడు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన ఆ సువార్తను పవిత్ర లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు. 5 యేసు క్రీస్తు, శారీరికంగా చూస్తే దావీదు సంతానం. దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా చనిపోయి తిరిగి సజీవుడుగా లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడు అని బల ప్రభావాలతో ప్రకటించబడింది. 6 ఈయన నామం నిమిత్తం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఈయన ద్వారా మేము కృప, అపొస్తలత్వం పొందాము. 7 వారితోబాటు మీరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు.
-
7 సువార్త ప్రకటిస్తూ శాంతిసమాధానాలు చాటిస్తూ శుభ సమాచారం తెస్తూ విడుదల సమాచారం తీసుకు వచ్చే వారి పాదాలు “నీ దేవుడు పరిపాలిస్తున్నాడు” అని సీయోనుతో చెప్పే వారి పాదాలు పర్వతాల మీద ఎంతో అందంగా ఉన్నాయి.
8 విను! నీ కావలివారు తమ గొంతు పెంచుతున్నారు. వాళ్ళంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు. యెహోవా సీయోనుకు తిరిగి వచ్చేటప్పుడు వారు కళ్ళారా చూస్తారు.
9 యెరూషలేము శిథిలాల్లారా! కలిసి ఆనంద గీతాలు పాడండి. యెహోవా తన ప్రజలను ఆదరించాడు. యెరూషలేమును విమోచించాడు.
10 అన్ని రాజ్యాల కళ్ళెదుటే యెహోవా తన పవిత్ర హస్తం బయలుపరచాడు. ప్రపంచమంతా మన దేవుని రక్షణ చూస్తారు.
-
13 అయితే ప్రభువు ప్రేమించిన సోదరులారా, మేము మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే సత్యాన్ని నమ్మడం ద్వారా, పరిశుద్ధాత్మ చేసే శుద్ధీకరణ ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మిమ్మల్ని తొలిపంటగా ఎంచుకున్నాడు. 14 మేము ప్రకటించిన సువార్త ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాల్గొనేలా మిమ్మల్ని పిలిచాడు.
15 కాబట్టి సోదరులారా, స్థిరంగా ఉండండి. మా నోటి మాట చేతా, మా పత్రికల చేతా మేము ఉపదేశించిన విధివిధానాలను పాటించండి.
Shows Read in context, Share and Copy.