45 Bible Verses About Satan's Tricks

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Satan's Tricks
  1. 1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. 2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.

    4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు. 5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

  2. 10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి. 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

    12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.

    13 అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. 14 మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం, 15 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి. 17 ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.

    18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి. 19 సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి. 20 సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.

  3. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

  4. 7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు. 8 కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది. 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు.

    10 అప్పుడు నేను పరలోకం నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. “మన సోదరులను నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తీ రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది. 11 వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్షాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు.

    12 కాబట్టి పరలోకమూ, పరలోకంలో నివసించే వారూ, సంబరాలు చేసుకోండి. భూమీ, సముద్రం, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు.

  5. 42 యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. నేను వచ్చింది దేవుని దగ్గర్నుంచే. నా అంతట నేను రాలేదు. ఆయనే నన్ను పంపించాడు. 43 నా మాటలు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా మాట వినే మీకు సహనం లేదు. 44 మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.

    45 నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు. 46 నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించ గలరు? నేను సత్యాన్నే చెబుతున్నా మీరెందుకు నమ్మడం లేదు? 47 ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు.”

  6. 10 మీరు ఎవరినైనా దేని గురించి అయినా క్షమిస్తే నేనూ అతన్ని క్షమిస్తాను. 11 నేను దేనినైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా, మీ కోసం, క్రీస్తు ముఖం చూసి క్షమించాను. సాతాను ఎత్తుగడలు మనకు తెలియనివి కావు.

  7. 12 అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.

    13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.

  8. 6 ఒకరోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. 7 యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని సాతానును అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని జవాబిచ్చాడు. 8 అప్పుడు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థ వర్తనుడు. నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు” అన్నాడు.

    9 అందుకు సాతాను “యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా? 10 నువ్వు యోబునూ, అతని సంతానాన్నీ, అతని ఆస్తి అంతటినీ కంచె వేసి కాపాడుతున్నావు గదా? నువ్వు అతడు చేస్తున్న ప్రతిదాన్నీ దీవిస్తున్నావు గనక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది. 11 అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు” అని యెహోవాతో అన్నాడు.

  9. 3 ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే. 4 దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.

  10. 7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.

  11. 1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

  12. 1 తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ లోతైన అగాధం తాళం చెవీ ఉన్నాయి. 2 అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహా సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు. 3 వాణ్ణి అగాధంలో పడవేసి, దాన్ని మూసివేసి దానికి ముద్ర వేశాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజలను మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తరువాత కొద్ది సమయం వాణ్ణి వదిలిపెట్టాలి.

    4 అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కోసమూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించారు.

    5 ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునరుత్థానం. 6 ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందిన వారు. వీళ్ళపై రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.

    7 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు. 8 వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు.

  13. 8 అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు. 9 సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.

    10 ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు. 11 ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమంలోనే సంతోషించే వారిని శిక్షించడానికి 12 అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.

  14. 8 పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.

  15. 9 నువ్వు పడుతున్న హింసలూ, నీ పేదరికమూ నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా దూషణల పాలు చేస్తున్నారో నాకు తెలుసు. 10 నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. పది రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.

  16. 1 తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు.

  17. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. 3-4 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.

    5 శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. 6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7 ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. 8 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. 9 దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు.

  18. 13 తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు సైతానుని ఓడించారు కాబట్టి మీకు రాస్తున్నాను.

    14 చిన్నపిల్లల్లారా, మీరు తండ్రిని తెలుసుకుని ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను.

    తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను.

    యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో నిలిచి ఉంది, మీరు సైతానును ఓడించారు, అందుకే మీకు రాస్తున్నాను.

    15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే.

  19. 31 “సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు. 32 నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.” 33 కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు. 34 అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు.

  20. 3 సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.

    4 ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక మీరు పొందని వేరొక ఆత్మను పొందినా, మీరు అంగీకరించని వేరొక సువార్త మీరు అంగీకరించినా, మీరు వాటిని బాగానే సహిస్తున్నారు.

  21. 3 అందుకు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు, నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు. కారణం లేకుండాా అతణ్ణి నాశనం చెయ్యాలని నువ్వు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్ధిరంగా నిలబడ్డాడు” అని అన్నాడు.

    4 అప్పుడు సాతాను “మనిషి తన చర్మం కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తనకున్నదంతా ఇస్తాడు గదా. 5 మరొక్కసారి నువ్వు నీ చెయ్యి చాపి అతని ఎముకల మీదా, దేహం మీదా దెబ్బ కొడితే అతడు నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు” అన్నాడు. 6 అప్పుడు యెహోవా “అతణ్ణి నీకు స్వాధీనం చేస్తున్నాను. అతని ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు” అని చెప్పాడు.

    7 సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి వెళ్లి, యోబు అరికాలు నుండి నడినెత్తి వరకూ బాధ కలిగించే కురుపులు పుట్టించాడు.

  22. 36 అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని కలుపు మొక్కలను గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు” అని అడిగారు. 37 అందుకాయన ఇలా అన్నాడు, “మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు. 38 పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు. 39 వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు. 40 కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది. 41 మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. 42 అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి. 43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక.

  23. 3 మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా యుద్ధం చేయం. 4 మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది. 5 వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం. 6 మీ విధేయత పూర్తి అయినప్పుడు అవిధేయతనంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.

  24. 22 నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి. 23 బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి.

    24 ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి. 25-26 దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.

  25. 13 దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది. 14 అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు. 15 నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు.

  26. 24 పరిసయ్యులు ఆ మాట విని, “వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు” అన్నారు. 25 ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, “ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు.

    26 ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది?

  27. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

  28. 15 “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16 వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా?

  29. 1 యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి నడిపించాడు. 2 అక్కడ నలభై రోజులు సాతాను ఆయనను విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.

    3 సాతాను ఆయనతో, “నీవు దేవుడి కుమారుడివైతే, ఈ రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు” అన్నాడు. 4 యేసు, “‘మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.

    5 అప్పుడు సాతాను ఆయనను ఎత్తయిన కొండ మీదికి తీసుకు వెళ్ళి, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించాడు. 6 “ఈ రాజ్యాధికారమంతా వాటి వైభవాలతో పాటు నీకిస్తాను. దానిపై అధికారం నాదే. అది ఎవరికివ్వడం నా ఇష్టమో వారికిస్తాను. 7 కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే ఇదంతా నీదే” అని ఆయనతో చెప్పాడు. 8 అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయనను మాత్రమే సేవించాలి’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.

    9 ఆ తరువాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకువెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి, “నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందికి దూకు.

    10 ‘దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.

    11 నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు’

    అని రాసి ఉంది గదా,” అని ఆయనతో అన్నాడు.

    12 అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు. 13 సాతాను, యేసును అన్ని రకాలుగా పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకూ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.

  30. 1 ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి.

    2 ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది. 3 యేసును అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కానీ అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది. 4 పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు.

    5 ఆ ఆత్మలు లోకానికి చెందినవారు కాబట్టి వారు చెప్పేది లోక సంబంధంగా ఉంటుంది. లోకం వారి మాట వింటుంది. 6 మనం దేవుని సంబంధులం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీన్ని బట్టి ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో మనం తెలుసుకుంటాం.

  31. 1 అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. 2 నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది. 3 శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు. 4 అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు. 5 అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి, 6 “నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే,

    ‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.

    నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు’ అని రాసి ఉంది” అన్నాడు.

    7 అందుకు యేసు “‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది” అని అతనితో అన్నాడు. 8 అపవాది మళ్ళీ ఆయనను చాలా ఎత్తయిన కొండపైకి తీసుకు పోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు. 9 “నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను” అన్నాడు. 10 అప్పుడు యేసు “సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది” అన్నాడు.

    11 అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు.

  32. 1 పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది. 2 ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు.

    3 అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు. 4 దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడాడు. 5 దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు. 6 అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు.

  33. 5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.

  34. 24 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.

  35. 12 వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. 13 ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.

  36. 22 యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, “బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు” అన్నారు.

    23 యేసు వారిని తన దగ్గరికి పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, “సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు? 24 చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. 25 చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు. 26 అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా.

  37. 5 అందుకే ఇక నేను కూడా ఉండబట్టలేక ఒకవేళ దుష్ట ప్రేరకుడు మిమ్మల్ని ప్రేరేపించాడేమో అనీ, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందేమో అనీ మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోడానికి తిమోతిని పంపాను.

  38. 7 అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.

  39. 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

    10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.

  40. 13 చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా.

    14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. 15 చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది.

  41. 6 వారు ఆ ద్వీపమంతా తిరిగి పాఫు అనే ఊరికి వచ్చి మంత్రగాడూ యూదీయ అబద్ధ ప్రవక్త అయిన బర్‌ యేసు అనే ఒకణ్ణి చూశారు. 7 ఇతడు వివేకి అయిన సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్కు వినాలని బర్నబానూ సౌలునూ పిలిపించాడు.

    8 అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. 9 అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి 10 అతనిని తేరి చూసి, “అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా? 11 ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు.

  42. 11-12 విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. 13 మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు. 14 అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము. 15 ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం. 16 ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.

  43. 11 స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. 12 ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే. 13 ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు? 14 ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది.

    15 అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉంటే ప్రసవం ద్వారా దేవుడు వారిని కాపాడతాడు.

  44. 1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది. 3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.

  45. 13 అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు.