64 Bible Verses About Following Jesus

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Following Jesus
  1. 57 వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి, “నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను” అని ఆయనతో అన్నాడు. 58 అందుకు యేసు, “నక్కలకు గుంటలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు” అని అతనికి చెప్పాడు.

    59 ఆయన మరో వ్యక్తిని చూసి “నా వెంట రా” అన్నాడు. ఆ వ్యక్తి, “ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి” అన్నాడు. 60 అందుకాయన, “చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు” అని అతనితో చెప్పాడు.

    61 మరొకడు, “ప్రభూ, నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. నాకు సెలవియ్యి” అన్నాడు. 62 దానికి యేసు, “నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు” అని వాడితో చెప్పాడు.

  2. 13 ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి. 14 రాజు అందరికీ అధిపతి అనీ, అధికారులు దుర్మార్గులను శిక్షించడానికీ, మంచి వారిని మెచ్చుకోడానికీ ఆయన పంపిన వారనీ వారికి లోబడి ఉండండి. 15 ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం.

    16 స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి. 17 అందరినీ గౌరవించండి. తోటి సోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును గౌరవించండి.

    18 సేవకులారా, మంచివాళ్ళూ సాత్వికులయిన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి.

    19 ఎవరయినా దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే అది గొప్ప విషయం. 20 మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? మేలు చేసి బాధలకు గురి అయి సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది. 21 దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు.

    22 ఆయన ఎలాంటి పాపం చేయలేదు.

    ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.

    23 ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు.

    ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు.

    24 మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు. 25 మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.

  3. 18 యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ, ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో వల వేయడం చూశాడు. వారు పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ. వారు చేపలు పట్టేవారు. 19 యేసు వారితో, “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని పిలిచాడు. 20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.

    21 యేసు అక్కడనుంచి వెళ్తూ ఇంకో ఇద్దరు అన్నదమ్ములను చూశాడు. వారు జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను. వారు తమ తండ్రి జెబెదయి దగ్గర పడవలో తమ వలలు బాగుచేసుకుంటుంటే చూసి వారిని పిలిచాడు. 22 వెంటనే వారు తమ పడవనూ తమ తండ్రినీ విడిచిపెట్టి ఆయనను వెంట వెళ్లారు.

    23 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు. 24 ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది. రకరకాల వ్యాధులతో, నొప్పులతో బాధపడుతున్న వారిని, దయ్యాలు పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వారిని బాగుచేశాడు. 25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు.

  4. 24 అప్పుడు యేసు తన శిష్యులతో, “ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను మోసుకుంటూ రావాలి. 25 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 26 ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?

    27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. 28 నేను మీతో కచ్చితంగా చెబుతున్నదేమంటే, ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం చూసేవరకూ మరణించరు” అని చెప్పాడు.

  5. 34 తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి. 35 ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 36 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం? 37 ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?

    38 వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”

  6. 23 ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి, 24 తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనే వాడు దాన్ని కాపాడుకుంటాడు. 25 ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకొంటే వాడికేం లాభం? 26 నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. 27 అయితే ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే వరకూ మరణించరని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

  7. 16 ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు. 17 యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు. 18 వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.

    19 ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు. 20 వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.

  8. 1 అది పస్కా పండగకు ముందు సమయం. తాను ఈ లోకం విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చిందని యేసు గ్రహించాడు. ఈ లోకంలో ఉన్న తన సొంత వారిని ఆయన ప్రేమించాడు. చివరి వరకూ ఆయన వారిని ప్రేమించాడు.

    2 యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు. అప్పటికే సాతాను సీమోను కొడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో యేసును అప్పగించాలనే ఉద్దేశం పెట్టాడు. 3 తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ యేసుకు తెలుసు. 4 ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. 5 అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు.

    6 ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. అప్పుడు పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?” అన్నాడు. 7 యేసు అతనికి జవాబిస్తూ, “నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు. కాని, నువ్వు తరవాత అర్థం చేసుకుంటావు” అన్నాడు. 8 పేతురు ఆయనతో, “నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగకూడదు” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను నిన్ను కడగకపోతే, నాతో నీకు సంబంధం ఉండదు” అన్నాడు. 9 సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నా కాళ్ళు మాత్రమే కాదు. నా చేతులు, నా తల కూడా కడుగు” అన్నాడు. 10 యేసు అతనితో, “స్నానం చేసినవాడు తన పాదాలు తప్ప ఇంకేమీ కడుక్కోవలసిన అవసరం లేదు. అతడు పూర్తిగా శుద్ధుడే. మీరూ శుద్ధులే గాని, మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు.

    11 ఎందుకంటే, తనకు ద్రోహం చేసేది ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఆయన, “మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు. 12 యేసు వారి కాళ్ళు కడిగి, తన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వారితో, “నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? 13 మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని సరిగానే పిలుస్తున్నారు. 14 బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. 15 నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను.

    16 నేను మీకు కచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వాణ్ణి పంపినవానికన్నా గొప్పవాడు కాదు. 17 ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు.

  9. 1 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి. 2 మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నేను మీకు ఉపదేశించిన పద్ధతులను అనుసరిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొంటున్నాను.

  10. 26 నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు.

  11. 1 కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి. 2 క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.

  12. 37 నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు. 38 తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు. 39 తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.

  13. 1 నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2 మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.

    3 ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. 4 “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. 5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.

    6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

  14. 18 యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపులను చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు.

    19 అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి, “బోధకా! నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను నీ వెంటే వస్తాను” అన్నాడు. 20 అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు. 21 ఆయన శిష్యుల్లో మరొకడు, “ప్రభూ, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి” అని ఆయనను అడిగాడు. 22 అయితే యేసు అతనితో, “నాతో రా. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి చనిపోయిన వారు ఉన్నారులే!” అన్నాడు.

  15. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  16. 34 మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35 మీరు ఒకడి పట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు” అన్నాడు.

  17. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

    9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,

    భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,

    ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,

    దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,

    అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

  18. 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2 మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

    3 మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి. 4 మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు.

  19. 27 ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్నులు వసూలు చేసే లేవీ అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో, “నా వెంట రా” అన్నాడు. 28 అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు. 29 లేవీ తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసే వారూ వేరే వారూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు.

    30 పరిసయ్యులూ వారి శాస్త్రులూ, “మీరు పన్నులు వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి?” అని శిష్యుల మీద సణుక్కున్నారు. 31 అందుకు యేసు, “రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర లేదు. 32 పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు” అన్నాడు.

  20. 12 మళ్ళీ యేసు ఇలా అన్నాడు, “నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. జీవపు వెలుగు కలిగి ఉంటాడు.”

  21. 25 కాబట్టి యేసు వారిని పిలిచి, “ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు. 26 కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి. 27 మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి. 28 అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు.

  22. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు. 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు.

  23. 9 యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు.

  24. 16 ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు. 17 అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.

    18 అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, 19 నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే” అని చెప్పాడు.

    20 అందుకు ఆ యువకుడు, “వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?” అన్నాడు. 21 అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు. 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.

  25. 17 ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.

    18 యేసు, “నేను మంచి వాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు. 19 దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు.

    20 అతడు ఆయనతో, “బోధకా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను” అని అన్నాడు. 21 యేసు అతన్ని చూస్తూ, అతనిపై ప్రేమ భావం కలిగి ఇలా అన్నాడు, “నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు” అని అన్నాడు. 22 అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

    23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం” అని అన్నాడు. 24 ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు మళ్ళీ, “పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం! 25 ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం” అన్నాడు.

    26 ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు. వారు “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. 27 యేసు వారి వైపు చూసి, “మనుషులకు ఇది అసాధ్యమే గాని, దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే” అన్నాడు.

    28 పేతురు ఆయనతో, “ఇదిగో, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా!” అన్నాడు. 29 అందుకు యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నా కోసం, సువార్త కోసం, తన ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఆస్తులను వదిలిపెట్టిన వాడు. 30 ఇప్పుడు ఈ లోకంలో హింసలతో బాటు ఇళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, ఆస్తులు, రానున్న లోకంలో శాశ్వత జీవం పొందుతాడు. 31 కాని, మొదటివారు చాలా మంది చివరివారు అవుతారు, చివరివారు చాలా మంది మొదటివారు అవుతారు” అన్నాడు.

  26. 18 ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. 19 అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు. 20 వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.

    21 దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. 22 యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. 23 అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు. 24 యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు.

    26 ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు 27 అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు. 28 అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.” 29 అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి, 30 ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

  27. 27 నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి. 28 నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు. 29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు.

  28. 13 కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.

    14 విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు.

    15 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.

    16 ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది.

    17 ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.

    18 మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు.

    19 అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు. 20 విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు. 21 ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.

    22 సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి. 23 మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు.

    24 “ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు.

    వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది.

    గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది

    25 గానీ ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.”

    ఈ సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది.

  29. 25 గొప్ప జన సమూహాలు ఆయనతో వస్తూ ఉన్నారు. ఆయన వారి వైపు తిరిగి ఇలా అన్నాడు, 26 “నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు. 27 అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.

    28 “మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దాన్ని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా? 29 అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తరువాత గోపురం పూర్తి చేయలేకపోతే, 30 చూస్తున్న వారంతా ‘ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు’ అంటూ వేళాకోళం చేస్తారు.

    31 “అలాగే ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఇరవై వేల మంది సైన్యంతో తన మీదికి వస్తున్నవాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా? 32 తన శక్తి చాలదనుకుంటే ఆ రాజు దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సంధి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కదా! 33 అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు.

  30. 27 అప్పుడు పేతురు, “ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా, మాకేమి లభిస్తుంది?” అని ఆయనను అడగగా 28 యేసు వారితో ఇలా అన్నాడు, “కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు.

    29 నా నామం నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు. 30 మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు.”

  31. 53 అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు. 54 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు. అంత్యదినాన నేను అతణ్ణి లేపుతాను. 55 నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం. 56 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండిపోతాడు. నేను అతనిలో ఉండిపోతాను. 57 సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు. 58 పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.” 59 ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూములోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు.

    60 ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు, “ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు. 61 తన శిష్యులు ఇలా సణుక్కుంటున్నారని యేసుకు తెలిసింది. ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా? 62 మనుష్య కుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు? 63 జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం. 64 కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు.” తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు. 65 ఆయన, “నా తండ్రి ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరికి రాలేరని ఈ కారణం బట్టే చెప్పాను” అన్నాడు.

    66 ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు.

    67 అప్పుడు యేసు, “మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?” అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు. 68 సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. 69 నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేము విశ్వసించాం, తెలుసుకున్నాం” అని చెప్పాడు. 70 యేసు వారితో, “నేను మీ పన్నెండు మందిని ఎంపిక చేసుకున్నాను కదా, అయినా మీలో ఒకడు సాతాను” అని చెప్పాడు. 71 పన్నెండు మందిలో ఒకడుగా ఉండి ఆయనకు ద్రోహం చెయ్యబోతున్న సీమోను ఇస్కరియోతు కొడుకు యూదా గురించి ఆయన ఈ మాట చెప్పాడు.

  32. 16 పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు. 17 అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.

    18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

  33. 13 యేసు మళ్లీ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు. 14 ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కుమారుడు లేవీని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు.

  34. 1 అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 2 పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. 3 ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవాన్ని దేవుడు క్రీస్తులో దాచి పెట్టాడు. 4 మీ జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలో ఆయనతో ప్రత్యక్షమౌతారు.

    5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. 6 వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది.

    7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. 8 కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు.

    11 ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు.

    12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.

    16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.

    17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.

  35. 2 ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇక ముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయనలాగా ఉంటామనీ మనకు తెలుసు.

    3 ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు.

  36. 1 “నేను నిజమైన ద్రాక్ష తీగని. నా తండ్రి ద్రాక్ష రైతు. 2 నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దాన్ని కత్తిరించి సరిచేస్తాడు. 3 నేను మీతో చెప్పిన సందేశం కారణంగా మీరు ఇప్పటికే శుద్ధులు.

    4 నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఏ విధంగా ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు. 5 నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. 6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి. 7 మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది. 8 మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది.

    9 తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు. 11 మీలో నా ఆనందం ఉండాలని, మీ ఆనందం పరిపూర్ణం కావాలని, ఈ సంగతులు మీతో మాట్లాడాను.

    12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. 13 స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులు.

    15 “నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. ఎందుకంటే దాసుడికి యజమాని చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవన్నీ మీకు తెలియజేశాను. 16 మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను. 17 మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

  37. 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.

    2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. 3-4 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.

    5 శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. 6 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. 7 ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. 8 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. 9 దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు.

  38. 8 వాస్తవంగా ఇప్పుడు మిగతా వాటన్నిటినీ నష్టంగా ఎంచుతున్నాను ఎందుకంటే నా ప్రభువైన యేసు క్రీస్తును ఎరగడమే ఎంతో శ్రేష్ఠమైన విషయం. ఆయనను బట్టి మిగతా వాటన్నిటినీ ఇష్టపూర్వకంగా తిరస్కరించాను. క్రీస్తును సంపాదించటానికి వాటిని చెత్తతో సమానంగా ఎంచాను. 9 ధర్మశాస్త్రమూలమైన నా స్వనీతిగాక, క్రీస్తులోని విశ్వాసమూలమైన నీతికి బదులుగా, అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతిగలవాడనై ఆయనలో కనపడేలా అలా చేశాను.

    10-11 ఆయనను ఎరగడం అనే నీతిన్యాయాలు, ఆయన పునరుత్థాన శక్తి, ఆయన పొందిన హింసల్లో సహానుభవం, క్రీస్తు మూలంగా ఆయన మరణం పోలికలోకి మార్పు చెందడం కోసం, ఏ విధంగానైనా చనిపోయిన వారిలో నుండి నాకు పునరుత్థానం కలగాలని, కోరుతున్నాను.

  39. 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు. 10 మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

  40. 31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. 32 సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు.

  41. 23 యేసు వారికి జవాబిస్తూ, “మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చింది. 24 మీతో కచ్చితంగా చెబుతున్నాను, గోదుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒకటిగానే ఉండిపోతుంది. అది చస్తే అధికంగా ఫలం ఇస్తుంది. 25 తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు.

  42. 19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి. 20 బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?

    21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు, క్రియల వల్ల నీతిమంతుడుగా తీర్పు పొందలేదా? 22 అతని విశ్వాసం క్రియలతో కలిసి పని చేసింది. అతని క్రియల ద్వారా విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు గదా. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” అని లేఖనాల్లో ఉన్న విషయం నెరవేరింది. అంతేకాక అబ్రాహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది.

    24 మనిషిని విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా దేవుడు నీతిమంతుడుగా ఎంచడం మీరు చూశారు.

  43. 16 “తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి. 17 మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. 18 వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు.

    19 వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు. 20 మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. 21 సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. 22 నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.

    23 వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపొండి. మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు పట్టణాలు అన్నిటికీ వెళ్ళి ఉండరు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

    24 గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు. 25 శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారు గదా!

  44. 43 మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు. 44 ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే. 45 ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు.

    46 దానికి నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?” అన్నాడు. ఫిలిప్పు, “నువ్వే వచ్చి చూడు” అన్నాడు. 47 నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు. 48 అప్పుడు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అన్నాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అన్నాడు.

    49 దానికి నతనయేలు, “బోధకా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే” అని ఆయనకు బదులిచ్చాడు. 50 అందుకు యేసు, “ఆ అంజూరు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలు చూస్తావు” అన్నాడు. 51 తరువాత యేసు ఇలా అన్నాడు, “నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఆకాశం తెరుచుకోవడం, దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉండడం మీరు చూస్తారు.”

  45. 49 మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం. 50 సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.

    51 ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. 52 బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. 53 నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి.

  46. 21 “‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు. 22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు. 23 అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.

    24 “కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”

  47. 51 ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు. 52 కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు.

  48. 40 శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. అయితే సంపూర్ణమైన శిక్షణ పొందినవాడు తన గురువులా ఉంటాడు.

  49. 46 ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు భిక్షగాడు. 47 ఆ గుడ్డివాడు, వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకుని, “యేసూ! దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని కేకలు పెట్టసాగాడు. 48 చాలా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, “దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు.

    49 యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో, “ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు. 50 ఆ గుడ్డివాడు తాను కప్పుకొన్న పైబట్టను అవతల పారవేసి, గభాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు. 51 యేసు, “ఏం కావాలి?” అని అడిగాడు. ఆ గుడ్డివాడు, “రబ్బీ! నాకు మళ్లీ చూపు ప్రసాదించు” అని వేడుకున్నాడు. 52 యేసు, “నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, ఇక వెళ్ళు” అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు.

  50. 20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే.

  51. 1 తరువాత నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎదురుగా సీయోను పర్వతంపై గొర్రెపిల్ల నిలబడి ఉండడం నాకు కనిపించింది. ఆయనతో కూడా 1, 44,000 మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి. 2 అప్పుడు విస్తారజలం పడుతున్నట్టుగా, పెద్ద ఉరుము శబ్దంలా పరలోకం నుండి ఒక శబ్దం రాగా విన్నాను. తీగ వాయిద్యాలు వాయించేవారు వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది.

    3 వారంతా సింహాసనం ఎదుటా, ఆ నాలుగు ప్రాణుల ఎదుటా, పెద్దల ఎదుటా ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 1, 44,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు. 4 వీళ్ళు స్త్రీతో లైంగిక సంబంధం మూలంగా తమను అశుద్ధం చేసుకోని వారు. లైంగికంగా తమను పవిత్రంగా ఉంచుకొన్న వారు. వీళ్ళు గొర్రెపిల్ల వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయనను అనుసరిస్తూ ఉంటారు. మానవాళిలో నుండి దేవుని కోసమూ, గొర్రెపిల్ల కోసమూ ప్రథమ ఫలాలుగా విమోచన జరిగిన వారు. 5 అబద్ధమన్నది వీళ్ళ నోటి నుండి రాదు. వీళ్ళు నిందా రహితులు.

  52. 33 మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్తపడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి.”

  53. 13 ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు. 14 జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు. దారికష్టమైనది. దాన్ని కనుగొనే వారు కొంతమందే.

  54. 15 యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నపుడు పన్ను వసూలు చేసేవారు, పాపులు, చాలామంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడిస్తున్నారు.

  55. 1 ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు. ప్రజలు గుంపుగూడి ఆయనపైకి తోసుకువస్తూ దేవుని వాక్కు వింటూ ఉన్నారు. 2 ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు. చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు.

    3 పడవల్లో సీమోను పడవ ఒకటి. యేసు ఆ పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు.

    4 ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో, “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు. 5 సీమోను, “స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు. 6 వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి. 7 వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి.

    8 సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ముందు పడి, “ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు” అన్నాడు. 9 ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు.

    10 వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో, “భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు. 11 వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు.

  56. 10 అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారిని వెంట బెట్టుకుని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు. 11 జన సమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి, దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు.

    12 పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి” అన్నారు. 13 ఆయన, “మీరే వీళ్ళకి భోజనం పెట్టండి” అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే” అన్నారు.

    14 అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, “వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి” అని శిష్యులతో చెప్పాడు. 15 వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు. 16 అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు. 17 వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు.

  57. 1 ఆయన ఒకసారి ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, “ప్రభూ, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు” అని ఆయనను అడిగాడు. 2 అందుకు ఆయన, “మీరు ప్రార్థన చేసేటప్పుడు, ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఎంచబడు గాక, నీ రాజ్యం వచ్చుగాక, 3 మాకు కావలసిన అనుదిన ఆహారం ప్రతిరోజూ మాకు దయచెయ్యి, 4 మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి” అని చెప్పాడు.

  58. 24 తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది. 25 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు. 26 మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. 27 అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.

  59. 9 నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.

    11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.

  60. 36 సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వెక్కడికి వెళ్తున్నావు?” అన్నాడు. యేసు జవాబిస్తూ, “నేను వెళ్ళే స్థలానికి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు, కాని తరవాత వస్తావు” అన్నాడు. 37 అందుకు పేతురు, “ప్రభూ, నేను ఇప్పుడే నీ వెంట ఎందుకు రాలేను? నీకోసం నా ప్రాణం పెడతాను” అన్నాడు. 38 యేసు జవాబిస్తూ, “నా కోసం ప్రాణం పెడతావా? నేను నీతో కచ్చితంగా చెబుతున్నాను, నేనెవరో తెలియదని నువ్వు మూడు సార్లు చెప్పక ముందు కోడి కూయదు” అన్నాడు.

  61. 18 “ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. 19 మీరు ఈ లోకానికి చెందిన వారైతే ఈ లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వారు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనుంచి వేరు చేశాను. అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.

    20 “‘దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు’ అని నేను మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా మాట ప్రకారం చేస్తే, మీ మాట ప్రకారం కూడా చేస్తారు. 21 వారికి నన్ను పంపిన వాడు తెలియదు కాబట్టి, నా పేరిట ఇవన్నీ మీకు చేస్తారు. 22 నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే, వారికి పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వారి పాపం నుండి తప్పించుకునే అవకాశం వారికి లేదు.

    23 “నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. 24 ఎవ్వరూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకపోతే వారికి పాపం ఉండేది కాదు. కాని, వారు నా కార్యాలు చూసినా నన్నూ, నా తండ్రినీ ద్వేషిస్తున్నారు. 25 ‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది.

    26 “తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. 27 మీరు మొదటి నుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు కూడా సాక్షులుగా ఉంటారు.

  62. 25 మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం.

  63. 11 మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో చివరి వరకూ సాగాలని మా అభిలాష. 12 మీరు మందకొడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసంతో, సహనంతో, వాగ్దానాలను వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.

  64. 3 తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు. 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, లోకంలో ఉన్న దుర్మార్గపు కోరికల నాశనగుణం నుండి తప్పించుకుని మీరు తన స్వభావంలో పాలిభాగస్థులు కావాలన్నదే దేవుని ఉద్దేశం.

    5 ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసానికి మంచి గుణం, మంచి గుణానికి జ్ఞానం, 6 జ్ఞానానికి ఆశల అదుపు, ఆశల అదుపుకు ఓర్పు, ఓర్పుకు భక్తి, 7 భక్తికి సోదర ప్రేమ, సోదర ప్రేమకు దైవ ప్రేమ జోడించండి. 8 ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.

    9 కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలనుండి దేవుడు శుభ్రపరిచాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు. 10 కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు. 11 దీని ద్వారా మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యంలోకి ఘనమైన ప్రవేశం మీకు దొరుకుతుంది.