51 Bible Verses About Rest

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Rest
  1. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  2. 1 అందుచేత, ‘దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం’ అన్న వాగ్దానం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడే, మీలో ఎవరికైనా ఆ వాగ్దానం దక్కకుండా పోతుందేమో అని జాగ్రత్త పడండి. 2 విశ్రాంతిని గూర్చిన సువార్త ఇశ్రాయేలీయులకు ప్రకటించినట్టే మనకూ ప్రకటించడం జరిగింది. కానీ విన్న దానికి తమ విశ్వాసం జోడించని వారికి ఆ ప్రకటన వ్యర్ధమై పోయింది.

    3 అయితే విశ్వసించిన మనమే ఆ విశ్రాంతిలో ప్రవేశించేది. రాసి ఉన్న దాని ప్రకారం లోకం ఆరంభం నుండి తన సృష్టి కార్యమంతా ముగిసినా ఆయన,

    “నేను నా తీవ్ర ఆగ్రహంతో శపథం చేశాను.

    వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అన్నాడు.

    4 మరో చోట ఏడవ దినం గూర్చి చెబుతూ,

    “దేవుడు ఏడవ రోజు తన పనులన్నీ ముగించి,

    విశ్రాంతి తీసుకున్నాడు” అన్నాడు.

    5 మళ్లీ “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అని చెప్పాడు.

    6 దేవుని విశ్రాంతి కొందరు ప్రవేశించడానికి ఏర్పడిందన్నది స్పష్టం. కాబట్టి, ఎవరికైతే సువార్త ముందుగా ప్రకటించబడిందో వారు తమ అవిధేయత కారణంగా దానిలో ప్రవేశించలేక పోయారు. 7 కాబట్టి దేవుడు, “ఈ దినం” అనే ఒక ప్రత్యేక దినాన్ని నిర్ణయించాడు. మొదట దీన్ని గూర్చిన ప్రస్తావన జరిగిన చాలా కాలానికి, తిరిగి దావీదు ద్వారా ఆయన మాట్లాడినప్పుడు, ఆయన ఇలా అన్నాడు,

    “మీరు మీ హృదయాలను కఠినపరచుకోకుండా నేడు ఆయన స్వరం వింటే మేలు.”

    8 ఒక వేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరొక రోజు గూర్చి చెప్పేవాడు కాదు.

    9 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. 10 ఎందుకంటే దేవుడు తన పనులన్నీ చేసి ముగించి విశ్రాంతి తీసుకున్నట్లే ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన పనులన్నీ ముగించి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. 11 కాబట్టి, వారిలా అవిధేయతలో పడిపోకుండా, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆత్రుత పడదాం.

    12 ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.

    14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16 కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం.

  3. 1 ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి. 2 ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 3 దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.

  4. 30 అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు.

    31 వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, “నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి, కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు. 32 అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు.

  5. 8 విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. 9 నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి. 10 ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు.

    11 ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు.

  6. దావీదు కీర్తన.

    1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.

    2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.

    3 నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.

  7. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

    8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

  8. 13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది, “ఇలా రాయి. ‘ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు దీవెన పొందినవారు.’” నిజమే, వారు తమ బాధ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారు చేసిన పనులు వారి వెనకే వెళ్తాయి.

    14 మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. ఆ మేఘంపై మనుష్య కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.

  9. 11 తల్లి గర్భం నుండి బయటపడగానే నా ప్రాణం ఎందుకు పోలేదు?

    12 నన్నెందుకు మోకాళ్ల మీద పడుకోబెట్టుకున్నారు? నేనెందుకు తల్లి పాలు తాగాను?

    13 లేకపోతే ఇప్పుడు నేను పడుకుని ప్రశాంతంగా ఉండేవాణ్ణి. నేను చనిపోయి విశ్రాంతిగా ఉండేవాణ్ణి.

    14 శిథిలమైపోయిన భవనాలు తిరిగి కట్టించుకునే భూరాజుల్లాగా, మంత్రుల్లాగా నేను కూడా చనిపోయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి.

    15 బంగారం సంపాదించుకుని, తమ ఇంటినిండా వెండిని నింపుకున్న అధికారుల్లాగా నేను కన్నుమూసి ఉండేవాణ్ణి.

    16 భూమిలో పాతిపెట్టబడిన పిండంలాగా వెలుగు చూడని పసికందులాగా నాకిప్పుడు ఉనికి ఉండేది కాదు.

    17 అక్కడ దుర్మార్గులు ఇక బాధపెట్టరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.

    18 అక్కడ బంధితులైన వారు కలసి విశ్రమిస్తారు. వాళ్ళ చేత పనులు చేయించేవాళ్ళ ఆజ్ఞలు వాళ్లకు వినిపించవు.

    19 పేదవారు, గొప్పవారు అంతా అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల చెర నుండి తప్పించుకుని స్వతంత్రులయ్యారు.

  10. 12 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. మీరు నేను నియమించిన విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి. 13 మిమ్మల్ని పవిత్రంగా చేసే యెహోవాను నేనే అని మీరు తెలుసుకునేలా విశ్రాంతి దినం నాకు, మీకు, మీ తరతరాలకు ఒక చిహ్నంగా ఉంటుంది. 14 అందువల్ల మీరు విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి. అది మీకు పవిత్రమైనది. ఆ దినాన్ని అపవిత్రం చేసే వాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.

    15 ఆరు రోజులు పని చేసిన తరువాత యెహోవాకు ప్రతిష్ఠితమైన ఏడవ రోజును విశ్రాంతి దినంగా పాటించాలి. విశ్రాంతి దినాన పని చేసే ప్రతివాడికీ తప్పకుండా మరణశిక్ష విధించాలి. 16 ఇశ్రాయేలు ప్రజలు తమ తరతరాలు విశ్రాంతి దిన ఆచారం పాటించి ఆ దినాన్ని ఆచరించాలి. ఇది శాశ్వత కాలం నిలిచి ఉండే నియమం. 17 నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య అది శాశ్వతంగా ఒక గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు భూమి ఆకాశాలను సృష్టి చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు.”

  11. 14 అందుకు ఆయన “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకు నెమ్మది కలుగజేస్తాను” అన్నాడు.

  12. 9 భూమి అంతటి మీదా జరుగుతున్న యుద్ధాలను ఆయన నిలిపివేస్తాడు. ఆయన విల్లును విరుస్తాడు. ఈటెను ముక్కలు చేస్తాడు. యుద్ధ రధాలను కాల్చి వేస్తాడు.

    10 నిశ్శబ్దంగా ఉండండి. నేనే యెహోవాని అని తెలుసుకోండి. జనాలలో నన్ను హెచ్చిస్తారు. భూమిపై నన్ను ఉన్నత స్థానంలో ఉంచుతారు.

    11 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం.

  13. 3 యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.

    4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.

    5 నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.

    6 పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.

    7 యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.

    8 కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి.

  14. 6 సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.

    7 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు.

    8 అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.

    9 సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు?

    10 ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు?

    11 అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది.

  15. 12 ఆరు రోజులు నీ పనులు చేసిన తరువాత ఏడవ రోజున నీ ఎద్దులు, గాడిదలు, దాసీ కొడుకులూ, విదేశీయులూ సేద దీర్చుకొనేలా విశ్రాంతి తీసుకోవాలి.

  16. 7 ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు!

    8 మెరీబా దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు.

    9 అక్కడ వాళ్ళు నా అధికారాన్ని సవాలు చేశారు నా కార్య కలాపాలు చూసి కూడా నా ఓపికను పరీక్షించారు.

    10 నలభై ఏళ్ళు నేను ఆ తరం వారితో కోపంగా ఉన్నాను. వాళ్ళ హృదయాలు దారి తప్పుతున్నాయి. వాళ్ళు నా పద్ధతులు తెలుసుకోలేదు అన్నాను.

    11 కాబట్టి, వాళ్ళు నా విశ్రాంతి స్థలంలో ఎన్నడూ ప్రవేశించరని నేను నా కోపంలో శపథం చేశాను.

  17. 1 యెహోవా సీనాయికొండ మీద మోషేకు ఇలా చెప్పాడు 2 “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకిస్తున్న దేశానికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలాన్ని పాటించాలి. 3 ఆరు సంవత్సరాలు నీ పొలంలో విత్తనాలు చల్లాలి. ఆరు సంవత్సరాలు నీ పండ్ల తోటను సాగుచేసి దాని పండ్లు సమకూర్చుకోవచ్చు.

    4 ఏడవ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం, అంటే అది యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరంగా ఉండాలి. ఆ సంవత్సరం నీ పొలంలో విత్తనాలు చల్ల కూడదు. నీ పండ్ల తోటను బాగు చేయకూడదు.

  18. 12 మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. 13 ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి. 14 ఏడో రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి.

    15 మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు.

  19. 8 యెహోవా, శాంతిసమాధానాలతో నేను పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే నువ్వు మాత్రమే నాకు క్షేమం, భద్రత ఇస్తావు.

  20. 1 సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.

    2 ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.

  21. 5 యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.

    6 యెహోవా సాధుజీవులను కాపాడేవాడు. నేను క్రుంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించాడు.

    7 నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు.

    8 మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు.

  22. 13 సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు.

    14 బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు.

    15 కంచంలో సోమరి తన చెయ్యి ముంచుతాడు. దాన్ని తిరిగి నోటికి ఎత్తుకోవడం అతనికి బద్ధకం.

    16 సహేతుకమైన కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తానే జ్ఞానిననుకుంటాడు.

  23. 3 ఆ రోజున నీ బాధ నుంచి, నీ వేదన నుంచి, నువ్వు చెయ్యాల్సి వచ్చిన కష్టం నుంచి యెహోవా నీకు విశ్రాంతి ఇస్తాడు.

    4 ఆ రోజున నువ్వు బబులోను రాజు గూర్చి ఎగతాళి పాట ఎత్తి ఇలా పాడతావు.

    “బాధించిన వాళ్లకు అంతం ఎలా వచ్చిందో చూడు. గర్వించిన రౌద్రం ఎలా అంతమయ్యిందో చూడు!

  24. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

    29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  25. 21 ఆరు రోజులు మీ పనులు చేసుకున్న తరువాత ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలి. అది పొలం దున్నే కాలమైనా, కోత కోసే కాలమైనా.

  26. 22 సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది? 23 అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, వత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే.

    24 అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను. 25 ఆయన అనుమతి లేకుండా భోజనం చేయడం, సంతోషించడం ఎవరికి సాధ్యం?

  27. 24 అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25 శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు.

  28. 23 విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు. 24 పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని ఆయనను అడిగారు. 25 అందుకాయన వారితో ఇలా అన్నాడు, “దావీదు, అతనితో ఉన్నవారు అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా? 26 అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?” అన్నాడు.

    27 ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “విశ్రాంతి దినం మనుషుల కోసమేగాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. 28 అందుచేత మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!” అని వారితో చెప్పాడు.

  29. 30 సోమరిపోతు చేను నేను దాటి వస్తుంటే తెలివిలేనివాడి ద్రాక్షతోట నేను దాటి వస్తుంటే, 31 ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది.

    32 నేను దాన్ని చూసి ఆలోచించాను. దాన్ని గమనించి బుద్ధి తెచ్చుకున్నాను.

    33 మరికాస్త నిద్ర, మరికాస్త కునుకు, నిద్ర పోవడానికి మరికాస్త చేతులు ముడుచు కోవడం, 34 వీటివల్ల నీకు దారిద్రర్యం పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుధం ధరించిన సైనికుడు వచ్చినట్టు లేమి నీమీదికి వస్తుంది.

  30. 22 “దుష్టులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెబుతున్నాడు.

  31. 10 వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, “సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్నవారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?” 11 అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ తెల్లని దుస్తులు ఇచ్చారు. “మీలాగే హతం కావాల్సిన మీ తోటి సేవకుల, సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి” అని వారికి చెప్పడం జరిగింది.

  32. 11 వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించిన వారూ, దాని ముద్ర వేయించుకున్న వారూ రేయింబవళ్ళు విరామం లేకుండా బాధలపాలు అవుతూ ఉంటారు.

  33. 5 మేము మాసిదోనియ వచ్చినప్పుడు మా శరీరాలకు ఎంత మాత్రం విశ్రాంతి దొరకలేదు. అన్నివైపులా మాకు కష్టాలే. బయట పోరాటాలు, లోపల భయాలు ఉన్నాయి.

    6 కానీ కృంగిన వారిని ఆదరించే దేవుడు, తీతు రాక ద్వారా మమ్మల్ని ఆదరించాడు. 7 తీతు రాక వలన మాత్రమే కాక, అతడు మీ దగ్గర పొందిన ఆదరణ వలన కూడా దేవుడు మమ్మల్ని ఆదరించాడు. నాపై ఉన్న మీ అభిమానం, నా పట్ల మీ దుఃఖం, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలియజేశాడు. కాబట్టి నేను మరెక్కువగా ఆనందించాను.

  34. 8 యెహోవా, లే. నీ విశ్రాంతి స్థలానికి రా.

  35. 15 సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు.

  36. 17 నీతి శాంతిని కలుగ చేస్తుంది. నీతి ఫలితంగా నిత్యమైన నెమ్మదీ నమ్మకమూ కలుగుతాయి.

    18 నా ప్రజలు శాంతిభరితమైన చోట, సురక్షితమైన ఇళ్ళల్లో నివసిస్తారు.

  37. 25 ఎందుకంటే అలసినవాళ్ళు తాగడానికి నీళ్ళిస్తాను. దప్పికతో బాధపడుతున్న వాళ్ళందరి కడుపు నింపుతాను.”

  38. 4 మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. 5 అలా ఆయన సమరయలో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు.

    6 యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం.

  39. 27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.

  40. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

  41. 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.

    3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.

    5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు.

  42. 9 నీ దేవుడు యెహోవా మీకిస్తున్న విశ్రాంతిని, స్వాస్థ్యాన్ని మీరింతకు ముందు పొందలేదు.

  43. 21 కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు.

    22 జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి.

    23 అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు.

    24 పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు.

  44. 24 ఒళ్ళువంచి పనిచేసే వాళ్ళు అధికారం సంపాదిస్తారు. సోమరిపోతులు ఊడిగం చెయ్యాల్సి వస్తుంది.

  45. 4 సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.

  46. 4 నాట్లు వేసే కాలంలో సోమరిపోతు నాగలి పట్టడు. కోతకాలంలో పంటకోసం వస్తే వాడికి ఏమీ దొరకదు.

  47. 12 కష్టజీవులు కొంచెమే తినినా హాయిగా నిద్ర పోతారు.

    అయితే ఐశ్వర్యవంతులు తమ ధనసమృధ్థి వలన నిద్రపోలేరు.

  48. 18 సోమరితనం ఇంటికప్పు దిగబడిపోయేలా చేస్తుంది. చేతులు బద్ధకంగా ఉంటే ఆ ఇల్లు కురుస్తుంది.

  49. 11 మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో చివరి వరకూ సాగాలని మా అభిలాష. 12 మీరు మందకొడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసంతో, సహనంతో, వాగ్దానాలను వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.

  50. 38 వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. 39 ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది. 40 మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది.

    41 అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42 మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు.

  51. 18 తనకు అవిధేయులైన వారిని గూర్చి కాకుంటే తన విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు ఎవరిని ఉద్దేశించి ప్రమాణం చేశాడు? 19 దీన్నిబట్టి, అవిశ్వాసం మూలానే వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేక పోయారని మనం చూశాము.