40 Bible Verses About Hope in Hard Times

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Hope in Hard Times
  1. 1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

  2. 18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.

  3. 28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

    29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

  4. 13 మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.

  5. 4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.

    5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7 అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.

    8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

  6. 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,’ ఇది యెహోవా వాక్కు. ‘అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.

    12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను. 13 మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు.

  7. 13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి, “నా తోడు” అంటూ ప్రమాణం చేశాడు. 14 “నిన్ను కచ్చితంగా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని విస్తారం చేస్తాను” అన్నాడు. 15 ఈ విధంగా అబ్రాహాము సహనంతో వేచి ఉన్న తరువాత దేవుడు తనకు వాగ్దానం చేసిన భూమిని పొందాడు.

    16 సాధారణంగా మనుషులు తమ కంటే గొప్పవాడి తోడు అంటూ ప్రమాణం చేస్తారు. వారికున్న ప్రతి వివాదానికీ పరిష్కారం చూపేది ప్రమాణమే. 17 వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.

    18 అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పు లేని ఆ రెండింటి ద్వారా ఆశ్రయం కోరి పరుగు తీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు. 19 ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి తెర లోపలికి ప్రవేశిస్తుంది. 20 మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ప్రధాన యాజకుడైన యేసు మన తరపున మనకంటే ముందుగా దానిలో ప్రవేశించాడు.

  8. 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

    నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

    దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

    నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

    11 నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు.

    నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు

    12 నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు.

    నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు.

    13 నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను.

  9. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

    7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

    10 తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు. 11 ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక. ఆమేన్‌.

  10. 2 నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3 రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4 ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.

  11. 3 మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.

    4 దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. 5 ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. 6 రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు.

    7 నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది. 8 మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు.

  12. ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం.

    1 దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.

    2 కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం.

    3 సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. సెలా.

  13. 15 కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి. 16 అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.

    17 మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం. 18 కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి.

  14. 1 సోదరులారా, కాలాలను సమయాలను గూర్చి నేను మీకు రాయనక్కరలేదు. 2 రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు. 3 ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.

    4 సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు. 5 మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు. 6 కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం. 7 నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు. 8 విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, రక్షణ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.

    9 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు. 10 మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు. 11 కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి.

  15. 4 నా దేవా, దుష్టుల చేతిలోనుండి నన్ను రక్షించు. కీడు చేసేవాళ్ళ, క్రూరుల పట్టులోనుండి నన్ను విడిపించు.

    5 నా ప్రభూ, యెహోవా, నా నిరీక్షణకు ఆధారం నువ్వే. నా బాల్యం నుండి నా ఆశ్రయం నువ్వే.

    6 నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను.

    7 నేను అనేకులకు ఒక వింతగా కనిపిస్తున్నాను. అయినా నాకు బలమైన ఆశ్రయం నువ్వే.

    8 నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండిపోయింది.

  16. 5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

    6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

  17. 26 నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.

    27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.

  18. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”

  19. దావీదు కీర్తన.

    1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.

    2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.

    3 నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.

    4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.

    5 నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది.

    6 కచ్చితంగా నేను బ్రతికిన రోజులన్నీ మంచి, నిబంధన నమ్మకత్వం నన్ను వెంటాడతాయి. చాలా కాలం యెహోవా ఇంట్లో నేను నివాసం ఉంటాను.

  20. 18 చూడండి, వాళ్ళ ప్రాణాలను మరణం నుండి తప్పించడానికీ, కరువులో వాళ్ళను సజీవులుగా నిలబెట్టడానికీ,

  21. 22 యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.

    23 ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు.

    నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!

    24 “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది.

    కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.

    25 తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.

    26 యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.

    27 తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది.

  22. 20 ఈ కారణం చేతనే మీతో మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తం ఈ గొలుసులతో నన్ను బంధించి ఉంచారు” అని వారితో చెప్పాడు.

  23. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  24. 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.

    4 ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.

    5 క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది.

  25. 5 మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము.

  26. 13 సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు. 14 యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.

    15 మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. 16 ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. 17 ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.

    18 కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోండి.

  27. 9 ప్రియమైన స్నేహితులారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికీ మీరింతకంటే మంచి స్థితిలోనే ఉన్నారనీ, రక్షణకు సంబంధించిన విషయాల్లో మంచి స్థితిలోనే ఉన్నారనీ గట్టిగా నమ్ముతున్నాం. 10 దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు.

  28. 32 అయితే గతించిన రోజులను జ్ఞాపకం చేసుకోండి. మీరు వెలుగును అనుభవించిన తరువాత ఎంత గొప్ప హింసనూ వేదననూ భరించారో జ్ఞాపకం చేసుకోండి. 33 హింసల, అవమానాల వల్ల మీరు బహిరంగంగా అపహాస్యానికి గురయ్యారు. మరో వైపు అలాంటి వేదన అనుభవించిన వారితో మీరు భాగస్వాములయ్యారు. 34 ఇదెలాగంటే, మీరు ఖైదులో ఉన్నవారిని కనికరించారు. మీకు శ్రేష్ఠమైన, కలకాలం నిలిచి ఉండే సంపదలు ఉన్నాయని తెలుసుకుని మీకున్న ఆస్తిపాస్తులను ఇతరులు పట్టుకు పోతుంటే ఆనందంగా అంగీకరించారు. 35 కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది. 36 దేవుని ఇష్టాన్ని జరిగించిన తరువాత, ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి.

    37 “ఇక కొద్ది కాలం తరువాత రానున్న వాడు తప్పకుండా వస్తాడు.

    ఆయన ఆలస్యం చేయడు.

    38 నా నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు.

    అతడు వెనక్కు మళ్ళితే అతణ్ణి గూర్చి నేను సంతోషించను.”

    39 అయితే మనం నాశనానికి పోవడానికి వెనక్కు తీసేవారం కాము. కానీ ఆత్మను కాపాడుకోడానికి కావలసిన విశ్వాసం గలవారిలో మనం ఉన్నాం.

  29. 8 నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు” అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు.

  30. 9 పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ.

    10 యెహోవా, నీ నామం తెలిసిన వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఎందుకంటే, నిన్ను వెదికే వాళ్ళను నువ్వు విడిచిపెట్టవు.

  31. 17 ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు.

    18 విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు.

    19 ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు.

  32. 22 నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.

  33. 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

    10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.

  34. 10 మనుషులందరికీ మరి విశేషంగా విశ్వాసులకు ముక్తిప్రదాత అయిన సజీవ దేవుని మీదే మనం నిరీక్షణ పెట్టుకున్నాము. కాబట్టి చెమటోడ్చి పాటుపడుతున్నాం.

  35. 13 కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.

  36. 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”

  37. 6 దీని కారణంగా భయభక్తులు కలిగిన వాడు నువ్వు దొరికే సమయంలో నీకు ప్రార్ధించాలి. అప్పుడు జల ప్రవాహాలు ఉప్పొంగినా అవి అతని దగ్గరకు రావు.

    7 నా రహస్య స్థావరం నువ్వే. సమస్య నుండి నువ్వు నన్ను కాపాడతావు. విజయ గీతాలతో నువ్వు నన్ను ఆవరిస్తావు.

    8 నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవాల్సిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేస్తాను.

  38. 28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”

  39. 33 నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.

  40. 1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.

    4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

    7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

    8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.

    9 ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము. 10 అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి. 11 నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.

    12 అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.

    13 ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.