80 Bible Verses About Loving Others

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Loving Others
  1. 1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.

    4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

    7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

    8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.

    9 ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము. 10 అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి. 11 నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.

    12 అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.

    13 ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.

  2. 7 ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునినుండి వస్తుంది. ప్రేమించే ప్రతి మనిషీ దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు. 8 ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ. 9 దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి, ఆయన ద్వారా మనం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది. 10 మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి, మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమంటే ఇదే.

    11 ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 12 ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది. 13 దీనివలన మనం ఆయనలో నిలిచి ఉన్నామనీ, ఆయన మనలో నిలిచి ఉన్నాడనీ తెలుసుకుంటాము. ఎందుకంటే, ఆయన తన ఆత్మను మనకిచ్చాడు.

  3. 37 అందుకు యేసు,

    “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.

    38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.

    39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.

    40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.

  4. 16 దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలుసుకుని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. 17 తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యింది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం.

    18 ప్రేమలో భయం లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయం ఉన్నవాడు ఇంకా ప్రేమలో పరిపూర్ణత పొందలేదు. 19 దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.

    20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. 21 దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, అన్న ఆజ్ఞ ఆయన నుండి మనకు ఉంది.

  5. 34 మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35 మీరు ఒకడి పట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు” అన్నాడు.

  6. 16 “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17 తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.

    18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు.

  7. 8 ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. 9 ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి. 10 ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.

  8. 12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. 13 స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు.

  9. 9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. 10 సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. 11 ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. 12 ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. 13 పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి.

  10. 41 ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు. 42 నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు.

    43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44 నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.

    46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

  11. 27 “వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. 28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.

    29 నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు. 30 అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్న వాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు. 31 మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి.

    32 మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా. 33 మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా!

    34 మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా.

    35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు. 36 మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి.

  12. 8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు. 9 ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. 10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి. 11 ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్‌.

  13. 6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. 11 అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.

  14. 1 మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

    4 అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనక, 5 మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

    6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.

    8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు. 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు.

  15. 14 మనం మన సోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవంలోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15 తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు.

    16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?

    18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం. 19 దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి.

  16. 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి.

    14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది.

  17. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

  18. 29 అప్పుడు యేసు, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ‘ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే. 30 పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ. 31 రెండవది, ‘నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.’ వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు” అని జవాబిచ్చాడు.

    32 ఆ ధర్మశాస్త్ర పండితుడు, “అయ్యా, మీరు బాగా చెప్పారు. దేవుడొక్కడే అనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పింది నిజమే. 33 పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం” అన్నాడు.

    34 అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది.

  19. 7 ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు. 8 ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. 9 ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, “నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?” ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు. 10 దానికి యేసు, “నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు” అన్నాడు.

    11 అప్పుడా స్త్రీ, “అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది? 12 మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది.

  20. 13 సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి. 14 ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది. 15 అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.

  21. 22 స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి. 23 క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు. 24 సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.

    25 పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి. 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి, 27 దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.

    28 అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే. 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.

  22. 1-3 కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.

  23. 22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23 అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.

  24. 18 పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు.

    నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.

  25. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

  26. 15 వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు.

    16 మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు.

    17 ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు.

    అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. 18 నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు.

  27. 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా? 36 దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే,

    “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.

    వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”

    37 అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం. 38-39 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

  28. 14 మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.

  29. 1 కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి. 2 క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.

  30. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.

  31. 22 సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి. 23 మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు.

  32. 9 సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు. 10 అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.

  33. 17 స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.

  34. 9 ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది.

    కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది.

    10 ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు.

    అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది.

    11 ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా!

    12 ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక.

    అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు.

    మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?

  35. 16 యేసు ఆమెతో, “నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసుకురా” అన్నాడు. 17 దానికి ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అంది. యేసు ఆమెతో, “‘భర్త లేడని సరిగ్గానే చెప్పావు. 18 ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు” అన్నాడు.

  36. 7 మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు. 8 క్రీస్తు యేసు ప్రేమ లోతుల్లో నుంచి, మీ కోసం నేనెంత తపిస్తున్నానో దేవుడే నాకు సాక్షి.

    9 మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. 10 దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన 11 అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలాలతో నిండి ఉండాలి.

  37. 12 మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నదో అలాగే మీరు కూడా ఒకరిపట్ల ఒకరు, ఇంకా, అందరి పట్ల కూడా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ప్రభువు అనుగ్రహించు గాక. 13 మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ఆయన స్థిరపరచు గాక!

  38. 4 ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. 5 నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

    6 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.

  39. 6 నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో.

    ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది.

    మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది.

    దాని మంటలు ఎగిసి పడతాయి.

    అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది.

    7 ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు.

    వరదలు దాన్ని ముంచలేవు.

    ప్రేమ కోసం ఎవడైనా తనకున్నదంతా ఇచ్చేసినా ఆ ప్రయత్నం శుద్ధ దండగ.

  40. 8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

    ఆయన నిన్ను కోరేదేంటంటే,

    న్యాయంగా ప్రవర్తించు.

    కనికరాన్ని ప్రేమించు.

    వినయంగా నీ దేవునితో నడువు.

  41. 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.

  42. 9 తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు.

  43. 24 “తండ్రీ, నేను ఎక్కడ ఉంటానో, నువ్వు నాకిచ్చిన వారు నాతో కూడా అక్కడ ఉండాలని, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భూమికి పునాది వేయక ముందు నుంచే నువ్వు నన్ను ప్రేమించావు.

  44. 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

  45. 6 యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో, పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.

  46. 1 సోదర ప్రేమను కొనసాగనియ్యండి. 2 అపరిచితులను ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తూ కొందరు తమకు తెలియకుండానే దేవదూతలను ఆహ్వానించారు. 3 మీరు కూడా వారితో చెరసాల్లో ఉన్నట్టు చెరసాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనక కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి.

  47. 14 నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా?

    15 ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే, 16 మీలో ఒకడు అలాటి వారితో, “శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను” అని చెబితే ఏం ప్రయోజనం? 17 అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే.

  48. 8 చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.

    9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.

  49. 1 యేసే క్రీస్తు అని నమ్మినవారంతా దేవుని ద్వారా పుట్టినవాళ్ళే. తండ్రిగా అయిన వాణ్ణి ప్రేమించిన వారంతా ఆయన ద్వారా పుట్టినవాణ్ణి కూడా ప్రేమిస్తారు. 2 మనం దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వల్ల మనకు తెలుసు.

    3 ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు.

  50. 17 ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు. 18 ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు.

    19 మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి.

  51. 8 నీపై నేను నమ్మకం పెట్టుకున్నాను. తెల్లవారగానే నువ్వు చూపే నిబంధన విశ్వసనీయత సమాచారం వినిపించు. నా మనసును నీ వైపే ఎత్తి ఉన్నాను. నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు.

  52. 35 అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను. 36 ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు.

    37 నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు. 38 తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు. 39 తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.

  53. 5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది.

    6 దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను.

  54. 23 యేసు జవాబిస్తూ, “ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివాసం చేస్తాము.

  55. 27 ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.

  56. 26 నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ వారిలో ఉండాలనీ, నేను వారిలో ఉండాలనీ, నీ నామాన్ని వారికి తెలియజేశాను. ఇంకా తెలియజేస్తాను.”

  57. 15 నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతణ్ణి నీ ఆహారం చేత పాడు చేయవద్దు.

  58. 1 సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

  59. 3 విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం.

    4 దేవుడు ప్రేమించిన సోదరులారా, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.

  60. 9 తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. 10 తన సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతడు తడబడి పడిపోయే అవకాశం లేదు. 11 కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివాడుగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.

  61. 11 మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు.

  62. 23 ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.

  63. 33 మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతణ్ణి బాధ పెట్టకూడదు, 34 మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.

  64. 12 ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది.

  65. 34 తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36 బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.

    37 అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? 38 ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? 39 ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. 40 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు.

  66. 25 ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. 26 అందుకాయన, “ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది? నువ్వు దానినెలా అర్థం చేసుకున్నావు?” అని అడిగాడు. 27 అతడు, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణీ ప్రేమించాలి” అన్నాడు. 28 దానికి ఆయన, “సరిగ్గా చెప్పావు. నువ్వూ అలా చెయ్యి, జీవిస్తావు” అన్నాడు.

  67. 26 “నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు.

  68. 21 “అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము.

  69. 42 యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. నేను వచ్చింది దేవుని దగ్గర్నుంచే. నా అంతట నేను రాలేదు. ఆయనే నన్ను పంపించాడు.

  70. 21 నా ఆజ్ఞలను కలిగిఉండి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నాడు.

  71. 17 మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

  72. 1 కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనలను మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి. 2 మన సాటిమనిషికి క్షేమాభివృద్ధి కలిగేలా మనలో ప్రతివాడూ మంచి విషయాల్లో అతణ్ణి సంతోషపరచాలి. 3 క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. “నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి” అని రాసి ఉన్నట్టు ఆయనకు జరిగింది.

  73. 14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఎలాగంటే, అందరి కోసం ఒకడు చనిపోయాడు కాబట్టి అందరూ చనిపోయారనే విషయం కచ్చితం. 15 బతికే వారు ఇక నుంచి తమ కోసం బతకకుండా తమ కోసం చనిపోయి సజీవంగా తిరిగి లేచిన వాడి కోసమే బతకాలని ఆయన అందరి కోసం చనిపోయాడు. 16 ఈ కారణం చేత ఇప్పటి నుండి మేము ఎవరితోనూ ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే చూశాం. అయితే ఇప్పటి నుండి ఇలా వ్యవహరించం.

    17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి.

  74. 20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే.

  75. 5 ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.

  76. 12 నీ యౌవనాన్ని బట్టి ఎవరూ నిన్ను చులకన చేయనియ్యకు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు.

  77. 1 చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి. 2 మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు, 3 బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు. 4 వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు. 5 వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.

  78. 9 ప్రియమైన స్నేహితులారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికీ మీరింతకంటే మంచి స్థితిలోనే ఉన్నారనీ, రక్షణకు సంబంధించిన విషయాల్లో మంచి స్థితిలోనే ఉన్నారనీ గట్టిగా నమ్ముతున్నాం. 10 దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు.

  79. 8 “నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు,” అని లేఖనాల్లో రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే.

  80. 15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.