78 Bible Verses About Helping the Poor and Needy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About Helping the Poor and Needy
  1. 31 దరిద్రుణ్ణి కష్టపెట్టేవాడు వాడి సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించినట్టే. పేదవారిని ఆదరించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు.

  2. 17 పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.

  3. 34 తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36 బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.

    37 అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? 38 ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? 39 ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. 40 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు.

    41 “తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42 ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43 పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు.

    44 అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45 అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. 46 వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”

  4. 12 తరువాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు, “నువ్వు పగలైనా రాత్రి అయినా విందు చేసినప్పుడు నీ స్నేహితులనూ నీ సోదరులనూ నీ బంధువులనూ ధనికులైన నీ పొరుగువారినీ పిలవకు. ఎందుకంటే నువ్వు వారిని పిలిచావు కాబట్టి వారు నిన్ను తిరిగి పిలవవచ్చు. కాబట్టి ఆ విధంగా వారు నీ రుణం తీర్చుకుంటారు. 13 అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు. 14 నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారి దగ్గరేమీ ఉండదు. కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు. చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది” అని చెప్పాడు.

  5. 9 మీరు మీ పొలం పంట కోసేటప్పుడు నీ పొలం మూలల్లొ పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకోకూడదు. నీ పండ్ల చెట్ల పరిగెను సమకూర్చుకోకూడదు. 10 నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.

  6. 9 ఉదార గుణం గలవాడికి దీవెన. ఎందుకంటే అతడు తన ఆహారంలో కొంత పేదవాడికి ఇస్తాడు.

  7. 16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?

    18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం. 19 దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి.

  8. 9 నాయకులుగా పేరొందిన యాకోబు, కేఫా, యోహాను, అనే వారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గుర్తించి, మేము యూదేతరులకూ, తాము సున్నతి పొందిన వారికీ అపొస్తలులుగా ఉండాలని చెప్పి, సహవాసానికి గుర్తుగా నాతోనూ, బర్నబాతోనూ తమ కుడి చేతులు కలిపారు. 10 మేము యెరూషలేములో ఉన్న సాటి విశ్వాసుల్లోని పేదవారి అవసరాలను ఇంకా పట్టించుకొంటూ ఉండాలని మాత్రమే వారు కోరారు. అలా చేయడానికి నేను కూడా ఆసక్తిగా ఉన్నాను.

  9. 13 దరిద్రుల మొర వినకుండా చెవులు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టే సమయంలో దేవుడు దాన్ని వినిపించుకోడు.

  10. 27 పేదలకు ఇచ్చే వాడికి లేమి కలగదు. వారిని చూడకుండా కళ్ళు మూసుకునే వాడికి ఎన్నో శాపాలు కలుగుతాయి.

  11. 35 నీ జాతివాడు ఎవరైనా పేదవాడై తనను పోషించుకోలేని స్థితిలో నీ దగ్గరికి వస్తే నీవు ఒక పరదేశికి, నీ దగ్గర నివసిస్తున్న బయటి వ్యక్తికి సహాయం చేసినట్టే అతనికి సహాయం చెయ్యాలి. 36 అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. అతని వలన లాభం పొందాలని చూడకూడదు. నీ సోదరుడు నీ మూలంగా బ్రతకాలి. ఆ విధంగా నీ దేవుణ్ణి నీవు గౌరవించాలి. 37 డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకోకూడదు. నీ దగ్గరున్న ఆహారపదార్థాలను లాభం వేసుకుని అతనికి అమ్మకూడదు. 38 నేను యెహోవాను. మీకు దేవుడుగా ఉండడానికి ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించి, మీకు కనాను దేశాన్ని ఇచ్చిన వాణ్ణి.

    39 నీ స్వజాతి వాడు పేదవాడై తనను నీకు అమ్మేసుకుంటే వాడిచేత బానిసలా ఊడిగం చేయించుకో కూడదు. 40 వాడు సేవకునిలాగా పరదేశిలాగా నీ దగ్గర ఉండి సునాద సంవత్సరం వరకూ నీ దగ్గర సేవకుడుగా పని చేస్తాడు. 41 అప్పుడతడు తన పూర్వీకుల ఆస్తిని మళ్లీ అనుభవించేలా తన పిల్లలతో సహా నీ దగ్గర నుండి బయలు దేరి తన వంశం వారి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. 42 ఎందుకంటే వారు నాకే సేవకులు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించాను. బానిసలను అమ్మినట్టు వాళ్ళను అమ్మకూడదు.

  12. 21 పేదవారిని ఆదరించేవాడు ధన్యజీవి. తన పొరుగువాణ్ణి తిరస్కరించేవాడు పాపం చేసినట్టే.

  13. 8 మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు.

    9 నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు బాధ పడేవారికి దరిద్రులకు న్యాయం చెయ్యి.

  14. 7 అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో, “సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? 8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను. 9 ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు” అని చెప్పాడు.

    10 అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 11 అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు.

  15. 32 చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం. 33 మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు. 34 మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.

  16. 16 ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు. 17 అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.

    18 అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, 19 నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే” అని చెప్పాడు.

    20 అందుకు ఆ యువకుడు, “వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?” అన్నాడు. 21 అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు. 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.

    23 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. 24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక.” 25 శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. “ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?” అన్నారు. 26 యేసు వారితో, “ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే” అని చెప్పాడు.

    27 అప్పుడు పేతురు, “ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా, మాకేమి లభిస్తుంది?” అని ఆయనను అడగగా 28 యేసు వారితో ఇలా అన్నాడు, “కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు.

    29 నా నామం నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు. 30 మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు.”

  17. 1 నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తును విశ్వసించే వారుగా పక్షపాతం లేకుండా ఉండండి.

    2 ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి. 3 మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాడి మీద ఉంచి, “దయచేసి ఈ మంచి చోట కూర్చోండి,” అని చెప్పి, పేదవానితో, “నువ్వు అక్కడ నిలబడు,” లేదా, “నా కాళ్ళ దగ్గర కూర్చో,” అంటే, 4 మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా?

    5 నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా? 6 కానీ మీరు పేదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్మల్ని అణగదొక్కేదీ, చట్ట సభలకు ఈడ్చేదీ ధనవంతులు కాదా? 7 మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురౌతున్నది? 8 “నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు,” అని లేఖనాల్లో రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే.

    9 కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది.

  18. 1 “మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. 2 కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.

    3 నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. 4 అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.

  19. 26 తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం. 27 తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.

  20. 7 మీ దేవుడు యెహోవా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక బీదవాడు ఉంటే అతనిపై దయ చూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు. 8 మీ చెయ్యి ముడుచుకోకుండా తప్పక వాడి వైపు చాచి, వాడి అక్కరకు చాలినంతగా వాడికి అప్పు ఇవ్వాలి. 9 అప్పు రద్దు చేయాల్సిన “ఏడో సంవత్సరం దగ్గర పడింది” అనే చెడ్డ తలంపు మీ మనస్సులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయ చూపి అతనికేమీ ఇవ్వకపోతే వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది.

    10 కాబట్టి మీరు తప్పకుండా అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన యెహోవా దేవుడు మీ పనులన్నిటిలో, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 11 పేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను మీ దేశంలో దీనులు, “పేదలు అయిన మీ సోదరులకు తప్పకుండా సహాయం చేయాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

    12 మీ సోదరుల్లో మీరు కొన్న హెబ్రీయుడు, లేక హెబ్రీయురాలు ఆరు సంవత్సరాలు మీకు దాస్యం చేసిన తరవాత ఏడో సంవత్సరం వారికి విడుదలనిచ్చి నీ దగ్గర నుండి పంపివేయాలి. 13 అయితే ఆ విధంగా పంపేటప్పుడు మీరు వారిని వట్టి చేతులతో పంపకూడదు. 14 వారికి మీ మందలో, ధాన్యంలో, మీ ద్రాక్ష గానుగలో నుండి ఉదారంగా ఇవ్వాలి. మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకిచ్చిన కొలదీ వారికి ఇవ్వాలి.”

    15 మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విమోచించాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను ఈ సంగతి ఈ రోజు మీకు ఆజ్ఞాపించాను.

  21. 4 మీరు ఉపవాసమున్నప్పుడు పోట్లాడుకుంటారు. మీ పిడికిళ్ళతో కొట్టుకుంటారు.

    మీరు ఈ రోజుల్లో ఉపవాసముండేది మీ స్వరం పైన వినబడాలని కాదు.

    5 నేను కోరేది అలాంటి ఉపవాసమా? ప్రతివాడు తనను తాను అణుచుకుంటే సరిపోతుందా?

    ఒకడు రెల్లులాగా తలవంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చోవడం ఉపవాసమా? అలాంటి ఉపవాసం యెహోవాకు ఇష్టమని మీరనుకుంటారా?

    6 నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే,

    దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం,

    అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం.

    7 ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం.

    దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు.

    8 అప్పుడు నీ వెలుగు, ఉదయకాంతిలాగా ఉదయిస్తుంది. నీ ఆరోగ్యం నీకు త్వరగా లభిస్తుంది.

    నీ నీతి, నీకు ముందుగా వెళ్తుంది. యెహోవా మహిమ నీ వెనుక కావలి కాస్తుంది.

    9 అప్పుడు నువ్వు పిలిస్తే యెహోవా జవాబిస్తాడు. సహాయం కోసం నువ్వు మొర్ర పెడితే “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అంటాడు.

    ఇతరులను అణిచివేయడం, వేలుపెట్టి చూపిస్తూ నిందించడం, మోసంగా మాట్లాడడం నువ్వు మానుకుంటే,

    10 ఆకలితో అలమటించే వారికి నీకున్న దానిలోనుంచి ఇచ్చి, బాధితుల అవసరాలను తీర్చి వాళ్ళను తృప్తి పరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. నీ చీకటి నీకు మధ్యాహ్నం లాగా ఉంటుంది.

    11 అప్పుడు యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన నీ ఆత్మను తృప్తిపరుస్తాడు.

    నీ ఎముకలను బలపరుస్తాడు. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు.

    ఎన్నడూ ఆగని నీటి ఊటలాగా ఉంటావు.

  22. 42 నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు.

  23. 35 మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.”

  24. 9 మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు.

  25. 14 నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా?

    15 ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే, 16 మీలో ఒకడు అలాటి వారితో, “శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను” అని చెబితే ఏం ప్రయోజనం? 17 అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే.

  26. 7 మంచి మనిషి పేదల పక్షంగా వాదిస్తాడు. పాతకుడికి అలాటి జ్ఞానం లేదు.

  27. 1 ప్రతి ఏడవ సంవత్సరం అంతంలో అప్పులన్నీ రద్దు చేయాలి. అది ఎలాగంటే, 2 తన పొరుగువాడికి అప్పు ఇచ్చిన ప్రతివాడూ దాన్ని రద్దు చేసి వారిని విడిచిపెట్టాలి. అది యెహోవా ప్రకటించిన గడువు కాబట్టి అప్పు ఇచ్చినవాడు తన పొరుగువాడిపై లేక తన సోదరునిపై ఒత్తిడి తేకూడదు. 3 ఇశ్రాయేలీయుడు కాని వ్యక్తి పై ఒత్తిడి తేవచ్చు గాని మీ సోదరుని దగ్గర ఉన్న మీ సొమ్మును విడిచిపెట్టాలి. 4 మీరు స్వాధీనం చేసుకోడానికి యెహోవా దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యెహోవా మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు.

    5 కాబట్టి ఈ రోజు నేను మీకు ఆదేశించే యెహోవా దేవుని ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా విని పాటిస్తే మీలో పేదవాళ్ళు ఉండనే ఉండరు.

  28. 28 మీ దేవుడు యెహోవా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా మూడు సంవత్సరాల కొకసారి, ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో పదో వంతుని బయటికి తెచ్చి మీ ఇంట్లో ఉంచాలి. 29 అప్పుడు మీ మధ్యలో వంతు గాని, స్వాస్థ్యం గాని లేని లేవీయులు, మీ ఇంట్లో ఉన్న పరదేశులు, అనాథలు, విధవరాళ్ళు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు.”

  29. 3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి. 4 ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు. 5 అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.

    6 దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి. 7-8 పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి.

    9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. 10 సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. 11 ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. 12 ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. 13 పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి.

  30. 21 పరాయి దేశస్థులను పీడించకూడదు. మీరు ఐగుప్తు దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు గదా.

    22 విధవరాళ్ళను, తల్లి తండ్రులు లేని పిల్లలను బాధపెట్టకూడదు. 23 వాళ్ళను ఏ కారణంతోనైనా నీవు బాధ పెడితే వాళ్ళు పెట్టే మొర నాకు వినబడుతుంది. నేను వాళ్ళ మొరను తప్పకుండా ఆలకిస్తాను. 24 నా కోపాగ్ని రగులుకొంటుంది. నా కత్తివేటుతో నిన్ను హతం చేస్తాను. మీ భార్యలు విధవరాళ్ళు అవుతారు. మీ పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు.

    25 నా ప్రజల్లో మీ దగ్గర ఉండే ఒక పేదవాడికి అప్పుగా సొమ్ము ఇచ్చినప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించ కూడదు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు. 26 మీరు ఒకవేళ ఎప్పుడైనా మీ పొరుగువాడి దుస్తులు తాకట్టు పెట్టుకుంటే సూర్యుడు అస్తమించే సమయానికి వాటిని వాళ్లకు తిరిగి అప్పగించాలి. 27 వాళ్ళు ఏమి కప్పుకుని పండుకుంటారు? వాళ్ళ దేహాలు కప్పుకొనే దుస్తులు అవే కదా. వాళ్ళు నాకు మొర పెట్టినప్పుడు నేను వింటాను. నేను దయగల వాణ్ణి.

  31. ప్రధాన సంగీతకారుడి కోసం దావీదు కీర్తన

    1 బలహీనులను పట్టించుకునే వాడు ధన్యజీవి. కష్ట సమయంలో యెహోవా అతణ్ణి కాపాడతాడు.

    2 యెహోవా అతణ్ణి భద్రపరచి సజీవంగా ఉంచుతాడు. భూమి మీద అతణ్ణి ఆశీర్వదిస్తాడు. అతని శత్రువులు కోరుకున్నట్టుగా అతణ్ణి వాళ్ళకి స్వాధీనం చేయడు.

    3 జబ్బు చేసి పడకపై ఉన్నప్పుడు యెహోవా అతణ్ణి పరామర్శిస్తాడు. వ్యాధి పడకను నువ్వు స్వస్థత పడకగా మారుస్తావు.

  32. 12 బాధితుల తరపున యెహోవా వాదిస్తాడనీ. ఆయన దరిద్రులకు న్యాయం చేకూరుస్తాడని నాకు తెలుసు.

  33. 38 ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకూ కొలవడం జరుగుతుంది.”

  34. 6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.

    9 దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది.

    10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

  35. 22 పేదవాడు గదా అని పేదవాణ్ణి దోచుకోవద్దు. పట్టణ ద్వారాల దగ్గర నిస్సహాయులను నలగ గొట్టవద్దు.

    23 యెహోవా వారి పక్షంగా వాదిస్తాడు. వారిని దోచుకొనేవారి ప్రాణాలు ఆయన దోచుకుంటాడు.

  36. 48 నువ్వూ, నీ కూతుళ్ళూ చేసినట్టు నీ చెల్లెలు సొదొమ గాని, దాని కూతుళ్ళు గాని చెయ్యలేదని నా జీవం తోడు, ప్రమాణం చేస్తున్నాను” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

    49 “చూడు! నీ చెల్లెలు సొదొమ పాపం ఏమంటే, అది తనకు కలిగిన కులాసాను బట్టి అహంకారం చూపింది. దేని గురించీ దానికి దిగులు లేదు, దేన్నీ లక్ష్య పెట్టదు. పేదల చేతులు దాని వైపుకు, దాని కూతుళ్ళ వైపుకు చాచి ఉన్నాయి గానీ అది ఎవరికీ సాయం చెయ్యలేదు. 50 వాళ్ళు అహంకారంతో నా దృష్టిలో అసహ్యమైన క్రియలు చేశారు గనుక నేను దాన్ని చూసి వాళ్ళను వెళ్ళగొట్టాను.

  37. 16 ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు. 17 యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే,

    18 “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు.

    పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు.

    చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ,

    19 ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు”

    అని రాసిన చోటు ఆయనకు దొరికింది.

    20 ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. 21 సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు.

  38. 20 అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని తదేకంగా చూసి ఇలా అన్నాడు,

    “పేదలారా, మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది.

    21 “ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా, మీరు ధన్యులు, మీకు తృప్తి కలుగుతుంది.

    “ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు.

  39. 17 ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు. 18 వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసుకోవాలనీ, 19 మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.

  40. 10 మీ పొరుగువాడికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు అతని దగ్గర తాకట్టు వస్తువు తీసుకొనేందుకు అతని ఇంటి లోపలికి వెళ్లకూడదు. 11 ఇంటి బయటే నిలబడాలి. అప్పు తీసుకునేవాడు బయట నిలబడి ఉన్న నీ దగ్గరికి ఆ తాకట్టు వస్తువు తీసుకు వస్తాడు. 12 అతడు పేదవాడైన పక్షంలో నువ్వు అతని తాకట్టు వస్తువు నీదగ్గరే ఉంచుకుని నిద్రపోకూడదు. అతడు తన దుప్పటి కప్పుకుని నిద్రబోయేముందు నిన్ను దీవించేలా సూర్యాస్తమయంలోగా తప్పకుండా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగి అప్పగించాలి. 13 అది మీ యెహోవా దేవుని దృష్టిలో మీకు నీతి అవుతుంది.

    14 మీ సోదరుల్లో గానీ మీ దేశంలోని గ్రామాల్లో ఉన్న విదేశీయుల్లోగానీ దరిద్రులైన కూలివారిని బాధించకూడదు. ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి. 15 సూర్యుడు అస్తమించేలోగా అతనికి కూలి చెల్లించాలి. అతడు పేదవాడు కాబట్టి అతనికి వచ్చే సొమ్ము మీద ఆశ పెట్టుకుంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్ర పెడతాడేమో. అది నీకు పాపమవుతుంది.

  41. 19 మీ పొలంలో మీ పంట కోస్తున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోతే దాన్ని తెచ్చుకోడానికి మీరు తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. 20 మీ ఒలీవ పండ్లను ఏరుకునేటప్పుడు మీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. 21 మీ ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు మీ వెనకపడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. 22 మీరు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నారని గుర్తుచేసుకోండి. అందుకే ఈ పని చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.”

  42. 8 దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ,

    మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ

    వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే.

    పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే.

    భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి.

    ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

  43. 10 అప్పుడు నా శక్తి అంతటితో నేనిలా అంటాను. యెహోవా, నువ్వు అణచివేతకు గురైన వాళ్ళను బలవంతుల చేతిలో నుండీ, పేదలనూ, అవసరార్థులనూ దోచుకునే వాళ్ళ చేతిలో నుండీ విడిపిస్తావు. నీలాటి వారెవరు?

  44. 12 ఎందుకంటే అక్కరలో ఉన్నవారు మొర పెట్టినప్పుడు అతడు వారికి సహాయం చేస్తాడు. సహాయం దొరకని పేదలను అతడు విడిపిస్తాడు.

    13 నిరుపేదల పట్లా అక్కరలో ఉన్నవారి పట్లా అతడు జాలి చూపుతాడు. పేదల ప్రాణాలను అతడు రక్షిస్తాడు.

    14 బలాత్కారం నుండీ హింస నుండీ అతడు వారి ప్రాణాన్ని విమోచిస్తాడు. వారి ప్రాణం అతని దృష్టికి విలువైనది.

    15 రాజు చిరంజీవి అవుతాడు గాక. షేబ బంగారం అతనికి ఇస్తారు గాక. అతని క్షేమం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు గాక. దేవుడు రోజంతా అతణ్ణి దీవిస్తాడు గాక.

  45. 3 పేదలకు, అనాథలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాథల హక్కులను పరిరక్షించండి.

    4 పేదలనూ దరిద్రులనూ విడిపించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి.

  46. 24 ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారు.

    25 ఔదార్యం చూపేవారు వర్ధిల్లుతారు. నీళ్లు పోసేవాడికి నీళ్లు పోస్తారు.

    26 ధాన్యం అక్రమంగా నిల్వ చేసే వాణ్ణి ప్రజలు శపిస్తారు. దాన్ని సక్రమంగా అమ్మే వాడికి దీవెనలు కలుగుతాయి.

    27 మేలు చేయాలని కోరేవాడు ఉపయోగకరమైన పనులు చేస్తాడు. కీడు చేయాలని కోరుకునే వాడికి కీడే కలుగుతుంది.

  47. 17 మంచి చెయ్యడం నేర్చుకోండి.

    న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి.

    తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి.

    వితంతువు పక్షాన నిలబడండి.

  48. 1 యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. 2 ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు.

    3 “ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.

  49. 2 ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.

  50. 25 మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి. 26 కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. 27 సాతానుకు అవకాశం ఇవ్వకండి. 28 దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి. 29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.

    30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది. 31 సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32 హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

  51. 10 ఆరు సంవత్సరాల పాటు నీ భూమిని దున్ని దాని పంట సమకూర్చుకోవాలి. 11 ఏడవ సంవత్సరం నీ భూమిని బీడుగా వదిలి పెట్టాలి. అప్పుడు మిగిలి ఉన్న పంటను నీ ప్రజల్లోని పేదవారు తీసుకున్న తరువాత మిగిలినది అడవి జంతువులు తినవచ్చు. మీకు చెందిన ద్రాక్ష, ఒలీవ తోటల విషయంలో కూడా ఈ విధంగానే చెయ్యాలి.

  52. 5 పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఆపద కలగడం చూసి సంతోషించేవాడికి శిక్ష తప్పదు.

  53. 20 దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది.

  54. 16 అతడు పేదలకూ అక్కరలో ఉన్నవారికీ న్యాయం జరిగిస్తూ సుఖంగా బతికాడు. అలా చేయడమే నన్ను తెలుసుకోవడం కాదా? ఇది యెహోవా వాక్కు.

  55. 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.

  56. 16 ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.

  57. 15 అన్యాయ తీర్పు తీర్చకూడదు.

    బీదవాడని పక్షపాతం చూపకూడదు.

    గొప్పవాడని అభిమానం చూపకూడదు.

    నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి.

  58. 17 దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి.

    18 అక్కరలో ఉన్నవాణ్ణి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. పీడిత ప్రజల ఆశలు శాశ్వతంగా చెదిరిపోవడం జరగదు.

  59. 5 పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను.

  60. 5 యాకోబు దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడో, తమ దేవుడైన యెహోవా మీద ఎవరు ఆశాభావం పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు.

    6 ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాలనూ, వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టి చేసినవాడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు.

    7 దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు.

    8 యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు.

    9 ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు.

  61. 27 అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు.

    28 నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే “రేపు ఇస్తాను పోయి రా” అనవద్దు.

  62. 2 ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే.

  63. 4 ఎందుకంటే దరిద్రులకు నీవు భద్రతగాను, అవసరతలో ఉన్నవారికి సంరక్షకునిగానూ ఉన్నావు. గాలివానలో ఆశ్రయంగాను వేసవిలో నీడగానూ ఉన్నావు. నిర్దయుల ఊపిరి సెగలాగా గోడకి తగులుతున్న తుఫానులాగా ఉంటే నీవు కవచంగా ఉన్నావు.

  64. 17 దీనులు, అవస్థలో ఉన్నవారు నీటి కోసం వెదుకుతున్నారు. నీళ్లు దొరక్క వారి నాలుక దప్పికతో ఎండిపోతున్నది.

    యెహోవా అనే నేను వారికి జవాబిస్తాను. ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడిచిపెట్టను.

  65. 8 యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,

    9 “సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.

    సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి.

    ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి.

    10 వితంతువులను, తండ్రిలేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకండి. మీ సోదరులకు హృదయంలో కీడు తలపెట్టకండి.”

  66. 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

    6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

    దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

    7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

    బానిస రూపం తీసుకున్నాడు.

    మానవుల పోలికలో కనిపించాడు.

    ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

    8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

    తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

    9-11 అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,

    భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,

    ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,

    దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,

    అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

  67. 17 నేను పేదవాణ్ణి. అవసరాల్లో ఉన్నాను. అయినా ప్రభువు నా గురించి ఆలోచిస్తున్నాడు. నా సహాయం నువ్వే. నన్ను కాపాడటానికి నువ్వు వస్తావు. నా దేవా, ఆలస్యం చేయకు.

  68. 1 హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు. 2 ఒక పేద వితంతువు అతి తక్కువ విలువగల రెండు నాణాలు అందులో వేస్తుంటే చూశాడు. 3 అప్పుడాయన “ఈ పేద వితంతువు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెబుతున్నాను. 4 వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది” అని వారితో చెప్పాడు.

  69. 32 విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. 33 అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్షమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది. 34 భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. 35 వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.

    36 సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు ‘బర్నబా’ అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ‘ఆదరణ పుత్రుడు.’ 37 ఇతడు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

  70. 36 యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. (ఈ పేరు గ్రీకులో దొర్కా, అంటే లేడి). ఈమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ, పేదలను ఆదుకుంటూ ఉండేది.

  71. 22 మీరు మీ పంటపొలం కోసేటప్పుడు పొలం అంచుల్లో పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. పేదవారికి, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.”

  72. 6 యెహోవా అతనికి ఆశ్రయంగా ఉన్నా, ఆ పేదవాణ్ణి నువ్వు అవమానించాలని చూస్తున్నావు.

  73. 16 తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది.

  74. 2-3 క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని, “రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు. 4 యేసు, “మీరు వెళ్ళి, విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి. 5 గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది. 6 నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు.

  75. 38 ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, “ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడవాటి దుస్తులు ధరించి, సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ, 39 సమాజ మందిరాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను కోరుకుంటారు. 40 వారు విధవరాళ్ళ ఇళ్ళను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”

    41 యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. 42 అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది. 43 ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. 44 మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.

  76. 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.

    43 అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు. 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు. 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ, 47 ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు.

  77. 20 “కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.

    అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”

    21 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.

  78. 8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.