21 Bible Verses About True Love

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

Bible Verses About True Love
  1. 9 నా ప్రేయసీ, ఫరో రథపు గుర్రాల్లోని ఆడ గుర్రంతో నిన్ను పోలుస్తాను. 10 ఆభరణాలతో నీ చెక్కిళ్లు, హారాలతో నీ మెడ ఎంత అందంగా ఉంది!

    11 నీకు వెండి పూలతో బంగారు గొలుసులు చేయిస్తాను.

    12 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

    రాజు విందుకు కూర్చుని ఉంటే నా పరిమళం వ్యాపించింది.

    13 నా ప్రియుడు నా స్తనాల మధ్య రాత్రంతా ఉండే బోళం సంచిలా ఉన్నాడు.

    14 ఏన్గెదీ ద్రాక్షాతోటల్లో కర్పూరపు పూగుత్తుల్లాగా నాకు నా ప్రియుడున్నాడు.

    15 (ఆమె ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు)

    ప్రేయసీ, నువ్వు సుందరివి.

    చాలా అందంగా ఉన్నావు.

    నీ కళ్ళు అచ్చం గువ్వ కళ్ళే.

    16 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

    నన్ను ప్రేమిస్తున్న నువ్వు అతిమనోహరుడివి.

    అందగాడివి. పచ్చిక మనకు పాన్పు.

    17 మన ఇంటి దూలాలు దేవదారు వృక్షం మ్రానులు.

    మన వాసాలు సరళ వృక్షం మ్రానులు.

  2. 18 నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి.

    19 అవి, అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండమీద పాము జాడ, నడిసముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ.

  3. 6 నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో.

    ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది.

    మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది.

    దాని మంటలు ఎగిసి పడతాయి.

    అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది.

    7 ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు.

    వరదలు దాన్ని ముంచలేవు.

    ప్రేమ కోసం ఎవడైనా తనకున్నదంతా ఇచ్చేసినా ఆ ప్రయత్నం శుద్ధ దండగ.

  4. 1 (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు)

    ప్రేయసీ, నువ్వెంత అందంగా ఉన్నావు! ప్రియురాలా! నువ్వెంత అందంగా ఉన్నావు!

    నీ ముసుకు గుండా కన్పించే నీ కళ్ళు, గువ్వ కన్నుల్లాగా ఉన్నాయి.

    నీ జుట్టు గిలాదు పర్వతం మీద నుంచి దిగి వస్తున్న మేకల మందలా ఉంది.

    2 ఉన్ని కత్తిరించి, కడిగిన తరువాత పైకి వచ్చిన గొర్రెల్లాగా నీ పళ్ళు ఉన్నాయి.

    ఒక్కటీ పోకుండా అవి జోడుజోడుగా ఉన్నాయి.

    3 నీ అధరాలు ఎరుపు నూలులాగా ఉన్నాయి.

    నీ నోరు మనోజ్ఞంగా ఉంది. నీ ముసుకు గుండా నీ చెక్కిళ్ళు, విచ్చిన దానిమ్మ పండులా కన్పిస్తున్నాయి.

    4 నీ మెడ, వరసల్లో రాళ్ళు పేర్చి కట్టిన దావీదు గోపురంలా ఉంది. దాని మీద వెయ్యి డాలులు వేలాడుతూ ఉన్నాయి. అవన్నీ సైనికుల డాలులే.

    5 నీ రెండు స్తనాలు లిల్లీ పూల మధ్య మేస్తున్న కవల జింకపిల్లల్లా ఉన్నాయి.

    6 తెల్లారే లోపు చీకటి నీడలు తొలిగి పోయేలోగా నేను బోళం కొండకు వెళ్తాను. సాంబ్రాణి కొండకు వెళ్తాను.

    7 ప్రేయసీ, నువ్వు నిలువెల్లా అందమే. నీలో ఏ దోషం లేదు.

    8 కళ్యాణీ, లెబానోను విడిచి నాతో రా. లెబానోను విడిచి నాతో రా.

    అమానా పర్వత శిఖరం నుంచి, శెనీరు హెర్మోను శిఖరాల నుంచి సింహాల గుహలనుంచి, చిరుతపులుండే గుహలున్న కొండలపైనుంచి కిందికి దిగి రా.

    9 నా సోదరీ, వధూ! నువ్వు నా హృదయాన్ని దోచుకున్నావు. నీ హారంలోని ఒక్క ఆభరణంతో నన్ను దోచుకున్నావు.

    10 నా సోదరీ, సఖీ! నీ ప్రేమ ఎంత మధురం! ద్రాక్షారసం కంటే నీ ప్రేమ ఎంత శ్రేష్ఠం!

    నువ్వు పూసుకున్న పరిమళాల వాసన సుగంధ ద్రవ్యాలన్నిటి కన్నా మించినది.

    11 వధూ! నీ పెదాలు తేనెలూరుతున్నాయి. నీ నాలుక కింద తేనె, పాలు తొణికిసలాడుతున్నాయి.

    నీ వస్త్రాల సువాసన లెబానోను సువాసనలాగా ఉంది.

    12 నా సోదరి, నా వధువు మూసి ఉన్న తోట. తాళం పెట్టి ఉన్న తోట. అడ్డు కట్ట వేసిన నీటి ఊట.

    13 నీ కొమ్మలు దానిమ్మతోటలా ఉన్నాయి. దానిలో రక రకాల పళ్ళ చెట్లున్నాయి. గోరింటాకు, జటామాంసి,

    14 కుంకుమ, నిమ్మగడ్డి, దాల్చిన చెక్క, అన్ని రకాల పరిమళతైల వనస్పతులున్నాయి.

    బోళం, అగరు, వివిధ సుగంధ ద్రవ్యాలు అందులో లభిస్తాయి.

    15 నువ్వు ఉద్యాన వనంలోని నీటి ఊట. మంచినీటి బావి. లెబానోను నుంచి ప్రవహించే సెలయేరు.

    16 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ఉత్తర గాలీ, రా! దక్షిణ గాలీ, రా! నా ఉద్యానవనం మీద వీచు.

    వాటి సుగంధాల పరిమళాలను వ్యాపింపనీ. నా ప్రియుడు తన ఉద్యానవనానికి వస్తాడు గాక! దాని శ్రేష్ట ఫలాలను అతడు తింటాడు గాక!

  5. 8 [రెండవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

    నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు.

    పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు.

    9 నా ప్రియుడు జింకలాగా, లేడిపిల్లలాగా ఉన్నాడు.

    చూడు, మన గోడ వెనక నిలబడి ఉన్నాడు.

    కిటికీలోనుంచి చూస్తున్నాడు.

    అల్లిక తడికె గుండా తొంగి చూస్తున్నాడు.

    10 నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు,

    “ప్రియా, లే.

    సుందరీ, నాతో వచ్చెయ్యి.

    11 చలికాలం పోయింది.

    వానలు పడి వెళ్ళిపోయాయి.

    12 దేశమంతా పూలు పూశాయి.

    కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది.

    కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి.

    13 అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి.

    ద్రాక్షచెట్లు పూతపట్టాయి.

    అవి సువాసన ఇస్తున్నాయి.

    ప్రియా, లే.

    సుందరీ, నాతో వచ్చెయ్యి.

    14 బండసందుల్లోని నా పావురమా,

    కొండ మరుగు చరియల్లోని పావురమా,

    నీ ముఖం నన్ను చూడ నివ్వు.

    నీ స్వరం వినిపించు.

    నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.”

    15 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

    మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి.

    తోడేళ్ళను పట్టుకో.

    ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.

    16 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

    నా ప్రియుడు నా వాడు.

    నేను అతని దాన్ని.

    లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.

    17 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

    ప్రియా, వెళ్ళిపో.

    ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో.

    కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.

  6. 2 [నాలుగవ భాగం] (యువతి మాట్లాడుతూ ఉంది)

    నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది.

    నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి.

    నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.”

    3 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)

    నేను బట్టలు తీసేశాను. మళ్ళీ వాటిని వేసుకోవాలా?

    కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ మురికి చేసుకోవాలా?

    4 తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి పెట్టగానే నా గుండె అతని కోసం కొట్టుకుంది.

    5 నా ప్రియుడి కోసం తలుపు తీయడానికి నేను లేచాను.

    నా చేతుల నుంచి బోళం కారుతూ ఉంది. నా వేళ్ళకున్న బోళం తడి తలుపు గడియపై కారింది.

    6 నా ప్రియునికి తలుపు తీశాను. కానీ అతడు వెళ్లిపోయాడు. నేను కుంగిపోయాను. నీరుగారిపోయాను.

    నేనతని కోసం వెతికినా కనబడలేదు. నేనతన్ని పిలిచినా అతడు పలకలేదు.

    7 పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు.

    వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు.

    ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు.

    8 (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

    యెరూషలేము ఆడపడుచులారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, అతనిపట్ల ప్రేమతో నేను సొమ్మసిల్లి పోతున్నానని అతనికి చెప్పమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.

    9 (పట్టణ స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.)

    జగదేక సుందరీ, వేరే ప్రియుల కంటే నీ ప్రియుడి విశేషమేంటి?

    నువ్వు మాచేత ఇలా ప్రమాణం చేయించుకోడానికి వేరే ప్రియుల కంటే నీ ప్రియుడు ఏవిధంగా గొప్ప?

    10 (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

    నా ప్రియుడు చూడ చక్కని వాడు. ఎర్రని వాడు. పదివేలమందిలో ప్రత్యేకమైన వాడు.

    11 అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు.

    12 అతని కళ్ళు నదీతీరాన ఎగిరే గువ్వల్లాంటివి. అవి పాలతో కడిగి, రత్నాలు పొదిగినట్టుగా ఉన్నాయి.

    13 అతని చెక్కిళ్ళు సుగంధమొక్కల తోటలా, కమ్మని సువాసన ఇస్తున్నాయి. అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి.

    14 అతని చేతులు, రత్నాలు పొదిగిన బంగారు కడ్డీలు. అతని ఉదరం పచ్చలు పొదిగిన ఏనుగు దంతం.

    15 అతని కాళ్లు పాలరాతి స్తంభాల్లా ఉన్నాయి. అవి అచ్చమైన బంగారు కుదురు మీద నిలిపినట్టున్నాయి.

    అతని ఆకారం లెబానోను పర్వతాల్లా, దేవదారు వృక్షాల్లా రమ్యం.

  7. 1 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

    నేను కేవలం మైదానంలోని పువ్వును.

    కేవలం లోయలోని లిల్లీ పువ్వును.

    2 (ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు)

    ప్రేయసీ! నువ్వు నా దేశపు యువతుల మధ్య ముళ్ళ చెట్లలో లిల్లీ లాగా ఉన్నావు.

    3 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)

    అడవి చెట్టుల్లో ఆపిల్ వృక్షంలా, యువకుల్లో నా ప్రియుడున్నాడు.

    ఉప్పొంగి పోతూ నేనతని నీడలో కూర్చున్నాను.

    అతని పండు ఎంతో రుచిగా ఉంది.

    4 అతడు నన్ను విందుశాలకు తెచ్చాడు.

    అతని ప్రేమ పతాక స్థాయిలో ఉంది.

    5 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

    ప్రేమ కోసం నేను ఆకలిగా ఉన్నాను.

    ఎండు ద్రాక్షపళ్ళతో నన్ను తెప్పరిల్లజేయండి, ఆపిల్ పళ్ళతో నన్ను ఉత్తేజ పరచండి.

  8. 7 నువ్వు తాడి చెట్టులా తిన్నగా ఉన్నావు.

    నీ స్తనాలు పండ్ల గెలల్లా ఉన్నాయి.

    8 “ఆ తాడి చెట్టు ఎక్కుతాను. దాని కొమ్మలు పట్టుకుంటాను” అనుకున్నాను.

    నీ స్తనాలు ద్రాక్షగెలల్లా, నీ శ్వాస సీమ బాదం వాసనలా ఉండాలి.

    9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి.

    మన పెదాల మధ్య, పళ్ళ మధ్య చక్కగా స్రవిస్తూ ఉండాలి.

    10 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)

    నేను నా ప్రియుడికి చెందిన దాన్ని.

    అతడు నా కోసం తహతహలాడుతున్నాడు.

    11 ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో రాత్రి గడుపుదాం.

    12 పొద్దున్నే లేచి ద్రాక్షతోటలకు వెళదాం. ద్రాక్షావల్లులు చిగిర్చాయో లేదో,

    వాటి పూల గుత్తులు వికసించాయో లేదో దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయో లేదో చూద్దాం పద.

    అక్కడే నీకు నేను నా ప్రేమ పంచుతాను.

    13 మాండ్రేక్ మొక్కలు కమ్మని సువాసనలీనుతున్నాయి.

    మా ఇంటి తలుపు దగ్గర చవులూరించే రక రకాల పళ్ళు కొత్తవీ పాతవీ ఉన్నాయి. ప్రియా, నేను నీ కోసం వాటిని దాచి ఉంచాను.

  9. 1 (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు)

    రాకుమారీ, చెప్పులు తొడిగిన నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! నీ తొడల వంపులు నిపుణుడైన కంసాలి పనితనంతో చేసిన ఆభరణాల్లాగా ఉన్నాయి.

    2 నీ బొడ్డు గుండ్రని కలశంలా ఉంది.

    కలిపిన ద్రాక్షారసం దానిలో ఎప్పుడూ వెలితి కాదు. నీ నడుము లిల్లీ పూలు చుట్టిన గోదుమరాశిలా ఉంది.

    3 నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి.

    4 నీ మెడ దంతగోపురంలా ఉంది.

    నీ కళ్ళు బత్ రబ్బీం ద్వారం దగ్గరున్న హెష్బోను జలాశయాల్లా ఉన్నాయి.

    నీ నాసిక దమస్కు వైపు చూస్తున్న లెబానోను శిఖరంలా ఉంది.

    5 నీ తల కర్మెలు పర్వతంలా ఉంది.

    నీ జుట్టు ముదురు ఊదా రంగు.

    నొక్కులు తిరిగిన ఆ జుట్టుకు రాజు వశమైపోయాడు.

  10. 1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3 పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.

    4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.

    5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.

    6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.

    7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.

    8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.

  11. 7 (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)

    యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి.

    మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.

  12. 21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. 22 ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు.

    23 ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం.

    మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు.

    24 ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు. 25 అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు.

  13. 16 అతని నోరు అత్యంత మధురం. అతడు మూర్తీభవించిన పరిపూర్ణ సౌందర్యం.

    యెరూషలేము ఆడపడుచులారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా నెచ్చెలి.

  14. 6 తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది.

    “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.”

    7 “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది.

    పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది.

    కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం.

    ఆయనకు మహిమ ఆపాదించుదాం.”

    8 ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు.

    ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.

    9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు. 10 అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, “అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను తోటి దాసుణ్ణి మాత్రమే” అన్నాడు.

  15. 18 ప్రేమలో భయం లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయం ఉన్నవాడు ఇంకా ప్రేమలో పరిపూర్ణత పొందలేదు. 19 దేవుడే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం.

  16. 6 నా ప్రేయసీ, నీ హర్షంతో నువ్వెంత అందంగా లలిత లావణ్యంగా ఉన్నావు!

  17. 1 నా ప్రియుణ్ణి గురించి పాడతాను వినండి. అతని ద్రాక్షతోట విషయమై నాకు ఇష్టమైన వాణ్ణి గురించి గానం చేస్తాను. వినండి.

    సారవంతమైన నేల గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉంది.

  18. 16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?

    18 నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం. 19 దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి. 20 మన హృదయం మనపై నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు.

  19. 8 ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ.

  20. 36 “బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.

    37 అందుకు యేసు,

    “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.

    38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.

    39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.

  21. 8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.