జెకర్యా చివరి ప్రవచనాలు (continued)
క్రీ.పూ. 457
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 ఇది దేవోక్తి. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలాన్ని విశాలంగా చేసి, భూమికి పునాది వేసి, మనిషిలో జీవాత్మను పుట్టించినవాడు యెహోవా. 2 ఆయన చెబుతున్నది ఏమిటంటే “నేను యెరూషలేమును చుట్టూ ఉన్న సమస్త ప్రజలందరికీ మత్తు కలిగించే పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమును, యూదా దేశాన్ని కూడా ముట్టడిస్తారు.
3 భూమిపై ఉన్న ఇతర జాతులన్నీ యెరూషలేముకు విరోధంగా సమకూడతాయి. ఆ రోజుల్లో నేను యెరూషలేమును సమస్త జాతులకు బరువైన రాయిగా చేస్తాను, దాన్ని తొలగించాలని చూసేవాళ్ళంతా గాయాలపాలు అవుతారు.” 4 ఇదే యెహోవా వాక్కు. “ఆ దినాన నేను గుర్రాలన్నిటికీ బెదురు, గుర్రపు రౌతులకు వెర్రి పుట్టిస్తాను. యూదావారి విషయం శ్రద్ధ చూపించి, ఇతర ప్రజల గుర్రాలన్నిటికీ గుడ్డితనం కలిగిస్తాను.”
5 అప్పుడు యెరూషలేములోని అధికారులు, నివాసులు “దేవుడైన యెహోవాను నమ్ముకోవడం వల్ల ఆయన మాకు తోడుగా ఉన్నాడు” అని తమ మనస్సుల్లో చెప్పుకుంటారు. 6 ఆ దినాన నేను యూదా అధికారులను కట్టెల కింద మంటగా చేస్తాను, పనల కింద కాగడాగా చేస్తాను, వారు నాలుగు దిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ దహించివేస్తారు. యెరూషలేము నివాసులు తమ స్వస్థలంలో స్థిరంగా నివసిస్తారు.
7 మొదటగా యెహోవా యూదావారి నివాసాలను రక్షిస్తాడు. దావీదు వంశంవారు, యెరూషలేము ప్రజలు తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారిని చిన్నచూపు చూడకుండా ఉండేలా ఆయన ఇలా చేస్తాడు. 8 ఆ కాలంలో యెహోవా యెరూషలేము నివాసులను కాపాడతాడు. వారిలో బలహీనులు దావీదువంటి వారిలాగా, దావీదు వంశీయులు దేవుని వంటివారుగా, ప్రజల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా ఉంటారు. 9 ఆ కాలంలో యెరూషలేము మీదికి దండెత్తే ఇతర దేశాల ప్రజలందరినీ నాశనం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను.
10 అప్పుడు దావీదు వంశీయుల మీదా యెరూషలేములో నివసించే ప్రజల మీదా కరుణ కలిగించే ఆత్మ కోసం విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరిస్తాను. తాము పొడిచిన నన్ను వారు కళ్లారా చూస్తారు. ఒకడు తన ఏకైక కుమారుడు మరణిస్తే దుఃఖించినట్టు, తన జ్యేష్ఠపుత్రుడు మరణిస్తే ఒకడు విలపించినట్టు అతని విషయమై దుఃఖిస్తూ ప్రలాపిస్తారు.
11 మెగిద్దో మైదానంలో హదదిమ్మోను దగ్గర జరిగిన విలాపం వలె ఆ రోజున యెరూషలేములో మహా విలాపం జరుగుతుంది. 12 దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా విలపిస్తారు. దావీదు వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. నాతాను వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. 13 లేవి వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా, షిమీ వంశీయులు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. 14 మిగిలిన అన్ని వంశాలవారు ప్రత్యేకంగా, వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.
13:1 ఆ రోజున పాపాలను, అపవిత్రతను పరిహరించడానికి దావీదు వంశీకుల కోసం, యెరూషలేము నివాసుల కోసం ఒక ఊట తెరవబడుతుంది.
2 ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. ఆ రోజున దేశంలో ఇకపై మరెన్నడూ గుర్తుకు రాకుండా విగ్రహాల నామరూపాలు లేకుండా వాటన్నిటినీ ధ్వంసం చేస్తాను. అన్య దేవుళ్ళ ప్రవక్తలను, అపవిత్రాత్మను దేశంలో లేకుండ చేస్తాను.
3 ఇక ఎవడైనా ఆత్మ పూని ప్రవచనం చెప్పడానికి ప్రయత్నిస్తే వాడి తలిదండ్రులు “నువ్వు యెహోవా నామం పేరట అబద్ధం చెప్తున్నావు కనుక నువ్వు తప్పక చావాలి” అని చెప్పాలి. వాడు ప్రవచనం పలికినప్పుడు వాడి తల్లిదండ్రులే వాణ్ణి పొడిచి చంపాలి.
4 ఆ కాలంలో ప్రతి ప్రవక్త తాము పలికిన ప్రవచనాలను బట్టి, తమకు కలిగిన దర్శనాన్ని బట్టి సిగ్గుపడతారు. ఇకపై ఇతరులను మోసం చేయడానికి గొంగళి ధరించడం మానివేస్తారు. 5 వాడు “నేను ప్రవక్తను కాను, వ్యవసాయం చేసేవాణ్ణి, చిన్నప్పటి నుంచి నన్ను కొన్న ఒకడి దగ్గర పొలం పని చేసేవాడిగా ఉన్నాను” అంటాడు.
6 “నీ చేతులకు ఉన్న గాయాలు ఏమిటి?” అని ఎవరైనా వాణ్ణి అడిగితే “ఇవి నా స్నేహితుల ఇంట్లో ఉన్నప్పుడు నాకు తగిలిన దెబ్బలు” అని వాడు చెబుతాడు.
7 ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదా, నా సన్నిహితుడి మీదా పడు. గొర్రెలు చెదరిపోయేలా వాటి కాపరిని సంహరించు. బలహీనుల మీద నేను నా చెయ్యి ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు.
8 దేశమంతటిలో మూడింట రెండు వంతులవారు నశిస్తారు. మూడవ భాగం మిగిలి ఉంటారు.
9 ఆ మూడవ భాగాన్ని నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుభ్రపరచినట్టు శుద్ధి చేస్తాను. బంగారాన్ని పరీక్షించినట్టు వారిని పరీక్షిస్తాను. వారు నా నామాన్నిబట్టి మొరపెట్టినప్పుడు నేను వారి మొర ఆలకిస్తాను. “వీరు నా ప్రజలు” అని నేనంటాను. “యెహోవా మా దేవుడు” అని వారు అంటారు.
14:1 ఇదిగో వినండి. యెహోవా తీర్పు దినం వచ్చేస్తోంది. ఆ రోజు మీ నుండి దోచుకున్న సొమ్ము మీ పట్టణాల్లోనే పంచిపెడతారు. 2 ఎందుకంటే యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను ఇతర దేశాల ప్రజలను సమకూర్చబోతున్నాను. అప్పుడు పట్టణం శత్రువు చేజిక్కుతుంది. ఇళ్ళు దోచుకుంటారు. స్త్రీలకు మానభంగాలు జరుగుతాయి. నగరంలో సగానికి పైగా బందీలుగా వెళ్ళిపోతారు. మిగిలినవారు నాశనం కాకుండా నగరంలోనే మిగిలిపోతారు.
3 అప్పుడు యెహోవా బయలు దేరతాడు. యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆయన ఆ ఇతర దేశాల ప్రజలతో యుద్ధం చేస్తాడు. 4 ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది.
5 కొండల మధ్య ఏర్పడిన లోయ ఆజీలు వరకు వ్యాపిస్తుంది. మీరు ఆ కొండ లోయగుండా పారిపోతారు. గతంలో యూదా రాజు ఉజ్జియా రోజుల్లో కలిగిన భూకంపానికి భయపడి పారిపోయినట్టు మీరు పారిపోతారు. నీతోబాటు పరిశుద్ధులందరూ వస్తారు. అప్పుడు నా దేవుడు యెహోవా ప్రత్యక్షం అవుతాడు.
6 ఆ రోజున వెలుగు ఉండదు. ప్రకాశించేవన్నీ మసకబారిపోతాయి. 7 అది యెహోవాకు మాత్రమే తెలిసిన రోజు. ఆ రోజు పగలూ కాదు, రాత్రీ కాదు. సాయంత్రం సమయంలో వెలుగు ఉంటుంది.
8 ఆ రోజున జల ప్రవాహాలు యెరూషలేము నుండి ప్రవహిస్తాయి. వాటిలో సగం తూర్పు సముద్రంలోకి, సగం పడమర సముద్రంలోకి ప్రవహిస్తాయి. వేసవికాలంలో, చలికాలంలో కూడా అలాగే జరుగుతుంది. 9 ఆ కాలంలో యెహోవా ఒక్కడే సర్వలోకానికీ రాజుగా, ప్రభువుగా ఉంటాడు. ఆయనకు పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది.
10 అప్పుడు దేశం యెరూషలేము దక్షిణ దిక్కున ఉన్న గెబ నుండి రిమ్మోను వరకు ఉన్న ప్రదేశంగా అవుతుంది. యెరూషలేము మెరక స్థలంలో బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు, అంటే మొదటి ద్వారం అంచు వరకు, హనన్యేలు ద్వారం నుండి రాజు ద్రాక్ష గానుగుల వరకు వ్యాపిస్తుంది. 11 ప్రజలు దానిలో నివసిస్తారు. ఇకపై శాపం వారి పైకి రాదు. యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసిస్తారు.
12 యెహోవా యెరూషలేముపై దండెత్తి యుద్ధం చేసిన ప్రజలపై తెగుళ్లు రప్పించి వాళ్ళను హింసిస్తాడు. ఆ ప్రజలు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్లిపోతాయి. వారి కళ్ళు వాటి కుహరాల్లోనే కుళ్లిపోతాయి. వారి నాలుకలు వారి నోళ్లలోనే కుళ్లిపోతాయి.
13 ఆ రోజున యెహోవా వారి మధ్య భయంకరమైన అయోమయం పుట్టిస్తాడు. వాళ్ళంతా ఒకరికొకరు శత్రువులై ఒకరినొకరు చంపుకుంటారు. 14 యూదా ప్రజలు యెరూషలేము దగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూ ఉన్న ఇతర దేశాల ప్రజలందరి నుండి బంగారం, వెండి, వస్త్రాలు, సంపదలు కొల్లసొమ్ముగా దోచుకుంటారు.
15 అదే విధంగా గుర్రాల మీదా, కంచర గాడిదల మీదా, ఒంటెల మీదా, గాడిదల మీదా, మందలో ఉన్న పశువులన్నిటి మీదా తెగుళ్లు వచ్చి పడతాయి. 16 యెరూషలేము మీదికి వచ్చిన ఇతర దేశాల ప్రజల్లో నాశనం కాకుండా మిగిలిన వారందరూ సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికీ, పర్ణశాల పండగ ఆచరించడానికీ ఏటేటా యెరూషలేముకు వస్తారు.
17 లోకంలో ఉన్న అన్య జాతుల ప్రజల్లో ఎవరైనా సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికి యెరూషలేముకు రాని పక్షంలో వారి ప్రాంతాల్లో వాన కురవదు. 18 ఐగుప్తీయుల కుటుంబాలవారు బయలు దేరకుండా, రాకుండా ఉన్నట్టయితే వారికి వాన కురవకుండా పోతుంది. పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలను యెహోవా తాను నియమించిన తెగుళ్ళతో హింసిస్తాడు. 19 ఐగుప్తీయులకు, పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలందరికీ సంభవించబోయే శిక్ష ఇదే.
20 ఆ కాలంలో గుర్రాల కళ్ళాల పైన “యెహోవాకు ప్రతిష్టితం” అని రాసి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంటపాత్రలను బలిపీఠం ఎదుట ఉన్న గిన్నెల వలె పవిత్రంగా ఎంచుతారు. 21 యెరూషలేములో, యూదా దేశంలో ఉన్న పాత్రలన్నీ సేనల ప్రభువు యెహోవాకు ప్రతిష్టితమౌతాయి. బలి అర్పించినవారు వధించిన దానిలో కావలసినదాన్ని తీసుకుని వంట చేసుకుంటారు. ఆ కాలంలో కనాను జాతివాడు ఎవ్వడూ సేనల ప్రభువు యెహోవా మందిరంలో కనిపించడు.
అర్తహషస్తకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను మొర్దెకై బయటపెట్టడం
21 ఆ రోజుల్లో మొర్దెకై రాజ భవన ద్వారం దగ్గర కూర్చుని ఉన్న సమయంలో రాజుగారి కొలువులో ఉన్న ఇద్దరు నపుంసకులు బిగ్తాను, తెరెషు అనే ద్వారపాలకులు అహష్వేరోషు రాజుపై కోపంతో అతనిని చంపాలని కుట్ర పన్నారు. 22 ఈ సంగతి మొర్దెకైకి తెలిసి అతడు దాన్ని ఎస్తేరురాణితో చెప్పాడు. ఎస్తేరు మొర్దెకై పేరున దాన్ని రాజుకు తెలియజేసింది. 23 ఈ సంగతిని గూర్చి విచారణ జరిపినప్పుడు అది నిజమని తేలింది. అందువల్ల వారిద్దరినీ ఒక చెట్టుకు ఉరి తీశారు. రాజు సమక్షంలో ఈ వివరం రాజ్య వృత్తాంత గ్రంథంలో రాశారు.