హామాను కుట్ర విఫలం కావడం

క్రీ.పూ. 453

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎస్తేరు 3–5

1 ఈ విషయాలు జరిగాక అహష్వేరోషు రాజు హమ్మెదాతా కొడుకు, అగగు వంశం వాడు అయిన హామానుకు పదోన్నతి కలిగించి, అతని అధికార హోదాను తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎక్కువగా చేశాడు. 2 కాబట్టి రాజ భవన ద్వారం దగ్గర ఉండే రాజోద్యోగులంతా రాజాజ్ఞ ప్రకారం మోకాళ్లూని హామానుకు నమస్కరించారు. మొర్దెకై మాత్రం అలా వంగలేదు, సాష్టాంగ పడలేదు. 3 రాజు భవన ద్వారం దగ్గర ఉండేవారంతా అతనితో “నువ్వు రాజాజ్ఞ పాటించవేమిటి?” అని అడిగేవారు. 4 వారు పదే పదే అలా అడిగినా అతడు వారి మాట చెవిని బెట్టలేదు. తాను యూదుడిననీ ఆ కారణంగా తాను ఆ పని చేయలేననీ అతడు వారితో చెప్పాడు. అందుకని అతడు ఆ మాటపై నిలిచి ఉంటాడో లేదో చూద్దాం అని వారు హామానుకు ఈ విషయం తెలియజేశారు.

5 మొర్దెకై తన ముందు మోకరించక పోవడం, వంగి నమస్కరించక పోవడం చూసి హామాను మండిపడ్డాడు. 6 అతడు, మొర్దెకై జాతి ప్రజలు ఎవరో తెలుసుకుని “మొర్దెకైని మాత్రమే చంపితే అందులో గొప్పతనం ఏముంది?” అనుకున్నాడు. ఎందుకంటే అహష్వేరోషు రాజ్యమంతటా ఉన్న మొర్దెకై జాతి ప్రజలైన యూదులనందరినీ తుడిచి పెట్టేయాలని అతడు అనుకున్నాడు. 7 రాజైన అహష్వేరోషు పరిపాలన పన్నెండో సంవత్సరంలో నీసాను అనే మొదటి నెలలో వారు హామాను ఎదుట “పూరు” అంటే చీటిని రోజు రోజుకీ నెల నెలకీ వేశారు. చివరికి అదారు అనే పన్నెండో నెల ఎంపిక అయింది.

8 అప్పుడు హామాను అహష్వేరోషుతో ఇలా చెప్పాడు. “మీ రాజ్య సంస్థానాలన్నింటిలో ఒక జాతి ప్రజలు అక్కడక్కడా నివసిస్తున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వ్యతిరేకం. వారు రాజాజ్ఞలు పాటించరు. కాబట్టి వారిని ఉండనివ్వడం రాజుకు శ్రేయస్కరం కాదు. 9 రాజుకు అంగీకారమైతే వారిని వధించడానికి ఆజ్ఞ ఇవ్వండి. నేను ఈ రాచకార్యాన్ని జరిగించే వారికి ఇరవై వేల మణుగుల వెండిని తూచి రాజు గారి ఖజానాలో ఉంచుతాను.” 10 రాజు తన రాజముద్రిక తీసి దాన్ని హమ్మెదాతా కొడుకు, అగగు వంశీకుడు అయిన హామానుకు ఇచ్చాడు. ఇతడు యూదులకు శత్రువు. 11 “ఆ వెండి నీకు, నీ వారికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. దానితో నువ్వు ఏది అనుకుంటే అది చెయ్యి” అన్నాడు.

12 మొదటి నెల పదమూడో రోజున రాజుగారి లేఖికులను పిలిపించారు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం, రాజు నియమించిన సంస్థానాల అధికారులకు, వివిధ సంస్థానాల పాలకులకు, వివిధ ప్రజల అధికారులకు, ప్రజలందరిపై ఉన్న కార్యనిర్వాహక అధిపతులకు వారి వారి లిపి ప్రకారం, వివిధ ప్రజల భాషల్లో రాసి పంపాలని ఆజ్ఞ అయింది. రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులు తాకీదులు రాశారు. వాటిపై రాజముద్ర వేశారు.

13 అదారు అనే పన్నెండో నెల పదమూడో రోజున యువత మొదలుకుని వృద్ధుల వరకూ, పిల్లలు, స్త్రీలు అనే తేడా లేకుండా యూదులందరినీ ఒక్క రోజే చంపి సమూల నాశనం చేసి వారి సొమ్ము కొల్లగొట్టాలని ఆజ్ఞ రాసి ఉన్న రాజపత్రాలను అంచెల వారీగా వార్తాహరులు రాజ్య సంస్థానాలన్నిటికీ తీసుకు పోయారు.

14 ఆ రోజు కోసం అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపే ఆ ఆజ్ఞ తాలూకు ప్రతులు అన్ని సంస్థానాల ప్రజలందరికీ అందజేశారు. 15 వార్తాహరులు రాజాజ్ఞను చేరవేయడానికి చురుకుగా బయలుదేరి వెళ్లారు. ఈ ఆజ్ఞ షూషను కోటలో కూడా ప్రకటించారు.

రాజు, హామాను విందుకు కూర్చున్నారు. షూషను పట్టణం అంతా గందరగోళంగా ఉంది.

4:1 జరిగినదంతా మొర్దెకై విన్నాడు. అతడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకున్నాడు. నగరం నడిబొడ్డుకు వెళ్లి మహా శోకంతో విలపించాడు. 2 అతడు రాజ భవన ద్వారం వరకూ మాత్రమే వచ్చాడు. ఎందుకంటే గోనె కట్టుకున్న వాడు రాజు ద్వారం గుండా ప్రవేశించకూడదు అనే ఆజ్ఞ ఉంది. 3 రాజాజ్ఞ, శాసనం అందిన సంస్థానాలన్నిటిలో అక్కడి యూదులంతా దుఃఖంలో మునిగిపోయి ఉపవాసం ఉంటూ గొప్ప శోకంతో, రోదనతో ఉన్నారు. చాలా మంది గోనె కట్టుకుని బూడిద పోసుకుని పడి ఉన్నారు. 4 ఎస్తేరు దాసీలు, ఆమె దగ్గరున్న నపుంసకులు వచ్చి జరిగిన సంగతి ఆమెకు తెలియజేశారు. రాణికి చాలా దిగులు కలిగింది. మొర్దెకై కట్టుకున్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి, అతడు కట్టుకోవడానికి బట్టలు పంపించిందిగానీ అతడు వాటిని తీసుకోలేదు.

5 అప్పుడు ఎస్తేరు తనను సేవించడానికి రాజు నియమించిన నపుంసకుల్లో హతాకు అనే వాణ్ణి పిలిచి ఏమి జరిగిందో అదంతా ఎందుకో తెలుసుకుని రమ్మని పంపింది. 6 హతాకు రాజద్వారం ఎదురుగా ఉన్న పట్టణ కూడలిలో మొర్దెకై దగ్గరికి వచ్చాడు. 7 మొర్దెకై తనకు జరిగినదంతా అతనికి వివరించాడు. హామాను యూదులను నాశనం చేయడానికి రాజు ఖజానాకు తూచి ఇస్తానని చెప్పిన సొమ్ము మొత్తం ఇంత అని అతనికి తెలిపాడు. 8 ఎస్తేరుకు చూపించడం కోసం యూదుల ఊచకోతకై షూషనులో విడుదల చేసిన ఆజ్ఞ ప్రతిని కూడా అతనికి ఇచ్చాడు. ఆమె తన జాతి ప్రజల పక్షంగా రాజు సముఖానికి వెళ్లి అతనికి విజ్ఞప్తి చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పాడు.

9 అప్పుడు హతాకు వెళ్లి మొర్దెకై చెప్పినదంతా ఎస్తేరుకు తెలియజేశాడు. 10 అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకుతో ఇలా చెప్పి పంపింది. 11 “పిలుపు రాకుండా పురుషుడు గానీ స్త్రీ గానీ రాజు గారి అంతఃపురం లోకి అడుగు పెడితే చట్ట ప్రకారం ఆ మనిషికి శిక్ష మరణమే. రాజు తన బంగారు రాజ దండాన్ని ఎవరివైపు చాపుతాడో ఆ వ్యక్తి మాత్రమే బ్రతుకుతాడు. ఈ కఠినమైన ఆజ్ఞ రాజసేవకులందరికీ రాజ సంస్థానాల్లోని వారందరికీ తెలుసు. ముప్ఫై రోజులుగా రాజు సముఖానికి వెళ్ళడానికి నాకు పిలుపు రాలేదు.”

12 హతాకు ఎస్తేరు మాటలు మొర్దెకైకి తెలిపాడు. 13 మొర్దెకై ఎస్తేరుకు ఇలా కబురంపాడు. “రాజ భవనంలో ఉన్నంత మాత్రాన ఇతర యూదులకు భిన్నంగా నువ్వు తప్పించుకుంటావనుకోవద్దు. 14 నువ్వు ఈ సమయంలో ఏమీ మాట్లాడక పోతే యూదులకు సహాయం, విడుదల వేరొక దిక్కునుండి వస్తుంది. అయితే నువ్వూ నీ తండ్రి వంశమూ నశిస్తారు. నువ్వొకవేళ ఇలాటి తరుణం కోసమే ఈ రాజరికానికి వచ్చావేమో ఎవరికి తెలుసు?”

15 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఇలా చెప్పి పంపింది. 16 “షూషనులో ఉన్న యూదులందరినీ సమకూర్చి నాకోసం ఉపవాసముండేలా చెయ్యి. మూడు రోజులు ఏమీ తినవద్దు, తాగవద్దు. నేనూ నా దాసీలు కూడా ఉపవాసం ఉంటాము. చట్టవ్యతిరేకం అయినప్పటికీ నేను రాజు దగ్గరికి వెళ్తాను. నేను నశిస్తే నశిస్తాను.”

17 మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినదంతా చేశాడు.

5:1 మూడో రోజున ఎస్తేరు రాణివస్త్రాలు ధరించుకుని రాజభవనం ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలబడింది. రాజనగరు ద్వారానికి ఎదురుగా ఉన్న ఆవరణంలో రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. 2 ఎస్తేరురాణి ఆవరణంలో నిలబడి ఉండడం రాజు చూశాడు. అతనికి ఆమెపై ఇష్టం పుట్టింది. రాజు తన చేతిలోని బంగారపు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం కొనను తాకింది.

3 రాజు “రాణివైన ఎస్తేరూ, నీకేమి కావాలి? నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యం కోరినా సరే, నీకు ఇచ్చేస్తాను” అన్నాడు. 4 అప్పుడు ఎస్తేరు “రాజుకు సమంజసం అనిపిస్తే నేను రాజు కోసం ఏర్పాటు చేయించిన విందుకు రాజైన మీరూ హామానూ ఈ రోజు రావాలని నా కోరిక” అంది. 5 అప్పుడు రాజు “ఎస్తేరు అడిగిన ప్రకారం జరిగేలా హామానును కూడా త్వరగా తెండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు, హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చారు.

6 విందులో ద్రాక్షారసం పోస్తుండగా రాజు ఎస్తేరుతో “నీ కోరిక ఏమిటి? దాన్ని తీరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే, నీకు ఇస్తాను” అని చెప్పాడు. 7 ఎస్తేరు ఇలా బదులు ఇచ్చింది “రాజైన మీకు నాపై అనుగ్రహం కలిగితే, నా మనవి ప్రకారం చేయడం రాజైన మీకు అనుకూలమైతే, 8 రాజైన మీరూ హామానూ రేపు కూడా మీ కోసం నేను చేయించబోయే విందుకు రావాలి. మీ ప్రశ్నకు జవాబు అప్పుడు ఇస్తాను.”

9 ఆ రోజు హామాను సంతోషంగా ఉల్లాసంగా బయలుదేరాడు. రాజు భవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి లేచి నిలబడక పోవడం, అసలు ఎలాటి భయం చూపకపోవడం చూసి మొర్దెకై మీద మండిపడ్డాడు. 10 అయితే అతడు కోపం అణచుకుని ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య జెరెషును పిలిపించాడు. 11 తన ఐశ్వర్య వైభవాల గురించి, తనకున్న చాలామంది కొడుకుల గురించి, రాజు తనని రాజోద్యోగులందరి కంటే, రాజసేవకులందరి కంటే ఎలా ఉన్నత స్థాయిలో ఉంచాడో వారికి వివరించాడు.

12 ఇంకా అతడు “ఎస్తేరు రాణి తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరి ఎవరినీ పిలవ లేదు. రేపు కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు ఆహ్వానం అందింది” అని చెప్పాడు. 13 “అయితే యూదుడైన మొర్దెకై రాజభవన ద్వారం దగ్గర కూర్చుని ఉండడం నేను చూస్తున్నంత కాలం ఈ పదవి అంతటి వలనా నాకు ప్రయోజనమేముంది?” అని అతడు అన్నాడు.

14 అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరూ “50 మూరల ఎత్తున్న ఉరికొయ్య ఒకటి చేయించు. దాని మీద మొర్దెకైని ఉరి తీసేలా రేపు రాజుకు మనవి చెయ్యి. ఆపైన సంతోషంగా రాజుతో కలిసి విందుకు పోవచ్చు” అని అతనితో చెప్పారు. ఈ సంగతి హామానుకు సముచితంగా తోచింది. అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు.