హామాను కుట్ర విఫలం కావడం (continued)
క్రీ.పూ. 453
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. అతడు తన పరిపాలన విశేషాలు రాసి ఉండే గ్రంథం తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు తెచ్చి దాన్ని రాజుకు చదివి వినిపించారు. 2 ద్వారపాలకులు బిగ్తాను, తెరెషు అనే ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపడానికి కుట్ర పన్నిన సంగతి మొర్దెకై బయట పెట్టి తెలియజేసినట్టు అందులో రాసి ఉంది.
3 రాజు ఆ సంగతి విని “మరి దీని కోసం మొర్దెకైకి సన్మానంగా, గుర్తింపుగా ఏదైనా చేశామా?” అని అడిగాడు. రాజు సేవకులు “అతనికేమీ చేయలేదు” అని జవాబిచ్చారు. 4 అప్పుడు “ఆవరణంలో ఉన్నది ఎవరు?” అని రాజు అడిగాడు. అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయించడానికి రాజు అనుమతి అడగడానికి రాజ భవంతి ఆవరణంలోకి వచ్చి ఉన్నాడు. 5 రాజ సేవకులు “అయ్యా, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడు” అని రాజుతో చెప్పారు. రాజు “అతన్ని రానియ్యండి” అన్నాడు. హామాను లోపలికి వచ్చాడు.
6 “రాజు ఎవరినైనా గొప్ప చేసి సత్కరించాలనుకుంటే ఏమి చేయాలి?” అని రాజు అతన్ని అడిగాడు. హామాను “నన్ను గాక రాజు మరి ఇంకెవరిని గొప్ప చేయాలనుకుంటాడు?” అని తనలో తాను అనుకుని రాజుతో ఇలా అన్నాడు, 7 “రాజు సత్కరించాలని కోరిన వాడికి ఇలా చెయ్యాలి. 8 రాజు ధరించుకునే రాజవస్త్రాలను, రాజు ఎక్కే గుర్రాన్ని, రాజు తన తలపై పెట్టుకునే రాజకిరీటాన్ని తేవాలి. 9 ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీరాజు ఉన్నతాధికారుల్లో ఒకడికి అప్పగించాలి. రాజు గొప్ప చేయాలని కోరుకున్న వ్యక్తికి ఆ వస్త్రాలు తొడిగి ఆ గుర్రం మీద అతణ్ణి ఎక్కించి రాజవీధిలో ఊరేగిస్తూ ‘రాజు గొప్ప చేయాలని కోరిన వాడికి ఈ విధంగా చేస్తారు’ అని అతని ముందు నడుస్తూ చాటించాలి.”
10 వెంటనే రాజు “అయితే తొందరగా వెళ్లి నువ్వు చెప్పినట్టే ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీ తీసుకుని రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి ఆ విధంగా చెయ్యి. నువ్వు చెప్పిన వాటిలో ఏదీ తక్కువ కానియ్యకుండా అంతా చెయ్యి” అని హామానుకు ఆజ్ఞాపించాడు. 11 హామాను ఆ వస్త్రాలను, గుర్రాన్నీ తెచ్చి మొర్దెకైకి ఆ బట్టలు తొడిగి ఆ గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి రాజ వీధిలో నడిపిస్తూ “రాజు గొప్ప చేయాలని కోరే వాడికి ఇలా జరుగుతుంది” అని అతని ముందర నడుస్తూ చాటించాడు.
12 తరువాత మొర్దెకై రాజు ద్వారం దగ్గరికి తిరిగి వచ్చాడు. హామాను మాత్రం తలపై గుడ్డ కప్పుకుని హతాశుడై గబగబా ఇంటికి వెళ్లి పోయాడు. 13 హామాను తనకు పట్టిన గతి తన భార్య జెరెషుకు, తన స్నేహితులందరికీ చెప్పాడు. అతని దగ్గర ఉన్న జ్ఞానులు, అతని భార్య జెరెషు “ఎవరి ఎదుట నీవు పడిపోవడం మొదలయిందో ఆ మొర్దెకై యూదు జాతివాడైతే గనక అతన్ని నీవు ఓడించలేవు. అతని చేతుల్లో నీకు పతనం తప్పదు” అని అతనితో అన్నారు.
14 వారు ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజుగారి ఉద్యోగులు వచ్చి ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు రమ్మని హామానును తొందర పెట్టారు.
7:1 రాజు, హామాను రెండవ రోజు ఎస్తేరు రాణి దగ్గరికి విందుకు వచ్చారు. 2 రాజు “ఎస్తేరు రాణీ, నీ విన్నపం ఏమిటి? అది నెరవేరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే నీకు ఇస్తాను” అని ద్రాక్షారసం పోస్తూ ఉండగా ఎస్తేరుతో అన్నాడు.
3 అప్పుడు ఎస్తేరు రాణి ఇలా జవాబిచ్చింది “రాజా, నీ అనుగ్రహానికి నేను నోచుకుంటే రాజువైన తమకు అంగీకారం అయితే, నా ప్రాణం నిలిచేలా చేయండి. ఇదే నా నివేదన. నా జాతి ప్రజల ప్రాణాల విషయంలో కూడా నేను వేడుకుంటున్నాను. 4 నేను, నా జాతి ప్రజలు, సమూల నాశనానికి, సంహారానికి, తుడిచి పెట్టి వేయడానికి అమ్ముడుబోయాము. మేమంతా ఆడ, మగ బానిసలుగా అమ్ముడుబోయినట్టైతే నేను నోరు విప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆ మాత్రం ఇబ్బందికి రాజువైన మీకు బాధ ఇవ్వడం భావ్యం కాదు గదా.”
5 అందుకు రాజైన అహష్వేరోషు “వాడెవడు? ఈ పని చేయడానికి సాహసించిన వాడెక్కడ?” అని ఎస్తేరు రాణిని అడిగాడు. 6 ఎస్తేరు “మా విరోధి అయిన ఆ శత్రువు, దుష్టుడైన ఈ హామానే” అంది. అప్పుడు రాజు, రాణి ముందు హమానుకు ముచ్చెమటలు పోశాయి. 7 రాజు పట్టరాని కోపంతో ద్రాక్షారసం విందును విడిచి చరచరా అంతఃపురం తోటలోకి వెళ్ళాడు. అయితే రాజు తనను సర్వనాశనం చేసే ఆలోచన చేస్తున్నాడని హమాను భయపడ్డాడు. అతడు తన ప్రాణాలు కాపాడమని ఎస్తేరు రాణిని ప్రాధేయ పడసాగాడు.
8 అంతఃపురం తోటలోనుండి ద్రాక్షారసం విందు స్థలానికి రాజు తిరిగి వచ్చి ఎస్తేరు కూర్చున్న తల్పం మీద హామాను పడి ఉండడం చూశాడు. “వీడు నా ఇంట్లో నేను చూస్తుండగానే రాణిని బలాత్కారం చేస్తాడా?” అన్నాడు. ఆ మాట రాజు నోట రాగానే సైనికులు హామాను ముఖానికి ముసుకు వేశారు. 9 రాజు సముఖంలో ఉన్న అధికారుల్లో హర్బోనా అనే వాడు “అయ్యా, రాజు ప్రాణాలు కాపాడేందుకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయాలని ఈ హామాను 50 మూరల ఎత్తున్న ఉరి కొయ్య ఒకటి చేయించాడు. అది హామాను ఇంటి దగ్గర ఉంది” అని చెప్పాడు. వెంటనే రాజు “దాని మీద వీడిని ఉరి తీయండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
10 ఆ విధంగా హామాను మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వాళ్ళు అతడినే ఉరి తీశారు. అప్పుడు రాజు ఆగ్రహం చల్లారింది.
8:1 ఆ రోజు అహష్వేరోషు రాజు యూదుల శత్రువు హామాను ఇంటిని ఎస్తేరు రాణికి ఇచ్చేశాడు. మొర్దెకైతో తన బంధుత్వం గురించి ఎస్తేరు రాజుకు తెలియజేసింది. 2 అతడు రాజు సన్నిధికి వచ్చినప్పుడు రాజు హామాను చేతిలోనుండి తీసుకున్న తన ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిపై అధికారిగా ఉంచింది.
3 ఎస్తేరు రాజు పాదాలపై పడి విన్నపం చేస్తూ “అగగు వంశీకుడు హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన కార్యాన్ని రద్దు చేయండి” అని కన్నీటితో అతణ్ణి వేడుకుంది. 4 రాజు తన బంగారు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. 5 ఎస్తేరు రాజు ముందు నిలబడి “రాజైన మీకు అంగీకారం అయితే, మీ అనుగ్రహం నాపై ఉంటే, ఈ సంగతి మీకు సమంజసంగా అనిపిస్తే, నేనంటే మీకు ఇష్టమైతే, హమ్మెదాతా కొడుకు, అగగు వంశీకుడు అయిన హామాను రాయించిన శాసనాలు అమలు కాకుండా వాటి రద్దుకు ఆజ్ఞ ఇవ్వండి. 6 నా స్వజనం మీదికి రాబోతున్న కీడును, నా వంశ నాశనాన్ని చూసి నేనెలా సహించ గలను” అని మనవి చేసింది.
7 అహష్వేరోషు రాజు రాణి అయిన ఎస్తేరుకు, మొర్దెకైకి ఇలా చెప్పాడు. “హామాను ఇంటిని ఎస్తేరుకు ఇచ్చాను. అతడు యూదులను హతమార్చడానికి ప్రయత్నించినందు వల్ల అతడు ఉరికొయ్య మీద వేలాడి చనిపోయాడు. 8 అయితే రాజు పేరున రాసి రాజ ముద్రిక వేసిన శాసనాన్ని మానవ మాత్రుడెవరూ మార్చలేడు. కాబట్టి మీకిష్టమైనట్టు మీరు రాజునైన నా పేర యూదులకు అనుకూలంగా వేరొక శాసనం రాయించి రాజ ముద్రికతో ముద్రించండి.”
9 సీవాను అనే మూడో నెలలో ఇరవై మూడో రోజున రాజుగారి లేఖికులను పిలిచారు. మొర్దెకై ఆజ్ఞాపించినట్టు యూదులకు, ఇండియా నుండి ఇతియోపియా వరకూ విస్తరించిన 127 సంస్థానాల్లోని అధిపతులకు, అధికారులకు, వివిధ సంస్థానాలకు వాటి లిపిలో, వాటి భాషల్లో శాసనాలు రాశారు. 10 మొర్దెకై అహష్వేరోషు పేర శాసనాలు రాయించి రాజముద్రికతో ముద్రించాడు. గుర్రాలపై, అంటే రాచకార్యాలకు వినియోగించే మేలు జాతి అశ్వాలపై అంచెలుగా ప్రయాణించే వార్తాహరులతో ఆ శాసనాలను పంపించాడు. 11 “రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో ఒక్క రోజునే అంటే అదారు అనే పన్నెండో నెల పదమూడో తేదీన అన్ని పట్టణాల్లో నివసించే యూదులు సమకూడాలి. తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు అన్ని చోట్లా తమకు విరోధులైన వారి సైనికులందరిని, బాలలను, స్త్రీలను కూడా, హతం చేసి, సర్వనాశనం చెయ్యాలి. 12 వారి సొత్తు అంతటినీ కొల్లగొట్టాలి, అని రాజు యూదులకు ఆజ్ఞాపించాడు” అని దానిలో రాశారు.
13 ఈ శాసనాల ప్రతులు రాయించి అన్ని సంస్థానాల ప్రజానీకానికి పంపించాలని, యూదులు తమ శత్రువులపై పగ తీర్చుకొనేందుకు ఒకానొక రోజున సిద్ధంగా ఉండాలనీ ఆజ్ఞ జారీ అయింది. 14 రాచ కార్యాల కోసం వినియోగించే మేలుజాతి అశ్వాలపై అంచె వార్తాహరులు రాజాజ్ఞ పొంది అతివేగంగా బయలుదేరారు. ఆ తాకీదును షూషను కోటలో కూడా ఇచ్చారు.
15 అప్పుడు మొర్దెకై నేరేడు, తెలుపు వర్ణాలు గల రాజవస్త్రం, పెద్ద స్వర్ణ కిరీటం, శ్రేష్ఠమైన నారతో చేసిన ఊదా రంగు బట్టలు ధరించి రాజు సముఖం నుండి బయలుదేరాడు. ఈ కారణంగా షూషను నగరంలో సంబరం కలిగింది. 16 యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి. 17 రాజు చేసిన తీర్మానం, అతని చట్టం అందిన ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో యూదులకు ఆనందం, సంతోషం కలిగాయి. వారంతా పండగ చేసుకున్నారు. అందరికీ యూదులంటే భయం వేసింది. కాబట్టి చాలామంది యూదులయ్యారు.