జెకర్యా చివరి ప్రవచనాలు

క్రీ.పూ. 457

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

జెకర్యా 9–11

1 హద్రాకు దేశాన్ని గూర్చి, దమస్కు పట్టణాన్ని గూర్చి వచ్చిన దేవోక్తి. 2 ఎందుకంటే యెహోవా మనుషులందరినీ ఇశ్రాయేలీ గోత్రాల వారినందరినీ లక్ష్యపెట్టేవాడు గనుక, దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతును గూర్చి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చి ఆ సందేశం వచ్చింది.

3 తూరు పట్టణం వారు ప్రాకారాలు గల కోట కట్టుకుని, ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని, వీధుల్లోని కసువంత విస్తారంగా బంగారాన్ని సమకూర్చుకున్నారు. 4 సముద్రంలో ఉన్న దాని బలాన్ని యెహోవా నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగిస్తాడు. అది తగలబడి పోతుంది.

5 అష్కెలోను దాన్ని చూసి బెదిరిపోతుంది. గాజా దాన్ని చూసి వణికిపోతుంది. ఎక్రోను పట్టణం తాను దేనిపై నమ్మకం పెట్టుకుందో దాని పరువు పోవడం చూసి భీతిల్లుతుంది. గాజాలో ఉన్న రాజు అంతరిస్తాడు. అష్కెలోను నిర్జనమై పోతుంది. 6 అష్డోదులో సంకర జాతి వారు కాపురం ఉంటారు. ఫిలిష్తీయుల గర్వ కారణాన్ని నేను నాశనం చేస్తాను.

7 వారి నోటి నుండి రక్తాన్ని, వారు తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసాన్ని నేను తీసివేస్తాను. అప్పుడు వారు మన దేవునికి యూదా గోత్రం వలె శేషంగా ఉంటారు. ఎక్రోను వారు కూడా యెబూసీయుల్లాగా ఉంటారు. 8 నేను కన్నులారా చూశాను గనక బాధించేవారు ఇకపై సంచరించకుండా, తిరుగులాడే సైన్యాలు నా మందిరం మీదికి రాకుండా దాన్ని కాపాడుకోడానికి నేనొక సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను.

9 సీయోను నివాసులారా, సంతోషించండి.

యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి.

నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై,

గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు.

10 నేను ఎఫ్రాయిములో రథాలుండకుండా చేస్తాను.

యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాను.

యుద్ధపు విల్లు లేకుండా పోతుంది.

నీ రాజు సమాధానవార్త అన్యప్రజలకు తెలియజేస్తాడు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకూ యూఫ్రటీసు నది మొదలు భూదిగంతం వరకూ అతడు పరిపాలిస్తాడు. 11 నీవు చేసిన నిబంధన రక్తాన్ని బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపిస్తాను. 12 బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గల మీరంతా మీ కోటలో మళ్ళీ ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేస్తానని ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను.

13 యూదా వారిని నాకు విల్లుగా వంచుతున్నాను. ఎఫ్రాయిము వారిని బాణాలుగా చేస్తున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుతున్నాను. శూరుడు కత్తి ఝలిపించినట్టు నేను నిన్ను ప్రయోగిస్తాను. గ్రీసు దేశవాసులారా, సీయోను కుమారులను మీ మీదికి రేపుతున్నాను.

14 యెహోవా వారికి పైగా ప్రత్యక్షమౌతాడు. ఆయన బాణాలు మెరుపువలె వెలువడుతాయి. ప్రభువగు యెహోవా శంఖం పూరిస్తూ దక్షిణ దిక్కునుండి వచ్చే గొప్ప సుడిగాలితో బయలు దేరుతాడు.

15 సేనల ప్రభువు యెహోవా వారిని కాపాడుతాడు గనక వారు భక్షిస్తూ వడిసెలరాళ్లను అణగ దొక్కుతూ వస్తారు. ద్రాక్షారసం తాగుతూ, తాగడం మూలంగా సింహనాదాలు చేస్తూ, బలిపీఠపు మూలల్లో పెట్టి ఉన్న పాత్రలు రక్తంతో నిండినట్లు నిండిపోతారు.

16 నా ప్రజలు యెహోవా దేశంలో కిరీటంలోని రత్నాల్లా ఉన్నారు గనక కాపరి తన మందను రక్షించినట్టు వారి దేవుడైన యెహోవా ఆ దినాన వారిని రక్షిస్తాడు.

17 అది ఎంత రమ్యంగా మేలుగా ఉంటుంది! ధాన్యం చేత యువకులు, కొత్త ద్రాక్షారసం చేత కన్యలు పుష్టిగా ఉంటారు.

10:1 కడవరి వాన కాలంలో వర్షం దయచేయమని యెహోవాను వేడుకోండి. ఆకాశంలో మెరుపులు పుట్టేలా చేసేవాడు యెహోవాయే. ఆయన ప్రతి ఒక్కరి పొలంలో పంటలు పెరిగేలా సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడు.

2 గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికాయి. సోదె చెప్పేవాళ్ళకు వ్యర్ధమైన కలలు వచ్చాయి. వాళ్ళు కపటంతో ఆ కలలకు అర్థం చెప్పారు. మోసపూరిత భావాలు చెప్పి ఓదార్చారు. కాబట్టి ప్రజలు గొర్రెల మంద తిరిగినట్టు తిరిగారు. తమను కాచే కాపరి లేకపోవడం వల్ల బాధల పాలయ్యారు.

3 “కాపరులపై నా కోపాగ్ని మండుతున్నది. మందలో మేకలను నేను శిక్షిస్తాను” అని సేనల ప్రభువు యెహోవా అంటున్నాడు. ఆయన తన మందయైన యూదా ప్రజలను దర్శించి వాళ్ళను తన యుద్ధాశ్వాలుగా మలుచుకుంటాడు.

4 ఆ వంశంలో నుంచి మూలరాయి పుడుతుంది. గుడారపు మేకు, యుద్ధ ధనుస్సు వారి నుండి పుడతాయి. యుద్ధ నేర్పు గలవాడు వారిలో నుండి పుడతాడు. 5 వారు పరాక్రమంతో యుద్ధం చేస్తూ శత్రువులను వీధుల్లోని బురదలో తొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉంటాడు కనుక వారు యుద్ధం చేసినప్పుడు గుర్రపు రౌతులు సిగ్గు పడి పరాజయం పాలౌతారు.

6 నేను యూదా ప్రజలను బలపరుస్తాను. యోసేపు సంతానానికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలం ఇస్తాను. నేను వారిపట్ల కనికరం చూపుతాను. నేను వారి ప్రార్థన ఆలకిస్తాను కనుక నేను వాళ్ళను నిరాకరించిన విషయం మరచిపోతారు. నేను వారి దేవుడనైన యెహోవాను,

7 ఎఫ్రాయిము ప్రజలు మహా బలవంతులు అవుతారు. ద్రాక్షారసం తాగిన వాళ్ళు సంతోషం పొందినట్టు వాళ్ళు తమ హృదయాల్లో ఆనందిస్తారు. అది చూసిన వారి సంతానం ఆనందపడతారు. వాళ్ళు యెహోవా చేసిన దాన్నిబట్టి హృదయపూర్వకంగా సంతోషిస్తారు.

8 నేను వారిని విమోచించాను కనుక ఈల వేసి పిలిచి వాళ్ళను సమకూరుస్తాను. ఇంతకు ముందు విస్తరించినట్టు వాళ్ళు అభివృద్ది చెందుతారు. 9 నేను వాళ్ళను ఇతర దేశాలకు చెదరగొట్టినప్పటికీ వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసికొంటారు. వారూ, వారి సంతానం సజీవులుగా తిరిగి చేరుకుంటారు.

10 నేను వాళ్ళను ఐగుప్తు దేశం నుండి తిరిగి తీసుకు వస్తాను. అష్షూరు దేశం నుండి వాళ్ళను సమకూరుస్తాను. గిలాదు, లెబానోను దేశాల్లో ఎక్కడా స్థలం చాలనంత విస్తారమైన జనాంగాన్ని తోడుకుని వస్తాను.

11 వాళ్ళు దుఃఖసముద్రం దాటవలసి వచ్చినప్పుడు సముద్రపు అలలు అణగారి పోతాయి. నైలునదిలోని లోతైన స్థలాలను ఆయన ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరీయుల గర్వం అణిగి పోతుంది, ఐగుప్తీయుల నుండి రాజరికం తొలిగి పోతుంది. 12 నేను వాళ్ళను యెహోవా నామం పేరిట బలపరుస్తాను. ఆయన పేరు స్మరించుకుంటూ వారు కొనసాగుతారు. ఇది యెహోవా వాక్కు.

11:1 లెబానోనూ, నీ ద్వారాలు తెరిచి ఉంచు. అగ్నికణాలు వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేస్తాయి.

2 దేవదారు చెట్లు కూలిపోయాయి. మహా వృక్షాలు నాశనమయ్యాయి. సరళవృక్షాల్లారా, విలపించండి. ఎందుకంటే దట్టమైన అడవి నరకబడింది. సింధూర వృక్షాల్లారా, విలపించండి.

3 గొర్రెల కాపరుల రోదన శబ్దం వినిపిస్తుంది. ఎందుకంటే వారి శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలు నాశనం అయ్యాయి. కొదమ సింహాల గర్జన వినబడుతున్నది. ఎందుకంటే యొర్దాను లోయలోని అడవులు పాడైపోయాయి.

4 నా దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందను మేపు. 5 వాటిని కొనుక్కున్న వాళ్ళు చంపినప్పటికీ నేరం అంటని వాళ్ళమేనని అనుకుంటారు. వాటిని అమ్మిన వారు ‘మాకు చాలా ధనం దొరుకుతుంది, యెహోవాకు స్తోత్రం’ అని చెప్పుకుంటారు. వాటిని కావలి కాచేవారు వాటి పట్ల జాలి చూపించరు.”

6 ఇదే యెహోవా వాక్కు. “ఇకపై నేను ఈ దేశనివాసులపై కనికరం చూపించను. ఒకరి చేతికి ఒకరిని వశపరుస్తాను. వాళ్ళ రాజుల చేతికి వాళ్ళందరినీ అప్పగిస్తాను. ఆ రాజులు దేశాన్ని నాశనం చేసినప్పుడు వాళ్ళ చేతిలోనుండి నేనెవరినీ విడిపించను.”

7 కాబట్టి నేను రెండు కర్రలు తీసుకున్నాను. ఒక దాని పేరు “అనుగ్రహం.” రెండవ దాని పేరు “ఐక్యం.” వధకు సిద్ధంగా ఉన్న వాటిలో బలహీనమైన వాటికి కాపరినయ్యాను. 8 నేను ఒక నెలలో ముగ్గురు కాపరులను తొలగించాను. ఎందుకంటే వాళ్ళు నా విషయంలో నీచంగా ప్రవర్తించారు. నేను వారి విషయంలో సహనం కనపరచ లేకపోయాను.

9 కనుక “నేను ఇకపై మీకు కాపరిగా ఉండను. చావబోయేవారు చనిపోవచ్చు, నాశనం అయ్యేవారు నశించిపోవచ్చు. మిగిలిన వారు ఒకరి శరీరం ఒకరు తినవచ్చు” అని చెప్పాను. 10 ప్రజలందరితో నేను చేసిన ఒడంబడిక రద్దు చేసిన దానికి సూచనగా “అనుగ్రహం” అనే కర్రను తీసుకుని దాన్ని విరిచివేశాను. 11 దాన్ని విరిచిన రోజున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బాధలు అనుభవిస్తూ, నన్ను కనిపెట్టి చూస్తూ ఉన్నవారికి తెలిసింది.

12 నేను వాళ్ళతో “మీకు అనుకూలంగా ఉంటే నా జీతం నాకు ఇవ్వండి, లేకపోతే మానివెయ్యండి” అన్నాను. అప్పుడు వాళ్ళు నా జీతంగా 30 వెండి నాణాలు ఇచ్చారు. 13 అప్పుడు యెహోవా తిరస్కారంగా “వాళ్ళు నాకు అపురూపంగా ఇచ్చిన దాన్ని కుమ్మరికి పారవెయ్యి” అని నాకు ఆజ్ఞ ఇవ్వగా నేను ఆ 30 వెండి నాణేలను యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.

14 తరువాత నేను యూదా వారికి, ఇశ్రాయేలు వారికి మధ్య ఉన్న సహోదర బంధానికి భగ్నం కలిగేలా “ఐక్యం” అనే నా రెండవ కర్రను తీసుకుని దాన్ని విరగగొట్టాను. 15 అప్పుడు యెహోవా నాకు చెప్పినదేమిటంటే “మరోసారి కాపరి సామాన్లు తీసుకుని బుద్ధిలేని కాపరి వలే ప్రవర్తించు. 16 ఎందుకంటే నేను దేశంలో ఒక కాపరిని నియమించబోతున్నాను. అతడు నశించిపోయే గొర్రెలను లక్ష్యపెట్టడు. చెదరిపోయిన వాటిని వెదకడు. గాయపడిన వాటిని బాగుచేయడు. ఆరోగ్యంగా ఉన్నవాటిని పోషించడు. అయితే కొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసం తింటూ ఉంటాడు.

17 మందను విడిచిపెట్టే పనికిమాలిన కాపరికి బాధ తప్పదు. వాడి చెయ్యి, కుడి కన్ను కత్తివేటుకు గురౌతాయి. వాడి చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది, వాడి కుడి కన్ను గుడ్డిదైపోతుంది.”