దేవాలయ పని తిరిగి ప్రారంభం (continued)

క్రీ.పూ. 520

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

జెకర్యా 2–6

1 తరువాత నేను కన్నులెత్తి చూసినప్పుడు చేతిలో కొలనూలు పట్టుకుని ఉన్న ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. 2 “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?” అని నేను అతణ్ణి అడిగాను. అతడు “యెరూషలేము పట్టణం పొడవు, వెడల్పు ఎంత ఉందో చూసి కొలవడానికి వెళ్తున్నాను” అని చెప్పాడు. 3 అప్పుడు నాతో మాట్లాడిన దూత బయలుదేరుతున్నప్పుడు మరో దూత అతనికి ఎదురు వచ్చాడు.

4 ఆ దూత మొదటి దూతతో “నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్లి, యెరూషలేములో మనుష్యులు, పశువులు, విస్తారంగా ఉన్నందువల్ల అది గోడలు లేని మైదానం వలె ఉంటుందని ఈ యువకునికి చెప్పు” అని ఆజ్ఞాపించాడు. 5 యెహోవా చెప్పేది ఏమిటంటే, నేనే దాని చుట్టూ అగ్నికీలలతో సరిహద్దుగా ఉంటాను. నేను ఆ పట్టణం మధ్య నివసిస్తూ దానికి మహిమ కలిగిస్తాను. 6 ఆకాశంలో నాలుగు దిక్కులకు వీచే గాలిలాగా మీరు చెదిరిపోయేలా చేశాను. ఉత్తర దేశాల్లో ఉన్న మీరంతా తప్పించుకుని రండి. ఇదే యెహోవా వాక్కు.

7 సీయోను ప్రజలారా, బబులోను దేశంలో నివసిస్తున్న మీరు అక్కడ నుండి తప్పించుకుని రండి. ఇదే యెహోవా వాక్కు. 8 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మిమ్మల్ని దోచుకొన్న ఇతర దేశాల ప్రజల దగ్గరికి ఆయన నన్ను పంపించాడు. ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే వాడు యెహోవా కనుగుడ్డును ముట్టినట్టే. అందువల్ల ఆయనకు ఘనత కలిగేలా, 9 నేను ఆ ప్రజలకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తుతాను. వారిని వారి దాసులు దోచుకుంటారు. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను పంపించాడని మీరు తెలుసుకుంటారు.

10 యెహోవా ఇలా అంటున్నాడు, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివసిస్తాను. సంతోష గీతాలు ఆలపించండి. 11 ఆ రోజున చాలామంది అన్య దేశాల ప్రజలు యెహోవా చెంతకు చేరుకుని నా ప్రజలుగా అవుతారు. నేను మీ మధ్య నివాసం చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు. 12 ప్రతిష్ఠితమైన దేశంలో యెహోవా యూదాను తన సొత్తుగా సొంతం చేసుకుంటాడు. ఆయన యెరూషలేమును మళ్ళీ కోరుకుంటున్నాడు. 13 సమస్తమైన ప్రజలారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నాడు. ఆయన ఎదుట మౌనంగా నిలబడి ఉండండి.

3:1 అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం నాకు చూపించాడు. అతని మీద అభియోగం మోపడానికి సాతాను అతని కుడి పక్కన నిలబడి ఉన్నాడు. 2 సాతానుతో యెహోవా దూత “సాతానూ, యెహోవా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన నిప్పుకణం లాగానే ఉన్నాడు గదా” అన్నాడు. 3 యెహోషువ మురికి దుస్తులు ధరించుకుని దూత సమక్షంలో ఇంకా నిలబడి ఉన్నాడు.

4 అప్పుడు దూత అక్కడ నిలబడి ఉన్నవారిని పిలిచి, ఇతని మురికి దుస్తులు తీసివేయమని ఆజ్ఞాపించాడు. “నేను నీ అపరాధాలను తొలగించాను. ప్రశస్తమైన దుస్తులతో నిన్ను అలంకరిస్తున్నాను” అని చెప్పాడు. 5 “అతని తల మీద తెల్లని పాగా పెట్టించండి” అని ఆయన చెప్పినప్పుడు వారు యెహోవా దూత సమక్షంలో అతని తలకు తెల్లని పాగా పెట్టి, దుస్తులు ధరింపజేసి అతణ్ణి అలంకరించారు.

6 అప్పుడు యెహోవా దూత యెహోషువతో ఇలా చెప్పాడు. 7 సేనల ప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే “నువ్వు నా కట్టడలను గైకొంటూ నేను నీకు అప్పగించిన కార్యం సవ్యంగా జరిగిస్తే నువ్వు నా ఆలయం మీద అధికారిగా ఉండి నా ఆవరణాలకు సంరక్షకుడివి అవుతావు. అంతేకాక, ఇక్కడ నిలబడే వారికి కలుగుతున్నట్టు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ప్రసాదిస్తాను.

8 ప్రధాన యాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుని ఉన్న నీ సహకారులు జరగబోయేవాటికి సూచనలుగా ఉన్నారు. నువ్వూ, వాళ్ళూ నా మాట ఆలకించాలి. అది ఏమిటంటే,

‘చిగురు’ అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను.

9 యెహోషువ ముందు నేను ఉంచిన రాయిని జాగ్రత్తగా చూడండి.

ఆ రాయికి ఏడు కళ్ళు ఉన్నాయి.

నేను దాని మీద అక్షరాలు చెక్కుతాను.” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

“ఒక్క రోజులో నేను ఈ దేశ ప్రజల అపరాధాలను తొలగిస్తాను. 10 ఆ రోజుల్లో మీరు ద్రాక్షచెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద కూర్చోవడానికి ఒకరినొకరు పిలుచుకుంటారు.” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

4:1 అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోతున్న ఒకణ్ణి లేపినట్లు నన్ను లేపాడు. 2 “నీకు ఏమి కనిపిస్తుంది?” అని నన్ను అడిగాడు. నేను “బంగారు దీపస్తంభం నాకు కనిపిస్తుంది. దీపస్తంభం మీద ఒక నూనె పాత్ర ఉంది. దీపస్తంభానికి ఏడు దీపాలు, ఒక్కో దీపానికి ఏడేసి గొట్టాలు కనిపిస్తున్నాయి. 3 దీపస్తంభానికి కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి చొప్పున రెండు ఒలీవ చెట్లు కనబడుతున్నాయి” అని చెప్పాను.

4 తరువాత నేను నాతో మాట్లాడుతున్న దూతతో “స్వామీ, ఇది ఏమిటి?” అని అడిగాను. 5 అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత “ఇదేమిటో నీకు తెలియదా” అని అడిగాడు. నేను “స్వామీ, నాకు తెలియదు” అన్నాను. 6 అప్పుడు ఆ దూత నాతో ఇలా చెప్పాడు. “జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. నీ శక్తి వల్లనైనా, నీ బలం వల్లనైనా ఇది జరగదు. కేవలం నా ఆత్మ వల్లనే ఇది జరుగుతుంది” అని సేనల ప్రభువు యెహోవా చెప్పాడు. 7 మహా పర్వతమా, నువ్వు ఏపాటి దానివి? జెరుబ్బాబెలును అడ్డగించాలని ప్రయత్నించే నువ్వు నేలమట్టం అవుతావు. కృప కలుగు గాక, కృప కలుగు గాక అంటూ ప్రజలు జయజయధ్వానాలు చేస్తూ ఉండగా అతడు పై రాయి తీసుకుని ఆలయంపై పెట్టిస్తాడు.

8 యెహోవా వాక్కు మళ్ళీ నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. 9 “జెరుబ్బాబెలు తన చేతులతో ఈ ఆలయం పునాది వేశాడు. అతడు ఈ కార్యం ముగిస్తాడు. అప్పుడు ఇదే సేనల ప్రభువు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపించాడని నువ్వు తెలుసుకుంటావు. 10 స్వల్పమైన పనులు జరిగే కాలాన్ని ఎవరు తృణీకరిస్తారు? లోకమంతా సంచారం చేసే యెహోవా ఏడు కళ్ళు జెరుబ్బాబెలు చేతిలో ఉన్న గుండునూలును చూసి సంతోషిస్తాయి.”

11 నేను ఆ దూతను “దీపస్తంభానికి రెండు వైపులా ఉన్న ఈ రెండు ఒలీవచెట్ల భావం ఏమిటి?” 12 “రెండు బంగారపు కొమ్ముల్లో నుండి బంగారు నూనె కుమ్మరించే ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మల భావం ఏమిటి?” అని అడిగాను. 13 అప్పుడు అతడు నాతో “ఇవి ఏమిటో నీకు తెలియదా?” అన్నాడు. నేను “స్వామీ, నాకు తెలియదు” అని చెప్పాను. 14 అతడు “వీరిద్దరూ సర్వలోకనాధుడైన యెహోవా దగ్గర నిలిచి తైలం పోసే సన్నిధాన సేవకులు” అని చెప్పాడు.

5:1 నేను మళ్ళీ తలెత్తి చూసినప్పుడు ఎగిరిపోతూ ఉన్న ఒక గ్రంథం నాకు కనిపించింది. 2 “నీకు ఏమి కనబడుతుంది?” అని అతడు నన్ను అడిగాడు. అందుకు నేను “20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు ఉండి ఎగిరిపోతూ ఉన్న ఒక గ్రంథం కనబడుతుంది” అని చెప్పాను. 3 అప్పుడు అతడు నాతో “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం. దానికి ఒక వైపు రాసి ఉన్న ప్రకారం దొంగతనం చేసేవాళ్ళు నాశనం అవుతారు, రెండవ వైపు రాసి ఉన్న ప్రకారం అబద్ద సాక్ష్యాలు పలికేవాళ్ళంతా నాశనం అవుతారు” అని చెప్పాడు.

4 ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. నేనే ఆ గ్రంథాన్ని పంపుతున్నాను. అది దొంగల ఇళ్ళలో, నా నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేసేవారి ఇళ్ళలో ప్రవేశించి వాళ్ళ ఇళ్ళలో ఉండి ఇళ్ళను, వాటి గుమ్మాలను, గోడలను నాశనం చేస్తుంది.

5 అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత వచ్చి “నువ్వు బయలుదేరి వెళ్లి నీ కన్నులెత్తి చూసి ఇవతలకు వస్తున్నదేమిటో కనిపెట్టు” అని నాతో చెప్పాడు. 6 నేను “ఇది ఏమిటి?” అని అడిగినప్పుడు అతడు “ఇది కొలత గంప. ఇది దేశమంతటిలో ఉన్న ప్రజల దోషములును సూచిస్తుంది” అని చెప్పాడు.

7 గంపకు ఉన్న సీసపు మూత తీసినప్పుడు గంపలో కూర్చుని ఉన్న ఒక స్త్రీ కనబడింది. 8 అప్పుడతడు “ఇది దోషంతో నిండి ఉంది” అని నాతో చెప్పి గంపలో ఆ స్త్రీని పడవేసి సీసపు మూతను గంపపై ఉంచాడు. 9 నేను మళ్ళీ చూసినప్పుడు ఇద్దరు స్త్రీలు బయలుదేరారు. సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వాళ్లకు ఉన్నాయి. గాలికి వాళ్ళ రెక్కలు ఆడుతున్నాయి. వాళ్ళు వచ్చి గంపను మోసుకుంటూ భూమి ఆకాశాల మధ్యకు దాన్ని ఎత్తారు. 10 నేను నాతో మాట్లాడుతున్న దూతతో “వీళ్ళు ఈ గంపను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?” అని అడిగాను. 11 అందుకతడు “షీనారు దేశంలో దాని కోసం ఒక గృహం నిర్మించడానికి వాళ్ళు వెళ్తున్నారు. గృహం సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని నియమిత స్థలంలో ఉంచుతారు” అని జవాబిచ్చాడు.

6:1 నేను మళ్ళీ తేరిచూడగా రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతున్నాయి. ఆ పర్వతాలు ఇత్తడివి. 2 మొదటి రథానికి ఎర్రని గుర్రాలు, రెండవ రథానికి నల్లని గుర్రాలు, 3 మూడవ రథానికి తెల్లని గుర్రాలు, నాలుగవ రథానికి చుక్కలు చుక్కలుగల బలమైన గుర్రాలు పూన్చి ఉన్నాయి.

4 “స్వామీ, ఇవేమిటి?” అని నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను. 5 అతడు నాతో ఇలా అన్నాడు. “ఇవి సర్వలోకనాధుడైన యెహోవా సన్నిధిని విడిచి బయలు దేరే ఆకాశపు నాలుగు గాలులు. 6 నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశంలోకి పోయేది. తెల్లని గుర్రాలున్న రథం వాటి వెంబడి పోతుంది, చుక్కలు చుక్కల గుర్రాలు గల రథం దక్షిణ దేశంలోకి పోతుంది.” 7 బలమైన గుర్రాలు బయలుదేరి లోకమంతట సంచరించడానికి సిద్ధంగా ఉండగా “పోయి లోక మంతటా సంచరించండి” అని అతడు చెప్పాడు. అప్పుడు అవి లోకమంతా సంచరించాయి.

8 అప్పుడతడు నన్ను పిలిచి “ఉత్తరదేశంలోకి పోయే వాటిని చూడు. అవి ఉత్తరదేశంలో నా ఆత్మకు విశ్రాంతి కలిగిస్తాయి” అని నాతో అన్నాడు.

9 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే 10 చెరలోకి పోయిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబీయా, యెదాయా, అనేవారు జెఫన్యా కుమారుడు యోషీయా ఇంట్లో దిగారు. వారు చేరిన దినాన్నే నీవు ఆ ఇంటికి పోయి 11 వారినడిగి వెండి బంగారాలు తీసుకుని, కిరీటం చేసి ప్రధాన యాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ తల మీద ఉంచి 12 అతనితో ఇలా చెప్పు.

“సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,

చిగురు అనే ఒకడు ఉన్నాడు.

అతడు తన స్థలంలో నుండి చిగురిస్తాడు.

అతడు యెహోవా ఆలయం కడతాడు.

13 అతడే యెహోవా ఆలయం కడతాడు.

అతడు ఘనత వహించి సింహాసనాసీనుడై పరిపాలిస్తాడు.

సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ యిద్దరికీ సమాధానకరమైన ఆలోచనలు కలుగుతాయి.

14 ఆ కిరీటం యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. హేలెముకు, టోబీయాకు, యెదాయాకు, జెఫన్యా కుమారుడు హేనుకు స్మారక చిహ్నంగా ఉంటుంది. 15 దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయాన్ని కడతారు, అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా వింటే ఇలా జరుగుతుంది.”