దేవాలయ పని తిరిగి ప్రారంభం

క్రీ.పూ. 520

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎజ్రా 5:1

1 హగ్గయి ప్రవక్త, ఇద్దో కొడుకూ ప్రవక్తా అయిన జెకర్యా, యూదా దేశంలో, యెరూషలేములో ఉంటున్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రకటించారు.

హగ్గయి 1:1–11

1 రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి దినాన ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారి, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుకు, ప్రధానయాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.

సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు.

2 “మేము కలిసి రావడానికి గానీ యెహోవా మందిరాన్ని కట్టడానికి గానీ ఇది సమయం కాదు అని ఈ ప్రజలు చెబుతున్నారు కదా.”

3 అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై హగ్గయి ప్రవక్త ద్వారా చెప్పినదేమిటంటే,

4 “ఈ మందిరం పాడై ఉండగా మీరు కలపతో కప్పిన ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా?

5 కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి.

6 మీరు ఎక్కువ విత్తనాలు చల్లినా పండింది కొంచెమే.

మీరు భోజనం చేస్తున్నప్పటికీ ఆకలి తీరడం లేదు.

మీరు ద్రాక్షరసం తాగుతున్నప్పటికీ మత్తు రావడం లేదు.

బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగడం లేదు.

పనివారు కష్టపడి జీతం సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది.

7 కాగా సేనల ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి.

8 పర్వతాలెక్కి కలప తీసుకు వచ్చి మీరు ఈ మందిరాన్ని కట్టించండి. అప్పుడు నేను ఆనందిస్తాను. నాకు ఘనత వస్తుంది” అని యెహోవా అంటున్నాడు.

9 “విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు గానీ నేను దాన్ని చెదరగొట్టినందువల్ల మీరు కొంచెమే ఇంటికి తెచ్చుకోగలిగారు.

ఎందుకని? యెహోవా అడుగుతున్నాడు.

ఎందుకంటే నా మందిరం పాడై ఉన్నా మీరంతా మీ చక్కని సొంత ఇళ్ళు కట్టుకుంటూ ఆనందిస్తున్నారు.

10 అందుకే మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవడం లేదు.

భూమి పండడం లేదు.

11 నేను భూమికీ పర్వతాలకూ అనావృష్టి కలగజేసి,

ధాన్యం విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలో,

భూమి ఫలించే అన్నిటి విషయంలో,

మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.”

ఎజ్రా 5:2

2 షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవ ఇద్దరూ బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి సహాయం చేస్తూ వచ్చారు.

హగ్గయి 1:12–2:9

12 షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యెహోజాదాకు కొడుకు, ప్రధానయాజకుడు యెహోషువ, శేషించిన ఇశ్రాయేలీ ప్రజలంతా తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త హగ్గయిని పంపించి, తెలియజేసిన మాట విని యెహోవా పట్ల భయభక్తులు చూపారు.

13 అప్పుడు యెహోవా ప్రవక్త హగ్గయి యెహోవా చెప్పగా ప్రజలతో ఇలా చెప్పాడు.

“నేను మీకు తోడుగా ఉన్నాను.” ఇదే యెహోవా వాక్కు.

14 యెహోవా యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు మనస్సును,

ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువ మనస్సును,

శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపించాడు.

15 వారు కూడి వచ్చి, దర్యావేషు రాజు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల ఇరవై నాలుగవ రోజున సేనల ప్రభువైన తమ దేవుని మందిరపు పనిచేయడం మొదలుపెట్టారు.

2:1 రాజైన దర్యావేషు పరిపాలనలో ఏడవ నెల ఇరవై ఒకటవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే,

2 “నీవు యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువతోను శేషించిన జనులతోను ఇలా చెప్పు.

3 పూర్వకాలంలో ఈ మందిరానికి ఉన్న మహిమను చూసినవారు మీలో ఉన్నారు గదా.

అలాటి వారికి ఇది ఎలా కనబడుతున్నది?

దానితో ఇది ఏ విధంగానూ సరి పోలినది కాదని తోస్తున్నది గదా.

4 అయినా యెహోవా ఇచ్చే ఆజ్ఞ.

జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో.

ప్రధానయాజకుడు, యెహోజాదాకు కొడుకు యెహోషువా, ధైర్యం తెచ్చుకో.

దేశంలో ఉన్న ప్రజలారా, ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి.

నేను మీకు తోడుగా ఉన్నాను.

ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.

5 మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి.

నా ఆత్మ మీతో ఉంది కాబట్టి భయపడవద్దు.

6 సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే ఇక త్వరలోనే,

ఇంకొకమారు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపజేస్తాను.

7 ప్రతి రాజ్యాన్నీ నేను కదిలించగా అన్యజనులందరి విలువైన వస్తువులు తీసుకు వస్తారు.

నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను.”

ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.

8 “వెండి నాది. బంగారం నాది” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

9 ఈ చివరి మందిరం మహిమ మునుపటి మందిరం మహిమను మించి పోతుందని సేనల ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు.

ఈ స్థలంలో నేను శాంతిసమాధానాలు నిలుపుతాను.

ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

జెకర్యా 1:1–6

1 దర్యావేషు పాలించే కాలంలో రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్కు.

2 “యెహోవా మీ పూర్వీకుల మీద తీవ్రంగా కోపం తెచ్చుకున్నాడు. 3 కాబట్టి నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీ వైపు తిరుగుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. 4 మీరు మీ పూర్వీకుల వలే ఉండవద్దు. పూర్వికులైన ప్రవక్తలు ఇలా ప్రకటించారు. సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, మీ దుర్మార్గతను, మీ దుష్ట క్రియలను మానుకుని ప్రవర్తించమని వారికి ప్రకటించినప్పటికీ వాళ్ళు వినలేదు. నా మాట ఆలకించలేదు. ఇదే యెహోవా వాక్కు.”

5 “మీ పితరులు ఏమయ్యారు?

ప్రవక్తలు కలకాలం జీవిస్తారా?

6 అయినప్పటికీ నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు, కట్టడలు మీ పూర్వీకుల విషయంలో నెరవేరాయి గదా. అవి నెరవేరినప్పుడు వాళ్ళు ‘మళ్ళీ మన ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి, యెహోవా మనకు చేయాలని సంకల్పించినదంతా మనకు చేశాడు’ అని చెప్పుకున్నారు.”

హగ్గయి 2:10–23

10 దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే,

11 సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు. యాజకుల దగ్గర ధర్మశాస్త్ర విచారణ చెయ్యి.

12 “ఒకడు ప్రతిష్టితమైన మాంసాన్ని తన వస్త్రపు చెంగున కట్టుకుని,

తన చెంగుతో రొట్టెనైనా వంటకాన్నైనా, ద్రాక్షారసాన్నైనా,

నూనెనైనా మరి ఏ విధమైన భోజన పదార్థాన్నైనా,

ముట్టుకుంటే ఆ ముట్టుకున్నది ప్రతిష్ఠితమవుతుందా?” అని యాజకులను అడిగితే, వారు “కాదు” అన్నారు.

13 “శవాన్ని ముట్టుకోవడం వల్ల ఒకడు అంటుపడి అలాటి వాటిలో దేనినైనా ముట్టుకుంటే,

అతడు ముట్టుకున్నది అపవిత్రం అవుతుందా?” అని హగ్గయి మళ్లీ అడిగినప్పుడు యాజకులు “అది అపవిత్రం అవుతుంది” అన్నారు.

14 అప్పుడు హగ్గయి వారికి ఈ విధంగా జవాబిచ్చాడు.

ఈ ప్రజలు కూడా నా దృష్టికి అలానే ఉన్నారు.

వారు చేసే క్రియలన్నీ వారక్కడ అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రం. ఇదే యెహోవా వాక్కు.

15 ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించింది మొదలు ఆ వెనుక మీకు సంభవించినదాన్ని ఆలోచన చేసుకోండి.

16 అప్పటి నుండి ఒకడు ఇరవై కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుతున్నది.

ఏభై కొలల తొట్టి దగ్గరికి ఒకడు రాగా ఇరవై కొలలు మాత్రమే దొరకుతున్నది.

17 తెగులుతోను, కాటుకతోను, వడగండ్లతోను, మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేశాను.

అయినా మీలో ఒక్కడు కూడా తిరిగి నా దగ్గరికి రాలేదు. ఇదే యెహోవా వాక్కు.

18 మీరు ఆలోచించుకోండి.

ఇంతకు ముందు తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినం నుండి,

అంటే యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి.

19 కొట్లలో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లు అయినా అంజూరపు చెట్లు అయినా దానిమ్మ చెట్లయినా ఒలీవ చెట్లు అయినా ఫలించాయా?

అయితే ఇది మొదలు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.

20 రెండవ సారి ఆ నెల ఇరవై నాలుగవ దినాన యెహోవా వాక్కు హగ్గయికి మళ్ళీ ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.

21 “యూదాదేశపు అధికారి అయిన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు.

ఆకాశాన్ని, భూమిని నేను కంపింపజేయ బోతున్నాను.

22 రాజ్యాల సింహాసనాలను నేను కింద పడదోస్తాను.

అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను.

రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను.

గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు.

23 నా సేవకుడవు, షయల్తీయేలు కుమారుడవు అయిన జెరుబ్బాబెలూ,

నేను నిన్ను ఏర్పరచుకున్నాను.

కాబట్టి ఆ రోజున నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.”

జెకర్యా 1:7–21

7 దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం శెబాటు అనే 11 వ నెల 24 వ రోజున యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమయింది. 8 రాత్రి సమయంలో ఎర్రని గుర్రం ఎక్కిన ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, చుక్కలు ఉన్న గుర్రాలు, తెల్లని గుర్రాలు కనబడ్డాయి. 9 అప్పుడు నేను “స్వామీ, ఇవి ఏమిటి?” అని అడిగినప్పుడు నాతో మాట్లాడే దూత “ఇవి ఏమిటో నేను నీకు చెబుతాను” అన్నాడు.

10 అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్న వ్యక్తి “ఇవి లోకమంతా సంచరించడానికి యెహోవా పంపిన గుర్రాలు” అని చెప్పాడు. 11 అప్పుడు అవి గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్న యెహోవా దూతతో “మేము లోకమంతా సంచరించి వచ్చాము. లోకంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉన్నారు” అన్నాడు. 12 అప్పుడు యెహోవా దూత “సేనల ప్రభువు యెహోవా, 70 సంవత్సరాల నుండి నీవు యెరూషలేము మీదా, యూదా పట్టణం మీదా కోపగిస్తూ ఉన్నావు. ఎంతకాలం పాటు వాళ్ళపై కనికరం చూపకుండా ఉంటావు?” అని వేడుకున్నాడు. 13 నాతో మాటలాడిన దూతకు యెహోవా ఆదరణకరమైన సున్నితమైన మాటలతో జవాబిచ్చాడు.

14 అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇలా అన్నాడు “నువ్వు ఈ విధంగా ప్రకటించాలి, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. నాకు యెరూషలేము, సీయోనుల విషయంలో అమితమైన ఆసక్తి ఉంది. 15 ఏమీ పట్టనట్టు ఉన్న ఇతర దేశాల ప్రజలపై నాకు తీవ్రమైన కోపం ఉంది. ఇంతకు ముందు నాకున్న కోపం స్వల్పమే గానీ వారు కీడును వృద్ది చేసుకున్నారు. 16 కాబట్టి యెహోవా చెప్పేది ఏమిటంటే, కనికరం చూపాలన్న ఆసక్తితో నేను యెరూషలేము వైపు చూస్తున్నాను. అందులో నా మందిరాన్ని కడతారు. యెరూషలేము మీద శిల్పకారులు కొలనూలు లాగి కొలతలు వేస్తారు. ఇది యెహోవా వాక్కు. 17 నీవు ఇంకా ప్రకటించాల్సింది ఏమిటంటే, ఇకపై నా పట్టణాలు మరింత ఎక్కువగా భోగభాగ్యాలతో నిండి పోతాయి. యెహోవా సీయోనుకు ఓదార్పు కలిగిస్తాడు. యెరూషలేముపై ఆయన మరింత మక్కువ చూపుతాడు.”

18 ఆ తరువాత నేను కన్నులెత్తి చూసినప్పుడు నాలుగు కొమ్ములు కనిపించాయి. 19 “ఇవి ఏమిటి?” అని నేను నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను. అతడు “ఇవి యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు” అని బదులిచ్చాడు.

20 అప్పుడు నలుగురు కంసాలి పనివారిని యెహోవా నాకు చూపించాడు. 21 “వీళ్ళు ఏమి చేయబోతున్నారు?” అని నేను అడిగాను. ఆయన “ఇవి ఎవ్వరూ తల ఎత్తకుండా యూదా ప్రజలను చెదరగొట్టిన కొమ్ములు. యూదా దేశ నివాసులను చెదరగొట్టడానికి వారిపై దురాక్రమణ జరిగించిన అన్య దేశాల ప్రజలను భయపెట్టడానికి కొమ్ములను నేలమట్టం చేయడానికి ఈ కంసాలి పనివాళ్ళు వచ్చారు” అని నాకు బదులిచ్చాడు.