దేవాలయ పని ఆగి మళ్లీ ప్రారంభం
క్రీ.పూ. 519
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
3 అప్పుడు నది ఇవతల అధికారులుగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి, వారితోబాటు మరికొందరు, యూదుల దగ్గరికి వచ్చారు. వారు “ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి, మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని ప్రశ్నించారు.
4 దాన్ని నిర్మిస్తున్న వారి పేర్లు, ఇతర విషయాలు కూడా వాళ్ళు అడిగారు. 5 అయితే యూదుల దేవుడు వారిపై తన కాపుదల ఉంచడం వలన ఈ విషయంలో చక్రవర్తి దర్యావేషు నుండి అనుమతి వచ్చేవరకూ అధికారులు కట్టడం పని జరగకుండా అడ్డుకోలేదు. 6 నది ఇవతల అధికారులైన తత్తెనై, షెతర్బోజ్నయి, వారితో ఉన్న ఇతర అధికారులు చక్రవర్తి దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ప్రతి ఇది.
7 “రాజైన దర్యావేషుకు సమస్త క్షేమ సుఖాలు కలుగు గాక. 8 రాజువైన మీకు తెలియాల్సిన విషయాలు ఏమిటంటే, మేము మహా దేవుని మందిరం ఉన్న యూదుల ప్రాంతానికి వెళ్ళాం. దాన్ని పెద్ద పెద్ద రాళ్లతో కడుతూ ఉన్నారు. గోడల మధ్యలో స్థంభాలు వేస్తున్నారు. ఈ పని త్వరత్వరగా కొనసాగుతూ పూర్తి కావస్తున్నది. 9 ‘ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?’ అని అక్కడున్న పెద్దలను మేము అడిగాం. 10 మీకు తెలియజేయడం కోసం అజమాయిషీ చేస్తున్న అధికారుల పేర్లు వ్రాసి ఇమ్మని కూడా అడిగాం.
11 దానికి వారు ఇలా జవాబిచ్చారు, భూమి, ఆకాశాలకు దేవుడైన వాడికి సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల్లో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాం. 12 మా పూర్వీకులు ఆకాశంలో నివాసముండే దేవునికి కోపం పుట్టించినందువల్ల ఆయన వారిని కల్దీయుడైన బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బబులోను దేశానికి బందీలుగా తీసుకువెళ్ళాడు. 13 అయితే బబులోను రాజు కోరెషు తన పాలన మొదటి సంవత్సరంలో దేవుని మందిరం తిరిగి కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు. 14 అంతే కాక నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయం నుండి తీసుకువెళ్ళి బబులోను గుడిలో ఉంచిన వెండి బంగారు సామగ్రిని రాజైన కోరెషు ఆ గుడిలో నుండి తెప్పించాడు. 15 షేష్బజ్జరును గవర్నరుగా నియమించి దేవుని మందిరాన్ని అది ఉన్న స్థలం లో కట్టించి, ఆ సామగ్రిని తీసుకువెళ్ళి యెరూషలేము పట్టణంలోని దేవాలయంలో ఉంచే బాధ్యతలు అతనికి అప్పగించాడు.
16 కాబట్టి షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోని దేవుని మందిరం పునాది వేయించాడు. అప్పటినుండి నేటివరకూ దాన్ని కడుతూ ఉన్నాము. పని ఇంకా పూర్తి కాలేదు. 17 కాబట్టి చక్రవర్తికి ఇష్టమైతే బబులోను పట్టణంలో ఉన్న రాజుకు చెందిన ఖజానాలో వెతికించి, యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కట్టించాలని కోరెషు రాజు నిర్ణయించాడో లేదో తెలుసుకోవచ్చు. అప్పుడు చక్రవర్తి ఈ విషయంలో తన నిర్ణయం తెలియజేయాలని కోరుకొంటున్నాం.”
6:1 అప్పుడు దర్యావేషు చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం బబులోను ఖజానాలో ఉంచిన దస్తావేజులను వెదికారు. 2 మాదీయ ప్రాంతంలోని ఎగ్బతానా పట్టణంలో ఒక గ్రంథపు చుట్ట దొరికింది. అందులో ఈ విషయాలు రాసి ఉన్నాయి.
3 “కోరెషు చక్రవర్తి పాలన మొదటి సంవత్సరంలో అతడు యెరూషలేములో ఉండే దేవుని ఆలయం విషయంలో చేసిన నిర్ణయం. బలులు అర్పించడానికి వీలైన స్థలంగా ఆ మందిరాన్ని నిర్మించాలి. దాని పునాదులు స్థిరంగా వేయాలి. దాని పొడవు 60 మూరలు, వెడల్పు 60 మూరలు ఉండాలి. 4 మందిరం మూడు వరసలున్న పెద్ద పెద్ద రాళ్లతో, ఒక వరస సరికొత్త మానులతో కట్టాలి. దానికయ్యే ఖర్చంతా రాజు ధనాగారం నుండి ఇవ్వాలి. 5 యెరూషలేములో ఉన్న ఆలయం నుండి నెబుకద్నెజరు రాజు బబులోనుకు తీసుకు వచ్చిన వెండి, బంగారు సామగ్రిని తిరిగి తీసుకు వెళ్ళి దేవుని మందిరంలో వాటి వాటి స్థలం లో ఉంచాలి.”
6 అప్పుడు దర్యావేషు రాజు ఇలా ఆజ్ఞాపించాడు “నది అవతల అధికారులైన తత్తెనై, షెతర్బోజ్నయి అనే మీరు, మీతో ఉన్న అధికారులు యూదులు కడుతున్న దేవుని మందిరం పనిలో జోక్యం చేసుకోవద్దు. 7 దేవుని మందిరం పని జరగనివ్వండి. యూదుల అధికారులు, పెద్దలు దేవుని మందిరాన్ని దాని స్థలం లో కట్టుకోనివ్వండి. 8 దేవుని మందిరం పని కొనసాగేలా యూదుల పెద్దలకు మీరు చేయాల్సిన సహాయాన్ని గూర్చి మేము ఇలా నిర్ణయించాం. రాజు ధనాగారంలో నుండి, అంటే నది అవతల పన్నుగా వసూలైన సొమ్ములోనుండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారి పని కోసం కావలసిన మొత్తాన్ని ఇవ్వాలి. 9 ఆకాశంలో నివసించే దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, గొర్రెలు, పొట్టేళ్ళు, గోదుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె మొదలైన వాటిని యాజకులకు ఇవ్వాలి. యెరూషలేములో ఉంటున్న వారు ఆకాశంలో ఉండే దేవునికి సువాసన గల అర్పణలు అర్పించి రాజు, అతని సంతానం బతికి ఉండేలా ప్రార్థన చేస్తారు. 10 కాబట్టి వారు కోరినదంతా ప్రతిరోజూ తప్పకుండా ఇవ్వాలి.
11 ఇంకా నేను నిర్ణయించినదేమిటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞను తిరస్కరిస్తే అతని ఇంటి దూలాల్లో ఒకదాన్ని ఊడదీసి దాన్ని నిలబెట్టి దానిపై అతణ్ణి ఉరితీయాలి. అతడు చేసిన ఆ తప్పును బట్టి అతడి ఇంటిని చెత్తకుప్పగా చెయ్యాలి. 12 ఏ రాజులైనా, ప్రజలైనా ఈ ఆజ్ఞను ఉల్లంఘించి యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే, తన సన్నిధిని అక్కడ ఉంచిన దేవుడు వారు నశించిపోయేలా చేస్తాడు. మందిర నిర్మాణ పని వేగంగా జరగాలి. దర్యావేషు అనే నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను” అని రాయించి ఆజ్ఞ జారీ చేశాడు.
13 అప్పుడు నది ఇవతల ఉండే అధికారులు తత్తెనై, షెతర్బోజ్నయి, వారిని అనుసరించేవారు దర్యావేషు రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వేగంగా పని జరిగించారు.
దావీదు కీర్తన
1 నేను నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్య దేవుళ్ళ ఎదుట కూడా నిన్ను కీర్తిస్తాను.
2 నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు.
3 నేను నిన్ను వేడుకున్న రోజున నువ్వు నాకు జవాబిచ్చావు. నన్ను ధైర్యపరచి నాలో బలం పుట్టించావు.
4 యెహోవా, భూమిపై ఉన్న రాజులంతా నీ నోటి వెంట వచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు.
5 యెహోవా మహా బలప్రభావాలు గలవాడని వారు యెహోవా విధానాలను గూర్చి పాటలు పాడతారు.
6 యెహోవా మహా ఘనుడైనప్పటికీ ఆయన దీనులను పట్టించుకుంటాడు. గర్విష్ఠుల కదలికలు ఆయన దూరం నుండే పసికడతాడు.
7 నేను ఆపదల్లో చిక్కుకుని ఉన్నప్పుడు నువ్వు నన్ను బ్రతికిస్తావు. నీ చెయ్యి చాపి నా శత్రువుల క్రోధం నుండి నన్ను రక్షిస్తావు. నీ కుడిచేతి నుండి నాకు సంరక్షణ దొరుకుతుంది.
8 యెహోవా నా తరపున పని సవ్యంగా జరిగిస్తాడు. యెహోవా, నీ కృప సదాకాలం నిలుస్తుంది. నీ చేతులు చేసిన వాటిని విడిచిపెట్టవద్దు.