పౌలు అంత శ్రద్ధగా ఎందుకు ప్రకటిస్తున్నాడు
రాబోయే తీర్పు యొక్క భయంకరత్వాన్ని ఎరిగిన పౌలు, సువార్తను ప్రకటించడంలోను ప్రజలను క్రైస్తవులుగా మారేందుకు ఒప్పించడంలోను మరింత శ్రద్ధ చూపించాడు. దేవునికి పూర్తిగా తెలిసినవాడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు; కొరింతీయుల మనస్సాక్షులకు కూడా తాను అలాగే తెలిసి ఉన్నానని ఆశించాడు. తరువాత, తన ద్వారా విశ్వసించినవారు తనను అపొస్తలునిగా చూసి గర్వించడానికి కారణాలు ఉండేలా, అబద్ధ బోధకుల దాడులకు వ్యతిరేకంగా తనను సమర్థించుకుంటున్నాడు. ప్రాణాలకు తెగించి సువార్తను ప్రకటించి, ఆ కారణంగా ప్రత్యర్థి వర్గం దృష్టిలో పిచ్చివాడిగా కనిపించినా, లేదా హింసను తప్పించుకుంటూ వివేకంతో ప్రవర్తించినా, అదంతా తన శిష్యుల కోసమేనని ప్రకటిస్తున్నాడు.
క్రీ.శ. 58
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 5:11–15
11 కాబట్టి మేము ప్రభువు పట్ల భయభక్తులతో ప్రజలను ఒప్పిస్తున్నాము. మేమేంటో దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. మీ మనస్సాక్షికి కూడా అది స్పష్టంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. 12 మాకు మేమే మీ ఎదుట మళ్ళీ మెప్పించుకోవడం లేదు, హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టే అతిశయించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మా విషయమై మీకు అతిశయ కారణం కలిగిస్తున్నాము. 13 మాకు మతి తప్పింది అని ఎవరైనా అంటే అది దేవుని కోసమే. మేము స్థిర చిత్తులం అంటే అది మీ కోసమే.
14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఎలాగంటే, అందరి కోసం ఒకడు చనిపోయాడు కాబట్టి అందరూ చనిపోయారనే విషయం కచ్చితం. 15 బతికే వారు ఇక నుంచి తమ కోసం బతకకుండా తమ కోసం చనిపోయి సజీవంగా తిరిగి లేచిన వాడి కోసమే బతకాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.
దేవునితో సమాధానపరచబడిన నూతన సృష్టి
క్రీస్తు మానవజాతి అంతటి కోసం మరణించాడనే వాస్తవాన్ని బట్టి, ఇకపై యూదులకూ యూదేతరులకూ మధ్య భేదం లేదని పౌలు వాదిస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తును ఇక శరీరరీత్యా యూదునిగా పరిగణించడం లేదు. విశ్వాసం ద్వారా క్రీస్తుతో ఐక్యమైనవారందరూ నూతన సృష్టిగా మారుతారు; వారి పాత పాపపు ఆచారాలు ముగిశాయి. ఈ నూతన స్థితిలోని ప్రయోజనాలు, ఆశీర్వాదాలు దేవుని నుండి మాత్రమే వస్తాయి. ఆయన క్రీస్తు యేసు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరచుకొని, సమాధాన సందేశాన్ని అపొస్తలులకు అప్పగించాడు. మానవజాతి కోసం పాపబలిగా చేయబడిన తన కుమారుని ప్రాయశ్చిత్తం ద్వారా తమ కోసం సంపాదించబడిన క్షమాపణను అంగీకరించేందుకు దేవుని దగ్గరకు రావాలని పౌలు క్రీస్తు పక్షాన ప్రజలందరినీ వేడుకుంటున్నాడు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 5:16–21
16 ఈ కారణం చేత ఇప్పటి నుండి మేము ఎవరితోనూ ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే చూశాం. అయితే ఇప్పటి నుండి ఇలా వ్యవహరించం.
17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి. 18 అంతా దేవుని వల్లనే అయ్యింది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు. 19 అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.
20 కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం. 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.
నమ్మకమైన పరిచారకుని లక్షణాలు
క్రీస్తు రాయబారిగా పౌలు, దేవుని కృపను వ్యర్థంగా పొందకుండా, సువార్త కోరేదంతా చేయాలని కొరింతీయులను వేడుకుంటున్నాడు. తన సొంత బాధలను వివరించడం ద్వారా, సువార్తకు నమ్మకమైన పరిచారకుడు ఎలా ఉంటాడో పౌలు చిత్రిస్తున్నాడు. తద్వారా అబద్ధ బోధకుడు తనకంటే తక్కువవాడని నిరూపిస్తున్నాడు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 6:1–10
1 అందుచేత మేము దేవునితో కలిసి పని చేస్తూ దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము.
2 “అనుకూల సమయంలో మీ ప్రార్థన విన్నాను.
రక్షణ దినాన మీకు సాయం చేశాను,”
అని ఆయన చెబుతున్నాడు. ఇదిగో, ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.
3 మా సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఏ విషయంలోనూ అభ్యంతరం కలిగించం. 4 దానికి బదులు మేము అన్ని విషయాల్లో దేవుని సేవకులంగా మమ్మును మేము రుజువు చేసుకుంటున్నాం. బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో 5 దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కాయకష్టంలో నిద్ర లేని రాత్రుల్లో ఆకలిలో-ఎంతో సహనం చూపాం. 6 పవిత్రతలో జ్ఞానంలో దీర్ఘశాంతంలో దయలో పరిశుద్ధాత్మలో నిష్కపటమైన ప్రేమలో 7 సత్యవాక్యంలో దేవుని శక్తిలో-కుడి ఎడమ చేతుల్లో నీతి ఆయుధాలతో 8 ఘనతలో ఘనహీనతలో అపవాదుల్లో ప్రశంసల్లో మేము పని చేస్తున్నాం. మోసం చేస్తున్నామనే నింద మా మీద ఉంది, అయినా మేము యథార్థవంతులమే. 9 అనామకులంగా మేము పని చేస్తున్నా, సుప్రసిద్ధులమే. చచ్చిపోతున్నట్టు ఉన్నాం, అయినా చూడండి, ఇంకా బతికే ఉన్నాం. మేము చేసే దాని వల్ల శిక్ష కలిగినా మరణ శిక్ష పడడం లేదు. 10 ఏడుస్తున్నాము కానీ ఎప్పుడూ ఆనందిస్తూనే ఉన్నాం. దరిద్రులంగా కనబడుతున్నా, అనేకమందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం. ఏమీ లేని వాళ్ళంగా కనబడుతున్నా, అన్నీ ఉన్నవాళ్ళమే.
అవిశ్వాసులతో సన్నిహిత బంధాలను పౌలు నిషేధిస్తున్నాడు
కొరింతీయుల పట్ల తనకున్న గొప్ప ప్రేమను, ఆప్యాయతను పౌలు ప్రకటిస్తున్నాడు. వారిలో ప్రేమ కొరవడినందుకు వారిని గద్దిస్తూ, తన పిల్లలుగా, తమ ఆధ్యాత్మిక తండ్రియైన తన పట్ల హృదయాలను విశాలంగా తెరవాలని కోరుతున్నాడు. అవిశ్వాసులను వివాహం చేసుకోవడాన్ని, వారితో స్నేహం చేయడాన్ని, వారితో ఏ విధమైన సన్నిహిత సంబంధాల్లోనైనా ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నాడు. అలాంటి అపవిత్రమైన బంధాల నుండి వేరుపడేవారికి దేవుడు చేసిన వాగ్దానమే, పరిపూర్ణతను లక్ష్యంగా పెట్టుకోవడానికి వారికి అత్యంత బలమైన ప్రేరణగా ఉండాలి.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 6:11–7:1
11 కొరింతీయులారా, పూర్తి సత్యం మేము మీకు చెప్పాం, మా హృదయం విశాలంగా తెరిచి ఉంది. 12 మీ విషయంలో మా అంతరంగం సంకుచితంగా లేదు, మీ అంతరంగమే సంకుచితంగా ఉంది. 13 మేము చేసినట్టే మీరూ చేయండి. మీరూ మీ హృదయాలను విశాలంగా తెరవండి. నా పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నాను. 14 అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? 15 క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేమిటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేమిటి? 16 దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు.
“నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”
17 కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు”
అని ప్రభువు చెబుతున్నాడు.
18 “నేను మిమ్మల్ని చేర్చుకుంటాను,
మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులుగా కూతురులుగా ఉంటారు”
అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.
7:1 ప్రియమైన కొరింతు విశ్వాసులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి, కాబట్టి దేవుని మీద భయభక్తులతో పరిపూర్ణమైన పరిశుద్ధత కోసం తపన పడుతూ దేహానికీ ఆత్మకూ అంటిన మురికినంతా కడుక్కుందాం.
తనను అపొస్తలునిగా స్వీకరించమని పౌలు కోరుతున్నాడు
తనను అపొస్తలునిగా గుర్తించాలని పౌలు కొరింతీయులను వేడుకుంటున్నాడు. వారి ప్రేమను పొందేందుకు తనకున్న హక్కులను పేర్కొంటూ, అందుకు విరుద్ధంగా ఉన్న అబద్ధ బోధకుని ప్రవర్తనను పరోక్షంగా సూచిస్తున్నాడు. వారిని ఖండించడానికి కాక, వారి పట్ల ఉన్న అత్యంత గొప్ప ప్రేమతోనే ఇలా చెబుతున్నానని భరోసా ఇస్తున్నాడు. వారి మంచి మనోభావాన్ని, విధేయతను బట్టి ఆనందిస్తున్నాడు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 7:2–4
2 మమ్మల్ని మీ హృదయాల్లో చేర్చుకోండి. మేమెవరికీ హాని చేయలేదు. ఎవరికీ అపకారం తలపెట్టలేదు. ఎవరినీ స్వార్థానికి వినియోగించుకోలేదు. 3 మీ మీద నింద మోపాలని నేనిలా అనడం లేదు. మీరు మా హృదయాల్లో ఉన్నారు. మీతో పాటు చావడానికైనా జీవించడానికైనా సిద్ధంగా ఉన్నామని నేను ముందే చెప్పాను.
4 నేను చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీ గురించి నేనెంతో గర్విస్తున్నాను. నిండు ఓదార్పుతో ఉన్నాను. మాకు బాధలెన్నున్నా సరే ఆనందంతో పొంగి పోతున్నాను.
తీతు తెచ్చిన వార్తను బట్టి పౌలు ఆనందం
తన ప్రేమకు రుజువుగా, అబద్ధ బోధకుడు వారిని తప్పుదారి పట్టించాడేమోనన్న భయంతో వారి గురించి తాను పడిన ఆందోళనను పౌలు కొరింతీయులకు చెబుతున్నాడు. వారి విధేయతను, ప్రేమను తెలిపే వార్తతో తీతు వచ్చినప్పుడు తనకు కలిగిన ఆనందాన్ని వివరిస్తున్నాడు. తన మొదటి లేఖ గురించి వారితో మాట్లాడుతూ, వారి పట్ల తనకున్న గొప్ప శ్రద్ధను చూపించడానికి దగ్గరి బంధువుతో అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తిని సంఘం నుండి వెలివేయమని ఆదేశించానని భరోసా ఇస్తున్నాడు. వారి విధేయతను, ఆసక్తిని, పశ్చాత్తాపాన్ని ప్రశంసిస్తున్నాడు. వారి ప్రవర్తన తనకు కలిగించిన ఆదరణను, వారి ఐక్యతను విధేయతను చూసి తీతు పొందిన ఆనందాన్ని వివరిస్తున్నాడు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 7:5–16
5 మేము మాసిదోనియ వచ్చినప్పుడు మా శరీరాలకు ఎంత మాత్రం విశ్రాంతి దొరకలేదు. అన్నివైపులా మాకు కష్టాలే. బయట పోరాటాలు, లోపల భయాలు ఉన్నాయి.
6 కానీ కృంగిన వారిని ఆదరించే దేవుడు, తీతు రాక ద్వారా మమ్మల్ని ఆదరించాడు. 7 తీతు రాక వలన మాత్రమే కాక, అతడు మీ దగ్గర పొందిన ఆదరణ వలన కూడా దేవుడు మమ్మల్ని ఆదరించాడు. నాపై ఉన్న మీ అభిమానం, నా పట్ల మీ దుఃఖం, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలియజేశాడు. కాబట్టి నేను మరెక్కువగా ఆనందించాను.
8 నా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది రాసినందుకు నేను బాధ పడటం లేదు. అది మీకు కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది నాకు కూడా దుఃఖం కలిగించింది. అయినా అది కొంచెం సేపు మాత్రమే. 9 కాని ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీరు విచారించారని ఆనందించడం లేదు గానీ మీ విచారం పశ్చాత్తాపపడేలా చేసింది. మీరు దైవిక విచారాన్ని అనుభవించారు. అందువల్ల మా వలన ఎలాంటి నష్టమూ మీరు పొందలేదు.
10 దైవిక విచారం పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దాని వలన విచారం కాదు, రక్షణ లభిస్తుంది. అయితే లోకానుసారమైన విచారం చావును తెస్తుంది. 11 దైవిక విచారం మీలో ఎలాంటి పట్టుదల తెచ్చిందో చూడండి. మీరు నిర్దోషులని రుజువు చేసే ఎలాంటి గొప్ప పట్టుదల, ఎలాంటి రోషం, ఎలాంటి భయభక్తులు, ఎలాంటి తపన, ఎలాంటి ఆసక్తి, ప్రతి దానిలో న్యాయం తప్పక జరగాలనే ఎలాంటి ఆశ, మీలో కలిగాయో చూడండి! ఆ విషయంలో అన్ని విధాలుగా మీరు నిర్దోషులని నిరూపించుకున్నారు. 12 నేను మీకు రాసినా ఆ చెడ్డ పని చేసినవాడి కోసం రాయలేదు. వాడి వలన అన్యాయం పొందిన వాడి కోసం కూడా రాయలేదు. అయితే మా పట్ల మీకున్న ఆసక్తి దేవుని దృష్టిలో మీకు తెలియడానికే రాశాను.
13 వీటన్నిటితో మాకెంతో ప్రోత్సాహం లభించింది. అంతే కాదు, తీతు పొందిన ఆనందం ద్వారా మాకు మరెక్కువ ఆనందం కలిగింది. మీ అందరి వలన అతని ఆత్మకు ఊరట కలిగింది. 14 ఎందుకంటే నేనతనికి మీ గురించి గొప్పగా చెప్పిన విషయాల్లో మీరు నన్ను సిగ్గుపరచలేదు. దీనికి భిన్నంగా మేము మీతో చెప్పినదంతా ఎలా వాస్తవమో అలాగే మేము మీ గురించి తీతుకు గొప్పగా చెప్పినదంతా వాస్తవమని తేలింది. 15 మీరు అతన్ని భయంతో, వణుకుతో చేర్చుకుని విధేయత చూపిన సంగతి జ్ఞాపకం చేసుకున్నపుడు అతనికి మీ పట్ల ప్రేమ అధికమయ్యింది. 16 ప్రతి విషయంలో మీ గురించి నాకు ఉన్న నమ్మకాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను.