కొరింతీయులే పౌలు లేఖ
అబద్ధ బోధకునిలాగే తాను కూడా సిఫారసు లేఖలతో వారి దగ్గరకు రావాల్సిన అవసరముందా అని పౌలు వ్యంగ్యంగా అడుగుతున్నాడు. వారే తన సిఫారసు లేఖలని, అవి సిరాతో కాక జీవముగల దేవుని ఆత్మతో రాయబడ్డాయని ప్రకటిస్తున్నాడు. అందువల్ల కొత్త నిబంధన పరిచర్యలో దేవుడు తనకు అప్పగించిన అధికారానికి వారే సాక్ష్యంగా ఉన్నారని చెబుతున్నాడు.
క్రీ.శ. 58
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 3:1–6
1 మళ్ళీ మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టామా? కొంతమందికి అవసరమైనట్టు, మీకు గానీ, మీ నుండి గానీ పరిచయ లేఖలు మాకు అవసరమా? 2 మా పరిచయ లేఖ మీరే. ఈ లేఖ మా హృదయాల మీద రాసి ఉండగా, ప్రజలందరూ తెలుసుకుని చదువుకోగలుగుతున్నారు. 3 అది రాతి పలక మీద సిరాతో రాసింది కాదు. మెత్తని హృదయాలు అనే పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో, మా సేవ ద్వారా క్రీస్తు రాసిన ఉత్తరంగా మీరు కనబడుతున్నారు 4 క్రీస్తు ద్వారా దేవుని మీద మాకిలాంటి నమ్మకముంది. 5 మావల్ల ఏదైనా అవుతుందని ఆలోచించడానికి మేము సమర్థులమని కాదు. మా సామర్ధ్యం దేవుని నుండే కలిగింది.
6 ఆయనే కొత్త ఒడంబడికకు సేవకులుగా మాకు అర్హత కలిగించాడు. అంటే వ్రాత రూపంలో ఉన్న దానికి కాదు, ఆత్మ మూలమైన దానికే. ఎందుకంటే అక్షరం చంపుతుంది గానీ ఆత్మ బ్రతికిస్తుంది.
సువార్త యొక్క మరింత గొప్ప మహిమ
అబద్ధ బోధకునికి వ్యతిరేకంగా పౌలు సువార్త యొక్క మహిమాన్వితమైన ఆధిక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మోషేలో తాత్కాలికంగా కనిపించిన బాహ్య మహిమను కప్పిన ముసుగు, మరణాన్ని కలిగించే నిబంధనలోని అస్పష్టతకు, సూచనప్రాయమైన స్వభావానికి చిహ్నంగా ఉంది. ఆత్మ నిబంధన పరిచారకులు, పరిశుద్ధాత్మ యొక్క నిలిచియుండే వరాలలోను ప్రేరణలోను ఉన్న శాశ్వతమైన, మరింత గొప్ప మహిమ ద్వారా, ఇంకా మహిమాన్వితమైన నీతి నిబంధనను ఆవిష్కరించి, వివరించి, ప్రతిచోటా ప్రకటించగలిగారు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 3:7–18
7 మరణ కారణమైన సేవ, రాళ్ల మీద చెక్కిన అక్షరాలకు సంబంధించినదైనా, ఎంతో గొప్పగా ఉంది. అందుకే మోషే ముఖ ప్రకాశం తగ్గిపోతున్నా సరే, ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని నేరుగా చూడలేక పోయారు. 8 ఇలాగైతే ఆత్మ సంబంధమైన సేవ మరింకెంత గొప్పగా ఉంటుందో గదా!
9 శిక్షా విధికి కారణమైన సేవ ఇంత గొప్పగా ఉంటే, నీతికి కారణమైన సేవ మరింకెంతో గొప్పగా ఉంటుంది గదా! 10 అపారమైన వైభవం దీనికి ఉండడం వలన ఒకప్పుడు వైభవంగా ఉండేది, ఇప్పుడు వైభవం లేనిదయింది. 11 గతించి పోయేదే గొప్పగా ఉంటే, ఎప్పటికీ ఉండేది ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది గదా!
12 తగ్గిపోయే వైభవాన్ని ఇశ్రాయేలీయులు నేరుగా చూడకుండా మోషే తన ముఖం మీద ముసుకు వేసుకున్నాడు. మేము మోషేలాంటి వాళ్ళం కాదు 13 మాకెంతో భరోసా ఉంది కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాము. 14 అయితే వారి మనసులు మూసుకు పోయాయి. ఇప్పటి వరకూ వారు పాత ఒడంబడిక చదివేటప్పుడు ఆ ముసుకు అలానే ఉంది. ఎందుకంటే కేవలం క్రీస్తులో దేవుడు దాన్ని తీసివేశాడు. 15 అయితే ఇప్పటికీ వారు మోషే గ్రంథాన్ని చదివే ప్రతిసారీ వారి హృదయాల మీద ముసుకు ఇంకా ఉంది గాని 16 వారు ఎప్పుడు ప్రభువు వైపుకు తిరుగుతారో అప్పుడు దేవుడు ఆ ముసుకు తీసివేస్తాడు.
17 ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. 18 మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవపు పోలిక లోకి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మ అయిన ప్రభువు ద్వారా జరుగుతున్నది.
పౌలు తనను కాదు, క్రీస్తును ప్రకటిస్తున్నాడు
తనకు అప్పగించిన మహిమాన్వితమైన పరిచర్య తనను ఆశతోను శ్రద్ధతోను నింపుతుందని పౌలు చూపిస్తున్నాడు. సువార్త సత్యాలను పూర్తిగా వెల్లడించడం ద్వారా తన విశ్వసనీయతను వారికి నిరూపించుకోవాలని కోరుకుంటున్నాడు. తమ దురాశలు, మోహాల వల్ల అంధులైన లోకానుసారమైన మనస్సు గలవారికి మాత్రమే ఆ సత్యాలు మరుగై ఉండగలవు. యేసు క్రీస్తులో బయలుపడిన దేవుని జ్ఞానాన్ని, మహిమను ఇతరులకు అందించేందుకు దేవుడు తన హృదయాన్ని వెలిగించాడు కాబట్టి, తాను సొంత మహిమను ఆశించడం లేదని పౌలు ప్రకటిస్తున్నాడు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 4:1–6
1 కనికరం ఎలా పొందామో అలానే ఈ సేవ కూడా పొందాము, కాబట్టి నిరుత్సాహపడము. 2 అయితే సిగ్గుకరమైన రహస్య విషయాలను నిరాకరించాము. మేము కుయుక్తిగా ప్రవర్తించడం లేదు, దేవుని వాక్యాన్ని వక్రం చేయడం లేదు. దేవుని దృష్టిలో ప్రతివాడి మనస్సాక్షికీ మమ్మల్ని మేమే అప్పగించుకొంటూ సత్యం ప్రకటిస్తున్నాము.
3 ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే. 4 దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.
5 కాబట్టి మమ్మల్ని మేము ప్రకటించుకోకుండా క్రీస్తు యేసును మా ప్రభువుగా, యేసు కోసం మీ పనివాళ్ళంగా ప్రకటిస్తున్నాము. 6 “చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది” అని చెప్పిన దేవుడే తన జ్ఞాన వైభవపు వెలుగును ఇవ్వడానికి మా హృదయాల్లో ప్రకాశించాడు. ఆ వెలుగు యేసు క్రీస్తు ముఖంలో ప్రకాశిస్తోంది.
మట్టి పాత్రలుగా అపొస్తలులు
సువార్త పరిచారకులను మట్టి పాత్రలతో పోలుస్తూ, తన మతం వ్యాపించడానికి కారణమైన అత్యున్నత శక్తి మనుష్యుల నుండి కాక దేవుని నుండి వచ్చిందని చూపించేందుకు, దేవుడు చదువులేని, ప్రాముఖ్యత లేని మనుష్యులను తన అపొస్తలులుగా ఎన్నుకున్నాడని పౌలు ప్రకటిస్తున్నాడు. వారు ఎదుర్కొన్న కష్టాలను పేర్కొంటూ, వాటి నుండి వారికి కలిగిన విడుదల తమ వల్ల కాక దేవుని వల్లనే వచ్చిందనడానికి వాటిని రుజువుగా చూపిస్తున్నాడు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 4:7–12
7 అయితే ఈ సంపద మాకు మట్టి కుండల్లో ఉంది కాబట్టి ఈ అత్యధికమైన శక్తి దేవునిదే తప్ప మాది కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది.
8 అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు. 9 చిత్రహింసలు అనుభవించాం గానీ దిక్కుమాలిన వాళ్ళం కాము. మమ్మల్ని కొట్టి పడేశారు కానీ నాశనం అయిపోవడం లేదు. 10 యేసు జీవం మా దేహాల్లో కనబడేలా యేసు మరణాన్ని మా దేహంలో ఎప్పుడూ మోసుకుపోతున్నాము. 11 యేసు జీవం మా మానవ దేహాల్లో కనబడేలా, బతికి ఉన్న మేము ఎప్పుడూ యేసు కోసం చావుకు లోనవుతూనే ఉన్నాము.
12 ఈ విధంగా మాలో చావూ, మీలో జీవమూ పని చేస్తున్నాయి.
విశ్వాసం, నిరీక్షణ పౌలును కష్టాల గుండా నడిపిస్తాయి
క్రీస్తులో విశ్వాసం ద్వారా, మహిమాన్వితమైన అమరత్వం పట్ల నిరీక్షణ ద్వారా తన క్రైస్తవ పరిచర్యలోని కష్టాలన్నిటినీ ప్రమాదాలన్నిటినీ అధిగమించగలుగుతున్నానని పౌలు చూపిస్తున్నాడు. తన యథార్థతను నమ్మి వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేలా, వారి కోసమే ఈ బాధలను సహించానని చెబుతున్నాడు. సువార్త కోసం తాను పడుతున్న బాధలకు తగిన ప్రతిఫలం పరలోకంలో లభిస్తుందని తనకున్న నిశ్చయాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ కారణంగా అతడు ఈ లోకంలోని తాత్కాలిక ప్రయోజనాల కోసం కాక, కనిపించని లోకంలోని శాశ్వత మహిమల కోసం ఎదురు చూస్తున్నాడు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 4:13–18
13 కాగా, “నమ్మాను కాబట్టి మాట్లాడాను” అని రాసినట్టుగా అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము.
14 ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి, మీతో తన ఎదుట నిలబెడతాడని మాకు తెలుసు. 15 కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి. 16 అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.
17 మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం. 18 కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి.
రాబోయే పరలోక నివాసం
ఇప్పుడు మనం నివసిస్తున్న నివాసం కంటే మన పరలోక నివాసం ఎంత శ్రేష్ఠంగా ఉంటుందో చూపిస్తూ పౌలు తన వాదనను కొనసాగిస్తున్నాడు. ఈ అమర స్థితి కోసం దేవుడు మనలను సిద్ధపరుస్తూ, దానికి హామీగా తన ఆత్మను ఇస్తున్నాడని నొక్కి చెబుతున్నాడు. ఇది అతనికి బోధించడంలో ధైర్యాన్ని ఇస్తూ, ఈ శరీరాన్ని విడిచి ప్రభువు సన్నిధిలో ఉండేందుకు సిద్ధంగా ఉండేలా చేస్తుంది. అయితే జీవించినా మరణించినా, అందరూ లెక్క అప్పగించవలసిన దేవునికి అంగీకారయోగ్యుడిగా ఉండటమే అతని లక్ష్యం.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 5:1–10
1 భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు. 2 పరలోక సంబంధమైన మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ ఈ గుడారంలో మూలుగుతున్నాం. 3 ఎందుకంటే దాన్ని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం. 4 ఈ గుడారంలో ఉన్న మనం బరువు మోస్తూ మూలుగుతూ ఉన్నాం. వీటిని తీసివేయాలని కాదు గాని చావుకు లోనయ్యేది జీవం చేత మింగివేయబడాలి అన్నట్టుగా, ఆ నివాసాన్ని దీని మీద ధరించుకోవాలని మన ఆశ.
5 దీని కోసం మనలను సిద్ధపరచినవాడు దేవుడే. ఆయన తన ఆత్మను మనకు హామీగా ఇచ్చాడు. 6 అందుచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉండండి. ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం, ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు. 7 కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము. 8 ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి నిబ్బరంగా ఉన్నాం. 9 అందుచేత దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా, ఆయనకు ఇష్టులంగా ఉండాలనేదే మా లక్ష్యం.
10 మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, తగినట్టుగా ప్రతిఫలం పొందాలి.