పౌలు గ్రీసుకు ప్రయాణం కొనసాగించడం

పౌలు మాసిదోనియ నుండి గ్రీసుకు, అంటే అకయకు, ప్రయాణం కొనసాగించి అక్కడ మూడు నెలలు ఉంటాడు.

క్రీ.శ. 57

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అపోస్తలుల కార్యములు 20:2–3

2 ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడి విశ్వాసులను ప్రోత్సహించి గ్రీసు వచ్చాడు. 3 అతడు అక్కడ మూడు నెలలు గడిపిన తరువాత ఓడపై సిరియా వెళ్ళాలని భావించాడు గానీ అక్కడి యూదులు అతనిపై కుట్ర చేస్తున్నారని తెలిసి తిరిగి మాసిదోనియ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.

పౌలు కొరింతీయులకు మళ్ళీ రాయడం క్రీ.శ. 58

కొరింతీయులు తన మొదటి లేఖను ఎలా స్వీకరించారో విన్న పౌలు, అపొస్తలునిగా తన ప్రవర్తనను సమర్థించుకోవడానికీ తన అధికారాన్ని కాపాడుకోవడానికీ ఫిలిప్పీ నుండి తన రెండవ లేఖను రాస్తాడు. ఒక తప్పుడు బోధకుడు ఈ రెండిటినీ ప్రశ్నించాడు.

పౌలు కొరింతీయులకు మళ్ళీ అభివందనం చెప్పడం

పౌలు ఉపోద్ఘాతం, ఆశీర్వచనం.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 1:1–2

1 కొరింతులోని దేవుని సంఘానికీ అకయ ప్రాంతమంతటా ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న విషయాలు. 2 మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

దేవుని ఆదరణకు పౌలు ఆయనను స్తుతించడం

తన కష్టాలన్నిటిలో, ప్రమాదాలన్నిటిలో తనను నిలబెట్టి విడిపించినందుకు పౌలు దేవుణ్ణి స్తుతిస్తాడు. ఎందుకంటే తన ఉదాహరణ ద్వారా ఇతరులు కూడా అలాంటి బాధల్లో అదే ఆదరణతో ఓదార్పు పొందవచ్చు.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 1:3–7

3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.

4 ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.

5 క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది. 6 మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.

7 మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది.

ఎఫెసులో పౌలును దేవుడు రక్షించడం

ఎఫెసులో తాను ఎదుర్కొన్న తక్షణ ప్రమాదం నుండి దేవుని శక్తి తనను ఎలా విడిపించిందో పౌలు చెబుతున్నాడు. తన కోసం వారు చేసిన ప్రార్థనలను కృతజ్ఞతతో గుర్తిస్తున్నాడు.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 1:8–11

8 సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము.

9 వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది. 10 ఆయన అలాటి భయంకరమైన ఆపద నుండి మమ్మల్నిరక్షించాడు, మళ్లీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకం పెట్టుకున్నాము. మళ్ళీ మళ్ళీ ఆయన మమ్మల్ని తప్పిస్తాడు. 11 మా కోసం మీరు ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీన్ని చేస్తాడు. చాలామంది ప్రార్థనల వల్ల దేవుడు మమ్మల్ని కనికరించినందుకు ఎంతోమంది మా తరపున కృతజ్ఞత చెబుతారు.

కొరింతీయుల పట్ల పౌలు యథార్థత

అబద్ధ బోధకుని అపనిందలను దృష్టిలో ఉంచుకొని, కొరింతీయుల పట్ల తన ప్రవర్తనలోని యథార్థతను, పవిత్రతను బట్టి పౌలు ఆనందిస్తున్నాడు. తన ప్రవర్తనలో స్వార్థపూరితమైన లేదా సొంత ప్రయోజనాన్ని ఆశించే ఉద్దేశాలేవీ లేవని ప్రకటిస్తున్నాడు. ప్రభువు దినాన వారు తనకు ఆనందకారణంగా ఉంటారు కాబట్టి, ఇప్పటికే కొందరు చేసినట్లే అందరూ తనను గుర్తించి, తనను బట్టి గర్విస్తారని అతడు నమ్ముతున్నాడు.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 1:12–14

12 మా అతిశయం ఇదే! దీనికి మా మనస్సాక్షి సాక్ష్యం. లౌకిక జ్ఞానంతో కాక దేవుడు ప్రసాదించే సదుద్దేశంతో యథార్థతతో దేవుని కృపనే అనుసరించి, లోకంలో మరి ముఖ్యంగా మీ పట్ల నడుచుకున్నాము. 13 మీరు చదివి అర్థం చేసుకోలేని సంగతులేవీ మీకు రాయడం లేదు. 14 మీరు ఇప్పటికే కొంతవరకూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు. కడవరకూ అర్థం చేసుకుంటారని ఆశాభావంతో ఉన్నాం. మన యేసు ప్రభువు దినాన, మీరు మాకూ, మేము మీకూ గర్వ కారణంగా ఉంటాం.

పౌలు తన సందర్శనను ఎందుకు వాయిదా వేశాడు

కొరింతీయులను సందర్శిస్తానని వాగ్దానం చేసినా రానందుకు, పౌలు స్థిరనిర్ణయం లేనివాడని, లోకానుసారుడని అబద్ధ బోధకుడు నిందించాడు. తాను బోధించిన మార్పులేని సిద్ధాంతం ద్వారా పౌలు తన నిలకడను చూపిస్తూ, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆధారంగా పేర్కొంటున్నాడు. ఆ అభిషేకం ద్వారా దేవుడు వారి మధ్య పౌలు అధికారాన్ని స్థిరపరిచాడు. వారిని శిక్ష నుండి తప్పించాలనే కోరికే తన సందర్శనను ఆలస్యం చేయడానికి అసలు కారణమని అతడు గంభీరంగా ప్రకటిస్తున్నాడు. వారిని శిక్షించడానికి రావడానికి బదులు, వారి పశ్చాత్తాపాన్ని బట్టి తాను ఆనందించాలనీ, వారి పట్ల తన ప్రేమ ఎంత గొప్పదో వారికి నమ్మకం కలిగించాలనీ, ఎంతో తీవ్రమైన వేదనతో వారికి రాశానని భరోసా ఇస్తున్నాడు.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 1:15–2:4

15 ఈ నమ్మకంతో నేను మొదట మీ దగ్గరికి రావాలనుకున్నాను. దీనివలన మీకు రెండు సార్లు ప్రయోజనం కలగాలని నా ఉద్దేశం.

16 మాసిదోనియకు వెళ్తూ ఉన్నపుడు మిమ్మల్ని కలుసుకుని మాసిదోనియ నుండి మళ్ళీ మీ దగ్గరికి రావాలనీ, తరువాత మీరు నన్ను యూదయకు సాగనంపగలరనీ అనుకున్నాను. 17 నేను ఇలా ఆలోచించి చపలచిత్తంగా నడచుకున్నానా? నేను “అవును, అవును” అన్న తరువాత, “కాదు, కాదు” అంటూ లౌక్యంగా ప్రవర్తిస్తున్నానా? 18 అయితే దేవుడు నమ్మదగినవాడు. మేము, “అవును” అని చెప్పి, “కాదు” అనం. 19 నేనూ, సిల్వానూ, తిమోతీ, మీకు ప్రకటించిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు “అవును” అని చెప్పి, “కాదు” అనేవానిగా ఉండలేదు. ఆయన ఎప్పుడూ, “అవును” అనేవానిగానే ఉన్నాడు. 20 దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో, “అవును” గానే ఉన్నాయి. కాబట్టి దేవుని మహిమ కోసం ఆయన ద్వారా మనం, “ఆమెన్” అంటున్నాం.

21 క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి 22 మనం తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు, మన హృదయాల్లో తన ఆత్మను హామీగా ఇచ్చాడు.

23 మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేక నేను కొరింతుకు మళ్ళీ రాలేదు. దీనికి దేవుడే నా సాక్షి. 24 మీ విశ్వాసం మీద పెత్తనం చెలాయించే ఉద్దేశం మాకు లేదు. మీరు మీ విశ్వాసంలో నిలిచి ఉండగా మీ ఆనందం కోసం మీతో కలిసి పని చేస్తున్నాము.

2:1 నేను బాధ కలిగించేలా మీ దగ్గరికి తిరిగి రాకూడదని నా అంతట నేనే నిశ్చయించుకున్నాను. 2 నేను మీకు బాధ కలిగిస్తే బాధ పొందినవాడు తప్ప ఇంకెవరు నన్ను సంతోషపరచగలరు? 3 నేను వచ్చేటప్పుడు ఎవరి వలన నాకు సంతోషం కలగాలో వారి వలన నాకు దుఃఖం కలగకుండా ఉండాలని ఈ సంగతి మీకు రాశాను. నా సంతోషమే మీ అందరి సంతోషమని నా నమ్మకం. 4 మీకు బాధ కలగాలని కాదు, మీ పట్ల నాకున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఎంతో బాధతో, హృదయ వేదనతో, కన్నీళ్ళు కారుస్తూ రాశాను.

తప్పు చేసినవాణ్ణి క్షమించి తిరిగి చేర్చుకోండి

సంఘం నుండి వెలివేయబడిన వ్యక్తి గురించి వారు దుఃఖించారు. ఇప్పుడు అతడు నిజాయితీగా పశ్చాత్తాపపడుతున్నాడు కాబట్టి అతణ్ణి తిరిగి చేర్చుకోమని పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. సాతాను అతణ్ణి నిరాశలోకి నెట్టకుండా ఉండేందుకు, దయతోను స్నేహపూర్వకంగాను ప్రవర్తించి అతని పట్ల తమ ప్రేమను చూపాలని చెబుతున్నాడు. శిక్ష విధించడంలో తనకు విధేయత చూపినట్లే, దానిని తొలగించడంలో కూడా వారు తనకు విధేయత చూపాలని పౌలు ఆశిస్తున్నాడు. ఈ రెండు విషయాల్లోనూ తాను క్రీస్తు నామంలో, ఆయన అధికారంతో వ్యవహరించానని ప్రకటిస్తున్నాడు.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 2:5–11

5 ఎవరైనా నాకు బాధ కలగజేసి ఉంటే, నాకు మాత్రమే కాదు, కొంతవరకూ మీకందరికీ బాధ కలగజేశాడు (ఇంతకంటే కఠినంగా మాట్లాడడం నాకిష్టం లేదు). 6 అలాంటి వాడికి మీలో ఎక్కువమంది వలన కలిగిన ఈ శిక్ష చాలు. 7 కాబట్టి మీరిక అతణ్ణి శిక్షించకుండా క్షమించి, ఆదరించడం మంచిది. లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో. 8 అందుచేత అతని పట్ల మీ ప్రేమ స్థిరపరచమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. 9 మీరన్ని విషయాల్లో విధేయులై ఉంటారో లేదో అని మిమ్మల్ని పరీక్షించేందుకే అలా రాశాను. 10 మీరు ఎవరినైనా దేని గురించి అయినా క్షమిస్తే నేనూ అతన్ని క్షమిస్తాను. 11 నేను దేనినైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా, మీ కోసం, క్రీస్తు ముఖం చూసి క్షమించాను. సాతాను ఎత్తుగడలు మనకు తెలియనివి కావు.

తీతు గురించి పౌలు ఆందోళన

నిర్ణయించిన సమయానికి కొరింతుకు రాకపోవడానికి మరో కారణంగా, తీతు గురించి తనకున్న ఆందోళనను పౌలు పేర్కొంటున్నాడు. మాసిదోనియలో తనకు కలిగిన విజయాన్ని వివరిస్తూ, సువార్తను అంగీకరించేవారికీ తిరస్కరించేవారికీ తన బోధ వల్ల కలిగే గొప్ప ఫలితాలను ప్రకటిస్తున్నాడు. చివరగా అబద్ధ బోధకుని గురించి ఘాటైన వ్యాఖ్య చేసి, తన యథార్థతను, నిస్వార్థతను ప్రకటిస్తున్నాడు.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 2:12–17

12 క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు, ప్రభువు నాకు ద్వారం తెరిచాడు. అయినా నా సోదరుడు తీతు కనిపించకపోవడంతో 13 నాకు మనశ్శాంతి లేక, వారి దగ్గర సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరాను.

14 దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు. 15 విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము. 16 నాశనమైపోతున్న వారికి మరణపు వాసనగా, విమోచన పొందుతున్న వారికి జీవపు సువాసనగా ఉన్నాము. వీటికి యోగ్యులెవరు? 17 దేవుని వాక్యాన్ని లాభం కోసం చాలామంది అమ్మేస్తున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు. మేమైతే సదుద్దేశంతో ఉన్నాం. దేవుడు మమ్మల్ని పంపించాడు. క్రీస్తులో దేవుని ఎదుట బోధిస్తున్నాం.