వృద్ధుల పట్ల, విధవరాండ్ర పట్ల తిమోతీ ప్రవర్తన

తిమోతీ బోధ మరింత ఫలవంతం కావడానికి అతనికి మరిన్ని నిర్దేశాలు ఇవ్వబడతాయి. వృద్ధుల పట్ల, యువకుల పట్ల, యువతుల పట్ల, సంఘం దాతృత్వంతో పోషించబడే విధవరాండ్ర పట్ల ఎలా ప్రవర్తించాలో అతనికి ఉపదేశించబడుతుంది. అరవై సంవత్సరాల లోపు వయస్సు గలవారెవరినీ చేర్చుకోకూడదు. ఎందుకంటే చిన్నవయస్సు స్త్రీలను చేర్చుకొని, వివాహం చేసుకోవద్దని నిషేధిస్తే, వారు క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టవచ్చు లేదా క్రైస్తవ నామానికి అవమానం తీసుకురావచ్చు.

క్రీ.శ. 57

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:1–16

1 వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు. 2 యువకులను సోదరులుగా, వయసు పైబడిన స్త్రీలను తల్లులుగా, యువతులను సోదరీలుగా ఎంచి పూర్ణ పవిత్రతతో హెచ్చరించు.

3 నిజమైన వితంతువులను గౌరవించు. 4 అయితే ఏ వితంతువుకైనా పిల్లలు గాని, మనవలు గాని ఉంటే, వీరు మొదట తమ ఇంటివారి పట్ల తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టం. 5 నిజంగా వితంతువు ఒక్కతే ఉండి, దేవుని మీదనే తన నమ్మకం పెట్టుకుని, ఆయన సాయం కోసం రేయింబగళ్ళు ప్రార్ధిస్తూ, విన్నపాలు చేస్తూ ఉంటుంది. 6 అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే. 7 వారు నింద పాలు కాకుండేలా వీటిని కూడా బోధించు.

8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. 9 అరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు ఉండి, గతంలో ఒక్క పురుషుడికే భార్యగా ఉన్న స్త్రీని మాత్రమే విధవరాలిగా నమోదు చెయ్యి. 10 ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకుని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.

11 పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు. క్రీస్తుకు విరోధంగా వారి వాంఛలు ఎక్కువైపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. 12 ఇలా వారు తమ మొదటి నిర్ణయాన్ని వదిలేసి తమ మీదికి అపరాధం తెచ్చుకుంటారు. 13 వారు ఇంటింటికీ తిరుగుతూ, సోమరులవుతారు. అంతేగాక, వారు పనికిమాలిన మాటలు మాటలాడుతూ, వాగుడుకాయలై ఇతరుల విషయాల్లో తల దూర్చేవారుగా తయారవుతారు.

14 కాబట్టి యువతులు పెళ్ళి చేసుకుని పిల్లలను కని ఇంటి పనులు చూసుకుంటూ, శత్రువుకు నిందించే అవకాశమివ్వకుండా ఉండాలని నా ఉద్దేశం. 15 ఇప్పటికే కొంతమంది దారి తప్పి సాతాను వెంట వెళ్ళిపోయారు. 16 ఏ విశ్వాసురాలి ఇంట్లోనైనా వితంతువులు ఉంటే, వారి గురించిన భారం సంఘానికి లేకుండా ఆమె తానే వారికి సహాయం చేయాలి.

పెద్దలకు గౌరవం, వారి నియామకంలో జాగ్రత్త

సంఘ పెద్దల పట్ల, అంటే కాపరుల పట్ల, ఎలా ప్రవర్తించాలో తిమోతీకి నిర్దేశించబడుతుంది. మంచి పరిచారకులు రెట్టింపు గౌరవానికీ వేతనానికీ అర్హులు; సంఘం వారికి తగిన పోషణ ఏర్పాటు చేయాలి. పూర్తిస్థాయి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే పెద్దలను గద్దించాలి; అప్పుడు ఇతరులకు హెచ్చరికగా బహిరంగంగా గద్దించాలి. తన పాలనలో కచ్చితంగా నిష్పక్షపాతంగా ఉండాలని తిమోతీకి గంభీరంగా ఆజ్ఞాపించబడుతుంది. పెద్దల స్వభావాలను నిబద్ధతతో పరిశీలించిన తరువాతే అత్యంత శ్రద్ధతో, జాగ్రత్తతో వారిని నియమించాలి. అలా చేస్తే తరువాత తలెత్తే ఏ దోషంలోనూ దుష్ప్రవర్తనలోనూ అతడు పాలుపంచుకోకుండా ఉంటాడు. మధ్యలో పౌలు అతనికి ఆరోగ్యం గురించి సలహా ఇస్తాడు.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17–25

17 చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి. 18 ఇందుకు అనుగుణంగా లేఖనంలో, “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అనీ, “పనివాడు తన జీతానికి అర్హుడు” అనీ ఉంది. 19 ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే తప్ప సంఘ పెద్ద మీద నిందారోపణ అంగీకరించ వద్దు.

20 మిగతా వారు భయపడేలా పాపం చేసిన వారిని అందరి ఎదుటా గద్దించు. 21 విరోధ బుద్ధితో గానీ భేద భావంతో గానీ ఏమీ చేయక ఈ నియమాలను పాటించాలని దేవుని ఎదుటా, క్రీస్తు యేసు ఎదుటా, దేవుడు ఎన్నుకున్న దూతల ఎదుటా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

22 ఎవరి మీదా త్వరపడి చేతులుంచవద్దు. ఇతరుల పాపాల్లో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రునిగా ఉండేలా చూసుకో. 23 ఇక నుండి నీళ్ళు మాత్రమే గాక నీ కడుపులో తరచుగా వచ్చే వ్యాధి కోసం కొద్దిగా ద్రాక్షారసం తాగు.

24 కొందరి పాపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వారి తీర్పుకు ముందే నడుస్తున్నాయి. మరి కొంతమంది పాపాలు వారి వెంటే వెళుతున్నాయి. 25 అలాగే కొన్ని మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన వాటిని సైతం దాచి ఉంచడం సాధ్యం కాదు.

బానిసలు తమ యజమానులను గౌరవించాలి

క్రైస్తవ మతం సమాజంలోని సంబంధాలను మార్చదు కాబట్టి, సేవకులూ బానిసలూ అన్యమతస్థులైన తమ యజమానులకు కూడా తగిన గౌరవం చూపాలని చెప్పాలి. క్రైస్తవులైన తమ యజమానులకు కూడా అదే విధేయత చూపాలని, క్రైస్తవులుగా తమకున్న సహోదర ఐక్యత తమకు తెలిసిన కర్తవ్యాలకు ఆటంకం కలిగించనివ్వకూడదని వారికి ప్రత్యేకంగా హెచ్చరించబడుతుంది.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:1–2

1 బానిసలుగా పని చేస్తున్న విశ్వాసులు వారి యజమానులను పూర్తి గౌరవానికి తగినవారుగా ఎంచాలి. ఆ విధంగా చేయడం వలన దేవుని నామమూ ఆయన బోధా దూషణకు గురి కాకుండా ఉంటాయి. 2 విశ్వాసులైన యజమానులు గల బానిసలైతే ఆ యజమానులు తమ సోదరులే కదా అని వారిని చిన్న చూపు చూడక, తాము సేవించేది తమ ప్రేమ పాత్రులైన విశ్వాసులనే అని ఇంకా బాగా వారికి సేవ చేయాలి. ఈ సంగతులు బోధిస్తూ వారిని హెచ్చరించు.

యూద ఆచారాలను రుద్దే బోధకులను పౌలు ఖండించడం

వేరే సిద్ధాంతాలను అనుసరిస్తూ, ప్రజలను పౌర కర్తవ్యాల నుండి తప్పించే యూద ఆచారాలను రుద్దే బోధకులు ఖండించబడతారు. వారి వివాదాలకూ పదాల గురించిన తగాదాలకూ, దేవుని ఘనతకన్నా ఆయన సత్య వ్యాప్తికన్నా తమ సొంత లౌకిక లాభానికి ప్రాధాన్యం ఇవ్వడానికీ వారు గద్దించబడతారు. భూసంబంధమైన ఆస్తులన్నీ శూన్యమైనవి కాబట్టి జీవితంలోని ప్రతి స్థితిలోనూ సంతృప్తిగా ఉండాలని ఉద్బోధించబడుతుంది. సంపదలపై మితిమీరిన ప్రేమ గొప్ప ప్రమాదం.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:3–10

3 ఎవరైనా మన ప్రభువైన యేసు క్రీస్తు ఆరోగ్యకరమైన ఉపదేశానికీ, దైవభక్తికి అనుగుణమైన బోధకూ సమ్మతించకుండా, దానికి భిన్నంగా బోధిస్తే 4 వాడు గర్విష్టి. వాడికి ఏమీ తెలియదన్నమాట. వాడు తర్కాల్లో వాగ్వాదాల్లో నిమగ్నమై ఉంటాడు. ఫలితంగా అసూయ, కలహం, దూషణలు, అపోహలు కలుగుతాయి. 5 ఇంకా చెడిపోయిన మనసుతో అలాటి వారు సత్యం నుండి తొలగిపోయి దైవభక్తి ధనసంపాదన మార్గం అనుకుంటారు.

6 అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం. 7 మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము. 8 కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం. 9 ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి. 10 ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.

స్థిరంగా నిలవమని దేవుని సమక్షంలో తిమోతీకి ఆజ్ఞ

దైవప్రేరణ పొందినవానిగా తిమోతీ ఈ చెడు ఆచారాలకు దూరంగా ఉండి దైవభక్తిని అనుసరించమని పిలవబడతాడు. దేవుని సమక్షంలో ఉన్నట్టుగా, గొప్ప తీర్పు దినాన్ని దృష్టిలో ఉంచుకొని, విశ్వాసంలో స్థిరంగా ఉండాలనీ, మనస్సాక్షికి అనుగుణంగా తన పదవీ బాధ్యతలను నిర్వర్తించాలనీ, లౌకికమైన, దురాశతో కూడిన ఉద్దేశాలన్నిటినీ విడిచిపెట్టాలనీ పౌలు అతనికి ఆజ్ఞాపిస్తాడు. ఇకముందు బయలుపరచబడే క్రీస్తు గొప్ప మహిమను వివరించడంతో పౌలు ముగిస్తాడు.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11–16

11 దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు. 12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు. 13 అంతటికీ జీవాధారమైన దేవుని ఎదుటా పొంతి పిలాతు ముందు సత్యాన్ని గూర్చి ధైర్యంగా సాక్షమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటా 14 నువ్వు నిష్కళంకంగా, నిందారహితుడిగా ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దీన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమయ్యే వరకూ చేస్తుండాలి.

15 భాగ్యవంతుడు, ఎకైక శక్తిశాలి అయిన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనుపరుస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 16 ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరూ చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగు గాక. ఆమేన్‌.

ధనవంతులు సంపదను కాక దేవుణ్ణి నమ్ముకోవాలి

ధనవంతులు అనిశ్చితమైన తమ ఆస్తులను కాక, వాటిని ఇచ్చే దేవుణ్ణి నమ్ముకోవాలని వారిని హెచ్చరించమని తిమోతీకి ఆజ్ఞాపించబడుతుంది. వారు తమ కోసం మరింత నిలకడైన, శాశ్వతమైన ఆశీర్వాదాలను సమకూర్చుకునేలా మంచి పనులలో ధనవంతులుగా ఉండాలని వారికి ఉద్బోధించబడుతుంది.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17–19

17 ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు. 18 వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసుకోవాలనీ, 19 మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.

విశ్వాసాన్ని నిలుపుకోమన్న పౌలు చివరి ఆజ్ఞ

క్రైస్తవ సిద్ధాంతంలో స్థిరంగా ఉండమనీ, తప్పుడు బోధకులు బలంగా ప్రోత్సహించిన తాత్వికమైన, పనికిరాని ఊహాపోహలన్నిటినీ విడిచిపెట్టమనీ తిమోతీకి మళ్ళీ ఉద్బోధిస్తూ, పౌలు లేఖను ప్రారంభించిన విధంగానే ముగిస్తాడు.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:20–21

20 తిమోతీ, ప్రభువు నీకు అప్పగించిన దాన్ని కాపాడుకుంటూ భక్తిలేని మాటలకూ, మూర్ఖపు వాదాలకూ దూరంగా ఉండు. కొందరు వాటిని జ్ఞానం అనుకుంటారు 21 కొందరు వాటిని మనఃపూర్వకంగా విశ్వసించి విశ్వాసం విషయంలో తప్పిపోయారు.

కృప మీకు తోడై ఉండు గాక.