ఆరాధనలో పురుషులకూ స్త్రీలకూ పౌలు ఉపదేశించడం

ప్రార్థన చేయవలసిన కర్తవ్యం మళ్ళీ నొక్కిచెప్పబడుతుంది. బహిరంగ ప్రార్థనలు చేయమని పురుషులకు ఆజ్ఞాపించబడుతుంది. ఆ ప్రార్థనలు సమాజమందిరానికో యెరూషలేంలోని దేవాలయానికో పరిమితం కాకూడదు; భక్తితో చేస్తే అవి ప్రతి స్థలంలోనూ అంగీకారయోగ్యమే. మంచి పనులు చేయమనీ మౌనంగా ఉండమనీ క్రైస్తవ స్త్రీలకు ఉద్బోధించబడుతుంది. వారి వస్త్రధారణ వారి పవిత్ర విశ్వాస ప్రకటనకు తగినదిగా ఉండాలి. స్త్రీ తన అతిక్రమం కారణంగా పురుషునికి లోబడి ఉండాలి. విశ్వాసం, పరిశుద్ధత అనే షరతుపై ఆమె మీద ప్రకటించిన శాపం తగ్గించబడుతుంది.

క్రీ.శ. 57

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8–15

8 అందుచేత అన్ని స్థలాల్లోనూ పురుషులు ఆగ్రహం, తర్కవితర్కాలు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను.

9 అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా 10 భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.

11 స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. 12 ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే. 13 ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు? 14 ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది.

15 అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉంటే ప్రసవం ద్వారా దేవుడు వారిని కాపాడతాడు.

సంఘాధ్యక్షుల, పరిచారకుల అర్హతలు

అనేక సంఘాలను పర్యవేక్షించే సంఘాధ్యక్షునికీ, ఒక సంఘంపై బాధ్యత వహించే పరిచారకునికీ ఉండవలసిన అర్హతలు వివరించబడతాయి.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:1–7

1 ఎవరైనా సంఘానికి అధ్యక్షుడుగా ఉండాలనుకుంటే అతడు శ్రేష్ఠమైన పనిని కోరుకుంటున్నాడు అనే మాటను నమ్మవచ్చు. 2 కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి. 3 అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి. 4 తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి.

5 ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? 6 అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో. 7 అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.

పరిచారకులు, వారి భార్యలు ఉండవలసిన విధం

సంఘ పరిచారకుల అర్హతలు పేర్కొనబడ్డాయి. వారి భార్యలు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8–13

8 అలాగే పరిచారకులు గౌరవానికి తగినవారుగా, రెండు నాలుకలతో మాట్లాడనివారుగా ఉండాలి. తాగుబోతులుగా, అక్రమ లాభం ఆశించేవారుగా ఉండకూడదు. 9 వెల్లడైన విశ్వాస సత్యాన్ని పవిత్రమైన మనస్సాక్షితో అంటిపెట్టుకొనే వారుగా ఉండాలి. 10 మొదట వారిని పరీక్షించాలి. తరువాత వారు నిందకు చోటివ్వనివారని తేలితే పరిచారకులుగా సేవ చేయవచ్చు.

11 అలాగే వారి భార్యలు కూడా గౌరవించదగినవారూ అపనిందలు ప్రచారం చేయనివారూ తమ కోరికలు అదుపులో ఉంచుకొనేవారూ అన్ని విషయాల్లో నమ్మకమైనవారూ అయి ఉండాలి. 12 పరిచారకులు ఒకే భార్య కలిగినవారూ, తమ పిల్లలనూ తమ ఇంటివారిని చక్కగా నిర్వహించుకొనేవారుగా ఉండాలి. 13 పరిచారకులుగా మంచి సేవ చేసిన వారు మంచి స్థానం సంపాదించుకుని క్రీస్తు యేసు పైని విశ్వాసంలో గొప్ప ధైర్యం పొందుతారు.

తిమోతీ విధుల్లో పౌలు అతనిని ప్రోత్సహించడం

క్రైస్తవ మతంలోని ఉన్నతమైన సిద్ధాంతాలను తిమోతీకి గుర్తుచేయడం ద్వారా పౌలు అతనిని సంఘాధ్యక్షునిగా, పరిచారకునిగా తన విధుల్లో ప్రోత్సహిస్తాడు.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14–16

14 త్వరలో నీ దగ్గరికి రావాలని ఆశిస్తున్నాను. 15 ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే ఒక వ్యక్తి దేవుని ఇంట్లో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఎలా నడుచుకోవాలో నీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నాను. ఆ సంఘం సత్యానికి మూల స్తంభమూ, ఆధారమూ.

16 మన దైవభక్తిని గురించి వెల్లడైన సత్యం గొప్పది.

ఏ సందేహమూ లేదు. ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు.

ఆయన నీతిపరుడని ఆత్మ తీర్పునిచ్చాడు.

ఆయనను దేవదూతలు చూశారు.

దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు.

లోకం ఆయనను నమ్మింది.

మహిమతో ఆయన ఆరోహణమయ్యాడు.

సంఘం విశ్వాసభ్రష్టత్వాన్ని పౌలు ముందుగా చెప్పడం

దేవుని ఆత్మ ద్వారా పౌలు క్రైస్తవ సంఘం విశ్వాసం నుండి తొలగిపోవడాన్ని ముందుగా చెప్పి, దాని భ్రష్టాచారాల స్వభావాన్ని వివరిస్తాడు. దానికి మార్గం సిద్ధం చేస్తున్నవారిలో యూద ఆచారాలను రుద్దే బోధకులు కూడా ఉన్నారని సూచిస్తాడు. ఈ భ్రష్టాచారాల వైపు మొగ్గుచూపే ప్రతి ప్రవృత్తికీ దూరంగా ఉండమని తిమోతీ హెచ్చరించబడతాడు. సద్గుణాన్నీ దైవభక్తినీ ఆచరించడమే క్రైస్తవునికి ప్రయోజనకరమైన, అంగీకారయోగ్యమైన ఏకైక సేవ అని బోధించమని అతనికి ఉద్బోధించబడుతుంది. అలా చేసినందుకు అతడు నిందించబడతాడు, హింసించబడతాడు; అయినప్పటికీ ఈ ముఖ్యమైన సత్యాన్ని గట్టిగా నొక్కిచెప్పాలని అతనికి చెప్పబడుతుంది.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1–11

1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది. 3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.

4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు. 5 ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి. 6 ఈ సంగతులను సోదరులకు వివరించడం ద్వారా నీవు అనుసరించే విశ్వాస వాక్యాలతో మంచి ఉపదేశంతో ఎదుగుతూ క్రీస్తు యేసుకు మంచి సేవకుడివి అనిపించుకుంటావు.

7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వదిలేసి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. 8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.

9 ఈ సందేశం విశ్వసనీయమైనదీ పూర్తిగా అంగీకరించదగినదీ. 10 మనుషులందరికీ మరి విశేషంగా విశ్వాసులకు ముక్తిప్రదాత అయిన సజీవ దేవుని మీదే మనం నిరీక్షణ పెట్టుకున్నాము. కాబట్టి చెమటోడ్చి పాటుపడుతున్నాం.

11 ఈ సంగతులు ఆదేశించి నేర్పు.

తిమోతీ స్వంత ప్రవర్తనకు పౌలు నిర్దేశాలు ఇవ్వడం

పౌలు తిమోతీకి అతని స్వంత ప్రవర్తన గురించి నిర్దేశాలు ఇస్తూ, తన బోధలో ఊహాపోహలకు సంబంధించిన విషయాలన్నిటినీ పక్కన పెట్టాలని కోరుతాడు. అతడు సంఘానికి ఆదర్శంగా మారి, పరిచర్యకూ పఠనానికీ అధ్యయనానికీ ధ్యానానికీ ఆత్మనిగ్రహానికీ తనను అంకితం చేసుకోవాలి. అలా చేయడం ద్వారా తనను తాను రక్షించుకొని, ఇతరుల రక్షణకు కూడా సాధనంగా ఉంటాడు.

తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12–16

12 నీ యౌవనాన్ని బట్టి ఎవరూ నిన్ను చులకన చేయనియ్యకు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు. 13 నేను వచ్చే వరకూ లేఖనాలను బహిరంగంగా చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు. 14 పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్షం చేయవద్దు.

15 నీ అభివృద్ధి అందరికీ కనబడేలా వీటి మీద మనసు ఉంచి, వీటిని సాధన చెయ్యి. 16 నీ గురించీ ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.