ఎఫెసులో దేమేత్రి అల్లరిమూకను రెచ్చగొట్టడం
పౌలు ఎఫెసులో ఉండడం కొనసాగిస్తాడు. దేమేత్రి అక్కడ అల్లరిమూకను రెచ్చగొడతాడు.
క్రీ.శ. 57
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
23 ఆ రోజుల్లో క్రీస్తు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది. 24 ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి డయానా దేవతకు వెండి విగ్రహాలను చేయిస్తూ అక్కడి పనివారికి మంచి ఆదాయం కల్పించేవాడు.
25 అతడు వారిని, ఆ వృత్తిలో ఉన్న ఇతరులను పోగుచేసి వారితో, “ఈ పని ద్వారా మనకి మంచి ఆదాయం వస్తూ మన జీవనోపాధి బాగా జరుగుతూ ఉందని మీకు తెలుసు. 26 అయితే ఈ పౌలు, చేతులతో చేసిన విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కారని బోధించి, ఎఫెసులో మాత్రమే కాక మొత్తం ఆసియా అంతట చాలామంది ప్రజలను పెడదారి పట్టించాడని మీరు విన్నారు, చూశారు కూడా. 27 పైగా మన వృత్తి మీద శ్రద్ధ తగ్గిపోవడమే కాక, డయానా దేవస్థానం కూడ నిర్లక్షానికి గురై, ఆసియా అంతటా, ఇంకా భూలోకమంతటా పూజలందుకుంటున్న ఈమె ప్రభావం తగ్గిపోతుందేమో అని నాకు భయం వేస్తున్నది” అని వారితో చెప్పాడు.
28 వారు అది విని ఉగ్రులైపోయి, “ఎఫెసీయుల డయానా మహాదేవి” అని కేకలు వేశారు. 29 దానితో పట్టణం బహు గందరగోళంగా తయారైంది. వెంటనే వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియాకు చెందిన గాయి, అరిస్తార్కులను పట్టుకుని దొమ్మీగా అక్కడి నాటక ప్రదర్శనశాలలోకి ఈడ్చుకు పోయారు.
30 పౌలు ఆ జనసమూహం పోగైన సభ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు గాని, శిష్యులు అతనిని వెళ్ళనియ్యలేదు. 31 అంతేగాక ఆసియా దేశాధికారుల్లో అతని స్నేహితులు కొందరు అతనికి కబురు పంపి, “నీవు నాటక ప్రదర్శనశాలలోకి వెళ్ళవద్దు” అని నచ్చజెప్పారు.
32 ఆ సభ గందరగోళంగా ఉంది. కొందరు ఒక రకంగా, మరికొందరు మరో రకంగా కేకలు వేస్తున్నారు. అసలు తామెందుకు అక్కడ గుమిగూడామో చాలా మందికి తెలియనే లేదు. 33 అప్పుడు యూదులు అలెగ్జాండరును ముందుకు తోసి అతనిని జనం ఎదుటికి తెచ్చారు. అలెగ్జాండర్ చేతితో సైగ చేసి ఆ ప్రజలకు వివరణ ఇవ్వాలని చూశాడు. 34 అయితే అతడు యూదుడని వారికి తెలిసి అందరూ మూకుమ్మడిగా రెండు గంటల సేపు ‘ఎఫెసీయుల డయానా మహాదేవి’ అని నినాదాలు చేశారు.
35 అప్పుడు ఊరి కరణం సమూహాన్ని సముదాయించి, “ఎఫెసు వాసులారా, ఎఫెసు పట్టణం డయానా మహాదేవికీ ఆకాశం నుండి పడిన పవిత్ర శిలకూ ధర్మకర్త అని తెలియని వారెవరు? 36 ఈ సంగతులు తిరుగులేనివి కాబట్టి మీరు శాంతం వహించి ఏ విషయంలోనూ తొందరపడకపోతే మంచిది.
37 మీరు ఈ వ్యక్తులను తీసికొచ్చారు గదా, వీరు గుడిని దోచుకున్న వారా? మన దేవతను దూషించారా? 38 దేమేత్రికీ అతనితో ఉన్న కంసాలులకూ వీరి మీద ఆరోపణలు ఏవైనా ఉంటే న్యాయసభలు జరుగుతున్నాయి, అధికారులు ఉన్నారు కాబట్టి వారు ఒకరిపై ఒకరు వ్యాజ్యం వేయవచ్చు. 39 అయితే మీరు ఇతర సంగతులను గురించి విచారణ చేయాలనుకుంటే అవి క్రమమైన సభలోనే పరిష్కారమవుతాయి.
40 మనం ఈ గందరగోళం గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేదు గనక, ఈ రోజు జరిగిన అల్లరిని గురించి అధికారులు మనపై విచారణ జరుపుతారేమో అని భయంగా ఉంది. ఈ విధంగా గుంపు కూడడానికి తగిన కారణం ఏం చెబుతాం?” అని వారితో అన్నాడు. 41 అతడలా చెప్పి సభను ముగించేశాడు.
పౌలు ఎఫెసును విడిచి మాసిదోనియకు వెళ్ళడం
1 ఆ అల్లరి సద్దుమణిగిన తరువాత పౌలు శిష్యులను దగ్గరికి పిలిచి ప్రోత్సాహక వాక్కులు చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియ బయలుదేరాడు.
పౌలు తిమోతీకి రాయడం
తిమోతీ అధ్యక్షత వహించడానికి నియమితుడైన ఎఫెసు సంఘంలో యూద మతోత్సాహులు స్థాపించడానికి ప్రయత్నిస్తున్న తప్పుడు బోధలనూ భ్రష్టాచారాలనూ ఎలా అణచివేయాలో అతనికి నిర్దేశించడానికి పౌలు తన మొదటి లేఖను తిమోతీకి రాస్తాడు.
పౌలు తిమోతీకి అభివందనం చెప్పడం
అభివందనం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:1–2
1 విశ్వాస విషయంలో నా నిజ కుమారుడు తిమోతికి మన రక్షకుడైన దేవుని సంకల్పానుసారం, మన ఆశాభావం అయిన క్రీస్తు యేసు ఆజ్ఞ ప్రకారం అపొస్తలుడైన పౌలు రాస్తున్న సంగతులు. 2 తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభువైన క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.
పౌలు తిమోతీని ఎఫెసులో ఎందుకు ఉంచాడు
క్రైస్తవ బోధలో వంశావళులనూ సంప్రదాయాలనూ కలపడానికి ప్రయత్నిస్తున్న యూద మతోత్సాహులను ఎదిరించడానికే తాను తిమోతీని ఎఫెసులో ఉంచానని పౌలు అతనికి గుర్తుచేస్తాడు.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:3–4
3 నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి. 4 అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు.
ధర్మశాస్త్ర ఉద్దేశం, ఉపయోగం
పౌలు ధర్మశాస్త్ర ఉద్దేశాన్నీ ఉపయోగాన్నీ వివరిస్తాడు. అది నైతిక మంచితనాన్ని విధిస్తూ ప్రతి విధమైన దుష్టత్వాన్నీ ఖండిస్తుంది కాబట్టి, క్రైస్తవ మతంతో పూర్తిగా అనుగుణంగా ఉందని చూపిస్తాడు.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5–11
5 ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.
6 కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు. 7 వారు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాకపోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు. 8 అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.
9 దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ 10 వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.
11 ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.
పౌలును అపొస్తలునిగా చేయడంలో క్రీస్తు కనికరం
ఈ మహిమగల సువార్తకు తనను అపొస్తలునిగా చేసిన క్రీస్తు మంచితనాన్ని గురించి వివరించడానికి పౌలు ప్రధాన విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడతాడు. దేవుడు తనపై చూపిన కనికరాన్ని ఆధారంగా చేసుకొని పాపులందరినీ పశ్చాత్తాపానికి ఆహ్వానిస్తాడు.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12–17
12 నన్ను బలపరచి, నమ్మకమైన వాడుగా ఎంచి తన సేవకు నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి. 13 అంతకు ముందు దేవ దూషకుణ్ణి, హింసించేవాణ్ణి, హానికరుణ్ణి. అయితే తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరం పొందాను. 14 మన ప్రభువు తన ధారాళమైన కృపను నాపై కుమ్మరించి, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ విశ్వాసాలను అనుగ్రహించాడు. 15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.
16 అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు. 17 అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్.
విశ్వాసాన్ని కాపాడుకోమని తిమోతీకి ఆజ్ఞ
ప్రవచనం ద్వారా తిమోతీ క్రైస్తవ పరిచర్యకు నియమితుడయ్యాడని పౌలు అతనికి గుర్తుచేసి, స్వచ్ఛమైన విశ్వాసాన్నీ మంచి మనస్సాక్షినీ పట్టుకొని ఉండమని ప్రోత్సహిస్తాడు. ఈ రెండిటినీ కాపాడుకోని అలెగ్జాండర్, హుమెనై తమ భక్తిహీనతకు శిక్ష పొందుతారు.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18–20
18 తిమోతీ, నా కుమారా, గతంలో నిన్ను గూర్చి చెప్పిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ సూచనలు నీకు ఇస్తున్నాను. వాటిని పాటిస్తే నీవు మంచి పోరాటం చేయగలుగుతావు. 19 అలాటి మనస్సాక్షిని కొందరు నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు. 20 వారిలో హుమెనై, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ మానుకొనేలా వీరిని సాతానుకు అప్పగించాను.
ప్రజలందరి కోసం ప్రార్థించమని పౌలు ఆజ్ఞాపించడం
యూద ఆచారాలను రుద్దే క్రైస్తవులకు వ్యతిరేకంగా, పౌలు క్రైస్తవ మతంలోకి మారినవారిని సువార్తలోని దయాపూర్వక వైఖరితో యూదులైనా యూదేతరులైనా ప్రజలందరి కోసం, ముఖ్యంగా ప్రతి జాతి, దేశంలోని రాజుల కోసం, అధికారంలో ఉన్నవారి కోసం ప్రార్థించమని ఆజ్ఞాపిస్తాడు. ఇది దేవునికి ప్రీతికరమని అతడు ప్రకటిస్తాడు. దేవుడు ప్రజలందరూ రక్షణ పొందాలని కోరుతున్నాడు; దేవునికీ అన్ని జాతుల ప్రజలకీ మధ్య ఉన్న మధ్యవర్తి ఒక్కడే. ఈ సత్యాలను యూదులకే కాక యూదేతరులకు కూడా తెలియజేయడానికి పౌలు నియమితుడయ్యాడు.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1–7
1 మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం, 2 రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.
3 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది. 4 మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.
5 దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు. 6 ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు.
7 దీన్ని గూర్చి ప్రకటించేవానిగా అపొస్తలునిగా దేవుడు నన్ను నియమించాడు. నిజం చెబుతున్నాను. అబద్ధమాడడం లేదు. నేను యూదులు కాని వారికి విశ్వాస సత్యాలను బోధించేవాణ్ణి.