మొదటి ఆదాము, రెండవ ఆదాము
మొదటి ఆదాముకు, రెండవ ఆదాముకు మధ్య ఉన్న పోలిక ద్వారా పునరుత్థాన సత్యం యూదులకు నిరూపించబడుతుంది.
క్రీ.శ. 57
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 15:45–49
45 దీని గురించి, “ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు” అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు. 46 మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు. ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరవాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి. 47 మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. 48 మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే. 49 మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం.
పాపం, మరణంపై విజయం
మన ప్రస్తుత శరీరాలు ఆత్మీయ స్థితిలోకి ప్రవేశించలేవని పౌలు నొక్కిచెబుతాడు. పునరుత్థానం ఎలా జరుగుతుందో, అమరత్వ స్థితిలో పాపం, మరణంపై సంపూర్ణ విజయంతో ఎలాంటి మహిమాన్వితమైన మార్పు సంభవిస్తుందో వివరిస్తాడు. ఈ ఆధారాలపై క్రియాశీలమైన, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని కొరింతీయులు ప్రోత్సహించబడుతున్నారు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 15:50–58
50 సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.
51 ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. 52 బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. 53 నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు,
“విజయం మరణాన్ని మింగివేసింది”
అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.
55 “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?”
56 మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.
57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి. 58 కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.
పేదల కోసం చందాల సేకరణపై పౌలు సూచనలు
కొరింతీయుల చివరి ప్రశ్నకు జవాబిస్తూ, క్రైస్తవులు పేదలకు ఎలా సహాయం అందించాలో పౌలు సూచనలు ఇస్తాడు; వారు సేకరించిన చందాలను యెరూషలేముకు పంపుతానని వాగ్దానం చేస్తాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 16:1–4
1 పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి. 2 నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి. 3 నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను. 4 నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.
పౌలు ముగింపు సందేశాలు, వందనాలు
పౌలు వివిధ సందేశాలతో, వందనాలతో తన పత్రికను ముగిస్తాడు. తన కుమారుడైన తిమోతి గురించి, అపొల్లో వచ్చి వారిని చూడాలని ఉద్దేశిస్తున్నాడని వారికి తెలియజేస్తాడు. తిమోతిని ఆదరించాలని వారికి సిఫారసు చేస్తాడు. విశ్వాసం, ప్రేమ కలిగి ఉండాలని వారిని ప్రోత్సహిస్తాడు. స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికులను ఆదరించాలని వారికి సిఫారసు చేస్తాడు. వందనాలతో, శుభాకాంక్షలతో ముగిస్తాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 16:5–24
5 నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను. 6 అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
7 ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు. 8 కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను. 9 ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
10 తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు. 11 కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.
12 సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.
13 మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి. 14 మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
15 స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు. 16 కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.
17 స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది. 18 నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి.
19 ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు. 20 ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.
21 పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను. 22 ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.
23 ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక. 24 క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్.