యూదయ కోసం ఉదారంగా ఇవ్వాలని పౌలు ప్రోత్సహిస్తున్నాడు

ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న మాసిదోనియలోని సంఘాల ఉదాహరణను చూపిస్తూ, యూదయలోని క్రైస్తవ సహోదరుల సహాయార్థం ఉదారంగా ఇవ్వాలని పౌలు కొరింతీయులను ప్రోత్సహిస్తున్నాడు. దయతో చేసే పనులు స్వచ్ఛందంగా ఉండాలి కాబట్టి తాను దీన్ని ఆజ్ఞగా ఇవ్వడం లేదని చెబుతున్నాడు. అయితే క్రీస్తు ఆదర్శాన్ని, ప్రేమను బట్టి వారు అలాంటి పనులను సమృద్ధిగా చేస్తారని ఆశిస్తున్నాడు. దేవుడు కానుక పరిమాణం కంటే ఇచ్చేవారి సంసిద్ధతకు ఎక్కువ విలువనిస్తాడు కాబట్టి, వారు ఇప్పటికే ప్రారంభించిన చందాల సేకరణను తమ శక్తి మేరకు ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని కోరుతున్నాడు. వారు ఇచ్చేది యూదయలోని పేద సహోదరుల కోసమే ఉపయోగించాలి. ఆ సహోదరులు కూడా తమ వంతుగా కొరింతీయుల అవసరాలను తీర్చగలగవచ్చు.

క్రీ.శ. 58

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 8:1–15

1 సోదరీ సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలోని సంఘాలపై దేవుడు చూపిన కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం. 2 విపరీతమైన బాధలు వారిని పరీక్షిస్తున్నప్పుడు సైతం, వారు అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనా వారి దాతృత్వం చాలా గొప్పది. 3 వారిని గురించి నా సాక్ష్యం ఏమిటంటే, పరిశుద్ధులకు సేవ చేయడానికి తమకు కూడా భాగం ఇవ్వాలని ఎంతో బతిమాలారు. 4 వారు స్వయంగానే ఇవ్వగలిగినంతా ఇచ్చారు. వాస్తవానికి, దానికంటే ఎక్కువే ఇచ్చారు.

5 అంతేకాక వారు మొదట ప్రభువుకూ, తరువాత దేవుని సంకల్పం వలన మాకూ తమను తామే అప్పగించుకున్నారు. ఇలా చేస్తారని మేమెన్నడూ తలంచలేదు. 6 కాబట్టి మీ దగ్గర తీతు ఇప్పటికే మొదలు పెట్టిన ఈ కృపా పరిచర్యను పూర్తి చేయమని మేము అతన్ని ప్రోత్సహించాము.

7 మీరు ప్రతి విషయంలో అంటే విశ్వాసంలో ఉపదేశంలో జ్ఞానంలో శ్రద్ధ అంతటిలో మీకు మా పట్ల ఉన్న ప్రేమలో ఎలా రాణిస్తున్నారో అలానే మీరు ఈ కృపా పరిచర్యలో కూడా తప్పక రాణించండి.

8 ఆజ్ఞలా మీతో చెప్పడం లేదు. ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షిస్తున్నాను. 9 మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు.

10 ఈ విషయంలో మీకు ఉపయోగపడే సలహా ఇస్తాను. ఏడాది క్రితం ఈ పని చేయాలని మొదలు పెట్టారు. అంతే కాదు, తలపెట్టడంలో మొదటి వారు కూడా మీరే. 11 కాబట్టి మీరిప్పుడు ఆ పని పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో ఆ విధంగానే మీరిప్పుడు దాన్ని ముగింపుకు తీసుకు రండి. 12 అసలు ఈ పని చేయాలనే శ్రద్ధ ఉంటే అది మంచిదీ, ఆమోదయోగ్యమైనది కూడా. ఈ ఆమోదం ఒక వ్యక్తి, తనకున్న దాన్ని బట్టే గానీ లేని దాన్ని బట్టి కాదు. 13 ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం కాదు. అందరికీ ఒకే విధంగా ఉండాలనే.

14 “ఎక్కువ ఉన్న వాడికి ఏమీ మిగల్లేదు. తక్కువ ఉన్న వాడికి కొదువ లేదు” అని రాసి ఉంది.

15 ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను.

తీతును, ఇద్దరు సహోదరులను కొరింతుకు పంపడం

తనకు వారిపట్ల ఉన్న శ్రద్ధే తీతుకు కూడా కలిగించినందుకు పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. తీతు తన ఆసక్తి కారణంగా ఈ లేఖను తీసుకువెళ్లడానికి ముందుకొచ్చాడు. తమకు అప్పగించిన పెద్ద మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారనే విషయంలో నిందకు తావిచ్చే అనుమానం ఏదీ రాకుండా, వారి కానుకలను ఎలా నిర్వహిస్తున్నారో దానికి సాక్షిగా ఉండేందుకు మాసిదోనియ సంఘాలు ఎన్నుకున్న, ఎంతో మంచి పేరు గల ఒక సహోదరుణ్ణి తీతుతో పాటు పంపుతున్నానని పౌలు వారికి చెబుతున్నాడు. వారి మంచి మనస్తత్వం గురించి విన్నందువల్ల ఈ సందర్భంలో ఎంతో ఆసక్తి చూపుతున్న మరో తోటి పనివాణ్ణి కూడా పంపుతున్నాడు. విభేదాలు రేపే వర్గం అడిగే ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలో పౌలు వారికి ఉపదేశిస్తున్నాడు. ఈ దూతలకు, సంఘాలకు తమ ప్రేమను, తమపట్ల పౌలుకున్న నమ్మకం నిజమైనదని నిరూపించాలని వారిని ప్రోత్సహిస్తున్నాడు.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 8:16–24

16 మీ పట్ల నాకున్న ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి వందనాలు. 17 అతడు మా విన్నపాన్ని అంగీకరించడమే గాక దాని గురించి ఎంతో ఆసక్తితో తన ఇష్టప్రకారమే మీ దగ్గరికి వస్తున్నాడు. 18 క్రీస్తు ప్రభువు సంఘాలన్నిటిలో సువార్త ప్రకటించే పనిలో ప్రసిద్ధి చెందిన సోదరుణ్ణి అతనితో పంపిస్తున్నాం. 19 అంతేకాక మన ప్రభువు మహిమ కోసం, మాకున్న ఆసక్తికి అనుగుణంగా మేము చేస్తున్న ఈ కృపా పరిచర్యలో మాతో కలిసి ప్రయాణం చేయడానికి సంఘాలు అతన్ని నియమించాయి.

20 మేము సేకరిస్తున్న ఈ విరాళాల విషయంలో ఎవరూ మమ్మల్ని విమర్శించకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నాం. 21 ఎందుకంటే ప్రభువు దృష్టిలోనే కాక మనుషుల దృష్టిలో కూడా గౌరవించదగిన వాటినే చేయాలని మేము జాగ్రత్త పడుతున్నాం. 22 వారితో కూడా మరొక సోదరుణ్ణి మేము పంపుతున్నాం. అతన్ని చాలా విషయాల్లో చాలా సార్లు పరీక్షించి, ఆసక్తి గలవాడని గ్రహించాం. అతనికి మీమీద నమ్మకం కుదిరింది. అతడిప్పుడు మరింత ఆసక్తితో ఉన్నాడు.

23 తీతు విషయంలోనైతే, అతడు నా సేవలో భాగస్థుడు, మీ విషయంలో నా జత పనివాడు. మన సోదరులయితే సంఘ ప్రతినిధులూ క్రీస్తుకు మహిమ తెచ్చేవారు. 24 కాబట్టి వారికి మీ ప్రేమ చూపించండి. ఇతర సంఘాల్లో మీ గురించి మేము ఎందుకు గొప్పగా చెప్పామో వారికి రుజువు చేయండి.

చందాను సిద్ధం చేయడానికి తీతును ముందుగా పంపడం

ఒక సంవత్సరం క్రితమే కొరింతీయుల సంసిద్ధత గురించి తాను మాసిదోనియ ప్రజల ముందు గొప్పగా చెప్పానని పౌలు వారికి ఇంకా గుర్తు చేస్తాడు. అప్పటి నుండి ఈ విషయంలో వారు అశ్రద్ధ చేశారని తీతు ద్వారా తెలుసుకుని, తాను రాకముందే చందాలను సిద్ధం చేయడానికి తీతునూ అతని సహచరులనూ పంపిస్తున్నాడు, వారి గురించి తాను చెప్పిన గొప్పలకు తాను సిగ్గుపడకుండా ఉండడానికీ, వారు ఇచ్చేది లోభుల దగ్గర బలవంతంగా వసూలు చేసినట్టు కాకుండా ఇష్టపూర్వకంగా ఇచ్చినదిగా ఉండడానికీ.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 9:1–5

1 పరిశుద్ధుల కోసమైన ఈ సేవ గురించి నేను మీకు రాయనవసరం లేదు. 2 మీ ఆసక్తి నాకు తెలుసు. దాన్ని గురించి మాసిదోనియ ప్రజల ముందు మిమ్మల్ని పొగిడాను గదా! పోయిన సంవత్సరం నుండి అకయ ప్రాంతం వారు సిద్ధంగా ఉన్నారని వారికి చెప్పాను. మీ ఆసక్తి వారిలో చాలా మందిని ప్రోత్సహించింది. 3 అయితే మీ గురించి మేము గొప్పగా చెప్పిన సంగతులు ఈ విషయంలో వ్యర్థం కాకూడదనీ నేను చెప్పినట్టు మీరు సిద్ధంగా ఉండాలనీ సోదరులను పంపాను.

4 ఒకవేళ మాసిదోనియ వారెవరైనా నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకుంటే మీకే కాదు, మీ మీద ఇంత నమ్మకం ఉంచిన మాకు కూడా అవమానం కలుగుతుంది. 5 అందుచేత సోదరులు ముందుగానే మీ దగ్గరికి వచ్చి పూర్వం మీరు వాగ్దానం చేసిన విరాళం పోగుచేయాలని ప్రోత్సహించడానికి వారిని పంపడం అవసరమని నేను భావించాను. తద్వారా మీ విరాళం బలవంతంగా ఇచ్చింది కాకుండా స్వచ్ఛందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.

సమృద్ధిగా విత్తండి, సంతోషంగా ఇవ్వండి

ఇక్కడ మనం చేసే పనులనుబట్టి మరో లోకంలో మనకు ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి ఉదారంగా ఉండాలని పౌలు కొరింతీయులను ప్రోత్సహిస్తున్నాడు. సంతోషంగా ఇవ్వాలని వారిని ప్రోత్సహిస్తున్నాడు. వారి కృషిని ఆశీర్వదించి, వారి సొంత అవసరాలకూ దానధర్మాలకూ సరిపడా ఈ లోకపు సంపదలను వారికి సమకూర్చే శక్తి దేవునికి ఉంది. సహాయం పొందినవారు సంతోషించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ఇచ్చినవారి కోసం ప్రార్థిస్తారు.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 9:6–15

6 “కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8 అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.

9 దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది.

10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

12 మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది. 13 ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. క్రీస్తు సువార్తను ఒప్పుకుని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, వారు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు. 14 మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు. 15 వర్ణించ శక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.

సమక్షంలోనూ ధైర్యంగా వ్యవహరించగలనని పౌలు హెచ్చరిక

పౌలు ఇప్పుడు ప్రత్యేకంగా అబద్ధ బోధకుణ్ణీ అతని అనుచరులనూ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అతడు సమక్షంలో ఉన్నప్పుడు మాత్రమే సాత్వికుడనీ, దూరంగా ఉన్నప్పుడు లేఖల్లో ధైర్యంగా మాట్లాడతాడనీ వారు అతణ్ణి దూషించారు. తాను శరీరానుసారంగా జీవిస్తున్నానని నిందించేవారు, తాను వారి సమక్షంలో ఉన్నప్పుడు తన ధైర్యాన్ని నిరూపించాల్సిన పరిస్థితి కలిగించవద్దని, ఇప్పుడు దూరంగా ఉన్నప్పటికీ వ్యంగ్యంగా వేడుకుంటున్నాడు. సువార్తకు విరోధమైన ప్రతిదాన్నీ కూలదోయడానికి దేవుడు తనకు ఇచ్చిన అసాధారణ శక్తులను ప్రకటిస్తున్నాడు. వారిలో పశ్చాత్తాపపడినవారి విధేయత సంపూర్ణమైన వెంటనే, అవిధేయతను శిక్షించడానికి తన అద్భుత శక్తిని చూపడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేస్తున్నాడు.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 10:1–6

1 స్వయంగా పౌలు అనే నేను క్రీస్తులో ఉన్న సాత్వీకంతో, మృదుత్వంతో మీకు విన్నపం చేస్తున్నాను. మీతో ఉన్నపుడు దీనునిగా, మీతో లేనపుడు ధైర్యశాలిగా ఉన్నాను గదా! 2 మేము శరీరానుసారంగా నడుస్తున్నామని కొందరంటున్నారు. అలాంటి వారితో నేను విభేధించి ధైర్యంతో వ్యవహరించాలని అనుకుంటున్నాను. అయితే మీతో ఉన్నపుడు నేనలా ఉండకుండాా చేయమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.

3 మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా యుద్ధం చేయం. 4 మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది. 5 వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం. 6 మీ విధేయత పూర్తి అయినప్పుడు అవిధేయతనంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.