బాహ్యరూపాన్ని బట్టి తీర్పు తీర్చడాన్ని గద్దిస్తున్న పౌలు
బాహ్యరూపాన్ని బట్టి తీర్పు తీర్చినందుకు పౌలు అబద్ధ బోధకుణ్ణి గద్దిస్తున్నాడు. తనను కూడా క్రీస్తు సేవకునిగా గుర్తించాలని అడుగుతూ, వారిని అభివృద్ధిపరచడానికి తనకు ఇచ్చిన అధికారాన్ని గురించి అతిశయిస్తున్నాడు. తన ప్రత్యర్థి చేసిన అపవాదులను మళ్లీ వ్యంగ్యంగా ప్రస్తావిస్తున్నాడు. తాను దూరంగా ఉన్నప్పుడే దగ్గరి బంధువుతో లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తికి విధించిన శిక్షలో తన శక్తి ఫలితాలు కనిపించాయి కాబట్టి, తాను సమక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ శక్తి అంతే గొప్పగా ఉంటుందని గ్రహించాలని అతణ్ణి కోరుతున్నాడు.
క్రీ.శ. 58
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 10:7–11
7 మీ ముందున్న వాటిని స్పష్టంగా చూడండి. మీలో ఎవరైనా తాను క్రీస్తు వాడినని నమ్మకం కుదిరితే, అతనెలా క్రీస్తు వాడో మేము కూడా అలానే క్రీస్తు వారిమని తాను గుర్తుంచుకోవాలి. 8 మీ నాశనం కోసం కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు ఇచ్చిన అధికారాన్ని గురించి కాస్త ఎక్కువ అతిశయంగా చెప్పుకున్నా సిగ్గుపడను.
9 నేను రాసే ఉత్తరాలతో మిమ్మల్ని భయపెట్టే వాడిలాగా ఉండకూడదు. 10 కొందరు ఇలా అంటారు, “అతని ఉత్తరాలు గంభీరంగా బలీయంగా ఉన్నాయి, కానీ శరీరం బలహీనం, మాటలు చప్పగా ఉంటాయి.” 11 అలాంటి వారు తెలుసుకోవలసింది ఏంటంటే మేమక్కడ లేనపుడు ఉత్తరాల్లో రాసిన మాటల ప్రకారం ఏమి చెప్పామో మేమక్కడ ఉన్నప్పుడూ అలానే చేస్తాము.
దేవుడు నిర్ణయించిన హద్దుల్లోనే అతిశయించడం
పౌలు తన వ్యంగ్యాన్ని కొనసాగిస్తూ, తనను తాను మాత్రమే కొలమానంగా తీసుకుని, కొరింతులో చేసిన పనులకు తనను తానే పొగడుకునే అబద్ధ బోధకునితో తనను పోల్చుకునే ధైర్యం తనకు లేదని అంటున్నాడు. దానికి భిన్నంగా, దేవుడు తనకు నిర్ణయించిన హద్దుల్లోనే సంతోషించాలని పౌలు కోరుతున్నాడు. దేవుడు నిర్ణయించిన ఆ హద్దులకు విధేయత చూపుతూ అతడు ఇప్పుడు కొరింతీయుల వరకు చేరుకున్నాడు. అబద్ధ బోధకునిలా ఇతరుల కృషిని గురించి అతిశయించడానికి అతడు నిరాకరిస్తూ, ఇంతకుముందు సువార్త ప్రకటించని ప్రాంతాల్లో దాన్ని ప్రకటించాలని ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఇతరుల పని గురించి అతిశయించేవాడు ఆమోదం పొందడు; దేవుని మహిమ కోసం ప్రకటించి, ఆత్మ వరాల ద్వారా వెల్లడయ్యే దేవుని మెప్పును పొందేవాడే ఆమోదం పొందుతాడు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 10:12–18
12 తమను తామే మెచ్చుకొనే వారిలో ఒకరిగా ఉండడానికి గానీ వారితో పోల్చుకోడానికి గానీ మేము తెగించం. అయితే వారు తమకు తాము ఒకరిని బట్టి మరొకరు బేరీజు వేసుకుంటూ ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే వారు తెలివిలేని పని చేస్తున్నట్టు.
13 మేమైతే మా స్థాయికి మించి అతిశయపడం, మిమ్మల్ని చేరగలిగేలా దేవుడు మాకు ఏర్పరచిన హద్దుల్లోనే ఉంటాం. 14 మేము మీ దగ్గరికి వచ్చినపుడు మా హద్దులు మీరలేదు. క్రీస్తు సువార్త మోసుకుంటూ మీ దాకా మొట్టమొదట వచ్చింది మేమే. 15 మేము మా హద్దు మీరి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టు అతిశయపడము. అయితే మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మా పరిధిలో పని ఇంకా ఎక్కువగా అభివృద్ది అవుతుందనీ, దాని వలన 16 మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించాలనీ మా ఆశ. మరొకరి పరిధిలో జరుగుతున్న పని గురించి మేము అతిశయించం. 17 అయితే, “అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి.” 18 ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు గానీ తనను తానే మెచ్చుకొనేవాడు యోగ్యుడు కాడు.
కొరింతీయులు తప్పుదారి పట్టించబడుతున్నారని పౌలు భయం
తనను తాను మెచ్చుకుంటున్నాడనే నిందకు గురైన పౌలు, ఈ సందర్భంలో దాన్ని సహించాలని కొరింతీయులను వేడుకుంటున్నాడు. ఎందుకంటే తాను క్రీస్తు వైపుకు నడిపించినవారు అబద్ధ బోధకుని వల్ల ఆయనకు దూరమయ్యారేమోనని భయపడుతున్నాడు. వారిని తాము నిశ్చయించబడిన భర్తకు పవిత్ర కన్యగా తీర్పు సమయంలో సమర్పించాలని అతడు ఎంతో కోరుకున్నాడు. అపొస్తలుడని వారు చెప్పుకునే వ్యక్తి మరొక రక్షకుణ్ణి గానీ మరొక సువార్తను గానీ వారికి ప్రకటించి ఉంటే, లేదా మరొక ఆత్మను వారికి ఇచ్చి ఉంటే, అతని వాదనలను వారు సహించవచ్చని వాదిస్తున్నాడు. తాను క్రీస్తు ప్రధాన అపొస్తలులకు సమానుడనని స్పష్టం చేస్తున్నాడు. మాటలాడటంలో నైపుణ్యం లేకపోయినా, సువార్త సేవకునికి అవసరమైన జ్ఞానం తనకు కొదువలేదని వారికి చూపించానని అంటున్నాడు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 11:1–6
1 నా బుద్దిహీనతను దయతో సహించమని కోరుతున్నాను, నిజానికి మీరు సహిస్తూనే ఉన్నారు. 2 మీ గురించి నేను రోషంతో ఉన్నాను. మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అంటే క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. అయితే, 3 సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.
4 ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక మీరు పొందని వేరొక ఆత్మను పొందినా, మీరు అంగీకరించని వేరొక సువార్త మీరు అంగీకరించినా, మీరు వాటిని బాగానే సహిస్తున్నారు.
5 ఆ “గొప్ప అపొస్తలుల” కంటే నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను. 6 ఎలా బోధించాలో నేను నేర్చుకోక పోయినా తెలివిలో నేర్పులేని వాడిని కాను. అన్ని రకాలుగా అన్ని విషయాల్లో దీన్ని మీకు తెలియజేసాం.
పౌలు కొరింతు నుండి పారితోషికం ఎందుకు తీసుకోలేదు
కొరింతీయుల నుండి పోషణను ఎందుకు స్వీకరించలేదో పౌలు వివరిస్తున్నాడు. తన శత్రువులు సూచించినట్లు దయలేకపోవడం వల్ల కాదనీ, వారిపట్ల తనకున్న ప్రేమ వల్లనూ, తాను లోకసంబంధమైన లాభం కోసం పనిచేస్తున్నానని అబద్ధ బోధకుడు చెప్పకుండా ఉండటానికీ అలా చేశానని ప్రకటిస్తున్నాడు. రహస్యంగా కానుకలు స్వీకరించే ఆ అబద్ధ బోధకుడు ఆ పద్ధతిని విడిచిపెట్టి పౌలు మాదిరిని అనుసరించేలా ఒత్తిడి చేయడం కూడా దాని ఉద్దేశం. సాతాను తానే వెలుగు దూత రూపం ధరిస్తాడు కాబట్టి, సాతాను సేవకులు క్రీస్తు సేవకుల లేదా అపొస్తలుల పదవిని తమపై వేసుకోవడం ఆశ్చర్యం కలిగించకూడదు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 11:7–15
7 మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేనే తగ్గించుకుని తప్పు చేశానా?
8 మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను “దోచుకున్నాను.” 9 నేను మీతో ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరి మీదా భారం మోపలేదు. మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చిన సోదరులు నా అవసరాలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండాా చూసుకున్నాను. ఇంకా అలానే చేస్తూ ఉంటాను.
10 క్రీస్తు సత్యం నాలో ఉండడం వలన అకయ ప్రాంతాల్లో నా అతిశయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. 11 ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమించనందుకా? నేను ప్రేమిస్తున్నట్టు దేవునికే తెలుసు. 12 అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.
13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.
తన శ్రమలను, బాధలను గురించి అతిశయిస్తున్న పౌలు
పౌలు తన అతిశయాన్ని సహించాలని కొరింతీయులను మళ్లీ వేడుకుంటున్నాడు. అపొస్తలులు కానివారు శరీరసంబంధమైన విషయాల్లో అతిశయిస్తున్నారు కాబట్టి, అపొస్తలునిగా తన స్థాయిని సమర్థించుకోవడానికి తాను కూడా తన సున్నతిని, యూదుల వంశానికి చెందినవాడిననే విషయాన్ని గురించి అతిశయించాలి. ఇతరుల పెత్తనపు తీరును కొరింతీయులు అతిగా సహించారని చూపిస్తూ, అబద్ధ బోధకుడు వారితో ప్రవర్తించిన తీరును వివరిస్తున్నాడు. తాను నీచ వంశంలో పుట్టినవాడనీ, బలహీనుడనీ, అపొస్తలునిగా ఉండటానికి అనర్హుడనీ వచ్చిన నిందకు జవాబుగా, ఎవరికైనా అతిశయించడానికి కారణం ఉంటే తనకూ ఉందని స్పష్టం చేస్తున్నాడు. ఈ విషయాల్లో తనను అబద్ధ బోధకునితో పోల్చుకుంటూ, తన శ్రమలు, బాధలు, సంఘాల పట్లా వ్యక్తుల పట్లా తనకున్న గొప్ప శ్రద్ధను చూపి తన ఆధిక్యతను వెల్లడిస్తున్నాడు. బలహీనుల పట్ల సానుభూతి చూపుతూ, తప్పుదారి పట్టినవారిని తిరిగి సంపాదించుకోవడానికి ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. దేవుని శక్తి వెల్లడయ్యేలా తన బలహీనతను గురించి, ముఖ్యంగా దమస్కు నుండి తప్పించుకున్న విషయాన్ని గురించి అతిశయిస్తున్నాడు.
కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక 11:16–33
16 మళ్ళీ చెబుతున్నాను. నేను బుద్ధిహీనుడినని ఎవరూ అనుకోవద్దు. అలా అనుకుంటే, నేను కొంచెం అతిశయపడేలా, నన్ను బుద్ధిహీనుడిగానే చేర్చుకోండి. 17 గొప్పలు చెప్పుకుంటూ నేను అతిశయంగా చెప్పే ఈ విషయాలు ప్రభువు మాటగా చెప్పడం లేదు, బుద్ధిహీనుడిలా చెబుతున్నాను. 18 చాలామంది శరీరానుసారంగా అతిశయిస్తున్నారు. నేనూ అతిశయిస్తాను. 19 తెలివిగల మీరు బుద్ధిహీనులను సంతోషంతో సహిస్తున్నారు. 20 ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చేసినా, మీలో విభేదాలు కలిగించినా, మిమ్మల్ని వశం చేసుకున్నా, తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నా, చెంప దెబ్బ కొట్టినా మీరు సహిస్తున్నారు. 21 వారు చేసినట్టు చేయలేని బలహీనులమని సిగ్గుతో చెబుతున్నాను. అయితే, ఎవరైనా ఎపుడైనా అతిశయిస్తుంటే-బుద్ధిహీనుడిలా మాట్లాడుతున్నాను-నేనూ అతిశయిస్తాను.
22 వారు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రాహాము సంతానమా? నేను కూడా.
23 వారు క్రీస్తు సేవకులా? (వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) నేను కూడా ఇంకా ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి. వారికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను. అనేకమార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. 24 యూదుల చేత ఐదు సార్లు “ఒకటి తక్కువ నలభై” కొరడా దెబ్బలు తిన్నాను. 25 మూడు సార్లు నన్ను బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు పగిలిపోయాయి. ఒక పగలు, ఒక రాత్రి సముద్రంలో గడిపాను.
26 తరచుగా ప్రయాణాల్లో అపాయాలకు గురయ్యాను. నదుల్లో అపాయాలూ దోపిడీ దొంగల వలన అపాయాలూ నా సొంత ప్రజల వలన అపాయాలూ యూదేతరుల వలన అపాయాలూ పట్టణాల్లో అపాయాలూ అరణ్యాల్లో అపాయాలూ సముద్రంలో అపాయాలూ కపట సోదరుల వల్ల అపాయాలూ నాకు ఎదురయ్యాయి. 27 కష్ట పడ్డాను. వేదన అనుభవించాను. నిద్ర కరువైన అనేక రాత్రులు గడిపాను. చలితో, ఆకలి దప్పులతో, తినడానికి ఏమీ లేక, బట్టల్లేక ఉన్నాను.
28 ఈ విషయాలు మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాలన్నిటిని గురించిన దిగులు రోజూ నా మీద భారంగా ఉంది. 29 మీలో ఒకడు బలహీనుడైతే, నేనూ బలహీనుణ్ణి కాకుండా ఉండగలనా? ఒకడు ఇతరుల వల్ల పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా?
30 అతిశయపడాల్సి వస్తే నేను నా బలహీనతలను కనపరిచే వాటిలోనే అతిశయిస్తాను. 31 ఎప్పటికీ స్తుతి పాత్రుడైన మన ప్రభు యేసు తండ్రి అయిన దేవునికి నేను అబద్ధమాడడం లేదని తెలుసు. 32 దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధికారి నన్ను పట్టుకోవడం కోసం దమస్కు పట్టణానికి కాపలా పెట్టాడు. 33 అప్పుడు నన్ను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దించితే అతని చేతికి చిక్కకుండా తప్పించుకున్నాను.