చెర తప్పదనే హెచ్చరికలు (continued)

యూదుల చెర, యెరూషలేము నాశనం తప్పవని ప్రకటిస్తూ వారికి చేసిన వివిధ ప్రవచనాలు, విజ్ఞప్తులు.

క్రీ.పూ. 609

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యిర్మీయా 16–17

1 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,

2 “నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఈ స్థలంలో నీ కోసం కొడుకులనుగానీ కూతుళ్ళను గానీ కనొద్దు.”

3 ఈ స్థలంలో పుట్టే కొడుకుల గురించి కూతుళ్ళ గురించి, వాళ్ళను కనిన తల్లులను గురించి, ఈ దేశంలో వాళ్ళను కనిన తండ్రులను గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు.

4 “వాళ్ళు ఘోరమైన చావు చస్తారు. వాళ్ళను గురించి ఎవ్వరూ ఏడవరు. వాళ్ళను పాతిపెట్టరు. వాళ్ళు భూమి మీద పెంటకుప్పలాగా పడి ఉంటారు. వాళ్ళు కత్తితో, కరువుతో నశిస్తారు. వాళ్ళ శవాలు రాబందులకూ భూజంతువులకూ ఆహారంగా ఉంటాయి.”

5 యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను ఈ ప్రజలకు నా శాంతి, నా దయ, నా వాత్సల్యం తీసివేశాను, కాబట్టి విలపించే వాళ్ళ ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వాళ్ళను గురించి విలపించడానికి వెళ్ళవద్దు. ఎవరినీ ఓదార్చడానికి వెళ్ళవద్దు.” ఇది యెహోవా వాక్కు.

6 ఈ దేశంలో గొప్పవాళ్ళు, సామాన్యులు అందరూ చస్తారు. వాళ్ళను ఎవ్వరూ పాతిపెట్టరు. వాళ్ళ గురించి ఎవరూ ఏడవరు. తమను తాము గాయపరచుకోరు. తలవెంట్రుకలు కత్తిరించుకోరు.

7 చచ్చినవారి గురించి ప్రజలను ఓదార్చడానికి వారితో కలిసి తినే వాళ్ళెవరూ ఉండరు. ఒకరి నాన్న గానీ అమ్మ గానీ చనిపోతే కూడా ఎవరూ వారిని ఓదార్చేలా తాగడానికి ఏమీ ఇవ్వరు.

8 విందు జరిగే ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వారితో కూర్చుని తిని తాగొద్దు.

9 ఇశ్రాయేలు దేవుడు, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “మీ కళ్ళ ముందే మీ రోజుల్లోనే ఇక్కడే సంతోష ధ్వనినీ ఉత్సవ ధ్వనినీ పెళ్ళి కొడుకు, పెళ్లి కూతురు స్వరాలనూ ఆపబోతున్నాను.”

10 నువ్వు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియచేసిన తరువాత, వారు “యెహోవా మాకెందుకు ఈ ఘోర విపత్తు నిర్ణయించాడు? మా దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మేము చేసిన దోషం, పాపం ఏమిటి?” అని నిన్ను అడుగుతారు.

11 అప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట చెబుతున్నాడు. మీ పూర్వీకులు నన్ను విడిచి వేరే దేవుళ్ళను అనుసరించి పూజించి వాటికి మొక్కారు. వాళ్ళు నన్ను వదిలేసి నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.

12 వినండి. మీరంతా నా మాట వినకుండా మీ చెడ్డ హృదయ కాఠిన్యం ప్రకారం నడుచుకుంటున్నారు. మీరు మీ పూర్వీకుల కంటే మరి ఎక్కువ దుర్మార్గం చేశారు.

13 కాబట్టి నేను మీ పట్ల ఏమాత్రం దయ చూపను. ఈ దేశం నుంచి మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని దేశంలోకి ఇక్కడ నుంచి మిమ్మల్ని విసిరివేస్తాను. అక్కడ మీరు రాత్రింబగళ్ళు ఇతర దేవుళ్ళను పూజిస్తారు.”

14 యెహోవా తెలియజేసేదేమిటంటే “నేను వారి పూర్వీకులకు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ రప్పిస్తాను. కాబట్టి రాబోయే రోజుల్లో ‘ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవం తోడు’ అని ఇకమీదట అనరు.

15 కానీ ‘ఉత్తరదేశంలో నుంచి ఆయన వారిని తరిమిన దేశాలన్నిటిలో నుంచి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవం తోడు’ అని ప్రజలు ప్రమాణం చేస్తారు.”

16 ఇదే యెహోవా వాక్కు. “వాళ్ళను పట్టుకోడానికి నేను చాలామంది జాలరులను పిలిపిస్తాను. తరువాత ప్రతి పర్వతం మీద నుంచి ప్రతి కొండ మీద నుంచి మెట్టల సందుల్లోనుంచి వారిని వేటాడి తోలివేయడానికి చాలామంది వేటగాళ్ళను పిలిపిస్తాను.

17 ఎందుకంటే వారు వెళ్ళిన దారులన్నిటి మీద నా దృష్టి ఉంది. ఏదీ నాకు కనిపించకుండా పోలేదు. వారి దోషం నా కళ్ళకు తేటతెల్లమే.

18 వాళ్ళు తమ నీచమైన విగ్రహాలతో నా సొత్తు నింపారు. నా దేశాన్ని అపవిత్రపరచారు. కాబట్టి నేను మొదట వారి దోషాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేస్తాను.”

19 యెహోవా, నువ్వే నా బలం. నా దుర్గం. దురవస్థలో ఆశ్రయంగా ఉన్నావు. ప్రపంచమంతటి నుంచి రాజ్యాలు నీ దగ్గరికి వచ్చి “మా పూర్వీకులు, వ్యర్ధాన్ని స్వతంత్రించుకున్నారు. అవి వట్టివి విగ్రహాలు. అవి పనికిమాలినవి” అని చెబుతారు.

20 మనుషులు తమకు దేవుళ్ళను కల్పించుకుంటారా? అయినా వారు దేవుళ్ళు కారు.

21 కాబట్టి “నా పేరు యెహోవా” అని వారు తెలుసుకునేలా నేను ఈసారి వారికి నేర్పిస్తాను. నా బలం, నా శౌర్యం ఎంతటివో వారికి తెలియజేస్తాను.

17:1 యూదా పాపం వజ్రపు కొన ఉన్న ఇనుప కలంతో రాసి ఉంది. అది వారి హృదయాలు అనే పలకల మీద, మీ బలిపీఠాల కొమ్ముల మీద చెక్కి ఉంది.

2 వారి ప్రజలకు ఎత్తయిన కొండల మీదున్న తమ బలిపీఠాలూ పచ్చని చెట్ల కిందున్న అషేరా దేవతా స్థంభాలూ గుర్తే.

3 సరిహద్దుల్లోని పర్వతాల మీదున్న వారి బలిపీఠాలు వారికి గుర్తే. నీ ఆస్తిని, నీ నిధులన్నిటిని దోపుడు సొమ్ముగా నేనప్పగిస్తాను. మీ పాపం మీ దేశమంతా ఉంది.

4 నేను నీకిచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. మీరు నా కోపాగ్ని రగులబెట్టారు. అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది. నీవెరుగని దేశంలో నీ శత్రువులకు నువ్వు బానిసవవుతావు.

5 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు “మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు బలంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీదనుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు.

6 వాడు ఎడారిలోని పొదలాగా ఉంటాడు. వాడికి ఏ మేలూ కనబడదు. వాడు ఎడారిలో రాళ్ళ మధ్య, చవిటి భూమిలో నిర్జన ప్రాంతంలో నివసిస్తాడు.

7 అయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు.

8 వాడు నీళ్ళ ఊట దగ్గర చెట్టులాగా ఉంటాడు. దాని వేళ్ళు చుట్టుపక్కలా వ్యాపిస్తాయి. ఎండ వచ్చినా దానికి చలనం ఉండదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. కరువు కాలాల్లో కంగారు పడదు. కాపు మానదు.

9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?

10 నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను.

11 కౌజుపిట్ట తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది. ఎవడైనా అక్రమంగా ఆస్తి సంపాదించుకోగలడు. అయితే తన ఉచ్ఛదశలో ఆ ఆస్తి వాణ్ణి వదిలేస్తుంది. చివరికి వాడు తెలివితక్కువవాడని తేలుతుంది.”

12 మొదటి నుంచి మా దేవాలయ స్థలం ఘనమైన సింహాసనం లాంటిది.

13 యెహోవాయే ఇశ్రాయేలుకు ఆశాభావం. నిన్ను విడిచిపెట్టే వాళ్ళంతా సిగ్గుపాలవుతారు. దేశంలో నీనుంచి దూరమైన వాళ్ళతో సంబంధం తెగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు యెహోవా అనే జీవజలాల ఊటను వదిలేశారు.

14 యెహోవా, నన్ను బాగు చెయ్యి. నేను బాగుపడతాను! నన్ను కాపాడు. నేను క్షేమంగా ఉంటాను. నువ్వే నా స్తుతి పాట.

15 వాళ్ళు “యెహోవా వాక్కు ఎక్కడుంది? దాన్ని రానివ్వు” అంటున్నారు.

16 నేను నిన్ను అనుసరిస్తూ కాపరిగా ఉండడం మానలేదు. విపత్తుదినం కోసం నేను ఎదురు చూడలేదు. నా నోట నుంచి వచ్చిన మాటలు నీకు తెలుసు. అవి నీ దగ్గరనుంచే వచ్చాయి.

17 నువ్వు నాకు భయకారణంగా ఉండవద్దు. విపత్తు రోజున నువ్వే నా ఆశ్రయం.

18 నన్ను తరిమేవాళ్ళు సిగ్గుపడాలి, కానీ నన్ను సిగ్గుపడనివ్వొద్దు. నన్ను దిగులు పడనివ్వక వాళ్ళను దిగులు పడనివ్వు. వాళ్ళ మీదికి ఆపద రోజులు రప్పించు. రెట్టింపు నాశనం వాళ్ళ మీదికి రప్పించు.

19 యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు వెళ్లి యూదా రాజులు వచ్చిపోయే కోట గుమ్మంలో, ఆ తర్వాత యెరూషలేము ద్వారాలన్నిటిలో నిలబడు.

20 వారితో ఇలా చెప్పు, యూదా రాజులారా! యూదా ప్రజలారా! యెరూషలేము నివాసులారా! ఈ ద్వారాలగుండా ప్రవేశించే మీరంతా యెహోవా మాట వినండి.

21 యెహోవా చెప్పేదేమిటంటే, మీరు జాగ్రత్తగా ఉండి విశ్రాంతి దినాన బరువులు మోయవద్దు. యెరూషలేము ద్వారాలగుండా వాటిని తీసుకు రావద్దు.

22 విశ్రాంతి దినాన మీ ఇళ్ళలోనుంచి బరువులు మోసుకుపోవద్దు. మరి ఏ పనీ చేయవద్దు. నేను మీ పూర్వీకులకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పవిత్ర దినంగా ఆచరించండి.

23 అయితే వాళ్ళు వినలేదు, శ్రద్ధ వహించలేదు. తలబిరుసుగా ఉండి నా మాట వినక, క్రమశిక్షణ పాటించలేదు.”

24 యెహోవా ఇలా చెప్పాడు. “మీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతి దినాన మరే పనీ చేయక దాన్ని పవిత్ర దినంగా ఆచరించండి. విశ్రాంతి దినాన ఈ పట్టణపు ద్వారాల గుండా బరువులు తీసుకు రాకండి.

25 అప్పుడు దావీదు సింహాసనమెక్కే రాజులూ అధిపతులూ ఈ నగర ద్వారాలగుండా ప్రవేశిస్తారు. రథాల మీదా గుర్రాల మీదా ఎక్కి తిరిగే రాజులూ అధిపతులూ యూదావారూ యెరూషలేము నివాసులూ వస్తారు. ఈ పట్టణం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

26 ప్రజలు దహనబలులనూ బలులనూ నైవేద్యాలనూ ధూపద్రవ్యాలనూ స్తుతియాగ ద్రవ్యాలనూ నా మందిరానికి తెస్తారు. వాళ్ళు యూదా పట్టణాల్లో నుంచి, యెరూషలేము ప్రాంతాల్లో నుంచి, బెన్యామీను దేశంలో నుంచి, మైదాన ప్రాంతంలో నుంచి, కొండసీమ నుంచి, దక్షిణ ప్రదేశం నుంచి వస్తారు.

27 అయితే మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించి, ఆ దినాన బరువులు మోస్తూ యెరూషలేము ద్వారాల గుండా ప్రవేశించకూడదని నేను చెప్పిన మాట వినకపోతే నేను దాని ద్వారాల్లో మంట పెడతాను. అది రాజ భవనాలను కాల్చివేస్తుంది. దాన్ని ఆర్పడం ఎవరి తరమూ కాదు.”