చెర తప్పదనే హెచ్చరికలు (continued)

యూదుల చెర, యెరూషలేము నాశనం తప్పవని ప్రకటిస్తూ వారికి చేసిన వివిధ ప్రవచనాలు, విజ్ఞప్తులు.

క్రీ.పూ. 609

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యిర్మీయా 14–15

1 కరువు గురించి యెహోవా యిర్మీయాకు ఇలా చెప్పాడు,

2 “యూదా రోదించాలి. దాని ద్వారాలు పడిపోవాలి. వాళ్ళు భూమి కోసం ఏడుస్తున్నారు. యెరూషలేము కోసం వాళ్ళు చేస్తున్న రోదన పైకి వెళ్తూ ఉంది.

3 వాళ్ళ నాయకులు తమ పనివాళ్ళను నీళ్ల కోసం పంపుతారు. వాళ్ళు బావుల దగ్గరికి పోతే నీళ్లుండవు. ఖాళీ కుండలతో వాళ్ళు తిరిగి వస్తారు. సిగ్గుతో అవమానంతో తమ తలలు కప్పుకుంటారు.

4 దేశంలో వాన రాకపోవడంతో నేల బీటలు వారింది. రైతులు సిగ్గుతో తమ తలలు కప్పుకుంటున్నారు.

5 గడ్డి లేకపోవడంతో లేడి కూడా తన పిల్లలను పొలాల్లో వదిలేస్తున్నది.

6 అడవి గాడిదలు చెట్లులేని మెట్టల మీద నిలబడి నక్కల్లాగా రొప్పుతున్నాయి. మేత లేక వాటి కళ్ళు పీక్కుపోతున్నాయి.”

7 యెహోవా, మా అపరాధాలు మా మీద నేరారోపణ చేస్తున్నప్పటికీ, నీ నామం కోసం కార్యం జరిగించు. చాలాసార్లు దారి తప్పాం. నీకు విరోధంగా మేము పాపం చేశాం.

8 ఇశ్రాయేలు ఆశ్రయమా! కష్టకాలంలో వారిని రక్షించేవాడివి. దేశంలో నువ్వెందుకు పరాయివాడిగా ఉన్నావు? ఒక్క రాత్రే బస చేసే బాటసారిలా ఎందుకు ఉన్నావు?

9 కలవరపడిన వాడిలా, ఎవరినీ కాపాడలేని శూరునిలా నువ్వెందుకున్నావు? యెహోవా, నువ్వు మా మధ్య ఉన్నావు! నీ పేరు మా మీద నిలిచి ఉంది. మమ్మల్ని విడిచి పెట్టవద్దు.

10 యెహోవా ఈ ప్రజలను గురించి ఇలా చెబుతున్నాడు. “తిరుగులాడడం అంటే వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళు తమ కాళ్లను అదుపులో ఉంచుకోవడం లేదు.” యెహోవా వారిపట్ల ఇష్టంగా లేడు. ఇప్పుడు ఆయన వారి అక్రమాన్ని గుర్తుకు తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షించాడు.

11 అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజల మేలు కోసం ప్రార్థన చేయవద్దు.

12 వాళ్ళు ఉపవాసమున్నప్పటికీ నేను వారి మొర వినను. వాళ్ళు దహనబలులూ నైవేద్యాలూ అర్పించినా నేను వాటిని అంగీకరించను. కత్తితో, కరువుతో, అంటువ్యాధులతో వారిని నాశనం చేస్తాను.”

13 అందుకు నేనిలా అన్నాను “అయ్యో, యెహోవా ప్రభూ! ‘మీరు కత్తి చూడరు. మీకు కరువు రాదు. ఈ స్థలంలో నేను స్థిరమైన భద్రత మీకిస్తాను’ అని ప్రవక్తలు వాళ్ళతో ఇలా చెబుతున్నారు.”

14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. “ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. వాళ్ళకు ఎలాంటి ఆజ్ఞా ఇవ్వలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. అయితే వాళ్ళ హృదయాల్లోనుంచి మోసపూరితమైన దర్శనాలూ పనికిమాలిన, మోసపు శకునాలూ వస్తున్నాయి. వీటినే వాళ్ళు మీకు ప్రవచిస్తున్నారు.

15 అందుచేత యెహోవా అనే నేను చెబుతున్నది ఏమంటే, నేను వాళ్ళను పంపకపోయినా, నా పేరును బట్టి కత్తిగానీ కరువుగానీ ఈ దేశంలోకి రాదు అని చెబుతున్నారు. ఆ ప్రవక్తలు కత్తితో కరువుతో నాశనమవుతారు.”

16 “వాళ్ళెవరితో అలాంటి ప్రవచనాలు చెబుతారో ఆ ప్రజలు కరువుకూ కత్తికీ గురై, యెరూషలేము వీధుల్లో కూలుతారు. నేను వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ మీదికి రప్పిస్తాను. వాళ్ళనూ వాళ్ళ భార్యలనూ వాళ్ళ కొడుకులనూ కూతుళ్ళనూ పాతిపెట్టడానికి ఎవడూ ఉండడు.”

17 “నువ్వు వాళ్ళతో ఈ మాటలు చెప్పు, కన్య అయిన నా ప్రజల కూతురు ఘోరంగా పతనమవుతుంది. అది మానని పెద్ద గాయం పాలవుతుంది. రాత్రి, పగలు నా కళ్ళ నుంచి కన్నీళ్లు కారనివ్వండి.

18 పొలంలోకి వెళ్లి చూసినప్పుడు కత్తితో చచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పట్టణంలోకి వెళ్లి చూస్తే కరువుతో అలమటించే వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రవక్తలూ యాజకులూ తెలివిలేక తిరుగుతున్నారు.”

19 నువ్వు యూదాను పూర్తిగా వదిలేశావా? సీయోను అంటే నీకు అసహ్యమా? మేము కోలుకోలేనంతగా నువ్వు మమ్మల్ని ఎందుకు కొట్టావు? మేము శాంతి కోసం ఆశించాం గానీ మేలు కలిగించేది ఏదీ రాలేదు. కోలుకునేలా ఎదురు చూశాం గానీ చుట్టూ భయానక దృశ్యాలే.

20 యెహోవా, మేము నీకు విరోధంగా పాపం చేశాం. మా దుర్మార్గాన్నీ మా పూర్వీకుల దోషాన్నీ మేము ఒప్పుకుంటున్నాం.

21 నీ పేరును బట్టి మిమ్మల్ని గౌరవించేలా మమ్మల్ని తోసివేయవద్దు. మాతో నువ్వు చేసిన నిబంధనను గుర్తు చేసుకో. దాన్ని భంగం చేయవద్దు.

22 ఇతర రాజ్యాలు పెట్టుకున్న విగ్రహాలు ఆకాశం నుంచి వాన కురిపిస్తాయా? మా యెహోవా దేవా, ఇలా చేసేది నువ్వే గదా! ఇవన్నీ నువ్వే చేస్తున్నావు, నీ కోసమే మేము ఆశాభావంతో ఉన్నాము.

15:1 అప్పుడు యెహోవా నాకిలా చెప్పాడు. “మోషే అయినా సమూయేలైనా నా ఎదుట నిలబడినప్పటికీ ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఒప్పుకోదు. నా దగ్గర నుంచి వాళ్ళను వెళ్లగొట్టు. వాళ్ళను వెళ్లనియ్యి.”

2 “మేమెక్కడికి వెళ్ళాలి?” అని వాళ్ళు నిన్నడితే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావు కోసం ఏర్పాటైన వాళ్ళు చావుకూ, కత్తి కోసం ఏర్పాటైన వాళ్ళు కత్తికీ, కరువు కోసం ఏర్పాటైన వాళ్ళు కరువుకూ, చెరకు ఏర్పాటైన వాళ్ళు చెరకూ వెళ్ళాలి.

3 చంపడానికి కత్తినీ, చీల్చడానికి కుక్కలనూ, తినివేయడానికీ నాశనం చేయడానికీ ఆకాశ పక్షులనూ, భూమి మీద తిరిగే మృగాలనూ పంపిస్తాను. ఈ నాలుగు రకాల బాధలు వారికి వస్తాయి.” ఇది యెహోవా వాక్కు.

4 యూదా రాజు హిజ్కియా కొడుకు మనష్షే యెరూషలేములో చేసిన పనులను బట్టి భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటికీ భీతి కలిగేలా చేస్తాను.

5 యెరూషలేమా, నిన్ను ఎవరు కనికరిస్తారు? నీ గురించి ఎవరు ఏడుస్తారు? నీ బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? ఇది యెహోవా వాక్కు.

6 నువ్వు నన్ను వదిలేసావు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. కాబట్టి నా చేత్తో నిన్ను కొడతాను. నిన్ను నాశనం చేస్తాను. నీ మీద జాలిపడి విసిగిపోయాను.

7 దేశం గుమ్మాల్లో నేను వారిని చేటతో తూర్పారపడతాను. నా ప్రజలు తమ పద్ధతులను విడిచి నా దగ్గరికి రావడం లేదు కాబట్టి వాళ్ళను నాశనం చేస్తాను. వారికి వియోగం కలిగిస్తాను.

8 వారి వితంతువుల సంఖ్య సముద్రతీరాన ఇసుక కంటే ఎక్కువయ్యేలా చేస్తాను. నేను మధ్యాహ్నం సమయంలో యువకుల తల్లుల మీదికి నాశనం చేసేవాణ్ణి పంపిస్తాను. వారి మీదికి భయం, దిగ్భ్రాంతి ఆకస్మాత్తుగా రప్పిస్తాను.

9 ఏడుగురిని కనిన స్త్రీ నీరసించి ప్రాణం విడుస్తుంది. పగటి సమయం ఇంకా ఉండగానే ఆమె పొద్దు ముగుస్తుంది. ఆమె సిగ్గుతో అవమానం పాలవుతుంది. మిగిలిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేస్తాను. ఇది యెహోవా వాక్కు.

10 అయ్యో నాకెంతో బాధ! అమ్మా! దేశస్థులందరితో కలహాలు పెట్టుకునేవాడిగా నన్ను కన్నావు. నేనెవరికీ అప్పివ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినా వారంతా నన్ను దూషిస్తున్నారు.

11 అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “మంచి కోసం నేను నిన్ను తప్పించనా? తప్పకుండా విపత్తులో బాధలో నీ శత్రువులు నీ సాయాన్ని అర్థించేలా చేస్తాను.

12 ఇనుమును, మరి ముఖ్యంగా ఉత్తర దేశం నుంచి వచ్చిన కంచు కలిసిన ఇనుమును ఎవడైనా విరగ గొట్టగలడా?

13 మీ ప్రాంతాలన్నిటిలో మీరు చేసే పాపాలన్నిటికీ మీ సంపదనూ మీ విలువైన వస్తువులనూ నేను దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను.

14 నువ్వెరుగని దేశంలో మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను. నా కోపం మంటల్లాగా రగులుకుంది. అది మిమ్మల్ని దహిస్తుంది.

15 యెహోవా, నా బాధ నీకే తెలుసు. నన్ను గుర్తు చేసుకుని సాయం చెయ్యి. నన్ను బాధించే వారి మీద నా కోసం ప్రతీకారం చెయ్యి. నువ్వు ఓర్పు వహించి నన్ను తీసుకుపోవద్దు. నీ కోసమే నేను నింద భరిస్తున్నానని గుర్తు చేసుకో.

16 సేనల ప్రభువైన యెహోవా, నేను నీ పేరు పెట్టుకున్నాను. నీ మాటలు నాకు దొరికితే నేను వాటిని తిన్నాను. నీ మాటలు నాకెంతో సంతోషంగా హృదయానందంగా ఉన్నాయి.

17 వేడుక చేసుకునే వాళ్ళ గుంపులో నేను కూర్చుని సంతోషించలేదు. నీ బలమైన చెయ్యి నా మీద ఉంది. కడుపుమంటతో నువ్వు నన్ను నింపావు. కాబట్టి, నేను ఒంటరిగా కూర్చున్నాను.

18 నా బాధకు అంతం లేదెందుకు? నా గాయం ఎందుకు ఘోరమై నయం కాకుండా ఉంది? నువ్వు నాకు మోసజలం లాగా, ఇంకిపోయే ఊటలాగా ఉంటావా?”

19 అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు. “యిర్మీయా, నువ్వు నావైపు తిరిగితే నువ్వు నా సన్నిధిని నిలిచేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. యోగ్యమైన వాటిలో నుంచి పనికిమాలిన వాటిని నువ్వు తీసేస్తే నా నోటిలాగా నువ్వుంటావు. ప్రజలు నీవైపుకు తిరుగుతారు. అయితే నువ్వు వారి వైపుకు తిరగకూడదు.

20 నేను నిన్ను ఈ ప్రజలకు అభేధ్యమైన కంచుకోటగా చేస్తాను. వాళ్ళు నీ మీద యుద్ధం చేస్తారు గాని నిన్ను గెలవలేరు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను. ఇది యెహోవా వాక్కు.

21 నేను నిన్ను దుర్మార్గుల చేతిలోనుంచి విడిపిస్తాను. నిరంకుశుల బారినుంచి నిన్ను విమోచిస్తాను.”