చెర తప్పదనే హెచ్చరికలు (continued)
యూదుల చెర, యెరూషలేము నాశనం తప్పవని ప్రకటిస్తూ వారికి చేసిన వివిధ ప్రవచనాలు, విజ్ఞప్తులు.
క్రీ.పూ. 609
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.
2 “నువ్వు లేచి కుమ్మరి యింటికి వెళ్ళు. అక్కడ నా మాటలు నీకు చెబుతాను.”
3 నేను కుమ్మరి ఇంటికి వెళితే అతడు తన సారె మీద పని చేస్తున్నాడు.
4 అయితే కుమ్మరి బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది. అందుచేత అతడు తన మనస్సు మార్చుకుని తనకిష్టమైనట్టు మరో కుండ చేశాడు.
5 అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు,
6 “ఇశ్రాయేలు ప్రజలారా! ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా?” ఇది యెహోవా వాక్కు. “బంక మట్టి కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు.
7 దాన్ని వెళ్ళగొడతాననీ పడదోసి నాశనం చేస్తాననీ ఒక దేశం గురించి గానీ రాజ్యం గురించి గానీ నేను చెబుతున్నాను.
8 ఏ రాజ్యం గురించి నేను చెప్పానో ఆ రాజ్యం దుర్మార్గం చేయడం మానితే నేను వారి మీదికి రప్పిస్తానని నేననుకున్న విపత్తు విషయం నేను జాలిపడి దాన్ని రప్పించను.
9 ఒక దేశం గురించి గానీ రాజ్యం గురించి గానీ ‘నేను కడతాను, లేకపోతే సుస్థిరం చేస్తాను’ అని చెప్పినప్పుడు,
10 ఆ ప్రజలు నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేస్తే దానికి చేయదలచిన మేలు చేయకుండా ఆపుతాను.”
11 కాబట్టి నువ్వు వెళ్లి యూదావారితో యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు. “యెహోవా ఇలా చెబుతున్నాడు, మీ మీదికి విపత్తు రప్పించబోతున్నాను. మీకు విరోధంగా ఒక ఆలోచన చేస్తున్నాను. మీరంతా ఒక్కొక్కరు మీ దుర్మార్గాన్ని విడిచి మీ విధానాలనూ ప్రవర్తననూ మార్చుకోండి.”
12 అందుకు వాళ్ళు “మేము తెగించాము. మేము మా సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తాం. మేము ఒక్కొక్కరం మా హృదయంలోని దుర్మార్గం ప్రకారం ప్రవర్తిస్తాం” అంటారు.
13 కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, రాజ్యాలను అడిగి తెలుసుకోండి. ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? ఇశ్రాయేలు కన్య చాలా ఘోరమైన పని చేసింది.
14 లెబానోను పర్వతం మీద బండలపై మంచు లేకుండా పోతుందా? దూరం నుంచి పారే చల్లని వాగులు ఇంకిపోతాయా?
15 నా ప్రజలైతే నన్ను మర్చిపోయారు. పనికిమాలిన విగ్రహాలకు వాళ్ళు ధూపం వేశారు. వాళ్ళ తమ మార్గాల్లో తడబాటు చెందారు. పురాతన దారులను విడిచిపెట్టి డొంక దారుల్లో నడవాలనుకుంటున్నారు.
16 వాళ్ళ దేశం పాడైపోతుంది. అది ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతుంది. ఆ దారిన వెళ్లేవాళ్ళంతా వణికిపోతూ తమ తలలూపుతారు.
17 తూర్పుగాలి చెదరగొట్టినట్టు నేను వాళ్ళ శత్రువుల ఎదుట వాళ్ళను చెదరగొడతాను.
18 అప్పుడు ప్రజలు ఇలా అన్నారు. “యిర్మీయా మీద కుట్ర పన్నుదాం రండి. యాజకులు ధర్మశాస్త్రం వినిపించకుండా ఉండరు. తెలివిగలవాళ్ళు సలహాలివ్వకుండా ఉండరు. ప్రవక్తలు సందేశాలు వినిపించకుండా ఉండరు. అతడు ప్రకటించే మాటలేమీ పట్టించుకోకుండా మన మాటలతో అతన్ని ఎదుర్కొందాం రండి.”
19 యెహోవా, నా మొర విను. నా విరోధుల రభస విను.
20 వాళ్ళు నా ప్రాణం తీయాలని గుంట తవ్వారు. వాళ్లకు నేను చేసిన మేలుకు బదులు వాళ్ళు నాకు భయంకరమైన కీడు చేయాలా? వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ మీదనుంచి నీ కోపం తప్పించడానికి నీ ఎదుట నేను నిలబడి వాళ్ళ గురించి మాట్లాడిన సంగతి గుర్తుంచుకో.
21 కాబట్టి వాళ్ళ పిల్లలను కరువుపాలు చెయ్యి. వాళ్ళను కత్తికి అప్పగించు. వాళ్ళ భార్యలు సంతానాన్ని కోల్పోయేలా వితంతువులయ్యేలా చెయ్యి. వాళ్ళ పురుషులు చావాలి. వాళ్ళ యువకులు యుద్ధంలో కత్తితో చావాలి.
22 నన్ను పట్టుకోడానికి వాళ్ళు గొయ్యి తవ్వారు. నా కాళ్లకు ఉచ్చులు వేశారు. వాళ్ళ మీదికి నువ్వు అకస్మాత్తుగా దండెత్తే వాళ్ళను రప్పించడం వలన వారి ఇళ్ళలోనుంచి కేకలు వినబడాలి.
23 యెహోవా, నన్ను చంపడానికి వాళ్ళు చేసిన కుట్ర అంతా నీకు తెలుసు. వాళ్ళ అపరాధాలనూ పాపాలనూ క్షమించవద్దు. వాళ్ళ పాపాలు నువ్వు తుడిచి వేయవద్దు. వాళ్ళు నీ ఎదుట కూలిపోవాలి. నీ ఉగ్రత కురిపించే సమయంలో వారికి తగిన శాస్తి చెయ్యి.
19:1 యెహోవా ఇలా చెప్పాడు,
2 నువ్వు వెళ్లి కుమ్మరి చేసిన మట్టికుండ కొను. ప్రజల పెద్దల్లో కొంతమందినీ యాజకుల్లో పెద్దవారినీ వెంటబెట్టుకుని హర్సీతు ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్ హిన్నోము లోయలోకి వెళ్ళి, నేను నీతో చెప్పే ఈ మాటలు అక్కడ ప్రకటించు.
3 “యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది.
4 ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
5 వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు.”
6 కాబట్టి యెహోవా చెప్పేదేమిటంటే “రాబోయే రోజుల్లో ఈ స్థలాన్ని ‘వధ లోయ’ అంటారు. తోఫెతు అని గానీ బెన్ హిన్నోము లోయ అని గానీ అనరు.
7 ఈ స్థలం లోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్ధం చేస్తాను. తమ శత్రువుల ఎదుట కత్తిపాలయ్యేలా చేస్తాను. తమ ప్రాణాలను తీయాలని చూసే వాళ్ళ చేతికి అప్పగిస్తాను. వాళ్ళ శవాలను రాబందులకూ అడవి జంతువులకూ ఆహారంగా ఇస్తాను.
8 ఈ పట్టణాన్ని పాడు చేసి ఎగతాళికి గురి చేస్తాను. ఆ దారిలో వెళ్ళే ప్రతివాడూ దాని కడగండ్లన్నీ చూసి నిర్ఘాంతపోయి హేళన చేస్తారు.
9 వాళ్ళు తమ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను తినేలా చేస్తాను. తమ ప్రాణం తీయాలని చూసే శత్రువులు ముట్టడి వేసి బాధించే కాలంలో వాళ్ళు ఒకరి శరీరాన్ని ఒకరు తింటారు.
10 ఈ మాటలు చెప్పిన తరువాత నీతో వచ్చిన మనుష్యులు చూస్తుండగా నువ్వు ఆ కుండ పగలగొట్టి వాళ్ళతో ఇలా చెప్పాలి.”
11 “సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు, మళ్ళీ బాగుచేయడానికి వీలు లేకుండా కుమ్మరివాని కుండను ఒకడు పగలగొట్టినట్టు నేను ఈ ప్రజలనూ ఈ పట్టణాన్నీ పగలగొట్టబోతున్నాను. తోఫెతులో పాతిపెట్టే చోటు దొరకనంతగా వాళ్ళను అక్కడే పాతిపెడతారు.”
12 యెహోవా వాక్కు ఇదే. “ఈ పట్టణాన్ని తోఫెతులాంటి స్థలంగా నేను చేస్తాను. ఈ స్థలానికీ అక్కడి నివాసులకూ నేనలా చేస్తాను.
13 యెరూషలేము ఇళ్ళు, యూదా రాజుల రాజ భవనాలూ ఆ తోఫెతు స్థలం లాగే అపవిత్రమవుతాయి. ఏ ఇళ్ళ మీద ప్రజలు ఆకాశ నక్షత్ర సమూహానికి మొక్కి ఇతర దేవుళ్ళకు పానార్పణలు చేశారో ఆ ఇళ్ళన్నిటికీ ఆలాగే జరుగుతుంది.”
14 యిర్మీయా ఆ ప్రవచనం చెప్పడానికి యెహోవా తనను పంపిన తోఫెతులో నుంచి వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలబడి ప్రజలందరితో ఇలా చెప్పాడు,
15 “సేనల ప్రభువు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఈ ప్రజలు నా మాటలు వినకుండా మొండికెత్తారు. కాబట్టి ఈ పట్టణం గురించి నేను చెప్పిన విపత్తునంతా దాని మీదికీ దానికి సంబంధించిన పట్టణాలన్నిటి మీదికీ రప్పిస్తున్నాను.”