ప్రార్థనపై రెండు ఉపమానాలు

ప్రార్థనపై రెండు ఉపమానాలు: పట్టుదలగల వితంతువు ఉపమానం, పరిసయ్యుడు మరియు పన్ను వసూలు చేసేవాని ఉపమానం.

క్రీ.శ. 29 నుండి 30 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

లూకా రాసిన సువార్త 18:1–14

18:1 తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు.

2 “ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. 3 ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి ‘నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి’ అని అడుగుతూ ఉండేది. 4 అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలాకాలం వరకూ ఇష్టపడలేదు. కాని ఆ తరువాత ఇలా అనుకున్నాడు, ‘నేను దేవుడికి భయపడను, మనుషులనూ లెక్కచెయ్యను. 5 కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది. కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను’ అనుకున్నాడు.”

6 ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా! 7 తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా? 8 ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?”

9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.

14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.

యేసు విడాకుల గురించి బోధించడం

గలిలయ నుండి పెరయ మీదుగా వెళ్తూ యేసు విడాకుల గురించి బోధిస్తాడు.

పెరయ

మత్తయి రాసిన సువార్త 19:1–12

19:1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలిలయ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వచ్చాడు. 2 గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. ఆయన వారిని అక్కడ బాగుచేశాడు.

3 పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆయనను పరీక్షించడం కోసం, “ఏ కారణం చేతనైనా సరే, పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా?” అని అడిగారు.

4 అందుకాయన, “సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ,

5 ‘అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు’ అని చెప్పాడనీ మీరు చదవలేదా?

6 కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు” అని జవాబిచ్చాడు.

7 అందుకు వారు, “అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని అడిగారు. 8 అప్పుడాయన, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు.

9 భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను” అని వారితో అన్నాడు.

10 ఆయన శిష్యులు, “భార్యాభర్తల మధ్య సంబంధం ఇలాటిదైతే అసలు పెళ్ళి చేసుకోక పోవడమే మంచిది” అని ఆయనతో అన్నారు. 11 అందుకు యేసు, “దేవుడు అనుమతించిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరించ లేరు. 12 తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు, మనుషులు నపుంసకులుగా తయారు చేసినవారు ఉన్నారు. పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారూ ఉన్నారు. ఈ మాటను అంగీకరించ గలవాడు దాన్ని స్వీకరించి పాటిస్తాడు గాక” అని వారితో చెప్పాడు.

మార్కు రాసిన సువార్త 10:1–12

10:1 యేసు ఆ ప్రాంతం విడిచి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తరువాత యొర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చారు. ఎప్పటిలాగే యేసు వారికి ఉపదేశం చేశాడు.

2 కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా?” అని అడిగారు.

3 యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు. 4 వారు, “విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు” అన్నారు.

5 యేసు, “మీరు దేవునికి లోబడని వారు, కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు.

6 కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు.

7 అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు.

8 వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. 9 కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు.

10 అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు.

11 యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే. 12 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు.

క్రీస్తు మరియు పిల్లలు

క్రీస్తు మరియు పిల్లలు, యేసు వైఖరిని అర్థం చేసుకోవడంలో శిష్యుల వైఫల్యం.

పెరయ

మత్తయి రాసిన సువార్త 19:13–15

19:13 అప్పుడు కొందరు తమ పిల్లల మీద యేసు తన చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుతూ చిన్నపిల్లలను ఆయన దగ్గరకి తీసుకుని వచ్చారు. అయితే ఆయన శిష్యులు ఆ పిల్లలను తీసుకొచ్చిన వారిని గద్దించారు.

14 అప్పుడు యేసు, “చిన్నపిల్లలను అడ్డుకోకుండా నా దగ్గరికి రానియ్యండి. పరలోకరాజ్యం ఇలాటి వారిదే” అని వారితో చెప్పాడు.

15 ఆ పిల్లల మీద చేతులుంచిన తరవాత ఆయన అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

మార్కు రాసిన సువార్త 10:13–16

10:13 యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకు వచ్చారు గాని, శిష్యులు వారిని అడ్డుకున్నారు.

14 ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో, “చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే.

15 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు” అన్నాడు.

16 ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు.

లూకా రాసిన సువార్త 18:15–17

18:15 తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు.

16 అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. “పిల్లలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆటంకపెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే.

17 చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.