లాజరును మృతులలో నుండి లేపడం వల్ల కలిగిన ప్రభావాలు
లాజరును మృతులలో నుండి లేపడం ప్రజలపై, మహా సభపై, యేసు సంచారాలపై చూపిన ప్రభావం.
యూదయలోని యెరూషలేము, ఎఫ్రాయిము
క్రీ.శ. 29 నుండి 30 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోహాను రాసిన సువార్త 11:45–54
11:45 అప్పుడు మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయనను నమ్మారు. 46 కాని, వారిలో కొంతమంది వెళ్ళి యేసు చేసిన పనులు పరిసయ్యులకు చెప్పారు.
47 అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరిచి, “మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే, 48 మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకుపోతారు” అన్నారు.
49 అయితే, వారిలో ఒకడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కయప వారితో, “మీకేమీ తెలియదు. 50 మన జాతి అంతా నాశనం కాకుండా ఉండాలంటే ఒక్క మనిషి ప్రజలందరి కోసం చనిపోవడం మీకు లాభం అన్నది మీరు అర్థం చేసుకోవడం లేదు” అన్నాడు. 51 అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు గానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, జాతి అంతటి కోసం యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు. 52 ఆ జాతి కోసం మాత్రమే కాకుండా, వివిధ ప్రాంతాల్లోకి చెదరిపోయిన దేవుని పిల్లలను ఒకటిగా సమకూర్చేలా యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు. 53 కాబట్టి, ఆ రోజు నుండి యేసును ఎలా చంపాలా అని వారు ఆలోచన చేస్తూ వచ్చారు.
54 అందుచేత యేసు అప్పటినుంచి యూదుల్లో బహిరంగంగా తిరగకుండా, అక్కడనుంచి వెళ్ళి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో కలిసి ఉన్నాడు.
యేసు యెరూషలేముకు తన చివరి ప్రయాణం ప్రారంభించడం
యేసు సమరయ, గలిలయ మీదుగా యెరూషలేముకు చివరి ప్రయాణం ప్రారంభిస్తాడు.
సమరయలో లేదా గలిలయలో
ఆయన పది మంది కుష్ఠరోగులను స్వస్థపరచి, దేవుని రాజ్య స్వభావాన్ని పరిసయ్యులకు, శిష్యులకు వివరిస్తాడు.
లూకా రాసిన సువార్త 17:11–37
17:11 ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ 12 ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు. 13 “యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు. 14 ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి” అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు.
15 వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి 16 బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు. 17 అందుకు యేసు, “పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ? 18 దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?” అన్నాడు. 19 “నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.
20 ఒకసారి పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని ఆయనను అడిగారు. దానికి ఆయన, “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు. 21 ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు” అని వారికి జవాబిచ్చాడు.
22 ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజును చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది. కానీ మీరు ఆ రోజును చూడరు. 23 వారు, ‘ఇదిగో ఇక్కడుంది, అదిగో అక్కడుంది’ అంటారు. మీరు వెళ్ళవద్దు. అసలు వారిని అనుసరించవద్దు. 24 ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకూ ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు. 25 అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి.
26 “నోవహు రోజుల్లో జరిగినట్టు గానే మనుష్య కుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది. 27 నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్ళిళ్ళకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది.
28 లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. 29 అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు.
30 “అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది. 31 ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు. 32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 33 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు.
34 నేను చెప్పేదేమిటంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం, మరొకరిని విడిచి పెట్టడం జరుగుతుంది. 35 ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు ఉండిపోతాడు.”
36 అప్పుడు శిష్యులు, “ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది” అని అడిగారు. 37 దానికి జవాబుగా ఆయన, “శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి” అన్నాడు.