ధనవంతుడైన యువ అధికారి, ధనసంపదల ప్రమాదాలు

ధనవంతుడైన యువ అధికారి, ధనసంపదల ప్రమాదాలు, శిష్యుల ఆశ్చర్యం. మెస్సీయను అనుసరించడానికి సమస్తాన్ని విడిచిపెట్టినందుకు లభించే ప్రతిఫలాలు గొప్పగా ఉంటాయి, అయితే అవి సార్వభౌమ సంకల్పం ప్రకారం ఇవ్వబడతాయి (ద్రాక్షతోటలోని పనివారి ఉపమానం).

పెరయలో

క్రీ.శ. 29 నుండి 30 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 19:16–20:16

19:16 ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు.

17 అందుకు యేసు, “మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు” అన్నాడు.

18 అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, “నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు,

19 నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే” అని చెప్పాడు.

20 అందుకు ఆ యువకుడు, “వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?” అన్నాడు.

21 అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు” అని అతనితో చెప్పాడు.

22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.

23 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం.

24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక.”

25 శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. “ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?” అన్నారు.

26 యేసు వారితో, “ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే” అని చెప్పాడు.

27 అప్పుడు పేతురు, “ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా, మాకేమి లభిస్తుంది?” అని ఆయనను అడగగా

28 యేసు వారితో ఇలా అన్నాడు, “కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు.

29 నా నామం నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు.

30 మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు.”

20:1 “ఎలాగంటే, పరలోకరాజ్యం ఈ విధంగా ఉంది, ఒక ఇంటి యజమాని తన ద్రాక్షతోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు. 2 రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకుని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు. 3 తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి, 4 ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళి పని చేయండి. ఏది న్యాయమో ఆ జీతం మీకిస్తాను’ అని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళారు.

5 దాదాపు పన్నెండు గంటలకూ, తరువాత మూడు గంటలకూ, అతడు బయటికి వెళ్ళి, ఆ విధంగా చేశాడు. 6 మళ్ళీ సుమారు ఐదు గంటలకు అతడు బయటికి వెళ్ళి, ఇంకా కొందరు ఊరికే నిలబడి ఉండడం చూసి, ‘మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు. 7 వారు ‘ఎవ్వరూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు’ అన్నారు. అతడు, ‘అయితే మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి’ అన్నాడు.

8 “సాయంకాలమైన తరువాత ఆ ద్రాక్షతోట యజమాని తన గృహాన్ని పర్యవేక్షించే అధికారిని పిలిచి, ‘పనివారిలో చివర వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారి వరకూ అందరికీ వారి కూలి ఇమ్మని చెప్పాడు. 9 దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది. 10 అది చూసి ముందుగా పనిలో చేరినవారు తమకు ఎక్కువ జీతం దొరుకుతుంది అని ఆశించారు గాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు. 11-12 వారు దాన్ని తీసుకుని ‘చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేశారు. మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పని చేశాం. కానీ వారికీ మాకూ జీతం సమానంగా ఇచ్చారేమిటి?’ అని ఆ యజమాని మీద సణుక్కున్నారు.

13 అప్పుడా యజమాని వారిలో ఒకడితో, “మిత్రమా, నేను నీకు అన్యాయమేమీ చేయలేదు. నీకు జీతం ఒక దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా? 14 నీ కూలి సొమ్ము తీసుకుని వెళ్ళు. నీకిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వడం నా ఇష్టం. 15 నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే అధికారం నాకు లేదా? నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపు మంటగా ఉందా?” అని అన్నాడు. 16 ఆ విధంగా చివరివారు మొదటివారూ, మొదటివారు చివరివారూ అవుతారు.”

మార్కు రాసిన సువార్త 10:17–31

10:17 ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు.

18 యేసు, “నేను మంచి వాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు.

19 దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి” అన్నాడు.

20 అతడు ఆయనతో, “బోధకా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను” అని అన్నాడు.

21 యేసు అతన్ని చూస్తూ, అతనిపై ప్రేమ భావం కలిగి ఇలా అన్నాడు, “నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు” అని అన్నాడు.

22 అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం” అని అన్నాడు. 24 ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు మళ్ళీ, “పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం!

25 ధనికుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం” అన్నాడు.

26 ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు. వారు “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు.

27 యేసు వారి వైపు చూసి, “మనుషులకు ఇది అసాధ్యమే గాని, దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే” అన్నాడు.

28 పేతురు ఆయనతో, “ఇదిగో, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా!” అన్నాడు.

29 అందుకు యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నా కోసం, సువార్త కోసం, తన ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఆస్తులను వదిలిపెట్టిన వాడు.

30 ఇప్పుడు ఈ లోకంలో హింసలతో బాటు ఇళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, ఆస్తులు, రానున్న లోకంలో శాశ్వత జీవం పొందుతాడు.

31 కాని, మొదటివారు చాలా మంది చివరివారు అవుతారు, చివరివారు చాలా మంది మొదటివారు అవుతారు” అన్నాడు.

లూకా రాసిన సువార్త 18:18–30

18:18 ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు.

19 అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు.

20 వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు.

21 దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు.

22 యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు.

23 అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు.

24 యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం.

25 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు.

26 ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు

27 అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు.

28 అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.”

29 అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి,

30 ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.