యేసు తన మరణాన్ని ముందుగా తెలియజేసి యాకోబును, యోహానును గద్దించడం

యేసు తన మరణ పునరుత్థానాలను గురించి శిష్యులకు మళ్లీ ముందుగా తెలియజేసి, యాకోబు, యోహానుల స్వార్థపూరిత ఆశను గద్దిస్తాడు.

బహుశా పెరయలో

క్రీ.శ. 29 నుండి 30 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 20:17–28

20:17 యేసు యెరూషలేముకు వెళ్ళబోయే ముందు తన పన్నెండు మంది శిష్యులనూ ఏకాంతంగా తీసుకుపోయి, దారిలో వారితో ఇలా అన్నాడు.

18 “ఇదిగో, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకూ ధర్మశాస్త్ర పండితులకూ అప్పగిస్తారు. వారు ఆయనకి మరణశిక్ష విధించి.

19 ఆయనను అవమానించడానికీ కొరడా దెబ్బలు కొట్టడానికీ సిలువ వేయడానికీ యూదేతరులకు అప్పగిస్తారు. అయితే మూడవ రోజున ఆయన సజీవంగా తిరిగి లేస్తాడు.”

20 అప్పుడు జెబెదయి భార్య తన కుమారులతో కలిసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది.

21 “నీకేమి కావాలి?” అని యేసు ఆమెను అడిగాడు. అందుకామె, “నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులను ఒకణ్ణి నీ కుడి వైపున, మరొకణ్ణి నీ ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు” అంది.

22 అందుకు యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా?” అని వారిని అడగగా వారు “తాగగలం” అన్నారు. 23 ఆయన, “నా గిన్నెలోది మీరు తాగుతారు గానీ, నా కుడి వైపున, ఎడమ వైపున కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధపరిచాడో వారికే అవి దొరుకుతాయి” అని చెప్పాడు.

24 మిగిలిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపం తెచ్చుకున్నారు.

25 కాబట్టి యేసు వారిని పిలిచి, “ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు.

26 కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి.

27 మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి.

28 అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు.

మార్కు రాసిన సువార్త 10:32–45

10:32 యేసు, ఆయనతో ఉన్నవారంతా యెరూషలేము బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ఆయనను అనుసరిస్తున్న ఇతరులు భయపడ్డారు. యేసు మళ్ళీ తన శిష్యులను పక్కకు పిలిచి, తనకు జరగబోయే వాటిని గురించి వారికి చెప్పాడు.

33 ఆయన, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకు, ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు. వారు ఆయనకు మరణశిక్ష విధించి, యూదేతర ప్రజలకు అప్పగిస్తారు.

34 వారు ఆయనను హేళన చేసి, ఆయన మీద ఉమ్మివేస్తారు. కొరడా దెబ్బలు కొడతారు, ఆ తరువాత చంపేస్తారు. మూడవ రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు” అని వారితో చెప్పాడు.

35 జెబెదయి కుమారులు యాకోబు, యోహాను ఆయన దగ్గరికి వచ్చి, “బోధకా! మేము అడిగింది మాకు అనుగ్రహిస్తావా?” అని అడిగారు.

36 ఆయన, “నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు?” అని ప్రశ్నించాడు. 37 వారు, “నీవు మహిమలో మాలో ఒకరిని నీ కుడిచేతి వైపు, మరొకరిని ఎడమచేతి వైపు కూర్చోబెట్టుకో” అన్నారు.

38 యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగిన దాన్ని మీరు తాగగలరా? నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా?” అని అడిగాడు. 39 వారు, “పొందగలం” అని జవాబు చెప్పారు. యేసు వారితో, “నేను తాగిన దాన్ని మీరు తాగుతారు, నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారు.

40 కాని, నా కుడి వైపు, నా ఎడమవైపు కూర్చోడానికి అనుమతించేది నేను కాదు. ఆ స్థానాలు ఎవరి కోసం సిద్ధం చేసి ఉన్నాయో వారికే అవి దొరుకుతాయి” అన్నాడు.

41 ఇది విని మిగతా పదిమందికి యాకోబు, యోహానుల మీద కోపం వచ్చింది.

42 అయితే యేసు వారిని దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు, “అన్యజనుల అధికారులు ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు.

43 మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలనుకొనేవాడు సేవకుడై ఉండాలి.

44 మీలో మొదటివాడు కావాలని కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి.

45 ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు, సేవ చేయడానికీ, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధార పోయడానికి వచ్చాడు.”

లూకా రాసిన సువార్త 18:31–34

18:31 ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. ప్రవక్తలు మనుష్య కుమారుణ్ణి గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి.

32 ఆయనను యూదేతరులకు పట్టిస్తారు. వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు.

33 ఆయనను కొరడాలతో కొడతారు, చంపివేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పాడు. 34 వారికి ఈ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఈ సంగతి వారికి మర్మంగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు.