యేసు గుడ్డివాడైన బర్తిమయిని, అతని సహచరుణ్ణి స్వస్థపరచడం
యెరికోలో
క్రీ.శ. 29 నుండి 30 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 20:29–34
20:29 వారు యెరికో దాటి వెళుతుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది.
30 అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని కేకలు వేశారు.
31 ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని ఇంకా పెద్దగా కేకలు వేశారు.
32 యేసు ఆగి, వారిని పిలిచి, “మీకోసం నన్నేమి చేయమంటారు?” అని అడిగాడు.
33 వారు, “ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు” అన్నారు.
34 యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.
మార్కు రాసిన సువార్త 10:46–52
10:46 ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు భిక్షగాడు.
47 ఆ గుడ్డివాడు, వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకుని, “యేసూ! దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని కేకలు పెట్టసాగాడు.
48 చాలా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, “దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు.
49 యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో, “ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు. 50 ఆ గుడ్డివాడు తాను కప్పుకొన్న పైబట్టను అవతల పారవేసి, గభాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు.
51 యేసు, “ఏం కావాలి?” అని అడిగాడు. ఆ గుడ్డివాడు, “రబ్బీ! నాకు మళ్లీ చూపు ప్రసాదించు” అని వేడుకున్నాడు.
52 యేసు, “నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, ఇక వెళ్ళు” అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు.
లూకా రాసిన సువార్త 18:35–43
18:35 ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు.
36 పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి, “ఏం జరుగుతోంది?” అని అడిగాడు.
37 నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు. 38 అప్పుడు వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని కేకలు వేయడం మొదలు పెట్టాడు.
39 ముందు నడుస్తున్నవారు, “నోరు మూసుకో” అని గద్దించారు. కానీ వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు.
40 అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు.
41 వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, “నీ కోసం నేనేంచేయాలని కోరుతున్నావు?” అని అడిగాడు. దానికి వాడు, “ప్రభూ, నాకు చూపు కావాలి” అన్నాడు.
42 దానికి యేసు, “చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.
43 వెంటనే వాడు చూపు పొందాడు. దేవుణ్ణి కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు.
యేసు జక్కయ్యను సందర్శించడం
యేసు జక్కయ్యను సందర్శించి, మినాల ఉపమానం చెప్పి, యెరూషలేముకు బయలుదేరుతాడు.
యెరికో
లూకా రాసిన సువార్త 19:1–28
19:1 ఆయన ప్రయాణం చేస్తూ సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి 2 దానిగుండా వెళ్తున్నాడు. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ముఖ్యపన్ను వసూలుదారు, ధనవంతుడు. 3 ఇతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు. కాని జనసమూహం గుమిగూడడం వలనా ఇతడు పొట్టివాడు కావడం వలనా చూడలేకపోయాడు. 4 అప్పుడు యేసు ఆ దారిలోనే వస్తున్నాడు, కాబట్టి అతడు ముందుగా పరిగెత్తి వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు.
5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి, “జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి” అన్నాడు. 6 అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. 7 అది చూసి అందరూ, “ఈయన ఒక పాపాత్ముడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు” అని గొణగడం మొదలుపెట్టారు.
8 జక్కయ్య నిలబడి, “ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను. నేనెవరినైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను” అన్నాడు. 9 అందుకు యేసు, “ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే. 10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు” అని చెప్పాడు.
11 వారు ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఆయన యెరూషలేముకు దగ్గరలో ఉండడం వల్ల దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తుందని వారు అనుకుంటున్నారు.
12 “గొప్ప వంశానికి చెందిన ఒక వ్యక్తి తన కోసం రాజ్యం సంపాదించుకుని రావాలని దూరదేశానికి ప్రయాణం అయ్యాడు. 13 దానికి ముందు తన సేవకులు పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణాలు ఇచ్చాడు. “నేను తిరిగి వచ్చే వరకూ మీరు వీటితో వ్యాపారం చేయండి” అని చెప్పాడు. 14 అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు. ‘ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు’ అంటూ అతని వెనుకే రాయబారం పంపారు. 15 అయినా అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చాడు. తన దాసులు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని వారిని పిలిపించాడు.
16 “మొదటి వాడు వచ్చి, ‘అయ్యా, మీరిచ్చిన నాణెం మరో పది నాణేలను సంపాదించింది” అన్నాడు. 17 దానికి ఆ యజమాని, ‘భలే, మంచి సేవకా! నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు. 18 ఇక రెండవ పనివాడు వచ్చాడు. ‘అయ్యా, మీరిచ్చిన నాణెంతో మరో ఐదు నాణాలు సంపాదించాను’ అన్నాడు. 19 యజమాని వాడితో, ‘నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు’ అన్నాడు.
20 అప్పుడు మరో పనివాడు వచ్చాడు. వాడిలా అన్నాడు, ‘అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం. 21 దీన్ని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను. నువ్వు కఠినుడివని నాకు తెలుసు. నువ్వు పెట్టని చోట తీసుకుంటావు, నాటని చోట పంట కోస్తావు,’ అన్నాడు. 22 అందుకా యజమాని, ‘చెడ్డ సేవకా, నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని చోట తీసుకుంటాను, నాటని చోట పంట కోస్తాను, కఠినుడినని నీకు తెలుసు కదా, 23 అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా’ అని వాడితో చెప్పి, 24 తన దగ్గర ఉన్న వారితో, “వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణాలు ఉన్న వాడికివ్వండి’ అన్నాడు. 25 దానికి వారు, ‘అయ్యా అతని దగ్గర పది నాణాలు ఉన్నాయి కదా’ అన్నారు. 26 అందుకు అతడు, ‘ఉన్న ప్రతి వాడికీ ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెబుతున్నాను.’ 27 మరోమాట, ‘నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి’ అన్నాడు.”
28 యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు.