భాగం 11: యెరూషలేములో చివరి బహిరంగ పరిచర్య

క్రీ.శ. 30 (లేదా క్రీ.శ. 29) వసంతకాలంలో, శ్రమల వారానికి ముందున్న శుక్రవారం నుండి ఆ వారంలోని మంగళవారం వరకు. పస్కాకు కొద్దిముందు

యేసు యెరూషలేము సమీపంలోని బేతనియకు చేరుకోవడం

శుక్రవారం మధ్యాహ్నం

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోహాను రాసిన సువార్త 11:55–12:1, 9–11

11:55 యూదుల పస్కా పండగ దగ్గర పడింది. చాలా మంది ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోడానికి పండగకు ముందే గ్రామాలనుంచి యెరూషలేముకు వచ్చారు. 56 వారు యేసు కోసం చూస్తున్నారు. దేవాలయంలో నిలబడి, ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు, “మీరేమంటారు? ఆయన పండగకు రాడా?”

57 యేసు ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిస్తే, తాము ఆయనను పట్టుకోవడం కోసం, వారికి తెలియజేయాలని ముఖ్య యాజకులు, పరిసయ్యులు, ఒక ఆజ్ఞ జారీ చేశారు.

12:1 పస్కాకు ఆరు రోజుల ముందు యేసు బేతనియ వచ్చాడు. మరణించిన లాజరును యేసు మళ్ళీ బతికించిన గ్రామం ఇదే.

9 అప్పుడు పెద్ద యూదుల సమూహం యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకుని, యేసు కోసమే కాక, యేసు చావు నుంచి తిరిగి లేపిన లాజరును కూడా చూడాలని అక్కడికి వచ్చారు. 10-11 లాజరును బట్టి చాలా మంది యూదులు వెళ్ళి యేసు మీద నమ్మకం ఉంచారు. కాబట్టి ముఖ్య యాజకులు లాజరును కూడా చంపాలని అనుకున్నారు.

యేసు మెస్సీయగా విజయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించడం

ఇక్కడ ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో రక్షకుని సంచారాలు, బోధనలు ఉన్నాయి: యూదుల, రోమీయుల విచారణల సమయంలో ఆయన చెప్పిన కొద్ది మాటలు తప్ప, ఆయన బహిరంగ పరిచర్య ఇంతటితో ముగుస్తుంది. దీని తరువాత ఆయన బోధ అంతా తన శిష్యులకే అందించబడుతుంది.

బేతనియ నుండి యెరూషలేముకు వెళ్లి తిరిగి రావడం (ఆదివారం). మెస్సీయగా తనను ప్రదర్శించుకున్న రోజు

మత్తయి రాసిన సువార్త 21:1–3, 6–7, 4–5, 8–11, 14–17

21:1 వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి,

2 “మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టేసి ఉన్న ఒక గాడిదా, దాని పిల్లా మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరికి తోలుకుని రండి.

3 ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు” అని చెప్పి వారిని పంపించాడు.

6 అప్పుడా శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.

7 వారు ఆ గాడిదను, దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటిమీద ఆయన కూర్చున్నాడు.

4 దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది, ఆ మాటలు ఏవంటే,

5 “ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి.”

8 జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు. కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు.

9 జనసమూహంలో ఆయనకు ముందూ, వెనకా నడుస్తూ, “దావీదు కుమారుడికి జయం! ప్రభువు పేరిట వచ్చేవాడికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం” అని కేకలు వేస్తూ వచ్చారు.

10 ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా, “ఎవరీయన?” అని కలవరంతో నిండిపోయింది. 11 ఆయనతో వచ్చిన జనసమూహం, “ఈయన యేసు. గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త” అని వారికి జవాబిచ్చారు.

14 అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు, ఆయన వారందరినీ బాగుచేశాడు.

15 ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు. 16 “వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని వారితో చెప్పి 17 ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు.

మార్కు రాసిన సువార్త 11:1–11

11:1 వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు.

2 “మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇంతవరకూ దాని మీద ఎవరూ ఎన్నడూ స్వారీ చెయ్యలేదు. దాన్ని విప్పి తోలుకు రండి.

3 అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ఇది ప్రభువుకు అవసరం’ అనండి. వెంటనే అతడు దాన్ని పంపిస్తాడు.”

4 శిష్యులు వెళ్ళి, ఒక ఇంటి ముందు వీధిలో ఒక గాడిద పిల్ల ఉండడం చూసి, దాన్ని విప్పుతుండగా

5 అక్కడ ఉన్న కొందరు వారితో, “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అని అడిగారు.

6 శిష్యులు యేసు చెప్పమన్నట్టే వారికి చెప్పారు. వెంటనే ఆ మనుషులు వారిని వెళ్ళనిచ్చారు.

7 వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరికి తీసుకు వచ్చి తమ వస్త్రాలను దాని మీద పరిచారు. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు.

8 చాలామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడవునా పరిచారు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారిన పరిచారు.

9 ముందు, వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తూ, “జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు!

10 రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. సర్వోన్నతమైన స్థలాల్లో జయం!” అని బిగ్గరగా కేకలు వేశారు.

11 యేసు యెరూషలేము పట్టణ దేవాలయంలోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న అన్నిటినీ చూశాడు. అప్పటికే పొద్దుపోవడం వల్ల ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కలిసి బేతనీకి వెళ్ళాడు.

లూకా రాసిన సువార్త 19:29–44

19:29 ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనీ అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు.

30 “మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఇంతవరకూ ఎవ్వరూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకు రండి.

31 ఎవరైనా ‘దీన్ని ఎందుకు విప్పుతున్నారు’ అని మిమ్మల్ని అడిగితే ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపించాడు.

32 ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు.

33 ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు, “మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారినడిగారు.

34 దానికి వారు, “ఇది ప్రభువుకు కావాలి” అన్నారు.

35 తరువాత యేసు దగ్గరికి దాన్ని తోలుకు వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయనను దానిపై కూర్చోబెట్టారు.

36 ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు. 37 ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు.

38 “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు.

39 ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, “బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు. 40 ఆయన, “వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు.

41 ఆయన యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని విషయం విలపించాడు. 42 “నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు! కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు. 43 ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు. 44 నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది” అన్నాడు.

యోహాను రాసిన సువార్త 12:12–19

12:12 ఆ తరువాతి రోజున పండగకి వచ్చిన గొప్ప జనసమూహం అక్కడ పోగయ్యింది. యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్నప్పుడు,

13 వారంతా ఖర్జూరం మట్టలు తీసుకుని ఆయనకు ఎదురుగా వెళ్ళి, “హోసన్నా! ప్రభువు పేరిట వస్తున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతి కలుగు గాక!” అని కేకలు వేశారు.

14-15 “సీయోను కుమారీ, భయపడకు! నీ రాజు గాడిద పిల్ల మీద కూర్చుని వస్తున్నాడు”

అని రాసి ఉన్న విధంగా యేసు చిన్న గాడిదను చూసి దాని మీద కూర్చున్నాడు.

16 ఆయన శిష్యులు ఈ సంగతులు మొదట్లో గ్రహించలేదు గాని యేసు మహిమ పొందిన తరువాత, ఈ సంగతులు ఆయన గురించి రాసినవనీ, వారు ఆయనకు ఈ విధంగా చేశారనీ గుర్తు చేసుకున్నారు.

17 ఆయన లాజరును సమాధిలో నుంచి పిలిచి, చావు నుండి తిరిగి బతికించినప్పుడు యేసుతో ఉన్న ప్రజలు ఆయన గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు.

18 ఆయన ఈ సూచక క్రియ చేశాడని విన్న కారణంగా జన సమూహం ఆయనను కలుసుకోడానికి వెళ్ళారు.

19 దీని గురించి పరిసయ్యులు, “చూడండి, మనం ఏమీ చెయ్యలేం. లోకం ఆయన వెంట వెళ్ళింది.” అని తమలో తాము చెప్పుకున్నారు.