అంజూరపు చెట్టు శపించబడడం, దేవాలయం మళ్లీ శుద్ధి చేయబడడం

ఫలించని అంజూరపు చెట్టు శపించబడుతుంది, దేవాలయం రెండవసారి శుద్ధి చేయబడుతుంది.

బేతనియ, యెరూషలేము (సోమవారం). మెస్సీయ శక్తి వెల్లడైన రోజు

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 21:18–19, 12–13

21:18 తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది.

19 అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, “ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!” అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది.

12 యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లలనూ, పావురాలు అమ్మేవారి పీటలనూ పడదోశాడు.

13 వారితో ఇలా అన్నాడు, “‘నా ఆలయం ప్రార్థనకు నిలయం’ అని రాసి ఉంది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు.”

మార్కు రాసిన సువార్త 11:12–18

11:12 మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది.

13 కొంత దూరంలో ఆకులున్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరికి వెళ్ళాడు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14 ఆయన ఆ చెట్టుతో, “ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు” అన్నాడు. ఆయన పలికినది శిష్యులు విన్నారు.

15 వారు యెరూషలేము వచ్చినప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి, వ్యాపారం చేస్తున్నవారిని తరిమి వేయడం ప్రారంభించాడు. డబ్బు మార్చే వ్యాపారుల బల్లలు, పావురాలు అమ్ముతున్న వారి పీటలు పడదోశాడు. 16 దేవాలయం గుండా ఎవ్వరూ సరుకులు మోసుకుపోకుండా చేశాడు.

17 ఆయన వారికి బోధిస్తూ,

“‘నా ఆలయం అన్ని జాతులకూ ప్రార్థనా ఆలయం అంటారు’

అని రాసి లేదా? కానీ మీరు దాన్ని దోపిడి దొంగల గుహగా చేశారు” అన్నాడు.

18 ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ మాట విని ఆయనను ఎలా చంపాలా అని ఆలోచించారు గానీ అక్కడ ఉన్న ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్య చకితులై ఉండడం వల్ల ఆయనకు భయపడ్డారు.

లూకా రాసిన సువార్త 19:45–48

19:45-46 అప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో, “‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగల గుహగా చేశారు” అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు.

47 ఆయన ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ, ప్రజల్లో ముఖ్యులు ఆయనను అంతం చేయాలని చూస్తూ వచ్చారు. 48 కాని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను విడిచి పెట్టకుండా ఆయన మాటలు వింటూ ఉన్నారు.

కొందరు గ్రీకులు యేసును చూడాలని కోరుకోవడం

యేసును చూడాలనే కొందరు గ్రీకుల కోరిక శిష్యులను అయోమయానికి గురిచేస్తుంది. అది యేసును ఆత్మలో కలవరపరచి, జీవనమరణాలను త్యాగంగా వివరించడానికి, తాను “పైకెత్తబడడం” ద్వారా అందరినీ తనవైపుకు ఎలా ఆకర్షించుకుంటాడో చూపడానికి దారితీస్తుంది.

యెరూషలేము (సోమవారం)

యోహాను రాసిన సువార్త 12:20–50

12:20 ఆ పండగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొంతమంది గ్రీకులు ఉన్నారు. 21 వారు, గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చి, “అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది” అన్నారు. 22 ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. అంద్రెయ ఫిలిప్పుతో కలిసి వెళ్ళి యేసుతో చెప్పారు.

23 యేసు వారికి జవాబిస్తూ, “మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చింది. 24 మీతో కచ్చితంగా చెబుతున్నాను, గోదుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒకటిగానే ఉండిపోతుంది. అది చస్తే అధికంగా ఫలం ఇస్తుంది. 25 తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు. 26 నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు.

27 ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది. నేనేం చెప్పను? ‘తండ్రీ, ఈ గడియ నుంచి నన్ను తప్పించు’ అని చెప్పనా? కాని, దీని కోసమే నేను ఈ గడియకు చేరుకున్నాను. 28 తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో” అన్నాడు. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వచ్చి ఇలా అంది, “నేను దానికి మహిమ కలిగించాను. మళ్ళీ మహిమ కలిగిస్తాను.” 29 అప్పుడు, అక్కడ నిలుచుని దాన్ని విన్న జనసమూహం, “ఉరిమింది” అన్నారు. మిగతా వారు, “ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు” అన్నారు.

30 అందుకు యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఈ స్వరం నా కోసం కాదు. మీ కోసమే వచ్చింది. 31 ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుణ్ణి తరిమివేసే సమయం. 32 నన్ను భూమిమీద నుంచి పైకి ఎత్తినప్పుడు, మనుషులందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటాను.” 33 ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, దానికి సూచనగా ఆయన ఈ మాట చెప్పాడు. 34 ఆ జనసమూహం ఆయనతో, “క్రీస్తు ఎల్లకాలం ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం. ‘మనుష్య కుమారుణ్ణి పైకెత్తడం జరగాలి’ అని నువ్వెలా చెబుతావు? ఈ మనుష్య కుమారుడు ఎవరు?” అన్నారు. 35 అప్పుడు యేసు వారితో, “వెలుగు మీ మధ్య ఉండేది ఇంకా కొంత కాలం మాత్రమే. చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే, ఇంకా వెలుగు ఉండగానే, నడవండి. చీకట్లో నడిచే వాడికి, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు. 36 మీకు వెలుగుండగానే, ఆ వెలుగులో నమ్మకముంచి వెలుగు సంబంధులు కండి” అన్నాడు. యేసు ఈ సంగతులు చెప్పి, అక్కడ నుంచి వెళ్ళి వారికి కనబడకుండా రహస్యంగా ఉన్నాడు.

37 యేసు వారి ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వారు ఆయనను నమ్మలేదు.

38 ప్రభూ, మా సమాచారం ఎవరు నమ్మారు? ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయ్యింది?”

అని ప్రవక్త యెషయా చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది. 39 ఈ కారణంగా వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే యెషయా మరొక చోట ఇలా అన్నాడు,

40 “ఆయన వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఆయన వారి హృదయాలను కఠినం చేశాడు.

అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి,

హృదయాలతో గ్రహించి, నా వైపు తిరిగేవారు.

అప్పుడు నేను వారిని బాగు చేసేవాణ్ణి.”

41 యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు. 42 అయినా, పాలకవర్గం వారిలో కూడా చాలామంది యేసులో నమ్మకం ఉంచారు, కాని పరిసయ్యులు సమాజ మందిరంలో నుంచి తమను వెలివేస్తారని భయపడి, ఆ విషయం ఒప్పుకోలేదు. 43 వారు దేవుని నుంచి వచ్చే మెప్పుకంటే, మనుషుల నుంచి వచ్చే మెప్పునే ఇష్టపడ్డారు.

44 అప్పుడు యేసు పెద్ద స్వరంతో, “నాలో నమ్మకం ఉంచినవాడు నాలో మాత్రమే కాక నన్ను పంపినవాడిలో కూడా నమ్మకం ఉంచుతాడు. 45 నన్ను చూసినవాడు నన్ను పంపినవాణ్ణి కూడా చూస్తున్నాడు.

46 నాలో నమ్మకం ఉంచేవాడు చీకట్లో ఉండిపోకూడదని, ఈ లోకంలోకి నేను వెలుగుగా వచ్చాను. 47 ఎవరైనా నా మాటలు విని, వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడానికి కాదు.

48 నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది. 49 ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నాకు ఆదేశించాడు. 50 ఆయన ఆదేశం శాశ్వత జీవం అని నాకు తెలుసు. అందుకే నేను ఏ మాట చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వారితో చెబుతున్నాను” అన్నాడు.

ఫలించని అంజూరపు చెట్టు ఎండిపోయినట్లు కనబడడం

బేతనియ నుండి యెరూషలేముకు వెళ్లే దారిలో. (మంగళవారం)

మత్తయి రాసిన సువార్త 21:20–22

21:20 అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి, “ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!” అని చెప్పుకున్నారు.

21 అందుకు యేసు, “మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది. 22 మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు” అని వారితో చెప్పాడు.

మార్కు రాసిన సువార్త 11:19–26

11:19 సాయంకాలమైనప్పుడు ఆయన, ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు. 20 తరువాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు.

21 అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, “రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది” అన్నాడు.

22 అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి. 23 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. 24 అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. 25 అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి. 26 అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”

లూకా రాసిన సువార్త 21:37–38

21:37 ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఒలీవ కొండపై గడిపేవాడు.

38 ప్రజలంతా పొద్దున్నే దేవాలయంలో ఆయన ఉపదేశం వినడానికి వస్తూ ఉన్నారు.