మహాసభ యేసు అధికారాన్ని సవాలు చేయడం

అధికారులు (మహాసభ) గుర్తింపు పొందిన బోధకునిగా (రబ్బీగా) యేసుకున్న అధికారాన్ని అధికారికంగా సవాలు చేస్తారు.

దేవాలయ ప్రాంగణంలో. (మంగళవారం) వివాదాల రోజు

యేసు తనకు బాప్తిసమిచ్చిన తన ముందరి దూత అయిన బాప్తిసమిచ్చే యోహానును తన మానవ అధికారానికి ఆధారంగా చూపి, యోహాను బాప్తిసమును గురించి మహాసభ అభిప్రాయాన్ని కోరుతాడు. ఈ సూటి ఎదురు ప్రశ్న యూదుల నాయకులను నిశ్చేష్టులను చేస్తుంది. యేసు మూడు ఉపమానాలతో తన వాదనను బలంగా నొక్కిచెబుతాడు: (అ) ఇద్దరు కుమారుల ఉపమానం; (ఆ) దుష్టులైన కౌలుదారుల ఉపమానం; (ఇ) రాజు కుమారుని వివాహ విందు ఉపమానం.

క్రీ.శ. 30 లేదా 29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 21:23–22:14

21:23 ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు.

24 యేసు, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను.

25 యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?” అని వారిని అడిగాడు.

అప్పుడు వారు, “మనం పరలోకం నుండి, అని చెబితే, ‘మీరెందుకు యోహానును నమ్మలేదు?’ అంటాడు.

26 మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకుని,

27 “మాకు తెలియదు” అన్నారు. అప్పుడాయన “అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను” అన్నాడు.

28 ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, ‘బాబూ, పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి’ అన్నాడు. 29 అతడు, ‘నేను వెళ్ళను’ అని జవాబిచ్చాడుగానీ తరవాత మనసు మార్చుకుని వెళ్ళాడు.

30 అప్పుడా తండ్రి తన రెండవ కొడుకు దగ్గరికి వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, ‘నేను వెళతాను’ అన్నాడుగానీ వెళ్ళలేదు. 31 ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?” అని వారిని అడిగాడు. వారు, “మొదటివాడే” అని జవాబిచ్చారు. యేసు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. 32 యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడ లేదు, అతనిని నమ్మలేదు.

33 “ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు.

34 కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు.

35 ఆ రైతులు అతని దాసులను పట్టుకుని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు.

36 అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు.

37 చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు.

38 అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు.

39 వారు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు.

40 ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు?” అని వారిని అడిగాడు.

41 వారు “అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు.

42 అప్పుడు యేసు వారితో,

“‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది.

దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’

అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?

43 “కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి, దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను.

44 ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది” అన్నాడు.

45 ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు, పరిసయ్యులు గ్రహించారు.

46 వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారుగానీ ప్రజలకు భయపడ్దారు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు.

22:1 యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు, 2 “పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది. 3 ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు.

4 అప్పుడు ఆ రాజు, ‘ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి’ అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు. 5 కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు. 6 మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు.

7 కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. 8 అప్పుడతడు, ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు. 9 కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి’ అని తన దాసులతో చెప్పాడు. 10 ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది.

11 “రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు. 12 రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు. 13 కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు. 14 ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.”

మార్కు రాసిన సువార్త 11:27–12:12

11:27 యేసు, ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి

28 ఆయనతో, “నీవు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు?” అని అడిగారు.

29 యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను.

30 యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు.

31 వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము ఈ విధంగా చర్చించుకున్నారు. “‘మనం పరలోకం నుండి’ అని అంటే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు?’ అంటాడు.

32 ‘మనుషుల నుండి’ అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది” అనుకున్నారు. ఎందుకంటే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు.

33 కనుక వారు, “మాకు తెలియదు” అని జవాబు చెప్పారు. యేసు, “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.

12:1 ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. “ఒకడు ద్రాక్షతోట వేసి చుట్టూ గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు తొక్కడానికి గానుగ తొట్టి కట్టించి, అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తరువాత ఆ ద్రాక్షతోటను రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై దూర దేశానికి వెళ్ళాడు.

2 పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్షపండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపాడు.

3 అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకుని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు.

4 అతడు మళ్ళీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతని తలపై గాయపరచి, అవమానించి పంపివేశారు.

5 అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతణ్ణి చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు. కాని, ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి, ఇంకొందరిని చంపారు.

6 వారి దగ్గరికి పంపడానికి ఇక తన ప్రియ కుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకుని చివరిగా అతడు తన కుమారుణ్ణి పంపాడు.

7 కాని ఆ కౌలుదారులు ‘ఇతడే వారసుడు! ఇతన్ని చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది’ అని తమలో తాము మాట్లాడుకున్నారు.

8 వారు అతన్ని పట్టుకుని, చంపి ఆ ద్రాక్షతోట అవతల పారవేశారు.

9 అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతులను చంపి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు.

10 మీరు ఈ లేఖనం చదవలేదా?

‘ఇల్లు కట్టేవారు పనికి రాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.

11 అది ప్రభువు మూలంగా జరిగింది.

ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.’”

12 ఈ ఉపమానం తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయనను బంధించాలని చూశారు కాని, ప్రజల గుంపును చూసి జంకారు. అందువల్ల ఆయనను వదిలి వెళ్ళిపోయారు.

లూకా రాసిన సువార్త 20:1–19

20:1 ఆ రోజుల్లో ఒకసారి ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ పెద్దలతో కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చి,

2 “నువ్వు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు? మాకు చెప్పు” అని ఆయనను అడిగారు.

3 దానికి ఆయన, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాకు జవాబివ్వండి. 4 యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా, మనుషుల్లో నుండి కలిగిందా?” అని వారినడిగాడు.

5 వారు ఇలా ఆలోచించారు, “మనం ‘పరలోకం నుండి కలిగింది’ అంటే, ‘అలాగైతే మీరెందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు.

6 ‘మనుషుల్లో నుండి కలిగింది’ అంటే జనం మనలను రాళ్ళతో కొడతారు. ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని అంతా కచ్చితంగా నమ్ముతున్నారు.”

7 ఇలా ఆలోచించుకుని వారు, “అది ఎక్కడ నుండి కలిగిందో మాకు తెలీదు” అని జవాబిచ్చారు.

8 దానికి యేసు, “నేను కూడా ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో మీతో చెప్పను” అన్నాడు.

9 ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి ద్రాక్షతోట నాటించి, దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ఆ తరువాత వేరే దేశానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ఉన్నాడు.

10 కోతల కాలం వచ్చినపుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపి వేశారు.

11 మళ్ళీ అతడు మరో పనివాణ్ణి పంపాడు. వారు వాణ్ణి కూడా కొట్టి, అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు.

12 మళ్ళీ అతడు మూడవ వాణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి గాయపరిచి బయటకు తోసివేశారు.

13 అప్పుడా ద్రాక్షతోట యజమాని ఇలా అనుకున్నాడు, “ఇప్పుడు నేనేం చేయాలి? ఇక నా సొంత కుమారుణ్ణి పంపుతాను. వారు ఒకవేళ అతణ్ణి గౌరవిస్తారేమో.”

14 అయితే ఆ కౌలు రైతులు అతణ్ణి చూసి, “ఇతడే వారసుడు. ఇతన్ని చంపివేస్తే ఈ పొలం మనదవుతుంది” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

15 వారు అతణ్ణి ద్రాక్ష తోట బయటకు తోసి చంపివేశారు. ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వారినేం చేస్తాడు?

16 అతడు వచ్చి ఆ రైతులను నాశనం చేసి తన ద్రాక్షతోటను మరొకరికి అప్పగిస్తాడు.” వారు అది విని, “అలా ఎన్నటికీ కాకూడదు” అన్నారు.

17 ఆయన వారిని చూసి, “అలాగైతే, ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’ అని రాసి ఉన్న మాట సంగతి ఏమిటి?

18 ఈ రాయి పైన పడే ప్రతి వాడూ ముక్కలై పోతాడు. కానీ ఈ రాయి ఎవరిమీద పడుతుందో వాణ్ణి పిండి చేసేస్తుంది.”

19 ఆయన తమను ఉద్దేశించే ఈ ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ గ్రహించి ఆయనను ఆ సమయంలోనే పట్టుకోవాలని చూశారు కానీ ప్రజలకు భయపడ్డారు.