సార్దీస్కు, ఉత్సాహం తగ్గిపోతున్న సంఘాలకు

సార్దీస్ సంఘానికి, తమ ఆసక్తిని, నమ్మకత్వాన్ని తగ్గిపోనిస్తున్న సంఘాలన్నిటికీ సందేశం.

క్రీ.శ. 96

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3:1–6

1 “సార్దీస్‌లో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

ఏడు నక్షత్రాలూ దేవుని ఏడు ఆత్మలూ ఉన్నవాడు చెప్పే విషయాలు. నీ పనులు నాకు తెలుసు. బ్రతికి ఉన్నావనే పేరు మాత్రం నీకు ఉంది గానీ నువ్వు చచ్చిన వాడివే. 2 జాగ్రత్త పడు. చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచుకో. ఎందుకంటే నీ పనులు నా దేవుని ముందు నాకు సంపూర్ణంగా కనిపించడం లేదు. 3 కాబట్టి నీవు ఉపదేశం ఎలా పొందావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకో. దానినే ఆచరించి పశ్చాత్తాప పడు. నువ్వు మేలుకొనక పోతే, నేను దొంగలా వస్తాను. ఏ సమయంలో వస్తానో నీకు ఎంతమాత్రం తెలియదు.

4 అయితే సార్దీస్ లో నీ దగ్గర ఉన్నవారిలో కొందరు తమ బట్టలు మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు. కాబట్టి వారు తెల్లటి బట్టలు వేసుకుని నాతో కలసి నడుస్తారు. 5 జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను. 6 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”

ఫిలదెల్ఫియకు, నమ్మకమైన, ఆసక్తిగల సంఘాలకు

ఫిలదెల్ఫియలోని సంఘానికి, తమ అవకాశాలు, సామర్థ్యం అనుమతించినంతవరకు ఆసక్తితో, నమ్మకత్వంతో పనిచేసే సంఘాలన్నిటికీ సందేశం.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3:7–13

7 “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

సత్యం మూర్తీభవించిన వాడూ పరిశుద్ధుడూ దావీదు తాళం చెవులను చేత పట్టుకున్న వాడు; తెరిచాడంటే ఎవరూ మూయలేరు, మూశాడంటే ఎవరూ తీయలేరు, అలాటి ఈయన చెప్పే విషయాలేమిటంటే, 8 నీ పనులు నాకు తెలుసు. చూడు, నీ ఎదుట తలుపు తీసి ఉంచాను. దాన్ని ఎవరూ మూయలేరు. నీ బలం స్వల్పమే అయినా నా వాక్కుకు విధేయత చూపావు. నా నామాన్ని తిరస్కరించలేదు. 9 సాతాను సమాజానికి చెందినవారై ఉండి, మేము యూదులమే అని అబద్ధమాడే వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ కాళ్ళపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయ్యేలా చేస్తాను. 10 ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదికి రాబోయే పరీక్షా కాలంలో నేను నిన్ను కాపాడతాను.

11 నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటాన్ని ఎవరూ తీసుకోకుండా నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో. 12 జయించేవాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి అతడు ఇక ఎప్పటికీ బయటకు వెళ్ళడు. నా దేవుని పేరునూ పరలోకంలో నా దేవుని దగ్గర నుండి వస్తున్న నా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేము పేరునూ నా కొత్త పేరునూ అతనిపై రాస్తాను. 13 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”

లవొదికయకు, సంపన్నమైన, గర్విష్ఠమైన, నులివెచ్చని సంఘాలకు

లవొదికయలోని సంఘానికి, సంపన్నమైన, గర్విష్ఠమైన, నులివెచ్చని సంఘాలన్నిటికీ సందేశం.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3:14–22

14 “లవొదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

ఆమేన్‌ అనే పేరున్న వాడూ నమ్మకమైన సత్యసాక్షీ దేవుని సృష్టికి మూలం అయిన వాడూ చేసే ప్రకటన ఏమిటంటే, 15 నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది. 16 నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండాా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను. 17 ‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.

18 నా సలహా విను, నీకు సంపద పెరగడం కోసం కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కనిపించి నీ సిగ్గు పోకుండా ధరించడానికి తెల్లని వస్త్రాలనూ, నీవు చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో. 19 నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.

20 చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరికి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు. 21 నేను విజయం సాధించి నా తండ్రితో కలసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.

22 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”

సమస్త సృష్టి యేసు క్రీస్తును ఆరాధిస్తోంది

క్రైస్తవ మతపు దేవుడైన యేసు క్రీస్తు ఆరాధనలో సమస్త సృష్టి పాలుపంచుకుంటున్న దృశ్యంతో యోహాను దర్శనాలు మొదలవుతాయి.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 4

1 ఇదంతా జరిగాక నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరుచుకుని ఉంది. నేను ఇంతకు ముందు విన్న స్వరం భేరీ నాదంలా నాతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ స్వరం, “పైకి రా. తరువాత జరగాల్సినవి నీకు చూపిస్తాను” అని పలికింది.

2 వెంటనే నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. అప్పుడు పరలోకంలో ఉన్న ఒక సింహాసనాన్నీ, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తినీ చూశాను. 3 అలా కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలాగా కెంపులాగా ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఒక ఇంద్రధనుస్సు ఆవరించి ఉంది.

4 ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి.

5 ఆ సింహాసనం నుండి మెరుపులు, శబ్దాలు, ఉరుములు వస్తున్నాయి. సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.

6 ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికంలాటి సముద్రంలాటిది ఉంది. ముందూ వెనకా కళ్ళు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి. 7 మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండవది దూడలా ఉంది. మూడవ ప్రాణికి మనిషి ముఖంలాటి ముఖం ఉంది. నాలుగవ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది.

8 ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”

9 ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు 10 ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, 11 “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

ముద్రవేసిన గ్రంథపు చుట్టను ఏ మనిషీ విప్పలేడు

యోహాను తన దర్శనంలో ఏడు ముద్రలుగల ఒక గ్రంథపు చుట్టను చూస్తున్నాడు. అందులో దేవుని సంఘపు భవిష్యత్తు చరిత్ర ఉంది. దాన్ని ఏ మనిషీ విప్పలేకపోయాడు.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 5:1–3

1 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో ఏడు సీలులతో గట్టిగా మూసి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను. ఆ గ్రంథం వెనకా లోపలా రాసి ఉంది. 2 బలిష్టుడైన ఒక దేవదూత, “ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను. 3 కానీ ఆ గ్రంథాన్ని తెరవడానికైనా, చూడడానికైనా పరలోకంలో భూమి మీదా భూమి కిందా ఎవరికీ సామర్థ్యం లేకపోయింది.

గొర్రెపిల్ల గ్రంథపు చుట్టను విప్పుతున్నాడు

బలి అర్పించబడుతున్న గొర్రెపిల్లగా చిత్రించబడిన దేవుని కుమారుడు, కాలాంతం వరకు దైవ సంకల్పం సంఘాన్ని ఎలా నడిపిస్తుందో తెలిపే చరిత్రను సంఘానికి చూపించడానికి గ్రంథపు చుట్టను విప్పుతాడు. సృష్టి అంతా బలి అర్పించబడిన దేవుని గొర్రెపిల్లకు మళ్లీ స్తుతి, ఘనత అర్పిస్తుంది.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 5:4–14

4 ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవారు ఎవరూ కనబడక పోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను.

5 అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “ఏడవకు. చూడు, ఏడు సీలులను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహమూ, దావీదు వేరూ అయిన వ్యక్తి జయించాడు” అన్నాడు.

6 సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ ఏడు కళ్ళూ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు. 7 గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు.

8 ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యాలూ ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు.

9 ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు. 10 మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశావు. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు” అంటూ ఒక కొత్త పాట పాడారు.

11 ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది. 12 వారు, “వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు” అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు.

13 అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా “సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!” అనడం నేను విన్నాను.

14 ఆ నాలుగు ప్రాణులూ, “ఆమేన్‌” అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.