యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడు

లోకానికి తీర్పు తీర్చడానికి క్రీస్తు రెండవసారి వచ్చే వరకు క్రైస్తవ సంఘంలో ప్రవక్తల పరంపర నిరంతరం కొనసాగడానికి బదులుగా, దాని స్థానాన్ని భర్తీ చేయడానికి అపొస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడు (బహుశా క్రీ.శ. 96లో).

క్రీ.శ. 96

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చేయమని అందరికీ చెప్పబడింది

ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చేయమని మానవులందరికీ ఆజ్ఞాపించబడింది.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1:1–3

1 ఇది త్వరలో జరగాల్సిన సంగతులను యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దేవదూతను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతులను తెలియజేశాడు. 2 యోహాను దేవుని వాక్కును గురించీ యేసు క్రీస్తు సాక్షాన్ని గురించీ తాను చూసినదానంతటికీ సాక్షిగా ఉన్నాడు.

3 ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడూ, వాటిని వినే వారూ, వాటి ప్రకారం నడుచుకునే వారూ ధన్య జీవులు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.

సంఘాలకు యోహాను అభివందనాలు

యోహాను సంఘాలకు అభివందనాలు తెలియజేస్తూ, లోకానికి తీర్పు తీర్చడానికి రాబోయే వారి రక్షకుని దైవత్వాన్ని ధృవీకరిస్తున్నాడు.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1:4–8

4 ఆసియలో ఉన్న ఏడు సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు. పూర్వం ఉండి, ప్రస్తుతం ఉంటూ, రానున్న వాడి నుండీ, ఆయన సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల నుండీ, 5 నమ్మకమైన సాక్షీ, చనిపోయిన వారిలో నుండి ప్రథముడిగా లేచిన వాడూ, భూరాజులందరి పరిపాలకుడూ అయిన యేసు క్రీస్తు నుండీ కృపా, శాంతీ మీకు కలుగు గాక. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మనలను మన పాపాల నుండి విడిపించాడు. 6 మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగానూ, యాజకులుగానూ చేశాడు. ఆయనకు కీర్తి యశస్సులూ, అధికారమూ కలకాలం ఉంటాయి గాక!

7 చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు.

ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు.

భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు.

8 “ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు.

పత్మసులో యోహానుకు క్రీస్తు ప్రత్యక్షమవుతున్నాడు

పత్మసు దీవిలో క్రీస్తు తనకు ఎలా ప్రత్యక్షమయ్యాడో, ప్రవక్తగా తనకు అప్పగించిన బాధ్యత గురించీ యోహాను చెబుతున్నాడు.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1:9–20

9 మీ సోదరుణ్నీ, యేసు కోసం కలిగే హింసలోనూ, రాజ్యంలోనూ, ఓర్పులోనూ మీలో ఒకడినీ అయిన యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మసు ద్వీపంలో ఉన్నాను.

10 ప్రభువు దినాన నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు భేరీనాదం లాంటి ఒక పెద్ద స్వరం 11 నా వెనక వినిపించింది. “నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దాన్ని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు” అని చెప్పడం విన్నాను.

12 అది వింటూనే “ఎవరిదీ స్వరం?” అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను. 13 ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడిలాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు. 14 ఆయన తల, తల వెంట్రుకలూ ఉన్నిలాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ తళతళ మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠ స్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది. 16 ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది.

17 నేను ఆయనను చూడగానే నిశ్చేష్టు డి నా ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, “భయపడకు, మొదటివాణ్ణీ చివరివాణ్ణీ నేనే. 18 జీవిస్తున్నవాణ్ణీ నేనే. చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి. 19 ఇప్పుడు నువ్వు చూసిన సంగతులనూ ప్రస్తుతమున్న సంగతులనూ, వీటి తరువాత జరగబోయే సంగతులనూ రాయి.

20 నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు, ఆ ఏడు బంగారు దీపస్తంభాల రహస్యం ఇది, ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు. ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.

ఎఫెసుకు, పతనమవుతున్న సంఘాలన్నిటికీ

ఎఫెసులోని సంఘానికి, పతనం కావడం మొదలైన సంఘాలన్నిటికీ సందేశం.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2:1–7

1 “ఎఫెసులో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకుని ఏడు దీపస్తంభాల మధ్య తిరిగేవాడు చెప్పే విషయాలు ఏవంటే, 2 నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవనీ, అపొస్తలులు కాకుండానే, మేము అపొస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు. 3 ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం భారం భరిస్తూ అలసి పోలేదనీ నాకు తెలుసు.

4 అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావు. 5 కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. పశ్చాత్తాపపడి ప్రారంభంలో చేసిన పనులు చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను. 6 అయితే నీలో ఈ విషయం ఉంది. నికొలాయితులు అనే వారి పనులను నువ్వు అసహ్యించుకుంటున్నావు. ఆ పనులంటే నాకూ అసహ్యమే.

7 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.”

స్ముర్నకు, హింసించబడుతున్న సంఘాలన్నిటికీ

స్ముర్న సంఘానికి, హింసను, శ్రమను అనుభవిస్తున్న సంఘాలన్నిటికీ సందేశం.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2:8–11

8 “స్ముర్నలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

మొదటివాడూ చివరివాడూ చనిపోయి తిరిగి బతికిన వాడు చెబుతున్నదేమిటంటే, 9 నువ్వు పడుతున్న హింసలూ, నీ పేదరికమూ నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా దూషణల పాలు చేస్తున్నారో నాకు తెలుసు. 10 నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. పది రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.

11 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించే వాడికి రెండవ మరణం ఏ హని చేయలేదు.”

పెర్గముకు, తప్పుడు బోధను అనుమతించే సంఘాలకు

పెర్గము సంఘానికి, తమ క్రమశిక్షణను సడలించడం వల్ల తప్పుడు బోధకులను లోపలికి అనుమతించిన సంఘాలన్నిటికీ సందేశం.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2:12–17

12 “పెర్గములో ఉన్న సంఘదూతకు ఇలా రాయి.

రెండు వైపులా పదునున్న కత్తి కలవాడు చెబుతున్న సంగతులు. 13 నీ నివాసం సాతాను సింహాసనం ఉన్న చోట ఉంది అని నాకు తెలుసు. అయినా నా పేరును నువ్వు గట్టిగా పట్టుకున్నావు. సాతాను నివసించే ఆ స్థలంలో నా కోసం సాక్ష్యం చెప్పిన అంతిపా అనే నా విశ్వాసిని చంపిన రోజుల్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని వదల్లేదు.

14 అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పులను నేను ఎత్తి చూపాల్సిందే. అవేవంటే ఇశ్రాయేలీయులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బాలాకుకు నూరిపోసిన బిలాము బోధను ఖచ్చితంగా పాటించేవారు నీలో ఉన్నారు. 15 అలాగే నికొలాయితుల బోధను అనుసరించే వారు కూడా నీలో ఉన్నారు. 16 కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నీ దగ్గరికి త్వరగా వస్తాను. నా నోటి నుండి వెలువడుతున్న కత్తితో వారితో యుద్ధం చేస్తాను.

17 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట విను గాక. ఎవరైతే జయిస్తారో అతణ్ణి దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతే కాకుండా అతనికి తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాతి మీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందిన వాడికే అది తెలుస్తుంది గానీ ఇంకెవరికీ తెలియదు.”

తుయతైరకు, అనైతికతను అనుమతించే సంఘాలకు

తుయతైరలోని సంఘానికి, నిజమైన విశ్వాసాన్ని ఒప్పుకుంటూ, అనేక విధాలుగా సత్కార్యాలు సమృద్ధిగా చేస్తున్నప్పటికీ, తమ మధ్య అనైతికత, విగ్రహారాధన కొనసాగడానికి ఇంకా అనుమతిస్తున్న సంఘాలన్నిటికీ సందేశం.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2:18–29

18 “తుయతైరలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. అగ్నిజ్వాలల్లాటి కళ్ళూ, మెరుస్తున్న కంచు లాంటి పాదాలూ ఉన్న దైవ పుత్రుడు చెప్పే సంగతులు ఏమిటంటే, 19 నీ పనులూ నీ ప్రేమా నీ విశ్వాసమూ నీ సేవా నీ ఓర్పూ అన్నీ నాకు తెలుసు. ప్రారంభంలో నువ్వు చేసిన పనుల కంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎక్కువని నాకు తెలుసు.

20 అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేమిటంటే ‘నేను ప్రవక్తని’ అని చెప్పుకుంటున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో నా సేవకులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది. 21 పశ్చాత్తాపపడడానికి నేను ఆమెకు సమయమిచ్చాను. కానీ ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాపపడడానికి ఇష్టపడలేదు. 22 ఇదిగో విను, నేను ఆమెను జబ్బుపడి మంచం పట్టేలా చేస్తాను. ఆమెతో వ్యభిచారం చేసిన వారు పశ్చాత్తాప పడాల్సిందే. లేకపోతే వారు తీవ్రమైన హింసలు పడేలా చేస్తాను. 23 ఆమె పిల్లలను కచ్చితంగా చంపుతాను. దాని వల్ల అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించేవాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను.

24 అయితే తుయతైరలో మిగిలినవారు, అంటే ఈ బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన విషయాలు అభ్యసించని వారితో ‘ఇక మరే భారమూ మీ మీద పెట్టను’ అని చెబుతున్నాను. 25 నా రాక వరకూ మీకు ఉన్నదాన్నే గట్టిగా పట్టుకోండి. 26 జయిస్తూ, నా పనులను చివరి వరకూ చేసేవాడికి జాతులపై అధికారం ఇస్తాను. 27 అతడు ఇనప దండంతో వారిని పరిపాలిస్తాడు. వారిని మట్టి కుండను పగలగొట్టినట్టు ముక్కలు చెక్కలు చేస్తాడు. 28 తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేనూ అతనికి ఉదయతారను కూడా ఇస్తాను.

29 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”