మొదటి ముద్ర: సువార్త జయిస్తుంది

మొదటి ముద్ర విప్పబడుతుంది. ఆ తరువాత కనిపించే దర్శనం యూదులపైనా యూదేతరులపైనా సువార్త సాధించే విస్తృత విజయాన్ని ప్రకటిస్తుంది.

క్రీ.శ. 96

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6:1–2

1 ఆ గొర్రెపిల్ల ఆ ఏడింటిలో మొదటి సీలు తెరవడం చూశాను. అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి గర్జిస్తున్నట్టుగా, “ఇలా రా” అనడం విన్నాను. 2 నేను అటు చూస్తుంటే తెల్లని గుర్రం ఒకటి కనిపించింది. దాని మీద కూర్చున్న రౌతు చేతిలో ఒక విల్లు ఉంది. అతనికి ఒక కిరీటం ఇచ్చారు. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు.

రెండవ ముద్ర: యూదులు చెదరగొట్టబడతారు

రెండవ ముద్ర విప్పబడుతుంది. ట్రాజన్, హేడ్రియన్ పాలనలో యూదులు అనుభవించే క్రూరమైన హింసలను, వారు పూర్తిగా చెదరగొట్టబడటాన్ని ఇది ప్రకటిస్తుంది (102–138).

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6:3–4

3 గొర్రెపిల్ల రెండవ సీలు తెరచినప్పుడు రెండవ ప్రాణి, “ఇలా రా” అనడం విన్నాను. 4 అప్పుడు ఎర్రగా ఉన్న మరో గుర్రం బయల్దేరింది. దాని పైన కూర్చున్న రౌతుకు పెద్ద కత్తి ఇచ్చారు. మనుషులు ఒకరినొకరు హతం చేసుకునేలా భూమి పైన శాంతిని తీసివేయడానికి అతనికి అనుమతి ఉంది.

మూడవ ముద్ర: శాంతి, సమృద్ధి

మూడవ ముద్ర విప్పబడుతుంది. సెప్టిమియస్ సెవెరస్ కుటుంబ పాలనలో ఉండే శాంతిని, సమృద్ధిని ఇది ప్రకటిస్తుంది (193–235).

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6:5–6

5 ఆ తరువాత గొర్రెపిల్ల మూడవ సీలు తెరిచాడు. అప్పుడు, “ఇలా రా” అని మూడవ ప్రాణి పిలవడం విన్నాను. నేను అప్పుడు ఒక నల్లని గుర్రం చూశాను. దానిమీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు. 6 నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “రోజు కూలికి ఒక కిలో గోదుమలూ, రోజు కూలికి మూడు కిలోల బార్లీ గింజలు. ఇక నూనెనీ, ద్రాక్షారసాన్నీ పాడు చేయవద్దు” అని పలకడం విన్నాను.

నాలుగవ ముద్ర: యుద్ధం, కరువు, తెగులు

నాలుగవ ముద్ర విప్పబడుతుంది. మాక్సిమినస్, డెసియస్, వలేరియన్ పాలనల్లో ప్రబలిన క్రూరమైన యుద్ధాలను, కరువులను, హింసలను, తెగుళ్లను ఇది ప్రకటిస్తుంది (255–271).

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6:7–8

7 గొర్రెపిల్ల నాలుగవ సీలు తెరచినప్పుడు, “ఇలా రా” అని నాలుగవ ప్రాణి చెప్పడం విన్నాను. 8 అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూరమృగాలతో చంపడానికి భూమి మీద నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది.

ఐదవ ముద్ర: అన్యమతస్థుల చివరి హింస

ఐదవ ముద్ర విప్పబడుతుంది. క్రైస్తవ మతంపై అన్యమతస్థుల చివరి హింసను, క్రైస్తవుల భయాలను ఇది ప్రకటిస్తుంది (286–301).

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6:9–11

9 ఆయన అయిదవ సీలు తెరచినప్పుడు దేవుని వాక్కు కోసమూ, తమ సాక్ష్యం కారణంగానూ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం కింద చూశాను. 10 వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, “సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్నవారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?” 11 అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ తెల్లని దుస్తులు ఇచ్చారు. “మీలాగే హతం కావాల్సిన మీ తోటి సేవకుల, సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి” అని వారికి చెప్పడం జరిగింది.

ఆరవ ముద్ర: అన్యమతం కూల్చివేయబడుతుంది

ఆరవ ముద్ర విప్పబడుతుంది. అన్యమతం చివరికి కూల్చివేయబడినప్పుడు రోమీయుల సామ్రాజ్యంలో జరిగే కల్లోలాలను, దాని స్థానంలో క్రైస్తవ సంఘం విజయవంతంగా స్థాపించబడటాన్ని ఇది చిత్రిస్తుంది. దర్శనంలోని ఈ భాగం తొలి హతసాక్షుల నిత్య ఆనందాన్ని, వారు దేవునికి, గొర్రెపిల్లకు అర్పించే స్తుతిని కూడా సూచిస్తుంది (323).

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6:12–7:17

12 ఆయన ఆరవ సీలు తెరిచినప్పుడు నేను చూస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు గొంగళిలాగా నల్లగా మారిపోయాడు. చంద్రబింబమంతా రక్తంలా ఎర్రగా అయింది. 13 పెనుగాలి వీచినప్పుడు అంజూరు చెట్టు నుండి పచ్చి కాయలు రాలినట్టుగా ఆకాశంలోని నక్షత్రాలు భూమిపై రాలాయి. 14 ఆకాశమంతా చుట్టిన కాగితంలా అదృశ్యమై పోయింది. పర్వతాలూ, ద్వీపాలూ అన్నీ వాటి వాటి స్థానాల నుండి కదిలిపోయాయి.

15 అప్పుడు భూమి మీద ఉన్న రాజులూ, ప్రముఖులూ, సేనాధిపతులూ, సంపన్నులూ, శక్తిమంతులూ, ఇంకా బానిసలూ, స్వేచ్ఛాజీవులూ అంతా పర్వతాల రాళ్ళ సందుల్లోనూ, గుహల్లోనూ దాక్కున్నారు. 16 వారు, “మీరు మా మీద పడండి! సింహాసనంపై కూర్చున్న ఆయన ముఖకాంతి నుండీ గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండీ మమ్మల్ని దాచిపెట్టండి. 17 వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది. ఎవరు నిలబడగలరు?” అంటూ పర్వతాలనూ, రాళ్ళనూ బతిమాలుకున్నారు.

7:1 ఈ సంగతులు జరిగిన తరువాత భూమి నాలుగు దిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలబడి ఉండడం నేను చూశాను. వారు భూమి మీద నాలుగు వైపుల నుంచి వీయాల్సిన గాలి వీయకుండా బలంగా అడ్డుకున్నారు. దాంతో భూమిమీద గానీ, సముద్రంమీద గానీ, ఏ చెట్టుమీద గానీ గాలి వీయడం లేదు.

2 మరొక దూత తూర్పు దిక్కు నుండి పైకి లేవడం నేను చూశాను. అతనికి సజీవ దేవుని సీలు ఉంది. భూమికీ సముద్రానికీ హని చేయడానికి అనుమతి ఉన్న మొదటి నలుగురు దూతలతో అతడు బిగ్గరగా 3 “మేము మా దేవుని దాసుల నుదిటిపై ముద్ర వేసేంత వరకూ భూమికీ, సముద్రానికీ, చెట్లకూ ఎలాంటి హని చేయవద్దు” అన్నాడు.

4 సీలు పొందిన వారి సంఖ్య చెబుతుంటే నేను విన్నాను. ఇశ్రాయేలు వారి గోత్రాలన్నిటిలో సీలు పొందినవారి సంఖ్య 1, 44,000.

5 గోత్రాల వారీగా ముద్ర పొందిన వారి సంఖ్య.

యూదా గోత్రంలో 12,000.

రూబేను గోత్రంలో 12,000.

గాదు గోత్రంలో 12,000.

6 ఆషేరు గోత్రంలో 12,000.

నఫ్తాలి గోత్రంలో 12,000.

మనష్షే గోత్రంలో 12,000.

7 షిమ్యోను గోత్రంలో 12,000.

లేవి గోత్రంలో 12,000.

ఇశ్శాఖారు గోత్రంలో 12,000.

8 జెబూలూను గోత్రంలో 12,000.

యోసేపు గోత్రంలో 12,000.

బెన్యామీను గోత్రంలో 12,000.

9 ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు. 10 వీరంతా కలసి,

“రక్షణ సింహాసనంపై కూర్చున్న మా దేవునిది, గొర్రెపిల్లది”

అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.

11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి,

12 “ఆమేన్! మా దేవుడికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహా బలం కలకాలం కలుగు గాక” అని చెబుతూ దేవుణ్ణి పూజించారు.

13 అప్పుడు ఆ పెద్దల్లో ఒకతను “తెల్లటి వస్త్రాలు వేసుకున్న వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు. 14 అందుకు నేను “అయ్యా, నీకే తెలుసు” అని జవాబిచ్చాను. అప్పుడు అతడు నాతో ఇలా చెప్పాడు, “వీరంతా మహా బాధల్లో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు. వాటిని తెల్లగా చేసుకున్నారు. 15 అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు. 16 వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ తీవ్రమైన వేడిమిగానీ వారికి తగలదు.

17 ఎందుకంటే సింహాసనం మధ్యలో కూర్చున్న గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. జీవమిచ్చే నీటి ఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. వారి కళ్ళలో నుండి కారే కన్నీటిని ఆయనే తుడిచివేస్తాడు.”

ఏడవ ముద్ర: బూరలతో ఏడుగురు దేవదూతలు

ఏడవ ముద్ర విప్పబడుతుంది. ఏడు బూరలతో ఏడుగురు దేవదూతలు పరలోకంలో కనిపిస్తారు. ఇప్పుడు విశ్రాంతిలో ఉన్న క్రైస్తవుల కృతజ్ఞతా ప్రార్థనలు, దేవుడు వారి ప్రార్థనలను అంగీకరించడం ప్రకటించబడతాయి. అనాగరిక జాతుల చేత సామ్రాజ్యానికి రాబోయే విధ్వంసం కూడా ప్రకటించబడుతుంది.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 8:1–5

1 ఆయన ఏడవ సీలు తెరిచినప్పుడు పరలోకంలో దాదాపు అరగంట సేపు నిశ్శబ్దం అలుముకుంది.

2 అప్పుడు నేను దేవుని సమక్షంలో నిలబడే ఏడుగురు దేవదూతలను చూశాను. వారికి ఏడు బాకాలు ఇచ్చారు. 3 మరో దూత ధూపం వేసే బంగారు పాత్ర చేత్తో పట్టుకుని వచ్చి బలిపీఠం ముందు నిలుచున్నాడు. సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠంపై పరిశుద్ధుల ప్రార్థనలతో కలపడానికి చాలా పరిమళ సాంబ్రాణి అతనికి ఇచ్చారు. 4 అప్పుడు ఆ దూత చేతిలో నుండి పరిమళ వాసనలు, సాంబ్రాణి పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలసి పైకి లేచి దేవుని సమక్షంలోకి వెళ్ళాయి.

5 ఆ దూత ధూపం వేసే పాత్రను తీసుకుని, బలిపీఠం పైన ఉన్న నిప్పు కణికలతో దాన్ని నింపి భూమి మీదికి విసిరి వేశాడు. అప్పుడు గర్జనలాంటి శబ్దాలూ, ఉరుములూ, మెరుపులూ, భూకంపమూ కలిగాయి.

మొదటి బూర: ఉత్తర జాతులు దండెత్తుతాయి

ఇప్పటివరకు పాపపురుషుణ్ణి అణచి ఉంచిన రోమీయుల అధికారం కూలిపోయే కొత్త శకం ఏడు బూరలు మోగడంతో మొదలవుతుంది. మొదటి బూర మోగుతుంది. ఆ తరువాత జరిగే అద్భుతాలు ఉత్తరాన ఉన్న అనాగరిక జాతులు రోమీయుల సామ్రాజ్యంపై చేసే దండయాత్రను ముందుగా సూచిస్తాయి (323–412).

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 8:6–7

6 అప్పుడు ఏడు బాకాలు పట్టుకున్న ఆ ఏడుగురు దూతలు వాటిని ఊదడానికి సిద్ధం అయ్యారు.

7 మొదటి దూత బాకా ఊదినప్పుడు రక్తంతో కలసిన వడగళ్ళూ నిప్పూ భూమి మీద కురిశాయి. దాని మూలంగా భూమి మీద మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం తగలబడి పోయాయి. పచ్చగడ్డి అంతా తగలబడిపోయింది.

రెండవ బూర: వాండలులు జయిస్తారు

రెండవ బూర మోగుతుంది. జెన్సెరిక్ నాయకత్వంలోని వాండలులు, అలానులు పశ్చిమ రోమీయుల సామ్రాజ్య రాజకీయ అధికారాన్ని నాశనం చేస్తారు (395–455).

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 8:8–9

8 రెండవ దూత బాకా ఊదినప్పుడు భగభగ మండుతూ ఉన్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో మూడవ భాగం రక్తం అయిపోయింది. 9 సముద్రంలోని ప్రాణుల్లో మూడవ భాగం చచ్చిపోయాయి. ఓడల్లో మూడోభాగం నాశనం అయ్యాయి.

మూడవ బూర: జలాలు చేదుగా మారతాయి

మూడవ బూర మోగుతుంది. పశ్చిమ ప్రాంతపు చివరి రోమీయుల చక్రవర్తి అగస్టులస్ పదవీచ్యుతి; లేదా అధికారాశగల సంఘ నాయకుల విశ్వాసభ్రష్టత్వం లేదా అవినీతి; లేదా ఇతర అభిప్రాయాలన్నిటికంటే ఎక్కువగా జీవజలాలను చేదుగా మార్చి క్రైస్తవ ఐక్యతను నాశనం చేసిన అగస్టిన్ అభిప్రాయాల వ్యాప్తి ఇక్కడ ముందుగా సూచించబడి ఉండవచ్చు (455–476).

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 8:10–11

10 మూడవ దూత బాకా ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం కాగడాలాగా మండిపోతూ ఆకాశం నుండి రాలిపోయింది. అది భూమి మీద ఉన్న నదుల్లో మూడవ భాగం పైనా, నీటి ఊటల పైనా పడింది. 11 ఆ నక్షత్రం పేరు “చేదు.” కాబట్టి నీళ్ళలో మూడవ భాగం చేదై పోయాయి. నీళ్ళు చేదై పోవడం వల్ల దాని మూలంగా చాలా మంది చచ్చిపోయారు.

నాలుగవ బూర: రోమ్ చివరి అధికారం అంతమవుతుంది

నాలుగవ బూర మోగుతుంది. రోమ్ ను జయించినవారి మధ్య, జస్టీనియన్ సేనాధిపతుల మధ్య, గోతుల మధ్య ఇటలీలో జరిగే యుద్ధాలను, రోమ్ కు మిగిలి ఉన్న అధికారమంతటినీ తుడిచిపెట్టిన రావెన్నా ఎక్సార్కేట్ స్థాపనను, 606 సంవత్సరం వరకు జరిగే ఈ సంఘటనలను ఇది ముందుగా తెలియజేస్తుంది.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 8:12

12 నాలుగవ దూత బాకా ఊదినప్పుడు సూర్యుడిలో మూడవ భాగం, చంద్రుడిలో మూడోభాగం, నక్షత్రాల్లో మూడవభాగం దెబ్బ తిన్నాయి. కాబట్టి వాటిలో మూడోభాగం కాంతి విహీనం అయ్యాయి, చీకటిగా మారాయి. దాంతో పగలు మూడవ భాగం, రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది.

రెండు గొప్ప విశ్వాసభ్రష్టత్వాలకు మార్గం సిద్ధమవుతుంది

మానవ చరిత్రలో మరో చిరస్మరణీయ కాలం ఇప్పుడు మొదలవుతుంది. క్రైస్తవులలో విస్తరించిన అవినీతి, సామ్రాజ్య రాజకీయ బలహీనత రెండు గొప్ప విశ్వాసభ్రష్టత్వాలకు మార్గం సిద్ధం చేస్తాయి. ఇవి తూర్పు, పశ్చిమ సామ్రాజ్యాల్లో ఒకేసారి తలెత్తి 1260 సంవత్సరాలు కొనసాగవలసి ఉంది (606).

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 8:13

13 తరువాత ఆకాశంలో ఎగురుతున్న ఒక పెద్ద డేగను నేను చూశాను. అది ఎగురుతూ “ఇంకా బాకాలు ఊదబోతున్న మిగిలిన ముగ్గురు దేవదూతల బాకా శబ్దాలను బట్టి భూమిపై నివసించే వారికి అయ్యో, ఎంత యాతన, ఎంత యాతన, ఎంత యాతన!” అంటూ బిగ్గరగా అరుస్తుంటే విన్నాను.