భాగం 5: బాప్తిసమిచ్చే యోహాను తన పరిచర్యను ప్రారంభించడం
బహుశా క్రీ.శ. 25లో ఆరు నెలలు. యూదయ అరణ్యంలో, యొర్దాను తీరాన
ప్రారంభ సమయం
క్రీ.శ. 25
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మార్కు రాసిన సువార్త 1:1
1:1 దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం.
లూకా రాసిన సువార్త 3:1–2
3:1 సీజరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు గవర్నర్. హేరోదు గలిలయకు చతుర్థాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి. 2 అన్న, కయప ముఖ్య యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది.
సందేశం, సందేశకుడు
మత్తయి రాసిన సువార్త 3:1–6
3:1-2 ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో “పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు.
3 పూర్వం యెషయా ప్రవక్త,
అరణ్యంలో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది.
ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి.
ఆయన దారులు తిన్నగా చేయండి,
అని చెప్పింది ఇతని గురించే.
4 ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె. 5 యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి,
6 తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు.
మార్కు రాసిన సువార్త 1:2–6
1:2 యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది,
“ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను.
అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు.
3 ‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి,
ఆయన దారులు తిన్నగా చేయండి’
అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”
4 యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు. 5 యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు.
6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం.
లూకా రాసిన సువార్త 3:3–6
3:3 అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు.
4 యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది,
“అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి.
ఆయన బాటలు తిన్నగా చేయండి.
5 ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి.
వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.
6 ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.”
బాప్తిసమిచ్చే యోహాను ప్రసంగానికి ఒక ఉదాహరణ
మత్తయి రాసిన సువార్త 3:7–10
3:7 చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. 9 ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను.
10 ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు.
లూకా రాసిన సువార్త 3:7–14
3:7 అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో, “సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను.
9 ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు” అని చెప్పాడు.
10 అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 11 అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు. 12 పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 13 అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు.
14 “మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.
మెస్సీయను చూడకముందే ఆయనను వర్ణించిన యోహాను
ముందుగా వచ్చేవాడైన బాప్తిసమిచ్చే యోహాను, మెస్సీయను చూడకముందే ఆయనను వర్ణిస్తాడు.
మత్తయి రాసిన సువార్త 3:11–12
3:11 పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లతో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
12 తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు” అని చెప్పాడు.
మార్కు రాసిన సువార్త 1:7–8
1:7 యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు.
8 “నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.
లూకా రాసిన సువార్త 3:15–18
3:15 క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు.
16 వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు. 17 తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”
18 అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు.