యేసును ఐగుప్తుకు తీసుకెళ్లడం, బేత్లెహేము పిల్లల హత్య
బాలుడైన యేసును ఐగుప్తుకు తీసుకెళ్తారు, బేత్లెహేములోని పిల్లలను చంపుతారు.
బహుశా క్రీ.పూ. 5
క్రీ.పూ. 5
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 2:13–18
2:13 వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “లేచి బాలుణ్ణీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకూ అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతున్నాడు” అని అతనితో చెప్పాడు. 14 యోసేపు లేచి, రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు. 15 హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు.
‘ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను’
అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.
16 ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో, దాని పరిసర గ్రామాలన్నిటిలో రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు.
17-18 “ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది.
రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది.
వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది”
అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి.
యేసును ఐగుప్తు నుండి నజరేతుకు తీసుకురావడం క్రీ.పూ. 4
బహుశా క్రీ.పూ. 4
మత్తయి రాసిన సువార్త 2:19–23
2:19 హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు కలలో కనబడి,
20 “లేచి, బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. బాలుడి ప్రాణం తీయాలని చూసేవారు చనిపోయారు” అని చెప్పాడు. 21 అప్పుడు యోసేపు లేచి పిల్లవాణ్ణీ తల్లినీ ఇశ్రాయేలు దేశానికి తీసుకు వచ్చాడు.
22 అయితే అర్కెలా తన తండ్రి హేరోదు స్థానంలో యూదయ ప్రాంతాన్ని పాలిస్తున్నాడని విని, అక్కడికి వెళ్ళడానికి యోసేపు భయపడ్డాడు. దేవుడు అతన్ని కలలో హెచ్చరించగా గలిలయ ప్రాంతానికి వెళ్ళి, 23 నజరేతు అనే ఊరిలో నివసించాడు. యేసును నజరేయుడు అని పిలుస్తారు అని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.
లూకా రాసిన సువార్త 2:39
2:39 ఆ విధంగా యోసేపు, మరియ ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున ఆచారాలన్నీ పూర్తి చేసుకుని గలిలయలోని తమ స్వగ్రామం నజరేతుకు వెళ్ళిపోయారు.
నజరేతులో యేసు బాల్యం క్రీ.పూ. 4 నుండి క్రీ.శ. 7 వరకు
బహుశా క్రీ.పూ. 4 నుండి క్రీ.శ. 7 వరకు
లూకా రాసిన సువార్త 2:40
2:40 పసివాడు ఎదుగుతూ, బలపడుతూ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది.
పన్నెండేళ్ల వయసులో బాలుడైన యేసు యెరూషలేమును సందర్శించడం క్రీ.శ. 7 లేదా 8
బహుశా క్రీ.శ. 7 లేదా 8
లూకా రాసిన సువార్త 2:41–50
2:41 పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళడం కద్దు. 42 ఆయన పన్నెండేళ్ళ ప్రాయంలో వాడుక చొప్పున వారు ఆ పండగకు యెరూషలేము వెళ్ళారు. 43 ఆ రోజులు తీరిన తరువాత వారు తిరిగి వెళుతుండగా బాల యేసు యెరూషలేములో ఉండిపోయాడు. ఆయన తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియలేదు.
44 ఆయన గుంపులో ఉన్నాడనుకుని, ఒక రోజు ప్రయాణం చేసి, తమ బంధువుల్లో, అయినవారిలో ఆయనను వెదకసాగారు. 45 ఆయన కనబడక పోవడంతో ఆయనను వెదుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వచ్చారు. 46 అప్పటికి మూడు రోజులైంది. ఆయన ఆలయంలో ఉపదేశకుల మధ్య కూర్చుని, వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలడుగుతూ ఉండగా చూశారు. 47 ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు అబ్బురపడ్డారు.
48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి, “కుమారా, ఎందుకిలా చేశావు? మీ నాన్న, నేను ఆందోళనగా నిన్ను వెదకుతున్నాం” అంది. 49 అందుకు ఆయన, “మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా?” అన్నాడు. 50 కానీ ఆయన తమతో చెప్పిందేమిటో వారికి అర్థం కాలేదు.
నజరేతులో పద్దెనిమిది సంవత్సరాలు క్రీ.శ. 6 నుండి 26 వరకు
బహుశా క్రీ.శ. 7 నుండి క్రీ.శ. 26 వరకు (లేదా 6 నుండి 25 వరకు)
లూకా రాసిన సువార్త 2:51–52
2:51 అప్పుడు ఆయన వారితో కలిసి బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసికుంది. 52 యేసు జ్ఞానంలోనూ, వయసులోనూ, దేవుని దయలోనూ, మనుషుల దయలోనూ దినదిన ప్రవర్థమానమవుతూ ఉన్నాడు.