దేవాలయంలో యేసును సమర్పించడం
యేసును దేవాలయంలో సమర్పిస్తారు. అక్కడ సుమెయోను, అన్నా ఆయనకు ప్రణామం చేస్తారు.
యెరూషలేము
క్రీ.పూ. 6 లేదా 5
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లూకా రాసిన సువార్త 2:22–38
2:22-24 మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. “ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లలను గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు.
25 యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు. 26 అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. 27 ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు చంటి బిడ్డ యేసును దేవాలయంలోకి తెచ్చారు. 28 సుమెయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు,
29 “ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!
30-32 అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా
నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.”
33 యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు. 34 అతడు వారిని దీవించి, మరియతో ఇలా అన్నాడు, “అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా, ఇశ్రాయేలులో చాలా మంది పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు. 35 అంతేగాక నీ హృదయంలోకి ఒక కత్తి దూసుకు పోతుంది.”
36 దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో, 37 ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది. 38 ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.
కొత్తగా జన్మించిన యూదుల రాజును దర్శించిన జ్ఞానులు
యెరూషలేము, బేత్లెహేము
మత్తయి రాసిన సువార్త 2:1–12
2:1 హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు యెరూషలేముకు వచ్చి, 2 “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఆయనను ఆరాధించడానికి వచ్చాం” అన్నారు.
3 హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారుపడ్డారు. 4 కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను, ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి, “క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు. 5 అందుకు వారు, “యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే. ఎందుకంటే,
6 ‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా!
యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు.
నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు.
7 అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన కచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు. 8 తరవాత వారిని బేత్లెహేముకు పంపుతూ, “మీరు వెళ్ళి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పాడు.
9 వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది.
10 ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు. 11 ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు. 12 హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు.