భాగం 6: క్రీస్తు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించడం: అంతగా తెలియని సంవత్సరం క్రీ.శ. 26 మరియు 27
బహుశా క్రీ.శ. 26, 27 సంవత్సరాల్లో కొంత భాగం
పరిశుద్ధ దేశంలోని అన్ని ప్రాంతాల్లో (పెరయలో మొదటి పరిచర్య, గలిలయలో మొదటి పరిచర్య, యూదయలో మొదటి పరిచర్య, సమరయలో మొదటి పరిచర్య). ఈ ప్రారంభ పరిచర్యలో బాప్తిస్మం, శోధన, యేసును గురించి యోహాను సాక్ష్యం, మొదటి శిష్యులు, గలిలయలో జరిగిన మొదటి అద్భుతం మరియు అక్కడి పరిచర్య, యూదయలో మొదటి పరిచర్య, యోహాను అరెస్టు, సమరయలో పరిచర్య, గలిలయకు తిరిగి రావడం ఉన్నాయి.
యొర్దానులో యేసుకు యోహాను బాప్తిసమివ్వడం
యొర్దాను అవతలి బేతనియ. బహుశా క్రీ.శ. 26
క్రీ.శ. 26
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 3:13–17
3:13 ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు. 14 అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు. 15 కానీ యేసు, “ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే” అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు.
16 యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు.
17 “ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం” అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.
మార్కు రాసిన సువార్త 1:9–11
1:9 యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు.
10 యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు.
11 అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.”
లూకా రాసిన సువార్త 3:21–23
3:21 ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది.
22 పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”
23 యేసు తన పని మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు ముప్ఫై సంవత్సరాలు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కొడుకు.
యేసుకు ఎదురైన మూడు శోధనలు
యూదయ అరణ్యం. బహుశా క్రీ.శ. 26
మత్తయి రాసిన సువార్త 4:1–11
4:1 అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు.
2 నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది. 3 శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు. 4 అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు.
5 అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి,
6 “నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే,
‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు’ అని రాసి ఉంది” అన్నాడు.
7 అందుకు యేసు “‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది” అని అతనితో అన్నాడు.
8 అపవాది మళ్ళీ ఆయనను చాలా ఎత్తయిన కొండపైకి తీసుకు పోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు.
9 “నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను” అన్నాడు.
10 అప్పుడు యేసు “సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది” అన్నాడు.
11 అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు.
మార్కు రాసిన సువార్త 1:12–13
1:12 వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.
13 ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.
లూకా రాసిన సువార్త 4:1–13
4:1 యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి నడిపించాడు.
2 అక్కడ నలభై రోజులు సాతాను ఆయనను విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.
3 సాతాను ఆయనతో, “నీవు దేవుడి కుమారుడివైతే, ఈ రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు” అన్నాడు. 4 యేసు, “‘మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.
5 అప్పుడు సాతాను ఆయనను ఎత్తయిన కొండ మీదికి తీసుకు వెళ్ళి, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించాడు.
6 “ఈ రాజ్యాధికారమంతా వాటి వైభవాలతో పాటు నీకిస్తాను. దానిపై అధికారం నాదే. అది ఎవరికివ్వడం నా ఇష్టమో వారికిస్తాను. 7 కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే ఇదంతా నీదే” అని ఆయనతో చెప్పాడు. 8 అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయనను మాత్రమే సేవించాలి’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.
9 ఆ తరువాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకువెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి, “నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందికి దూకు.
10 ‘దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
11 నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు’
అని రాసి ఉంది గదా,” అని ఆయనతో అన్నాడు.
12 అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.
13 సాతాను, యేసును అన్ని రకాలుగా పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకూ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.