మహా సభ బృందానికి యోహాను సాక్ష్యం
బాప్తిసమిచ్చే యోహాను మహా సభ నుండి వచ్చిన బృందానికి తన సాక్ష్యం ఇస్తాడు.
యొర్దాను అవతల బేతనియలో
క్రీ.శ. 26
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోహాను రాసిన సువార్త 1:19–28
1:19 యెరూషలేము నుండి యూదులు, “నువ్వు ఎవరు?” అని యోహానును అడగడానికి యాజకుల నుండీ లేవీయుల నుండీ కొందరిని పంపించారు. అప్పుడు అతడు ఇదే సాక్ష్యం ఇచ్చాడు. 20 అతడు, “నాకు తెలియదు” అనకుండా, “నేను క్రీస్తును కాదు” అంటూ ఒప్పుకున్నాడు. 21 కాబట్టి వారు, “అయితే నువ్వు ఎవరివి? ఏలీయావా?” అంటే అతడు, “కాదు” అన్నాడు. “నువ్వు ప్రవక్తవా?” అని అడిగితే కాదని జవాబిచ్చాడు. 22 దాంతో వారు, “అయితే అసలు నువ్వు ఎవరివి? మమ్మల్ని పంపిన వారికి మేమేం చెప్పాలి? అసలు నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావ్?” అన్నారు. 23 దానికి అతడు, “యెషయా ప్రవక్త పలికినట్టు నేను,
‘ప్రభువు కోసం దారి తిన్నగా చేయండి’ అని
అరణ్యంలో బిగ్గరగా కేక పెట్టే ఒక వ్యక్తి స్వరాన్ని” అన్నాడు.
24 అలాగే అక్కడ పరిసయ్యులు పంపిన కొందరున్నారు. 25 వారు, “నువ్వు క్రీస్తువు కావు, ఏలీయావు కావు, ప్రవక్తవూ కావు. అలాంటప్పుడు మరి బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు?” అని అడిగారు. 26 దానికి యోహాను, “నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. కాని మీ మధ్య మీరు గుర్తించని వ్యక్తి నిలిచి ఉన్నాడు. 27 నా వెనుక వస్తున్నది ఆయనే. నేను ఆయన చెప్పుల పట్టీ విప్పడానికి కూడా యోగ్యుణ్ణి కాదు” అని వారితో చెప్పాడు. 28 ఈ విషయాలన్నీ యొర్దాను నదికి అవతల వైపు ఉన్న బేతనీలో జరిగాయి. ఇక్కడే యోహాను బాప్తిసం ఇస్తూ ఉండేవాడు.
యేసు మెస్సీయ అని యోహాను తెలియజేయడం
యొర్దాను అవతల బేతనియలో
యోహాను రాసిన సువార్త 1:29–34
1:29 మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల! 30 ‘నా వెనక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు’ అంటూ నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన. 31 నేను ఆయనను గుర్తించలేదు, కానీ ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడి కావాలని నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తూ వచ్చాను.”
32 యోహాను ఇంకా సాక్షమిస్తూ, “ఆత్మ ఒక పావురంలా ఆకాశం నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచి పోవడం చూశాను. 33 నేను ఆయనను గుర్తు పట్టలేదు. కాని ‘ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచిపోవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు’ అని నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు. 34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, సాక్షం ఇచ్చాను.”
యేసు తన మొదటి శిష్యులను ఏర్పరచుకోవడం
యొర్దాను అవతల బేతనియలో
యోహాను రాసిన సువార్త 1:35–51
1:35 మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు. 36 అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, “ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల” అన్నాడు.
37 అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు. 38 యేసు వెనక్కి తిరిగి, వారు తన వెనకాలే రావడం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వారు, “రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?” అని అడిగారు. 39 ఆయన, “వచ్చి చూడండి” అన్నాడు. వారు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వారు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు.
40 యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు. 41 ఇతడు అన్నిటికంటే ముందు తన సోదరుడైన సీమోనును వెతికి పట్టుకుని, అతనితో, “మేము మెస్సీయను (మెస్సీయ అంటే క్రీస్తు అని అర్థం) కనుక్కున్నాం” అని చెప్పాడు. 42 యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు” అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం).
43 మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు. 44 ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే. 45 ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు.
46 దానికి నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?” అన్నాడు. ఫిలిప్పు, “నువ్వే వచ్చి చూడు” అన్నాడు. 47 నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు. 48 అప్పుడు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అన్నాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అన్నాడు.
49 దానికి నతనయేలు, “బోధకా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే” అని ఆయనకు బదులిచ్చాడు. 50 అందుకు యేసు, “ఆ అంజూరు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలు చూస్తావు” అన్నాడు. 51 తరువాత యేసు ఇలా అన్నాడు, “నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఆకాశం తెరుచుకోవడం, దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉండడం మీరు చూస్తారు.”
యేసు తన మొదటి అద్భుతం చేయడం
గలిలయలోని కానాలో
యోహాను రాసిన సువార్త 2:1–11
2:1 మూడవ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. 2 ఆ పెళ్ళికి యేసునూ ఆయన శిష్యులనూ కూడా పిలిచారు.
3 విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, “వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. 4 యేసు ఆమెతో, “అయితే నాకేంటమ్మా? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. 5 ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది. 6 యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి. 7 యేసు, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. 8 అప్పుడు ఆయన, “ఇప్పుడు బానలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్ళారు.
9 ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో, 10 “అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు.
11 యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.